వొదినా అండ bidlu- మాండలిక కథ

 వదినా ఆండ బిడ్లు



        వొదినా ఆండ బిడ్లు ఎంత ఒద్దిగ్గా ఉంటారో సూడాలంటే మా పార్వతొదిన్ని , వాళ్లాండ బిడ్డి అమరావతినీ సూడాల్సిందే.

        అమరావతి సొయానా మా పెద్దమ్మ కూతురు. దానికి పెండ్లయిన ఏడు నెళ్లకు వాళ్లన్న సుదాకరునికి పెండ్లయింది

        వాళ్లన్నకు పెండ్లి అనంగానే యాడలేని కుశాలొచ్చేసింది అమరావతికి. పార్వతిని  సూసి రావడం మొదులుకొని సీరలూ నగలూ కొనే కాన్నించి అన్నీ తనే సేసింది. కొట్లాడి ఎక్కువే వాళ్ల ఒదిని కోసం కొనిపించింది. పెండ్లిలో వాళ్లన్నతో దెగ్గిరుండడమే కాదు,  అన్ని పనులూ నెత్తి నేసుకొని సేసింది.

         అత్తింటి బందువుల్ని కూడా ఒగిర్నొదిలి పెట్ల్యా .  మొగునితో కూడా పోయి మరీ మరీ రమ్మని సెప్పి పిలిసొచ్చింది.

        పార్వతికి  పెండ్లి లోనే అర్తమై పోయింది. అన్నా చెల్లిళ్లు ఒగరికి కొకరు పానాలిచ్చి పుచ్చుకొనే రకాలని.

       బర్త పైన ఉన్ని ప్రేమతో ' మాయన్న కంటే  మా ఒదినే ఎక్కువ నాకు  అని అనిపించు కోవాల అమరావతితో ' అని గెట్టింగానే అనుకొనింది పార్వతి .

        అందురితో మంచిగా ఉండాల అనుకుంటానే  అత్త గారింట్లో అడుగు పెట్టింది పార్వతి. అమరావతి , ఒదినితో ఒక నిముసం ఎడ బడితే  ఒట్టు.

        పెండ్లికి ఒచ్చిన తమకు సంబందించిన బందువుల్ని  ఒకర్ని ఒదిలి పెట్టలేదు అమరావతి. అందుర్నీ బలమంతంగా ఈడ్సుకోనొచ్చి వాళ్ల వొదినికి పరిచయం చేసింది. ముఖ్యంగా తన చిన్నప్పటి స్నేయితురాళ్లను.

        ఆ ఊరికి కొత్తంగా కోడాండ్లుగా ఒచ్చి తనకు దగ్గరవడమే కాకుండా ప్రాణంగా ఉండే వాళ్లనూ  పిలుచుకోనొచ్చింది. 'మీరు ఈ ఊర్లోనే ఉండేటోళ్లు , నాతో ఎట్లుండినారో మా ఒదినతో గూడా మీరు అట్లే స్నేహంగా ఉండాల ' అని చేతిలో చెయ్యేపిచ్చు కొనింది.

        ఇంట్లో చిన్నప్పుడు ఆడుకొని దాచి పెట్టు కున్న ఆట వస్తువుల్ని, తను వాడు కొంటుండిన సామాన్లను , తినే తట్టను , ట్రంకు పెట్టిని, తను ఇన్నాళ్లు పండుకొంటుండిన పట్టె మంచాన్ని సూపించి  'ఇవన్నీ ఇంక నీకే ఒదినా'  అని అప్పగింతలు పెట్టింది.

        ' అమా , నన్నెట్లా సూసుకుంటా ఉంటివో దాని కంటే ఎక్కువగా మా ఒదిన్ని సూసు కోవాల. కోడలు గదా అని అత్తరికం సెయ్యాలనుకుంటివా నా కథ నీకు తెలీదు. మల్లి సుక్కలు సూస్తావు ముందే సెప్తా వుండా నీకు ' అని ఎచ్చరించింది.

        ' బాగ సూసు కోకుండా మీ వొదిన్ని నేనేమన్నా  కొడతానా తిడ్తానా లేక పోతే కొరుక్కోని తింటానా' అని నవ్వింది వాళ్లమ్మ బాగ్గెమ్మ.

        ' అట్నే గానీ లే పాపా . నేను నీ కంటికి అత్తరికం సేసే దాని మాదిరిగా కనిపిస్తా ఉండానా ? ' అని మేల మాడింది కూడా అందరూ నవ్వతా ఉంటే.

       ఆ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరూ అంతే దూరం గదా. ఎదుటి  వాళ్లను బట్టి  కూడా నడత మారతా ఉంటాది.

        పార్వతి మనుషుల్ని కలుపుకోని బోవడంలో అమరావతి కంటే రొండాకులు ఎక్కువే సదివింది. తన పైన అంత ప్రేమ చూపిస్తా ఉంటే పార్వతి అంత కన్నా ఎక్కువగా ఆండ బిడ్డి మింద ఇష్టం పెంచు కుంటా వొచ్చింది. పైగా ముందే అనుకోనే అత్తింట్లో అడుగు పెట్టింది కదా!

        ఇంట్లో జీత గాళ్లు , కూలి కొచ్చే మనుషులు గూడా 'ఏ సెట్టుకు ఆ పువ్వే పూస్తాది గాని యాప్నానుకు సింత పూలు పూస్తాయా? ఆ ఇంటికి దగిన కోండాలే ఒచ్చింది ' అని సెప్పుకొనే
వాళ్లు కొత్తల్లో. ఇప్పుడైతే ఇంగ పార్వతంటే వాళ్లకు
ఒక అపురూప మైన దేవత.

        ' మా పాప అమరావతి మాదిరేమ్మా నువ్వూనూ. మీరిద్దురూ అమడ బిడ్లుగా పుట్టి పెరగాల్సి నోళ్లు. దేవుడెందుకో మిమ్మల్ని ఒదినా ఆండ బిడ్లుగా పుట్టించి నాడు ' అంటా పార్వతి నడతా నాగరికతా సూసి ముక్కు మింద ఏలేసుకొని అర్సోది పోతారు ఊర్లో జనం .

        అమరావతి పుట్నింటి కొస్తే సాలు ఒదినా ఆండ బిడ్లిని పట్ట పగ్గా లుండవు .

        ఈ యమ్మ సీర ఆ యమ్మ కట్టు కుంటాది. ఆ యమ్మ రవిక ఈ యమ్మ ఒంటి మిందుంటాది. ఈ యమ్మ ఆ యమ్మ తల దువ్వి జడేస్తాది. ఆ యమ్మకు ఈయమ్మ తల దువ్వి తీరు తీరులుగా కొప్పు గడతాది. 

        ఇంగ సెప్పాల్నా ఎవురికైనా పెండ్లి పేరంటాలైతే సాలు ఇద్దురూ జయలలిత , శశికళల మాదిరిదిగా ఒకే రకం సీరలు , రవికలతో సిద్దమవతారు. ఆయమ్మ నగలు ఈయమ్మ , ఈ యమ్మ నగలు ఆ యమ్మ ఏసుకోని ఇద్దురూ మాట్లాడుకుంటా అందర్నీ పలకరించు కుంటా జంటగా తిరగతా ఉంటారు.

        వాళ్లను సూసి కొందురు ముచ్చట పడితే కొందురు కుళ్లు కుంటారు. మరీ ఓర్సుకోలేనోళ్లు
' ఓ యబ్బో అదిశంగా వీల్లే ఒదినా ఆడ బిడ్లయినట్లు  లోకంలో ఇంగెవురూ లేనట్లు ' అని పక్క నోళ్లతో సెప్పి మూతి మూడు వంకర్లు దిప్పతారు.

        అంతెందుకు పార్వతి పుట్నింట్లో ఏ కార్యం జరిగినా అమరావతి ఉండాల్సిందే . అమరావతి అత్తింట్లో ఏ పని బడినా పార్వతి ఉండాల్సిందే.

        పార్వతి తోబుట్టువులే ' మనం అక్క కంటికి ఎక్కడానతాములే '  అని మూతి నల్లంగా సేసు కుంటారు ఈళ్లను సూసి.

        సమత్సరం తిరకుండానే పార్వతి నీళ్లు పోసుకునింది. ఆ ఇసయాన్ని అమరావతికి తెలియజేసే దాకా నిద్ర బోలా పార్వతి.

        ఇంటిల్లిపాదీ సంతోసంలో మునిగి తేలతా ఉంటే ఏకంగా మొగునితోనే ' మీ సంతోసం సరే ముందుగా బొయ్యి అమరాకు ఈ సంతోస ఇషయాన్ని సెప్పి రాబోండి ' అని తరిమింది పార్వతి

        అనుకోకుండా అన్నొస్తే ఏ చెల్లికి అనందంగా  ఉండదు. అట్లాంటిది  ' నువ్వు మేనత్తవు గాబోతుండావమ్మా ' అని అన్న అనంగానే అమరావతిని పట్టడానికి పగ్గాల్లేక పొయినాయి. ప్రపంచంలో ఉన్న ఆనందమంతా తనదే అనుకొనింది.

        వెంటనే పుట్నింటింకి పొయ్యి వదినను చూడాలని ఆరాట పడి పోయింది. వాళ్లత్త  కుడా తల్లి మాదిరిగా సూసు కుంటాది కోడాల్ని. కోడలి మనసు తెలుసు ఆమెకు . మంచి తనమూ తెలుసు. అందుకే '  కుర్సీ పీట మింద కూసున్న అత్తా - మాయన్న వచ్చాడు నన్నంపుతావా' అని అడక్కుండానే కోడాల్ని పయానం కట్టించి 'వారం దినాలుండి రాబో' అని పంపించింది.

        కడుపుతో ఉన్న వాళ్లు ఏయే జాగర్తలు  తీసుకోవాలో ఎలాంటి తిండి తినాలో అత్తను గాక అక్కనా పక్కనా ఉన్నోళ్లను గూడా అడిగి తెలుసుకొనింది అమరావతి. ఎవురు కనిపించినా వాళ్లందరితో వదిన నీళ్లు బోసుకున్న ముచ్చట్లే .

        ' అదిశంగా బిడ్డి పుడ్తే సెవులు గుట్ను గెడ్డ పారెత్తు కున్న్యాడంట ఎనకటి కెవుడో ' అని అమరావతిని సూసి గుస గుస లాడు కున్న్యోల్లూ లేక పోలేదు ఊర్లో .

        'బిడ్డ పుట్టి పెరిగి పెద్దయినాక నాతోనే వియ్యమందాలొదినా ఇప్పుడే అందురి ముందర సెప్తా వుండా ' పిచ్చా పాటి మాట్లడు కొనే టప్పుడు అనింది, వదినిని సూసి పోవడాని కొచ్చిన అమరావతి.

         'నీలాంటి అత్తమ్మ దొరికితే నా పిలకాయిలకు అంత కంటే ఏం కావాల ' మనస్స్పూర్తిగానే అనింది పార్వతి.

        ' ఆలూ లేదు సూలూ లేదు అల్లుని పేరు సోమలింగ మంటా ' ఎగతాలి సేసి నాడు వాళ్లన్న.

        ' సోమ లింగమో రామలింగమో , వాడు నా అల్లుడు. ఇంకెవురికీ వాడి మింద హక్కు గానీ అదికారం గానీ లేదు. ఉంటే గింటే అంతో ఇంతో మా వదిన కుంటుంది గానీ నీక్కూడా లేదునా ' అనేసింది అపురూపమైన అన్నదమ్మునితో సెల్లి అమరావతి.

        ఆ మాటతో అక్కుడున్న్నోలందరి మొగాల పైన నవ్వుల పూలు పూసినాయి .

        ' పిండి బొమ్మను జేసి పీటమింద కూసో బెడితే ఆండ బిడ్డి తనాన ఎగిరెగిరీ పడిందంట. మీ వొదిన దెగ్గిరి కాబట్టి నీ ఆటలు సాగతా ఉండాయి, ఇంగొకరయితేనా? ' దీర్గం దీసింది బాగ్గెమ్మ .

        ' ఏం ఇంగొకరైతే తల గొట్టి మొలేస్తారా ? నాదగ్గర  ఆ పప్పులుడకవ్. ఈ ఊరికి ఆ ఊరెంత దూరమో ఆ ఊరికి ఈ ఊరూ అంతే దూరం అని మమ్మల్ని సూసి ఊర్లో వాళ్లు అనుకుంటా ఉండ్లా . అది నిజం గాదా ! ఏ ఎవ్వారమైనా అట్లే ఉంటాది.

        మళ్లీ అందరి మొగాల మింద చిరు నవ్వులు. అమరావతి ఒచ్చిందంటే ఆయింటికి పండగొచ్చినట్లే . ఒదినా ఆడబిడ్ల ఒద్దికను సూస్తా ఉంటేనే కడుపు నిండి పోతుంది.

        ' మా అత్తమ్మే మేలు మా , ' మీ ఒదిన కడుపుతో ఉందంటే నీ మనసంతా ఆడే ఉంటాది. పొయిరాబో '  అని నేను అడక్కుండానే పంపించిందంటే అందులో నీ కూతురి గొప్పదనం కూడా ఉంటాదని తెలుసుకో ' అంటా వాళ్ల అత్త సహృదయతను మెచ్చుకొనింది అమరావతి.

        'అది కూడా నీ గొప్పతనమే అంటావ్ మొత్తం మింద' అని అన్న ఆట పట్టించినాడు.

        ' అదంతా నీ మంచితనం అమరావతీ. ఆ మంచి తనంతోనే ఎట్లాంటోళ్లనయినా బుట్టిలో ఏసుకొనేస్తావు. ' అన్న్యాడు మళ్లీ సెల్లెలి సహృదయత తెలిసిన అన్న.

        ' ఏం? మా ఒదినలో ఆ మంచితనం  కనిపించ లేదా నీకు. ? ఎంటనే అడిగింది అమరావతి.

        ' ఏ మాట కా మాటే చెప్పుకోవాల. ఈ విషయంలో మాత్రం ఒదినా ఆడబిడ్లిద్దరూ దొందు దొందే. ' వాళ్లమ్మ  సమాదాన మిచ్చింది.

         వారం దినాలుండి అమరావతి వాళ్ల ఊరికి బయలు దేరింది.

        పార్వతికి మూడో నెల పెట్టంగానే నాలుగు రకాల పలారాలు కాల్చుకోనొచ్చి ఉరంతా పంచింది అమరావతి. అయిదో నెలలో పార్వతి వాళ్ల పుట్నింటోళ్లు గూడా పలారాలు పెద్ద మొత్తంలో తెచ్చినారు.  తొమ్మిదో నెల దాకా దగ్గరి సుట్టాలు నెలకు ఇద్దురు ముగ్గురు కాల్చుకోనొస్తానే ఉండారు. తెచ్చినవన్నీ  ఊర్లో పంచుతా ఉన్నారు. అందరిండ్ల లోను చిరు తిండ్లు మిగిలి మిట్న పడతా ఉండాయి.

        కానుపుకు పార్వతి పుట్నింటికి పోబట్టి గానీ లేకుంటే అమరావతి వదిలేది గాదు. అయినా ఆ సమయానికి అదృష్టం కొద్దీ హాస్పిటల్లో ఒదినకు పక్కనే ఉంది. ఒదినకు నొప్పులొస్తున్నాయని తెలియంగానే ఆగ మేగాల మింద వచ్చి వాలిపోయింది మరి.

        శుక్ర వారం నాలుగున్నర గంటలు కావస్తుండగా పార్వతికి  కానుపయింది. . సుక ప్రసవమయినందుకు అందరూ సంతోసించారు కానీ ఆడ బిడ్డ పుట్టినందుకు అమరావతి , పార్వతి మాత్రం మొగాలను కొంచం నల్లంగా బెట్టుకున్నారు. వాళ్ల ఒప్పందం అట్లాంటిది మరి!

        ఒక నిముషంలోనే తేరుకున్న అమరావతి 'ఒదినా , నీ కూతురు ఎప్పటికయినా నా కోడాలే . . మనము ఒదినా ఆడ బిడ్లిమే కాదు, వియ్యపు రాళ్లం  గూడా ' అనింది  . ఆ మాటల్లో దీమా ఉట్టి పడతా వుంది.

          అక్కడున్న  వాళ్లందరూ ఎట్లా అన్నట్లుగా మొగం బెట్న్యారు

        ' మొగ పిల్లోడు సమత్సరం  ఆర్ణెల్లు సిన్నో డయినంత మాత్రాన కొంపలు మునిగి పోతాయా ? , పట్నం కొల్ల బోతాదా? నా కొడుక్కి నా మేన కోడాలే పెండ్లా మవతాది. ఆరు నూరైనా అగ్రారం పాడైనా ఇది జరిగి తీరతాది ' గంట గొట్టి సెప్పేసింది అమరావతి.

        పనిలో పనిగా కొన్ని ఉదంతాల్ని ఉదాహరించింది. గాందీ కంటే కస్తూరి బాయి పెద్దదని , రాముని కంటే సీత పెద్దదనీ ... ' చెప్పు కొచ్చింది . సచిన్ టెండూల్కర్ పేరు  అప్పిటికి లోకానికి తెలియదు. . లేకుంటే ఆ సంగతీ చెప్పేదేమో!

        ఈ విషయాల్ని విని ఊర్లో చాలా మంది ముక్కు మింద ఏలేసుకున్యారు . వీళ్ల అన్నోన్యాన్ని సూసి గిట్టని వాళ్లూ ఉండారా ఊర్లో. వాళ్లు 'ఈయమ్మిణ్నికి కొడుకు బుట్ని కాలానికి కదా ! ' అని ఎగతాళిగా కూడా మాట్ల్యాడు కున్న్యారు.

        సంకల్ప బలమో , దైవ నిర్ణయమో , విధి రాసిన రాతో ఇంగా పార్వతి ఆస్పత్రిలో ఉండంగానే అమరావతి కండ్లు తిరుగుతా వుందంటే డాక్టరికి సూపించినారు.

        ' ఆమె చెప్పిన సంతోస వార్త ఎవరికేమని పించిందో గాని ఒదినా ఆడ బిడ్లికి మాత్రం ఊరట నిచ్చింది. కారణం పిల్లలిద్దురికీ తొమ్మిది నెలలే తేడా  ఉంటింది అనుకోవడం.

        'అట్లనుకున్న్యా దానికి మొగబిడ్డే పుడ్తాడని ఏమి గ్యారెంటీ' అనుకున్నోళ్లూ లేక పోలేదు.

        సూస్తా ఉండంగానే కాలం గిర్రున తిరగతా పరిగెత్తి అమరవతి కాన్పు దాకా ఒచ్చేసింది. ఒదినా అండబిడ్లి మొగాల్లో ఆనందం , కండ్లలో దీపాలూ ఎలగతా ఉండాయి ఇప్పుడు. ఇద్దురూ ఎవురు ఎవురి బిడ్లో తెలియనంతగా పెరిగి పెద్దవతా ఉండారు. 

        మా ఊర్లో మేమంతా కూడా అత్తా ఆండ బిడ్లితో కలిసి మెలిసి స్నేహంగా ఉండా మంటే కారణం అమరావతక్క పార్వతి ఒదిన్లను సూసే అని ఏరే  సెప్పాలా?

           
                      మహాసముద్రం దేవకి
                      10-12-2018
        

Comments