వరిగ పల్లె ముచ్చట్లు : 18
అమర్దం కుటుంబరం
' ఎవురు గురించైనా సెప్పే ముందు వాళ్ల పోకూ వర్తూ ఇలావరిగా తెలుసా లేదా అని ఆలోచించి మాటాడాల పాపా ' అనింది మాయమ్మ . సిలగుండ్లపల్లి లచ్చుమక్క, రొడ్డోళ్ల రుక్కమ్మతో మా ఊరి మున్లచ్మి గురించి సెడ్డగా సెప్తా ఉండాది సుశీల .అది ఇనిన మాయమ్మ ఈ మాటంటా కోపంగా సుశీలను అంటుకొనింది.
'నువ్వు కండ్లతో సూసి నట్ల మాట్లాడ్తా ఉండావే . మున్లచ్మిని పిల్చుకోనొస్తా దాని ముందు సెప్పు. ఎప్పుడే గానీ ఎనకొక మాట ముందొక మాట ఉండకూడదు' అని బుద్దీ మద్దీ సెప్పింది సుశీలకి.
అప్పుడు నేను కూడా ఆడే ఉండానా . ఆ మాటలు గెడ్డ పైనున్ని చెరుకు పిచ్చిల్ని బురదలో ఏసి సేతుల్తో అదింపెట్టి నాట్తామే అట్ల నాటక పొయింది నా మనసులో .
పిచ్చి పిచ్చికీ గెనుపు కాడ మొలక లొచ్చి సెరుకు పైరు ఏపుగా పెరిగి నట్లుగానే మా యమ్మ సెప్పిన ఆ మాట నా గుండెల్లో మోసులెత్తి నాతో బాటే పెరిగతా ఒచ్చింది.
ఆ పొద్దు నుంచి నిజి జీవితంలో నాకు తెలిసినోళ్ల గురించి గాని, ఒక కథ గాని కాకర కాయి గాని , ఒగ పాత్ర మింద గాని అన్యాయంగా తెలిసీ తెలియకుండా అబాండాలు ఎయడం నాకు తెలిసి జరగ లేదు.
ఇప్పుడు నేను సెప్ప బొయ్యే అమర్దం కథ గురించి కూడా అంతే. ఆ యమ్మ పేరు అమృతం . కాని నోరు తిరగక ఏమో అందురూ అమర్దం అనే పిలస్తారు.
మా ఊర్లో పడమట పక్క సివర సేన్లో ఉంటాది మా ఇల్లు. తూరుప్పక్క ఊరి సివర్లో మా ఎర మొన్ను సేనుకు ఆనుకో నుంటాది అమర్దం ఇల్లు .
వాళ్లు ఎక్కణ్నించో వొచ్చి మా వూర్లో సేరి నారని సెప్తారు గాని నేను పుట్టి బుద్దెరిగి నప్పుట్నుంచి వాళ్లను సూస్తానే ఉండాను.
ఆ సివర ఊర్లో ఇండ్ల కానుకోని మూడు సింత మాన్లుండాయి అవి కర్ణ మోళ్ల ఈరాసామివి . ఆ సెట్ల కింద మా ఊరి గాండ్ల సెట్టి ఈరాసామిని అడిగి చెక్క గానిగి పెట్టు కున్న్యాడు . అందురికీ మా ఊర్లో సెనిక్కాయిలు పండతాయా సెనిగి సమురు దుడ్లిచ్చి ఎవురూ కొనరు. గానిగాడించు కోవడమే .
ఇంట్లో సమురు ఐపోంగానే రొండు మూట్ల సెనిక్కాయిలు వాకిట్లో పోసి దుడ్డు కొయ్యలెత్తుకోని ఈపక్కొకరు ఆ పక్కొకరు కూసోని కాయిల్ని దబ దబా బాదతారు. వాటి గింజిల్ని ఆండోళ్లు సెరిగి సీరు జేసి రాయి రప్పా ఏరి గానిక్కి సిద్దం జేస్తారు.
గాండ్ల సెట్టికి ఎద్దుల్లేవు. అందుకని మనమే ఎద్దల్ని బట్టుకోని బోవాల. గంపలో గింజిల్ని, సమురు పోసుకోను బాగా మాంగి మాగడ పట్టిన కుండను ఎత్తుకోని బోతారు, అదైతే పగలదని. సెట్టితో గానిగాడించు కోని కుండలో శెనిగి సమురుతో , గంపలో గానిగి బిండితో ఇల్లు సేరతారు.
మేము సమురాడించు కోవాలంటే అట్లే సేసేది. ఎద్దల్ని గట్టి తోలేది మా జీత గాడు బాలడైతే దెగ్గిరుండి గాని గాడించు కోనొచ్చేది మాయవ్వ.
మాయక్క కైతే ఇంట్లో పనీ పాటుంటాది. నాకేం పని ? దినమంతా ఊరి మింద బడి తిరిగేదే కదా ! అందుకని మాయవ్వ యాడికి బోతే ఆడికి ఆ యవ్వ తోక బట్టుకోని అదే పతా పొతా ఉంటాన్నేను.
గానిక్కాడికి బొయినామంటే అమర్దం ఇంట్లో అడుగు బెట్టినట్లే. ఎట్ల తెలస్తాదో మేము గానిక్కాడికి పోంగానే ' బాగుండావా మా' అనుకుంటా ఒచ్చి మా యవ్వతో గానిగయ్యే దాకా యవ్వారాలు బెట్టుకుంటాది. అంత సిన్నప్పుట్నించి సూస్తా ఉండాను మరి అమర్దం వాళ్లని .
ఊరిని, అమర్దం వాళ్ల ఇండ్లను ఎరు సేస్తా ఉండేది ఈ గానిగే .
దినాము కనీసమంటే మూడు నాలుగు గానిగలు అడిస్తాడు గాండ్ల సెట్టి . మేమే సమత్స రానికి 22 గానిగిలు సెనిక్కాయి నూని ఆడిస్తాము.
పాపం ఎన్ని గానిగిలాడినా ఐదు మంది పిలకాయిల్ని సాకడం సిన్న పనా ? అందుకే శెట్టి పెండ్లాం కూలికీ నాలికీ పోతా ఉంటాది.
శెనిక్కాయిలే గాకుండా ఇప్పనూనె కూడా ఆడిస్తాము. దీపానికి వాడేది ఆ సమురే . మా ఊర్లో ఉండే ఇనాయక సామి గుళ్లో యాడది పొడుగునా దీపం జ్యోతి ఎలిగేది మా ఇప్ప సమురు తోనే.
ఇంగా కానక్కాయిలు, యాప కాయిలు ఆడి పెట్టుకోని ఊర్లో ఎద్దలకొచ్చే పుండ్లకు, మనుసుల కొచ్చే రోగాలకు , ఇంగేమైనా అవసరాలకు దానాదర్మాలకు ఆ సముర్ని వాడతాము.
దీపాల పండక్కు శానా మంది ఇప్ప సమురు పోసి కజ్జాలు కూడా కాల్చు కుంటారు, మా ఊర్లో బీదా బిక్కీ . కొంచిం కనురు వాసనుంటాది లే. ఆ నూనితో సేసిన అప్పచ్చులు .
ఇదేంది అమర్దం కతను వొదిలి పెట్టి గానిగి గురించి సెప్తా ఉండా. అమర్దం ఇంటికి బోవాలంటే అదే దోవ గదా! అందుకే ఆ దోవలో ఉండే సెక్క గానిగి గురించి సెప్తా ఉండా. ఈ తరం పిలకాయిలు ఇని దాని గురించి పెద్దోళ్లను అడిగి తెలుసుకుంటారని.
మాయవ్వతో గానిక్కాడికి పోతానా. కుశాల కొద్దీ మా బాలని సేతిలోని జాటీని పెరుక్కోని నాలుగు సుట్లు ఎద్దు లెంట నడస్తాను. మళ్లీ గాని గెక్కి కూసోని అది కిర్రని శబ్దం సేస్తా ఉంటే నాలుగయిదు సుట్లు తిరగతాను. ఈ లోపల నాతో బాటు పిలకాయిలెవురన్నా గానికెక్కతారా! ఎద్దలకు బొలువవతాదని 'దిగతారా లేదా ' అని మాయవ్వ కట్టి పుల్లెత్తుకోని తరుంకుంటాది.
పక్కనే అమర్దం వాళ్లిండ్లు మూడంటే మూడుండాయి. ఒగటి వాళ్లది. ఒగటి వాళ్ల తమ్ముడోళ్లది. ఒగటి పెరుమాలు గాని మూడో పెండ్లాం ఎస్తర్ వాళ్లది.
అమర్దం మనుముడు సుకుమారుడు నా ఈడు వాడే . వాళ్ల పెద్దమ్మ కూతురు జమున రొండేండ్లు సిన్నది. అప్పుడింగా మేమెవురూ ఇస్కూల్లో కూడా సేర లేదు . గానిగాడేది ముగిసే దాకా వాళ్లతో సింత సెట్టు కిందో , వాళ్లింట్లోనో ఆటలాడ్తాము . అప్పట్నుంచే నాకు వాళ్లందరి గురించి బాగా తెలుసు.
మా ఎర్ర మొన్ను సేను సుట్టు, నల్ల గెట్లోను మావి నలబై మూడు సింత మాన్లుండేవి . కొంచిం పెద్దయ్యి ఇస్కూల్లో సేరినాక విస విసాని గాలి తోలితే సాలు ' నాయినా నా బంగారు కదా! గాలి దోల్తా ఉండాది . సింత కాయిలన్నీ రాలి పోతాయి. వొడ్డి గుడ్సిల్లో ఉండే గుడ్సేటి ముండ్లు తక్కువవి కావు. రాలిన కాయి రాలినట్లే వాళ్ల ఎదానేసు కుంటారు. బుట్టి దీసు కోని అట్ల పొయి రాబో నాయినా. ఊర్లోకి గెన్సి గెడ్లొచ్చినప్పుడు గుల్ల కట్టు కాయిలేసి తీసిస్తాను ' అని మా యవ్వ , తప్పితే మా యమ్మ అడుక్కొనే వాళ్లు.
గాలి దోల్తా ఉంటే అట్ల బొయ్యి ఇట్ల రాను కాదు కదా. ఆడ సూస్తే తెలస్తాది . ఊర్లో వాళ్ల రావిడి .
నేనూ ఒగితే పోను . కూడా కాంతాను, పుల్లూరోళ్ల నీలాను పిలస్తాను. ఆట్లాడు కోను పిలిస్తే తిడ్తారు గాని సింత కాయిలకనేసరికి 'పొయిరాపోండి నాయినా' అని గుడ్డజోలి కట్టిచ్చి వాళ్లమ్మోళ్లు సంతోసంగా పంపిస్తారు.
మేము పోతానే సెట్ల కింద ఎవురయినా ఉంటే వాళ్లను నేను తిట్టి తరిమే లోపల వీళ్ల జోలెలు సుమారుగా నిండి పోతాయి.
వీళ్లను కూడా పిల్చక పోతానని మా యమ్మోళ్లకు తెలిస్తే ఇంగేమన్నా ఉండాదా? పొరక తిరగేయరూ. అందుకే నీలా , కాంతా సింతకాయ లేరుకోను నాతో వొచ్చే ఇసయం మా యమ్మోళ్లకు సెప్పను.
ఒక సుట్టు అన్ని సెట్లూ తిరిగి కాయిలేరుకోని ఒచ్చినాక నల్ల గుండ్ల సందులో బొమ్మరిల్లు కట్టు కోని ఆట మొదులు బెట్తాము మేము.
తినడానికి తీపు సింత మానువి రొండు గోటాయి లిస్తా నంటే ఒడ్డి గుడ్సిల్లోని పిలకాయిలు గూడా ఒగరిద్దరొస్తారు. వాళ్లూ మాతో ఆట్లాడు కుంటారు.
నీలా వాళ్ల జోలెల్లో కాయిలు ఎక్కువగా ఉంటాయా! నాకు ఒళ్లు మండి పోతాది. . అందుకే నేనూ, ఒడ్డి గుడ్సిలు పిలకాయిలు మాన్లో గుత్తులు గా ఉండే సింతకాయల పైన రాళ్లేసి రాలింది ఏరుకుంటాము.
మద్దిలో నీళ్లు తాగాలనిపిస్తాది. అమర్దం ఇంటికి బొయ్యి తాగొస్తాము.
వాళ్లిల్లు పెంకుల కప్పడం. ఇంట్లో సామాన్లు యాడివాడ శానా పొందిగ్గా ఉంటాయి. అందురిండ్లలో మాదిరిగా దొంతి కుండల్లేవు. తట్టా బుట్టీ కంటికి కానరాలా. కింద కూసొనేదే లేదు. కూసునే దానికి మెత్తని పరుపులు. వాటిని సోపాలంటారంటా.
దయామణి అమర్దానికి కొడుకు కూతురు. మాయక్క ఆ బిడ్డి ఇస్కూల్లో ఒకే క్లాసు . వాళ్లిద్దురూ ఒకే బెంచీలో కూసుంటారంటా. అవి నేల బెంచీల్లే.
ఆ బిడ్డితో మాయక్క వాళ్లింటికి పోతా వస్తా ఉంటాదా. వాళ్లింటి తీరూ తెన్నూ ముందే సెప్పిండాది.
కొన్నాళ్లకు దయామణి సిత్తూరుకు పూడ్సింది. వాళ్ల నాయనోళ్లు ఆ బిడ్ని ఆడే సదివించుకుంటా మని పిల్సుకోని పూడ్సి నారు. అమర్దం శాన్నాళ్లు ఏడ్సిందంట లే .
వాలింటి గురించి మా యక్క సెప్పినా ఇంత బాగుంటాదను కోలా.
అమర్దానికి ఒక కూతురుండాది. పేరు కమల . ఆయమ్మ కొడుకే సుకుమారుడు.
అమర్దం వాళ్లు పట్నమోళ్ల మాదిరిగా ఉంటారా. మా ఊర్లో ఎందు కుండారో తెలీదు.
అమర్దం మొగుడు మిలిట్రీ లో ఏదో పెద్దుద్యోగమే సేసి అది అయిపొయినాక నిమ్మలంగా బతకాలని మా ఊర్లో కొచ్చి ఈ పెంకుటిల్లు కట్టుకున్న్యాడంటా. కానీ ఇల్లు పూర్తయినాక పట్టుమని పెది నెళ్లయినా బతక్కుండా నాగు బాము కాటేసి కాటికి చేరుకున్న్యాడు.
అమర్దానికి ఒక తమ్ముడుండేవాడు. పేరు పెరుమాల్. ఆయనికి ముగ్గురు పెళ్లాలు. అమర్దం కూతురు కమల ఒక పెళ్లాం. వాళ్ల కొడుకే సుకుమార్.
సుకుమారుడు ఆయమ్మకు కొడుకంటే ఎవురూ నమ్మరు. తమ్ముడంటే కూడా నమ్మరేమో ! అంత నాజూగ్గా అందంగా చాలా లేత వయసన్నట్లు ఉంటాది మనిషి. ఊర్లో తిరపతిల్ రొయ్యాస్పత్రిలో డాక్టరని సెప్పుకుంటారు గాని అయ్యమ్మ అక్కడ నర్సు అని ఆడే నర్సు పని సేసే ఇరువారం దన్లచ్మి వాళ్లక్క సెప్పే దాకా తెలీదు.
ఆయమ్మను డాక్టర్లకే డాక్టరనొచ్చు. అంత పుట్టు బడి ఉన్ని మనిసి మా ఇలాకా లోనే లేదు. ఊర్లో కొచ్చిందని తెలిస్తే సాలు. ఏదో రోగముండే వాళ్లందురూ ఆయమ్మకు సూపించు కుంటారు. సెయి వాసి మంచిదని పేరు. మందులు కూడా తన దెగ్గిరుండేవి దుడ్లు తీసుకోకుండా ఇచ్చి బాగ జెస్తాది.
అట్లాంటి మనిసిని సదువు సందెల్లేకుండా మావిడి కాయిలు సింతకాయిలు మాసూలు యాపారం సేసు కొనే తమ్మునికి కట్ట బెట్టడం ఎనక పెద్ద కతే ఉందంటారు.
అయ్యమ్మ సదువు కొనే రొజుల్లోనే ఒగ అబ్బోన్ని ఇష్ట పడిందంటా. పెండ్లి సేసు కుంటానని సెప్పి మోసం సేసి నాడని పోవిడి. కల్యాణ మొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు . ఈ యమ్మ కొచ్చిన కక్కు వాళ్ల మేన మామతో కల్యానానికి దారి తీసింది.
ఇష్ట పడినోడు మోసం సేసినందుకు ఆ యమ్మకు మొగోళ్ల మిందే కాదు పెండ్లిమింద కూడా ఎంత రోయింపొచ్చిందో ఆ పరమాత్ముడి కెరుక.
ఎంటనే ఎవురికో ఒకరికి కట్ట బెడితే గాని పరువు నిలబడదని కూతుర్ని, తమ్ముణ్ని, తమ్ముడి పెండ్లాం లచ్మిని కూసో బెట్టు కోని మాట్లాడింది అమర్దం. అప్పిటికి లచ్మికి బిడ్డా పాప లేరు. ఆ యమ్మ కమలాను తమ్మునికి కట్ట బెడ్తానని సెప్పి నప్పుడు లచ్మి అడ్డు సెప్పలా.
తల్లి మాదిరిగా ఆదరించే అమర్దానికి ఎదురు సెప్తే పుట్టు గతులుండవని తెలుసు లచ్మికి. పైగా ఉత్తుత్తి పెండ్లని తెలస్తానే ఉండాది. లాభమే గాని నష్ట మేముండాది అనుకునింది లచ్మి. అట్లా వాళ్ల నొప్పించి తమ్మునికీ కూతురికీ ముడి పెట్టేసింది అమర్దం.
వాళిద్దురికి పెండ్లయితే అయింది కాని ఒకరి మొగం ఒకరు సూసు కొనేది ల్యా. ఎప్పుటి మాదిరిగానే కమలకు పెరుమాలు మేనమామ అంతే.
కమలకు కొడుకు పుట్ణ్యాడా. వాడు అమర్దం దెగ్గిరే పెరిగి పెద్దవతా ఉండాడు. అది తిరుపతి నుంచి వారానికో రొండు వారాలకో ఒచ్చి కొడుకును సూసుకోని అదేపతా పోతా ఉంటాది. .
ఆడ కడ్సీగా మూడిండ్లుండాయని ముందే సెప్పుండా గుర్తుందా. ఒగటి అమర్దానిది. , రొండు పెరుమాలు లచ్చ్మీ ఓళ్లది. ఇంగ మూడోది ఎస్తరోళ్లది.
ఉండెంట్టుండి దూరపు బంధుల అమ్మాయిని పెళ్లి చేసుకొని దిక్కు దివాణం లేని వాళ్ల అమ్మను కూడా ఎంట బెట్టు కొని వచ్చినాడు పెరుమాలు ఒకనాడు. అదేమంటే లచ్మికి పిల్లలేరి ? అంటాడు.
గుట్టు చప్పుడు కాకుండా మూడో ఇంట్లో కాపురం పెట్టించింది. అమర్దం.
ఇక్కడ లచ్చిమి గురించి కొంచం చెప్పాల. కమల నాజూకైన గాజు బొమ్మైతే లచ్మి పోత పోసిన నిలువెత్తు విగ్రహం. బారీ మనిసి. నొక్కుల జుట్టు . పెద్ద జడ. చెవుల్లో మనిసికి తగ్గట్టుగా ఏలాడే పెద్ద పెద్ద లోలాకులు. మెడలో కాంచికాయిల పూసల దండ . కాళ్లకు గెట్టి గొలుసులు . మంచి రూపం. అంత కన్నా మంచి మనసు.
ఎడబడకుండా ఎప్పుడు సూసినా లచ్మి నోటి నిండా ఎర్రటి వక్కాకు. దాని తాలూకు ఎర్రటి రసం పెదిమల కొనల్లోకి జారి కనిపిస్తా ఉంటాది. .
అమర్దాన్ని సొంత అమ్మగా సూస్తాది లచ్మి. . కమల పెరుమాల్ని కన్నెత్తి సూడదు. లచ్మి పెరుమాల్ని కంటికి రెప్ప మాదిరిగా సూసుకుంటాది. మొగుడు మళ్లీ పెళ్లి సేసుకున్నా అదరని బెదరని మనసుతో ఒగ మాట మాట్లాడ కుండా ఎస్తరుకు ఏరు కాపురానికి కావలసిన సట్టీ కుండా కూడా సమకూర్చిన దొడ్డరాలు లచ్మి.
ఎస్తరు చామన చాయతో కొంచిం పొట్టిగా పొట్లం మాదిరిగా పుష్టిగా ఉంటాది.
ఆయమ్మ నెల తప్పినప్పుడు అందురికంటే జాస్తిగా మురిసి పొయింది లచ్మి. మొగుని వల్ల ఎస్తర్ కడుపులో ఒగ కాయ కాస్తా ఉన్నందుకు.
దానికి కొడుకు పుట్టినప్పుడు సంబర పడడమే కాదు సాకి సంతరించింది కూడ ఆమే.
ఆమె మంచి తనమే ఆమెకు మేలు చేసిందేమో.! లచ్మి కూడా ఎంట ఎంటనే ఇద్దరాడ బిడ్లికి జన్మ నిచ్చింది. పెద్ద దానికి సాయిత్రి అని , సిన్న దానికి జమున అని పేర్లు పెట్టు కొనింది. లచ్మికి సినిమాల పిచ్చి జాస్తి.
ఆ మూడిండ్ల మద్దిన ఉన్న అన్యోన్యత, వాళ్ల అణకువ , వాళ్ల బతుకుల్లో ఏ లోటూ లేని డాబూ దర్పం , నాగరిక మైన తీరూ తెన్నూ సూసి వాళ్ల పట్ల ఏడా లేని మర్యాద మన్నన సూపిస్తారు ఊరి జనం.
మూడురోజులకో, నాలుగు దినాలకో వాళ్లింటి ముందుకు ఒక జీబొచ్చి నిలస్తాది. అందులో నించి ఎవరొచ్చిన్నా రాకున్నా ఒక పద్నాలుగేండ్ల అమ్మాయి ఒచ్చి దిగతాది. ఆ బిడ్డి ఎవురో కాదు. అమర్దం మనవరాలు దయామణి.
అమర్దం ఒక్కగానొక్క కొడుకు మంచి ఆపీసరుద్దోగం సేస్తా ఉండాడు. వేరే కులపామిని పెండ్లి సేసుకొని మొదట్లో తల్లికి దూరంగా ఉండి పోయినా ఆ తర్వాత మెల్లింగా కలుసు కున్న్యారు.
వాళ్ల కూతురు దయామిణికి నాన్నమ్మంటే ప్రాణం . ఒగటీ రొండు తరగతులు ఈడే ఉండి సదుం కునింది కూడా . మద్యలో వొచ్చినా , రాకున్న్యా ఆది వారం మాత్రం తప్పకుండా ఈడే ఉంటాది.
దయామిణి అచ్చం వాళ్ల మేనత్త పోలికే. ఐతే వాళ్లత్త కన్న ఒక జానా బెత్తెడు పొడుగు ఎక్కువగా పెరింది. శానా బాగుంటాది. టవున్లో సదుం కుంటాదా! సొకే సింగారం - దాని నీటే బంగారం. సూపు తిప్పు కోలేరెవురూ.
సింత కాయిలికి పొయినప్పుడు వాళ్లింటి ముందు జీబు కనిపిస్తే సాలు తేరూ తిర్నల్కొచ్చినంత సంబరంగా ఉంటాది మాకు .
దయామణి ఎప్పుడెప్పుడు సిత్తూరుకు పొయ్యేదానికి బయిటి కొస్తాదా అని కాసుకో నుంటాము. ఒచ్చి జీబెక్కే ముందు వాళ్లవ్వను వాటేసుకోని ముద్దు బెట్టు కుంటాది. ఆ తర్వాత టాటా సెప్తాది. జీబు కదలతాదా . కనిపించేంత దూరం తొంగి తొంగి సూస్తాది. అదంతా సూస్తా ఉన్ని మేమూ ఇంగ అన్నించి కదలతాము .
మా ఊర్లో ఏ ఆండబిడ్డయినా దయామణిని సూసినాక ఆ బిడ్డి మాదిరే తల దువ్వుకొంటాది, తిలకం దిద్దు కుంటాది. ఇంట్లో ఏడ్సి మొత్తుకోని , తిట్లూ కొట్లూ తినైనా గోర్ల సాయి కొనుక్కొనేస్తారు.
నేను గుడా జుట్టు జడేసుకోకుండా అంతా సేర్సి మద్దిలోనే రిబ్బను కట్టు కోని కుచ్చు పెట్టుకోడం నేర్సుకున్నా . నన్ను సూసి మా ఊర్లో ఆనంద , యామలత ఇట్లా ఒగొగరే నేర్సుకున్న్యారు. దయామణి ఏ తీరుగా సింగారించు కుంటాదో ఆ తీరు తెన్నులన్నీ మాకూ అలవాటై పోయింది.
ఇదంతా మా సిన్నప్పటి సంగతులు. అప్పుడా ఊర్లో ఉండే ఆండ పిలకాయిలకు ఎప్పుడో పెళ్లిళ్లయి పోయి మూల కొకరయి పోతిమి.
అడపా దడపా పండగా పబ్బాలకూ, ఊర్లో వాళ్ల పెండ్లిండ్లకూ కలుసు కొనేటోళ్లం. అందరికీ పిల్లా పీచూ కలిగి సంసార లంపటం ఎక్కువైనాక సీటికి మాటికీ పుట్నింటికి రావడం పూర్తిగా తగ్గి పోయింది. అదవా ఒచ్చినా అందురూ ఒకే సారి రావడం లేదు .
ఏండ్లు గడ్సి పొయినాయి . ఊర్లో దెగ్గిరోళ్ల సావులూ దినాళ్లు తెలుస్తున్నాయి కానీ పూర్తిగా ఆ పక్క ఈదిలో ఉండే వాళ్ల పొవిడి అస్సలు తెలీడం లేదు.
అప్పుడు సిన్న పిల్లోళ్లుగా ఉన్ని మాకంతా అంత వొయుసున్న మనవండ్లు మనవరాండ్లు ఉన్నారిప్పుడు .కొందురికి ముని మనవలు కూడా ఉన్నారు.
మా ఊర్లో పాతోళ్లు శానా మంది మంటి మరుగయి పొయినారు. ఒచ్చిన కొత్త కోడండ్లు ఎవురు ఏ ఇంటి కోడలో మా తమ్ముడి బార్య సెప్తే తప్ప తెలీడం లేదునాకు.
ఈదిలో గలాం బులాం అని ఆట్లాడు కుంటా ఉండే పిలకాయిల్ని సూస్తే సిన్నప్పడు మేము ఆట్లాడు కునింది గుర్తొచ్చి కండ్లలో నీళ్లు సుళ్లు దిరగతా పైకుబకతాయి. ఆట్లాడు కొంటా ఉన్ని పిళ్లోళ్లయితే ఒగరూ తెలియరు.
మా ఎర్ర మొన్ను సేను అమ్మేసి యాభై ఎండ్లయి పోయింది. ఊర్లో అందురూ దాంట్లోనే గలీజు సేస్తారని మాయమ్మ అమ్మేయ మనిందని ఉత్త పుణ్యానికి ఒక పదకొండు ఏలకు దిగ్గొలుకు కున్న్యాడు మా నాయిన.
రోడ్డుకానుకో నుండే ఆ సేను ఇప్పుడు పదకొండు కోట్లిచ్చినా రాదు. సిత్తూరు బెంగులూరు ఐవే అంటారే దాని కానుకోని ఉంటాది మరి. మా ఊరు సిత్తూరులో కలిసి పోయి మునిచి పాలిటీ లో సేరి పోయింది. అందుకే అంతంత రేట్లు .
మా సేను గెట్టున పుట్టెడు బిడ్ల తల్లులు మాదిరిగా పూత పూసికాయిలు కాసే నలభై మూడు సింత మాన్లూ లేవు. సేను తావులో ఇప్పుడు నందినీ రెస్టారెంటు నడస్తా ఉంది. పెద్ద పెట్రోలు బంక్ ఉండాది.
అమర్దం వాళ్లుండిన మూడు పెంకుటిండ్ల తావున కూడా వాళ్లుండిన ఆనవాళ్లు లేవు. అక్కడంతా సిన్న బజారు తయారయ్యింది. సిన్న సిన్న బంకంగళ్లుండాయి . ఓ చిన్న హోటల్ కూడా ఉండాది.
కల్లంగడొకటి పగటి పూట కూడా కిట కిటలాడతా ఉండాది.
అమర్దం , పెరుమాలు, లచ్చ్మి కాలం సేసినారంటా . ఎస్తర్ , కొడుకు యాడ బొయినారో తెలీదు. లచ్మి రొండో కూతురు తల్లి చావుతో పిచ్చిదయి మా ఊర్లోనే తిరగతా ఉండాది. ఎవరైనా పిల్చి పెడితే ఒగ ముద్ద తింటాదంటా . దాని అతీ గెతీ సూసే నాదుడు లేడు. దాని బతుకు పల్లాకుల పాలై పోయిందని ఏరే సెప్పాలా?
లచ్మి పెద్ద బిడ్ని మాత్రం ఎస్తర్ తనతో పాటు తీసక పోయిందంట. పనీ పాటకు పనికొస్తాదని. పెండ్లి సేసి ఇంట్లోనే పెట్టుకునిందని దానికి బిడ్డ పాపా లేరని సెప్పినారు. వాళ్లమ్మ , దాని మంచి గుణం గుర్తొచ్చి ' మాదా పణ్ణదు మక్కల్కాగుం ' అంటారు. అంత మంచి దాని బిడ్లికి ఈ గెతొచ్చిందా అని గుండి కాయిని పిండినట్లయింది.
సుకుమారుడు వాళ్లవ్వ సచ్చి పొయినాక తల్లి కమల దగ్గరకు పొయినాడు. తల్లి సదుంకున్ని ఉద్యోగస్తు రాలు అవడం వల్ల పెద్ద సదువులు సదుం కున్న్యాడు. దయామణిని పెండ్లి సేసు కొని తిరుపతి లో క్షేమంగా ఉండదంటా. అది విని 'పోనీలే ' అనుకున్నాను.
సెట్టుకు పూసిన పూలన్నీ పండ్లు కావు. కొన్ని పూలు పూలు గానే రాలి పోతాయి. కొన్ని పిందెలుగ , కాయలుగా నేల పాలవతాయి . కొన్ని మాత్రమే బతికి బట్ట గట్టి పండ్లుగా తయారయి అంగడి సరుకుగా మారి రైతు కాయి కష్టానికి కొంతయిన
Comments
Post a Comment