Posts

ముందు మాట , మా వొరిగిపలి గెవనాలు , published 2019 lliమా వొరిగి పల్లి ముచ్చట్లు :         వొరిగి పల్లి ఏమన్నా దేశమా, రాట్రమా , సెన్న పట్నమా సెప్పంగానే అందురికీ ఓహో ! పలానూరు అని తెలిసిపోడానికి .         మాది అన్ని వూర్లు మాదిరిగానే ఒక సిన్న పల్లెటూరు. సిన్నదైతేనేం నేను పుట్నూరు. అపూరూపంగా పెరిగి పెద్దైనూరు. పరుగులుబారినూరు .         అందురు పిలకాయిలతో కలిసి రాత్రనక పగలనక ఎన్నెల కుప్పలేనా, చెమ్మాచెక్కేనా, వామనగుంతలేనా, అచ్చన రాళ్లేనా ఒగటా, రెండా సెప్పడానికి .ఆట్లాడుకుంటా , పాటలు పాడుకుంటా, గొబ్బి తట్టుకుంటా , ఇస్కూలుకు పోతా , లీవుల్లో గొడ్లు మేపే పిలకాయిలితో ఆట్లాడుకొవచ్చనే మునాసతో ఆవుని మేపుకుంటా ఎట్లా పెరిగి పెద్దయినాము.         ' గొడ్లు మేపడానికి మన  సేద్ది గాడుండాడు కదా! తగుదునమ్మా అని ఒకావును పట్టుకోని నువ్వేంది సినపాపా మేపేది , ముందు దాన్నాడ కట్టు'  అని మాయవ్వ అరస్తా వుంటాది.         ఊహూ ..ఇనేదిల్యా . ఆవును పట్టుకోని అదే పతా పొయేదే . ‘ముచ్చుగుండు కాడికి ద్యా, కొల్లోడొంకకు ద్యా ‘అని మాయక్కకు అన్నం దెమ్మని మెల్లింగా సెప్పి జారుకొనేదే .         మాయక్క దెచ్చే సంగటి ముద్దను అందురు మాదిరిగా నేనూ, మాయక్క కూడా సేతిలో పెట్టుకోని తింటా వుంటే నా సామి రంగా ఆ సంతోసం ఇప్పుడు పిలకాయిలకు రమ్మన్నా వస్తాదా ? అది దుడ్లిచ్చి కొనుక్కొనేదా? అందుకే గదా పెద్దోల్లతో సీకొట్లు దింటా కూడా ఇట్లాంటి పనులు జేసేది .         ఈ ముచ్చట్లు అందురితో పంచుకోలేదనుకో అది మాతోనే మంటిలో కలిసిపోతాది గదా! అందుకే ఈ పని .          వూరు సుట్టుపక్కల ఉండే సెరువులు, దొరువులు, వాగులు, వంకలు , కొండలు గుట్టలు, గుళ్లు, గోపురాలు , సెట్లు , సేన్లు అన్నీ ఇర్లచెంగుల  మాదిరిగా తిరిగిన పిలకాయిలమే గాదా!         మాఊర్లో ఏ ఇంటి గురించి సెప్పాల? ఏతల్లి గన్న బిడ్లి గురించి సెప్పాల ? మూలింటవ్వ , సంగటి తాత, తిక్క శంకరెడ్డి, కుంటాదమ్మ , పులికింటోళ్ల కిష్ణమ్మ, గొబ్బి పాటలు బాడే వొల్లి , ఎత్తురాజులుగాని పెండ్లాము , నడీది బొడెబ్బ, పాలెమోళ్ల ఎంగటేసు, గాండ్ల సెట్టి , కుమ్మరోళ్ల కిష్ణయ్య - ఓయమ్మో, సెప్పుకుంటాబోతే పేర్లతోనే పొద్దు మునిగి పొతాది .         దీని వల్ల ఎవురికేమి లాబమంటారా? చరిత్రండీ చరిత్ర . మన తాత ముత్తాతలు లేకుండా మనమెట్ల లేమో ఆనాటి  బతుకులు తెలీకుండా ఈ నాటి బతుకులూ లేవు.         ఏదైనా గతం పునాదుల మిందనే కదా ఈ నాడైనా, రేపైనా నిలబడేది. చరిత్రైనా, బాసైనా, బాగ్గెమైనా, కట్టుబాట్లైనా , మొత్తుకోల్లైనా, బతికే బతుకైనా, బందుత్వాలైనా, ఈపొద్దు వున్నెట్లుండి ఆకాశం మింది నుండి వూడి మన ముందర పడిందా ?         మన తాతా అవ్వల బతుకుల్లో నుంచి  నేర్సుకోని అమ్మానాయిన్లు బతికినారు. వాళ్ల నించి మనం. మన్నించి మన పిలకాయిలు. వాల్లెట్లా బతికినారో మనమెట్లా బతకాలో తెలిసేది ఇదంతా కళ్ల ముందు కనిపిస్తేనే .         గతమంతా మంచిదని నేనెప్పుడూ సెప్పను. దాన్నుంచి పాటాలు నేర్సుకోవాల్సింది శానా ఉండాది అని అంటా ఉండానంతే.         గతకాలముమేలు వచ్చేకాలంకన్నా అని నన్నయ్య అనిందాంట్లో నిజమెంత ఉండాదో , మంచి గతమున కొంచెమేనయ్యా అని గురజాడ సెప్పిన మాటల్లో కూడా అంతే సత్తిముండాది.           ఆండపిలకాయిల్ని అష్ట కష్టాల పాలుచేసిన  కన్యా శుల్కాలు, ముసిలోళ్లతో పసిపిలకాయిలకు  పెడ్లిండ్లు, మొగుడు సస్తే నిప్పుల్లో  ఏసి కాల్చేయడాలు , వరకట్నాలు, ముండమోపుల అగచాట్లు ఇట్లా ఆండోళ్లు అప్పుట్లో పడిన కష్టాలు కొంచిమా నంచిమా.         అవి తెలిస్తేనే కదా మనుషుల మనసులు కుత కుతా ఉడికి పోయి వాళ్లు పడిన పాట్లేవో అంతు చిక్కేది. వాటిని ఏం చెయ్యాలో ఆలోచించేది.         అందుకే గతంలో ఉండే గన కీర్తినే కాదు. ఆ కాలంలో జరిగిన లొసుగుల్ని గురించి కూడా తప్ప కుండా తెలుసుకోవాల .         ఎప్పుడు సూసినా  గతాన్ని ఏం సేసుకుంటా మని అబ్బుదయమని, ప్రగతి పదమనీ ఓయబ్బో తెగ గింజుకుంటా వుంటారులే శానా మంది.         నాకనిపిస్తాది.ముందుటోళ్ల  కంటే మన బతుకులేమి గొప్పగా వుండాయని.  సిన్నప్పుడు మనం బతికినంత సంతోసంగా ఇప్పుడు పిలకాయిలు బతకతా వుండారా? సెప్పండి.         రుబ్బురోళ్లు బోయి మిక్సీ లొచ్చినాయి . రోలు రోకండ్లు, ఇసుర్రాయిలు బొయినాయి.  మిసన్లొచ్చినాయి. కట్లి పొవ్వులు బొయినాయి. కరెంటు పొవ్వులొచ్చినాయి.          మంటి కుండలకు బదులు, టీలు సామాన్లు, కుక్కర్లు,  నానుష్టిక్కు పెనాలు, రుసీ పసీ లేని తిండి తీర్తాలు , వాటితో పాటు వస్తున్న రోగాలు రొచ్చులు.  కష్టపెడతా వుండాయా ,  సుక పెడతా ఉండాయా మీరే ఆలోసించండి.         నాకొడుకు అమెరికాలో వుండాడు. నా కూతురు ఆష్ట్రేలియాలో వుండాది అని గొప్పలు సెప్పుకోడమే కానీ దాంట్లో ఏమన్నా అనందముండాదా?         అందురు కలిసుండి కష్టమో సుఖమో పంచుకుంటా ఉంటే ఎంత బాగుంటాది . మనుషులు ఎంత దూరంగా ఉంటారో మన తన అనేవి కూడా అట్లే దూరమయి పోతాయి. . మూల కొకరైపోయి బతికితే ఇంగ ప్రేమలు అభిమానాలు , ఒగరిపై ఒగరికి ఉండే మునాసలు రమ్మంటే వస్తాయా?         ఏరోప్లేనెక్కి  కూతురు దెగ్గిరికో , కొడుకు దెగ్గిరికో బోతామా? నాన్నాళ్లుంటాం. ఆడ బతికే ఇదానం మనకు సరిపోదు. పిలకాయిల మింది ఇష్టంతో నెలో రొండునెల్లో ముండ్ల మిందున్నట్లుంటాం. అప్పిటికే మొగం మొత్తేస్తాది. ఎప్పుడెప్పుడు మనూరికొచ్చి మనింట్లో పడిపోతామా అనుంటాది. పచ్చులుకి మాదిరిగా రెక్కలుంటే మనూరికి ఎగిరొచ్చెయచ్చు కదా అనిపిస్తాది.         నాగరికంగా మసులుకోడం రాదు. కోడలితోనో, కొడుకుతోనో , కూతురితోనో  సెప్పించు కోవాల. ఎవరన్నా వొస్తే ఇంగ్లీసులో మాట్లాడేది రాక దేబిరి మొగాలేసుకొని వాళ్ల నోర్లను మొగాలను సూస్తా కూసోవాల . 'అట్లెందు కుంటివి , ఇట్లెందు కంటివి 'అని పిలకాయిలితో  సీకోట్లు తినాల. తిరుగు పయానమై ఒచ్చి ఇంట్లో పడి మన ఊరి గాలి పీల్చుకుంటే గాని ఊపిరాడదే !         ఏరోప్లేనుకు ఎద్దుల బండ్లు  తీసిపొయినాయా ! మనూరుకంటే పొరుగూరు ఎక్కువయిందా.? మన సుట్టాలు మేలా దూరపు సుట్టరికాలు మేలా! దూరపు కొండలు ఎప్పుడూ నున్నంగానే కనిపిస్తాయి . దెగ్గిరికి పొతే కదా దాన్లో వుండే రాళ్లూరప్పలూ గతుకులు గరుసులూ , లోట్లూ లొసుగులూ తెలిసేది .         బతుకు ఎంత సిన్నదైతే దాంట్లో  దొరికే ఆనందం అంత శాస్వతం. పెద్దదయ్యేకొద్దీ ఎంపర్లాట ఎక్కువే .         పరుగులుబారి, వాళ్లకుందే మనకు లేదే  అని కుళ్లూ కుసిద్దాలతో ఒళ్లు గుల్ల సేసుకొని దుడ్లు సంపాదించి కార్లలో తిరగతా మిద్దిలూ మేడల్లో బతకడంలో సంతోస ముందా?         మనుసుల పొడ గిట్ట కుండా , వాళ్లంటే పడక పైకి నవ్వతా మాట్లడతా, లోపల పండ్లు కొరుక్కోడం అవసరమా !         సంగటి గానీలే ఉండేది తిని కూట్నీళ్లు గానీలే కలిగింది తాగి ఎవురేమను కుంటారో అనే బయం లేకుండా గుడ్సిలో సల్లంగా బతికే బతుకులో ఉండే ఆనందం కార్లలో తిరగతా మిద్దిల్లో బతికే వొళ్లలో కనిపిస్తాదా? కోట్లిస్తే దొరకతాదా?         నగలూ, సీరలూ, ఇండ్లూ వాకిండ్లూ నాకో నీకో అని పారకలాడి ఏమెత్తుకోని పోతాము . ఎంత పెశాంతంగా బతికినాము, సింతపండూరిబిండి గానీలే!  నోటికి ఎంత ఇతవుగా తిన్న్యాము అనేది కావాల గానీ.         నూరు రకాలు ముందరబెట్టి ఒంటినిండా సెక్కిరి నింపుకున్నోల్లిని తినండి అంటే  ఏమి తింటారు సెప్పండి.         ముందు తరాలని గురించి సెప్పాలని శానా కుశాలగా ఉంది నాకు . దాన్నించి ఏమి లాబమంటే ఏమి సెప్పాల. లాబం వుందనుకుంటే వుంది, లేదనుకుంటే లేదు .         వాళ్లు బతికిన తీరు సూడొచ్చు. వాళ్ల తిండీ తీర్తాల గురించి తెలుసుకోవచ్చు . సాటి మనుసుల్తో ఎట్లా మసులుకున్న్యారో గమనించొచ్చు. కష్టాలొచ్చినప్పుడు ఎంత నిబ్బరంగా నిలిసినారో కళ్లారా సూసి మరీ తెలుసుకోవచ్చు. . సెడి పుట్నింటికి సేరిన ఆడబిడ్ని అనవరించిన ఇదానాన్ని నేర్సుకోకుంటే అట్లాంటోళ్ల జీవితాలు పల్లాకుల పాలై పోవా? మన బిడ్ల బాగు ఓగు మనం గాక పోతే ఇంగెవురు సూడాల?         మొగబిడ్లున్నోళ్లు ఆండ బిడ్లి కోసం ఆడబిడ్లున్నొళ్లు మొగ సంతానం కోసం యాకారి నానా పాట్లు పడిందాన్ని సూడొచ్చు. సంతానం లేనోళ్లు సంతు కోసం చేసిన పూజలు వ్రతాలు, నోసిన నోములు, తిరిగిన పుణ్య క్షేత్రాలు, మునిగిన తీర్థాలు , చేసిన దాన ధర్మాలు తెలుకోవాల్నా వద్దా?        ఉన్నోళ్లు లేనోళ్లను ఆదరించిన తీరుతెన్నులు, కష్టాల్లో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండడం, పండగ పబ్బాలను కలిసి మెలిసి జరుపుకోడం, పనోళ్లకు పేమగా  పెట్టిపొయ్యడాలు , అవసరంలో ఆదుకోడాలు తెలుసు కోవాల్సిందే గదా!        అప్పటి ఆచారాలు,  యవ్వారాలు, సంప్రదాయాలు వాటి ఎనక ఉన్న లాభాలు , వాటిని పాటించిన పద్దతులు నెర్చుకొని తీరాల.        అన్నిటి కంటే మంచి మనుసులుగ బతడానికి కావాల్సిన గుణ పాటాలు నేర్చుకోవడం ముఖ్యం . ఇట్లా ఉండకూడదు, ఇట్లే ఉండాల, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఇంకొకరు నొచ్చుకుంటారు ఇట్లాంటివన్నీ మనం కథల్లో నుంచే కదా నేర్చుకోవాల . ఒక్కో జీవితం ఒక్కో పాటం .వూ. కానీండి                                      మహాసముద్రం దేవకి                                        ముందుమాట, మా వొరిగిపల్లి గెవనాలు ,0కథా సంకలనం ,2019 i

అమర్ధం కుటుంబరం -telugu మాండలిక కథ

అంగడి సాలమ్మత్త - మాండలిక కథ

మిలిట్రీ కృష్ణ మూర్తి - మాండలిక కథ

వొదినా అండ bidlu- మాండలిక కథ

సంపూర్ణక్క- తవుసు మాను - కథ          సూర్యోదయానికి ఇంకా మూడు గంటల సమయముండాది. సలిగాడు గిలిగింతలు పెడతా వుండాడు .         'సలికి బయపడితే పనులు గావులే ' అనుకొని కప్పు కున్ని బొంతని పక్కకు నెట్టి కుడి పక్కకు తిరిగి లేసి కూసునింది సంపూర్ణక్క. దండం బెట్టుకోని  బర బరా అరిసేతులు రుద్దుకొని మొగం సూసుకొనింది.         సలి గజ గజలాడిస్తా వుంటే కొంగును తల సుట్టూ సెవుల  మీందగా తీసు కొచ్చి జారి పోకుండా గొంతు కింద ముడేసుకొనింది. ఇంటి ముందర, రచ్చ బండ మింద, దాని కింద సుట్టూ పరా పరా పుల్లల పొరకతో  చెత్త తోసి కళ్లాపి సల్లింది.         స్జులుక్కు స్జులుక్కు అంటా ఒచ్చే  కళ్లాపి శబ్దాన్ని ఇని  మెలకువొచ్చినా కూడా తోడి కోడలు వసంత కొంచిం పాలుమారి ఎంటనే లేసిరాలా         ' పోనీలే ఇంకొంచేపు పండుకోనీ . ఈ లోపల యాప సెట్టు కాడ నీళ్లు సల్లేసొస్తా'  అనుకోని బయలు దేరింది సంపూర్ణక్క.         ఎడమ సేతిలో పొరక్కట్ట, సంకలో నీళ్ల కడవ , కుడిసేతిలో పేండకళ్లేసిన బొక్కినీ పట్టుకొని బోయి రోడ్డు పక్కన సలాబండ్ల కాడండే రాగి మాను యాప్మాను సుట్టూ శుద్ది జేసి ముగ్గు కర్ర ఏసేసొచ్చింది.         సేంద బాయిలో నీల్లు సేందుకోని రావాలంటే ఇద్దురుండాల. ఒకరు సేంది పొస్తే ఒకరు ఇంట్లో పోసి రావడానికి . ఒగటా, రొండా ఒగిరవై గడవల నీళ్లు కావాల కదా ఇంటికి.         'ఐదు దాటిందంటే జనం ఎక్కువుంటారు బాయి సుట్టూ గిజ గిజా. రాట్నం దొరికేదట్ల పక్కన పెడ్తే  వొంగి చేందుకొనేందుకు కూడా తావు దొరకదు. ' అనుకుంటా ఇంటికాడికొచ్చింది.         వసంత లేసినట్లుండాది. ముగ్గు మింద గొబ్బెమ్మలు పెట్టుండాయి. కడవలు , చేంతాడు , బొక్కిని బయటబెట్టుండాయి. సలికి కప్పడం దెచ్చుకోడానికి  పొయ్యినట్లుంది. తువ్వాలు తలకు సుట్టు కుంటా వొచ్చింది, ' లేపుండకూడదాకా ' అంటా .         ఇద్దురూ సేందబాయి కాడికి బొయినారు. సర సరా సంపూర్ణక్క సేంది పోస్తా వుంటే వసంత తలమిందొకటి సంకలో ఒకటి పెట్టుకోని తొట్లలోకి ఎద్దల కుడితిలోకే కాకుండా పూల చెట్లకు కూడా తంపుగా పోసి 'ఇంగ సాలు పోదాం పదకా ' అని వచ్చింది         'ఇరపాచ్చమ్మ గుడికాడికి పొయ్యొచ్చెయిపో కా . ఇంట్లో పని నేను సూస్తా' అనింది ఇంటికొచ్చి కడవలు దించి పెట్టినాక వసంత.         ఆ సల్లోనే సంపూర్నక్క రొండు సెంబులు సన్నీళ్లు నెత్తిన గుమ్మరించుకోని కాయా కర్పూరం, పూలు దీసుకొని ఇరపాచ్చమ్మ గుడికి బయలుదేరింది.         వూరికి దూరంగా వరి మళ్ల మద్దిలో వుంటాది ఆ గుడి. గెనాల మింద నడిచి పోవాల. పొట్ట కర్రతో వుండే వరి పైరు లోను, గెనాల  మింద వుండే కసువు లోను మంచు నిండుకోని మోకాళ్లదాకా సీరను ముద్దజేసేసింది. తడి తల్లో నీళ్లు గారి ఈపంతా ముద్ద. ఊరి బయట కావడం వల్ల సెట్లలో నించి ఒచ్చే చల్లని గాలికూడా గడ గడ వొణికించేస్తా ఉండాది.         గుడి ముందర చెత్త తోసి ,  ముగ్గులు పెట్టి పూజ చేసి హారతిచ్చి బెల్లం నైవేద్యం పెట్టింది. రేక్కాయంత  బెల్లాన్ని కండ్ల కద్దుకోని నొట్లో కేసు కునింది. ఆన్నించి బొయ్యి కాటమ రాయుని గుండుకు మొక్కోని. సెరువు కట్టకెగుదల వుండే మామిడి  తోపులోకి దూరింది.         ఆ చెట్ల మద్దిలో గుడి గోపురం మాదిరిగా ఉందొక పాము పుట్ట. ఆ పుట్ట మింద పసుపు నీళ్లు సల్లి  కుంకుం బొట్లు  పెట్టింది.  తెచ్చిన పత్తి వస్రాలను ఆడాడా పుట్టమింద పెట్టి బకితితో చేతులు జోడించింది.         కళ్లలో నీళ్లు కమ్ముకోనొస్తా ఉండాయి.  ' అమ్మా నాగాలమ్మా. నీ బిడ్లిమి తల్లీ. నువ్వే కనికరం సూపించక పొతే  ఇంగ మేము ఏ ఏట్లో  దూంకి సావాల. నాకు నాగదోస ముండాదని అందుకే పిలకాయిలు పుట్టలేదని అంటా వుండారు. నేను సెయ్యని పూజలుండాయా? నిన్ను కొలవని దినముండాదా? మిమ్మల్నందురినీ మొక్కందే పచ్చి మంచి నీళ్లు గూడా ముట్టుకోనే .ఎన్నాళ్లకమ్మా నీ దయ ' అని జల జల కన్నీరు కార్సింది.         ఒక సిటికి  పుట్టమొన్ను గిల్లుకోని నోట్లో ఏసుకోని సప్పరించి ఇంటి మొగం బట్టింది.         రొండు దినాలైనాక ఆ పొద్దు సుక్కరారం. మొగున్ని  బలమంతంగా బయలుదేర దీసింది. పొన్న దేవలానికి బొయ్యి ఉయ్యాల గట్టి రావాలని . ఏడాది వొయుసు మర్ది కొడుక్కు. వాన్ని ఈయమ్మే ఎత్తుకోని సాకతా వుండాది . వాన్ని కూడా పిల్సుకునింది.         ' వాడెందుక్కా తోక, మీరు పొయి రాకుండా ' అనింది వసంత.         ' రానీ  వాడు లేకపోతే నాకు బాగుండదు. వాడూనేను లేక పోతే నిన్ను సతాయిస్తాడు.' అనింది.         వాన్ని చూసుకుంటా పని సేసుకోడం తలకుమించిన పనని తెలుసామికి .          వాళ్లత్త కూడాలేదింట్లో . ఆయమ్మ కూతురికి రొండో కానుపు  సేసిరాను సామి రెడ్డి పల్లికి  పొయ్యుండాది.         ' అక్క కడుపులో ఒక కాయి కాస్తే  వాళ్లూ  సంతోసంగా ఉంటారు కదా 'అని అనుకునింది వసంత. వాళ్లు  పొన్నకు బయలుదేరతా ఉంటే.         సంపూర్ణక్క , మొగుడు మునిరత్నమన్న బస్సు కోసం రోడ్లో సలా బండ్ల మింద కూసోనుండారు. ఆయన్న  తమ్ముడు యాప్పుల్లతో పండ్లు తీటుకుంటా సెరువుకింద బాయికాణ్నించి వచ్చినాడు.          ' మంత్రాలకు సింతకాయిలు రాలవు నా , డాక్టర్లకు సూపించుకోండి అంటే ఇనరు కదా! ' అన్న్యాడు  అన్నను సూస్తా.         'సుబం పలకరా సుబ్బన్నా అంటే , పెండ్లి కూతురు ముండేడ అన్న్యాడంటా ఎనకటి కెవుడో . బయలుదేరి పొతా వుంటే ఇట్ల అనొచ్చా' అనుకోని దిగులు మొగం బెట్టుకునింది సంపూర్ణక్క.          ' డాకటర్లు మాత్రం ఏంజేసినార్రా. సూపిస్తానే  ఉండాము గదా! 'అన్న్యాడు అన్న. తమ్ముడు మారు బలక్కుండా ఇంటికి బొయినాడు.         పొన్న దేవలంలో పూజ సేసుకొని రాగిమానుకు ఉయ్యాల గట్టినాక పూజారి కాళ్లకు దండం బెట్టు కోని సమస్యను ఇన్నవించు కున్న్యారు దంపతులు.         ' గుల్లో ఉండే అంగిట్లో తెల్ల జిల్లేడు ఏరుతో సెక్కిన ఇనాయకుని బొమ్మ అమ్మతారు. దాన్ని దీసుకోని బొయ్యి దేవుని గూట్లో బెట్టి మండలం దినాలు ఎర్రంగా వుండే పూలు పెట్టి పూజ జేసుకోమ్మా' అన్న్యాడు పూజారి.         ఇంటికొచ్చినాక అన్ని పూజలతో పాటు ఇదీ ఇసుగూ ఇరామం లేకుండా సేసింది సంపూర్ణక్క.         ఎండా కాలమొచ్చింది . ఇస్కూల్లకి లీవులిచ్చేసినారు.         ' ఏప్రిలు ఇరవయ్యో తేది నుంచి బార్తం గుడికాడ పొగులు కత మొదులవుతాది . కంగుంది  కుప్పం నించి పొగులు కత సెప్పే  బాగవతార్ అయ్యోరు వచ్చుండాడహో ' అని తోటోడు సాటింపు ఏసి పొయినాడు.         ఊర్లో ఎవురి నొట్లో సూసినా  బార్తం గురించే. ఏడూర్లలో చందాలు  కూడా వసూలు సేసేసినారు. పొగులు కత సెప్పే  అయివోరు, ఆయిన బార్య,   పక్క వాద్యగాల్లిద్దురూ వొచ్చి ముత్తర పల్లి అన్నా సామింట్లో  దిగిపొయినారంట అనే వర్తమానం అందురుకీ తెలిసింది. పిల్లా పెద్దా అందురూ శానా కుశాలగా ఉండారు.         మద్యానాని కంతా పనులు ముగించుకోని జట్లుజట్లుగా గలాం బులాం అని మాట్లడుకుంటా పగులు కతకు పొయ్యి వస్తా వుండారంతా. అయివోరు కత శానా బాగా సెప్తావుండాడని అందురూ సెప్పుకున్న్యారు.         వారం తర్వాత తోటోడు మల్లీ ఒక టముకేసి పొయినాడు. ' తమిల్ నాడు నుండి ఈ పొద్దు రెయ్యాట ఆడే వాళ్లు దిగతా  వుండారు. రేపట్నించి రెయ్యాట కూడా వుండాది. అందురూ రావాల్సిందహో ! ' అని.         రెయ్యాటాడే వాళ్లొచ్చిన రొండో  దినమే ద్రవుపదమ్మ పెండ్లి జరిగింది. విగ్రహాలను దీసుకొని మూడు దినాలు ఏడూర్ల లోను  మెరివిణి సేసినారు. శానా మంది వాళ్ల ఇండ్ల ముందు కొచ్చినప్పుడు ద్రవుపదమ్మకు ఒడిబాలు గట్టి మొక్కు సెల్లించు కున్న్యారు.         మర్స నాడే  అర్జునుడు తవుసు మానెక్కతాడని మళ్లీ సాటింపు.         ఎప్పుటి మాదిరిగానే ఎంతో పొడుగ్గా ఉండే తాటి మాను కొట్టుకోనొచ్చి దాని తల కొట్టెసి మాను పొడుక్కూ మెట్లు అమర్చి గుడిముందర నాటినారు. పైన అర్జునుడు కుచ్చునేందుకు పీట దానిమింద ఎండబడకుండా గూడు కట్టినారు.         తెల్లారి పదికంతా బార్తం గుడికాడ ఇసికేస్తే కింద రాలనంత  జనం సేరి పొయినారు. అర్జునుడి ఏసంతో వున్నాయిన పూజా సామాగ్రి వున్న జోలిని బుజానేసుకోనొచ్చి నిలబడినాడు.         పొగులు కత సెప్పే అయివోరొచ్చి 'వర పడే ఆండోల్లంతా పొయ్యి బాయికాడ నీళ్లలో మునిగి రాండమ్మా ' అని సెప్పినాడు.         వర పడే ఓల్లలో సంపూర్ణక్క కూడా వుండాది. ఇది అయిదో సమత్సరం ఆ యక్క వరపడతా వుండేది. అందురు తడి బట్టలతో ఒచ్చి సుట్టూ నిల్సుకున్న్యారు.         వసంత ఒచ్చి సంపూర్నక్కతో ' పడమటి పక్క నంటా పండుకో , అపక్కకు గాలి గొడ్తుందంటా అయివోరు సెప్తా వుంటే ఇంట్ని ' అని సంపూర్ణక్కను ఎచ్చరించి పోయింది.         పూజ మొదులయింది. పొగులు కత సెప్పే అయివోరు పద్యాలు స్లోకాలు సెప్పి తవుసుమానుకు పూజ సేసి కతను సెప్తా  'అర్జునుడు పాసుపదాస్త్రం కోసం తబుసు సెయ్యిను వచ్చినాడు.' అని ముగించినాడు.         అర్జునుని ఏసమేసుకోనొచ్చినాయిన శివుని పాట పాడతా తవుసు మానుకు మూడుసార్లు ప్రదచ్చిన సేసుకోని ఒక్క మెట్టెక్కి నాడు. '         ఓ 'అని అరుపులు, ఈలలు,  , చప్పట్లు మిన్ను ముట్టినాయి . పాట ఇనిపించాలంటే అర్సకుండా  ఉండాలని ఆడుండే బండ మిందికి ఎక్కోని ఒకాయిన ఎచ్చరించినాక కొంచేపిటికి సద్దు మనిగింది.         శివుని పాట  పాడతా అర్జునుడు రెండో మెట్టెక్కి కూచ్చున్న్యాడు. అట్లా పజ్జెనిమిది మెట్లెక్కి నాడు. మెట్టు మెట్టుకూ ఒక పాట. ఆయన పాడిన పాటల్లో ... నీలకందరా దేవా, జగదీస్వరా పాహీ పరమేశ్వరా , దేవ దేవ దవలాచర మందిర అనే సినిమా పాటలు కూడా వుండాయి. ఆయన గొంతు శానా బాగుండాది.         పైన పీట  మింద కూచున్నాక  పూజ మొదులు బెట్టినాడు. వర పడినోల్లంతా సేతులు ముందుకు సాచుకోని తవుసు మాను సుట్టూ బోర్లా పండుకున్న్యారు. సంపూర్ణక్క వసంత సెప్పినట్లుగానే పడమటి దిక్కున పండుకొనింది.         కాయగొట్టి కర్పూర మెలిగించి హారతిచ్చినంక జోలెలో వుండే బొరుగులు, నిమ్మ పండ్లు, ఆకులు , వక్కలు, పసుపు కొమ్ములు , పూలూ, అంటిపండ్లు, ఇబూది పండ్లు అన్నీ సుట్టూ వరపడిన వాళ్ళ సేతుల్లో పడేట్లగా కిందికి సల్లి నాడు పైనుండే అర్జునుడు .         గాల్లో అవి కిందికొస్తా ఉంటే సుట్టూ ఉండే జనాలు వాటిని పట్టు కొనే ప్రయత్నం ముమ్మరంగా సేసినారు. వర పడిన వాళ్ల సేతుల్లో పడిన వాటిని సూసుకొని కొందురు వాళ్ల వాళ్లతో మురిసి పోతా వుంటే , పడని వాళ్లు ఉసూరుమని నిలబడి వుండారు         అర్జునుడు కిందికి దిగొచ్చే పాటికి శివుడు ఏటగాని  యాసం  , పార్వతి చెంచీత  యాసంగా  ఏసుకున్నోళ్లొచ్చినారు. పెద్ద పంది బొమ్మ ఉంటే అర్జునుడు , ఏటగాడూ ఇద్దురూ బాణాలేసి  పంది నాదంటే నాదని కొట్లాడుకున్న్యారు. చివరికి ఏటగాడు  శివునిగా మారి అర్జునునికి పాసుపతాస్త్రమిచ్చినాడు.         ఎప్పుడూ లేంది ఈ సారి సంపూర్ణక్క  సేతిలో  అంటిపండు పడింది. సంతోసం పట్టలేక నేరుగా పొయ్యి. పగలుకతయివోరికి సూపించి కాళ్లకు మొక్కింది.         ' అంటి పండు పడింది గదమ్మా నీ సేతిలో  . తప్పకుండా నీకు ఆడ సంతు కలగతాది తల్లీ . రేత్రి పొండుకొనే ముందు ఆ పరమాత్రుని తల్సుకోని పండు దిని పండుకోమ్మా '  అని దీవించినాడు.         సంపూర్ణక్క కొంగు ముడి ఇప్పి అర్ద రూపాయి దుడ్లు అయివోరి సేతిలో బెట్టి ఆయన కాళ్లకు మొక్కి కళ్లకద్దుకొనింది. అంతా సంతోసంగా ఇల్లు సేరినారు. ఇది జరిగి రొండు యేండ్లు గడిసి పోయా .బార్తం మొదులు కావడానికి ఇంగో రొండు నెలలుండాది.         సంపూర్ణక్క ఇంగా దినామూ  బ్రహ్మ  మూహూర్తంలో లేసి పూజలు సేస్తానే ఉండాది  . నెలకు రొండు సార్లు అమాసకు, పున్నమికి  పుట్టకు పాలు పోస్తానే ఉండాది . ఇరపాచ్చమ్మకు, కాటమ రాయునికీ బకితితో పూజలు సేస్తానే ఉండాది. కనిపించిన గుళ్లలో ఉండే దేముళ్లకు ముడుపులు కడతానే ఉండాది. అప్పుడప్పుడూ వ్రతాలు, నోములూ నోసి ముత్తైదులకు పసుపుకుంకాలిచ్చి అచ్చింతలు సేతిలో పెట్టి కాళ్లకు మొక్కోని దీవెనలందుకోవడం తప్పించ లేదు. దాన దర్మాలు కూడా దండిగా సేస్తా ఉండాది. బార్తం గుడికాడ తవుసు- తవుసుమాను - కథ

మా సుబ్బా రెడ్డి సిన్నాయన- కథ