వరిగపల్లె ముచ్చట్లు :13
అంగిడి సాలమ్మత్త
మావూర్లో నడీది మలుపు దాటంగానే వస్తాది మాయవ్వోలిల్లు. ఆడ సందులో నుంచి మూలకుంటాదది. అందుకే మా యవ్వోళ్లను మూలింటోళ్లంటారు.
ఈదికి నేరుగా ఏమో మా చింతాతోలిల్లుంది. ఈది పోటని మా చిన్నవ్వ ఆ ఇల్లు ఒద్దే వొద్దనిందంటా , ఏరుబందం పొయినప్పుడు. కానీ మా చింతాతుండాడే ఆ ఇల్లే కావాలని పట్టు బట్టి మరీ తనే పెట్టుకున్న్యాడంట . అయితే నేంలే . ఆ ఇంట్లో మా చిన్నవ్వ రాజ భోగం అనుబోగించిందని ఊరూ నాడంతా సెప్పుకుంటారు .
ఆ ఇంటికానుకొని అంగిడాయినింటికి బొయ్యే సందు. . దాని పక్కన ఒక పాడుబడిన కొంప . ఆ కొంపను మా చింతాత కూతురుకిచ్చినాడు.వాళ్ల ఊరిలో బతుకుతెరువు సరింగా లేదని ఈ ఊర్లో ఉండే వాళ్లు అల్లుడు , కూతురు.
ఆ పాతింట్లో ఉండలేక ఒడ్డి గుడ్సిల్లో ఉండే కర్ణం రామ చంద్రునింట్లో కొన్నేడ్లుండి నారు . వాళ్ల కొక కూతురు, ఇద్దురు కొడుకులు. కూతురు లలిత పాముకర్సి సచ్చి పొయింది. అంతే ఆడ ఉండలేక పెండ్లాం, పిలకాయిల్ని పిల్సుకోని వాళ్లూరికే పూడ్సి నాడాయన .
మా సింతాత కూతురుకిచ్చిన ఇల్లు పాడుబడి పోయి ఇప్పుడు మొండి గోడలు మాత్రముండాయి. ఆ పాడుబడిన తావులోనే తూరుప్పక్క ఒక జోబిడేసుకోని దాంట్లో ఉంటాది మా సాలమ్మత్త. మొండి గోడల మద్దిలో గుమ్మిడి సెట్లు , సిక్కుడు సెట్లు, పూల సెట్లు ఎప్పుడూ నవ నవ లాడతా ఉంటాయి . వాటిని నాటి , నీళ్లు బోసి సాకి సంతరించేది మా సాలమ్మత్తే.
సాలమ్మత్తకు ఆస్తి పాస్తుల్లేవు. ముందూ ఎనక, దిక్కూ దివానం కూడా ఎవురూ లేరు. ఒంటి కాయ సొంటి కొమ్ము మాదిరిగా ఒకతే ఉంటాది.
మొగుడు సచ్చినాక ఒక దినం పరింబాడు నించి మా ఊరికొచ్చిన సాలమ్మత్త అత్తింట్లో ఇమడ లేక ఈడే ఉండి పోవాలనుకొనింది.
అందురితో ఒద్దిగ్గా ఉండే సాలమ్మత్త ఆడ ఉండలేక రాలేదని, బావ చెడు వర్తనను తప్పించుకోడానికే ఈడి కొచ్చిందని సెప్పు కుంటారు.
ఈ ఊరు ఆ యమ్మకు పుట్నూరూ కాదు, మెట్నూరూ కాదు. వాళ్ల అమ్మకు పుట్నూరు. వాళ్లమ్మ , మా యవ్వ స్నేయితురాండ్లు. సిన్నప్పుడు కొన్నాళ్లీడ పెరిగింది.
అత్తిల్లు ఒద్దనుకోని వొచ్చిన సాలమ్మత్తకు మొగుని ఆస్తి రావాల్సి ఉన్నా పిల్చి వాళ్లత్తింట్లోళ్లు ఆస్తి ఇచ్చిందీ లేదు . ఈమె పొయ్యి అడిగిందీ లేదు.
బతకడానికి తెరువు లేక మాయవ్వ ఇచ్చిన సలహాతో దోసెలంగడి పెట్టింది సాలమ్మత్త. ఉత్త చేతుల్తో ఒచ్చిన సాలమ్మత్తకు ముప్పై మూడూ సమకూర్చి ఇచ్చింది మాయవ్వే. అందుకని ఆ యత్తకు మాయవ్వంటే దేవతతో సమానం.
' యమా ' అని నోరారా పిల్సేది మాయవ్వను. మాయవ్వ సేతికి ఎముక లేదు. దుడ్లు కయితే తడబాట్ల సేటు గాని తిండి గింజలకు కరువు లేదు. పది మందికి పెడితే పున్నిమే కదా! 'మాదా పన్నదు మక్కల్కాగుం ' అని దాన దర్మాలు బాగానే సేసేది మాయవ్వ.
అంగిడి పెట్టమని సెప్పి ఊరికే ఉండి పోలా మాయవ్వ. పెట్టుబడి పెట్టను సాలమ్మత్త దెగ్గిర దుడ్లేడుండాయి .అందుకే పండిందీ ఎండిందీ దారాళంగా శాట్లలో నింపి తీసక పొమ్మని ఇచ్చింది .
ఆడది సెడి ఈ ఊరు సేరింది . ఎవురూ ఆదరించ కుంటే ఎట్ల బతికేదది అని సెప్పేది. మాయవ్వ. ఒక దోవ సూపెట్టి మనం సెయ్యందిస్తే దాని కాళ్ల మింద అది నిలబడతాది అనేది. మాయవ్వకు మానాయన కాని, మాయమ్మ కానీ అడ్డం సెప్పరు.
దోసిక్కావాల్సిన ఉప్పిడి బీమిచ్చిందా. ఇంగ ఇంటిక్కావాల్సిన మిరక్కాయిలు, సింత పొండు ఇట్లాంటివి ఎందరికో దానం సేసే మాయవ్వ సాలమ్మత్తకు యియికుండా యట్లుంటాది . ఇంట్లో ఎట్టికి పడున్ని సట్టీ ముంతా, నానా బీనా, కనా కసమాలం ఇచ్చి ఆదరించింది మాయవ్వ .
సాలమ్మత్తకు యాబై ఏండ్లుంటాయి. పద్దతిగా ఉండే మనిసి.
తెల్లార్తో అయిదు గెంట్లకే నిద్ర లేస్తాది. ఇంటి ముందు కళ్లాపి సల్లి , పొయ్యిగెడ్డలికి ముచ్చటగా ముగ్గులు పెడతాది. . తాను పసుపు కుంకాలకు నోచుకోక పోయినా గడప్మెట్లకు, పొయ్యికీ పచ్చంగా పసుబ్బూసి కుంకుం బొట్లు పెడతాది. శుచిగా స్నానం చేసి , నట్టింట్లో దీపం ఎలిగిస్తాది. . దీపం దెగ్గిర, దాలబంద్రాలకు ఊదు కడ్డీ లెలిగించి గూట్లో ఉన్ని అరిచెయ్యంత మొగుని పోటోకు దండం బెట్టుకొని అప్పు డంటిస్తాది పొయ్యి.
దోసలంగడి పెట్టినాక జోబిడి ముందర అంకనం ఎడల్పుతో తాటి మట్టలతో పందిరేయించింది. అది కూడా మా యవ్వ ఇచ్చిన ఉభయమే . మాకు ఎదురు పొదలకు కొదవ లేదు. చేని చుట్టూ , పొలాల గెట్ల మింద, అక్కడక్కడా మామిడి తోపులో ఓపినన్ని తాటి మాన్లుండాయి. మా సేద్ది గాన్ని పంపించి ఆ పని చేపించి పుణ్యం కట్టు కునింది కూడా మాయవ్వే .
ఆ పందిలేసినాక కుడి పక్క కొడి పొయ్యి బొమ్మరిల్లు మాదిరిగా ముచ్చటగా ఏసుకొనింది అత్త. ఎడం పక్క రెండడుగుల ఎత్తు దిన్నె ఏసింది. అంగిడి కొచ్చి కూసోని తినే వాళ్ల కోసం . అవి రెండూ కూడా పచ్చని పేడతో అలికి, ముక్కరేసి ఎర్రగా అంచులకు ఎర మొన్ను పూస్తుందా ! ఎప్పుడూ ఆడే ఉందామా అనిపిస్తా ఉంటాది .
పొయ్యంటించి నాలుగు దోసెలు పోసి మా నాయన కోసమని మా ఇంటికిచ్చి పంపందే బోణీ చెయ్యదు అత్త. మా యవ్వ చేసిన మేలుకు కృతజ్ఞతగా చేసే పని అది.
మా నాయన అప్పిటికే బాయి కాడికి పూడ్సుంటాడా. అవి తినేది మేమే . అప్పుడప్పుడు అంగిడి నుంచి మాయమ్మ మాకని కూడా దోసెలు తెప్పిస్తాది. అవి తేవడానికి మేం బొయినామనుకో , దుడ్లు తీసుకోదు కదా! అందుకని సిలగుండ్ల పల్లి సిట్టెక్కనో, నడుపబ్బ పెదనాయిన కూతురు కాంతనో, సేంద బాయికి నీళ్ల కొచ్చిన ఇంకెవుర్నో దోసెలు తెమ్మని పంపిస్తాది మాయమ్మ.
ఒకసారి అది తెలిసి సాలమ్మత్త రొండు దినాలు వరసగా మాయింటి పక్కకే రాలేదు . ఏమై పోయిందా అని మాయవ్వ అదే పనిగా సెప్పి పంపిస్తే మూతి మూరెడు బెట్టుకో నొచ్చింది.
' ఈ పక్కే తొంగి సూళ్లేదు. అత్తగారూరిగ్గాని పొయ్యుంటివా? ' అని అడిగింది మాయవ్వ. ఆ ప్రెశ్నతో కంట్లో కారం బెట్టినట్లయింది సాలమ్మత్తకు . శానా నిష్టూరంగా మాట్లాడింది .
' మీ బీము , మీ నీళ్లు , మీ కట్టెలు, సర్వం మీ సాయం , పిల కాయిలకు దోసిలియడానికి మాత్రం నేను పనికి రానా? ' అని కొట్లాడింది.
'సాలమ్మా నువ్వు అరువుండే మాట్లాడతా ఉండవా? కట్టె కంపా మాదే అనుకో . ఊర్లో అందురి మాదిరే మా చెట్లలో ఎండిన పుల్లల్ని యార కొచ్చు కుంటావు. బీము మాదే అయినా దుడ్లిచ్చి తీసుకుంటా ఉండావు. బతడానికి అంగిడి పెట్టుకొని ఉద్దరకిస్తా ఉంటే నువ్వు గెట్టిక్కి బతికి బట్ట గట్టినట్లే ' అని నచ్చ జెప్పే ప్రయత్నం సేసింది మాయవ్వ.
'ఏమి దొసెలకు గొడ్డు కరువొచ్చిందా.? కూటికి గెతి లేదా? రుబ్బను టైం లేక ఆడే బండాట్లే కాని దినామూ ఇంట్లో చేసుకుంటే కొట్టే వాళ్లుండారా? అడపా దడపా కావాలంటే మా పిలకాయిలొచ్చి తెచ్చుకుంటారు. ' అనింది కూడా.
' ఇంగ మిందట కోదండానికి కూడా దోసిలు పంపిస్తే నేను ఒప్పుకోను. అట్లయితేనే మాయింటికి రా ' అని మా నాయినికి కూడా పంపించొద్దని కట్టితో కొట్టినట్లు చెప్పేసింది.
అప్పట్నుంచి మాకు దోసెలు కావాలంటే వాళ్లూ వీళ్లను అడుక్కొనే పని లేకుండా మేమే పొయి దుడ్లిచ్చి తెచ్చు కొనేటోళ్లం. .
దోసెలమ్మేంత వరకే సాలమ్మత్త వాళ్లింట్లో ఉండేది. ఆ పని అయిపోంగానే సట్టి , గిన్నే కడిగి ఎండలో బోర్లించి నాన బెట్టిన బీము గుండాయిని సంకలో బెట్టుకొని మా ఇంటి కొచ్చేస్తాది.
వచ్చిన మనిషి ఊరెకే కూసుంటాదా! మాయమ్మకు అన్ని రకాలుగా చేదోడు వాదోడవతాది. చింత కాయిలు, ఇప్ప కాయిలు, శెనిక్కాయిలు, కానక్కాయిలు ఒడిపే పనులు సేద్దెం చేసే మా ఇంట్లో సమత్సరం పొడుగునా నిలుకు లేకుండా ఉంటాయా. మా యమ్మ పొయికాడ, కూలోళ్లతో సతమత మవతా ఉంటే మా యవ్వతో ఆ మాట, ఈ మాట మాట్లడుకుంటా అన్ని పనుల్లోనూ ఒక చెయ్యేస్తాది సాలమ్మత్త.
సాలమ్మత్తను పనిలో ఎవరూ కూడా మెప్పించ లేరు. నా జీవితంలో అంత నాణ్యం గా పని చేసే వాళ్లను నేను సూడలేదు. ఏ పని చేసినా ప్రత్యేకంగా ఉంటాది.
అంత బాగా పని జేస్తాది కాబట్టే వేరే వాళ్లు అలికినా , పూసినా, ముగ్గేసినా సవా లక్ష ఒప్పరాలు సెప్తా ఉంటాది.
ముందే మాది సుట్టు భవంతిల్లు. మద్దెలో సుట్టూ బండలు పర్సిన పెద్ద వాకిలి . ఆడ మిరక్కాయిలో, సింత కాయిలో, పెసులో, అలసందలో ఎప్పుడూ ఏదో ఒకటి ఎండేవి ఎండతా ఉంటాయి. రేపు శుక్కరారం అనంగా ఆ సాయంత్రం మాత్రమే అవంతా గంపల్లోకి, గోనె సంచుల్లోకి ఎక్కతాయి. ఆ పొద్దు మాత్రమే వాకిట్లో నీళ్లు పోసి కడగతాది మాయమ్మ.
వాకిలి మద్దిలో పది అడుగులు వెడల్పు పది అడుగుల పొడవుతో గార ఏసిన నాలుగంగులాల ఎత్తుతో అరుగు ఉండాదా? . దాన్ని 'పెండ్లి దిన్నె' అని పిల్చే వాళ్లం. అది పరమనెంటుగా ఎప్పుడూ ఉండే పెండ్లి దిన్నె. దాని పైన నీడ కోసం టెంకాయ కీతులతో అల్లిన పందిలి కూడా ఎప్పుడూ ఉంటాది.
పప్పులేర్పరచేది, బియ్యం జల్లిడ పట్టేది తవుడు సెరిగి కోళ్లకని పూ నూకల్ని పక్కన బెట్టేది అన్ని పనులూ ఆ దిన్ని మిందే. పిలకాయిలు మద్యాన్నం, రాత్రి పూట ఆడే కూసోని అన్నం దినేది. అప్పుడప్పుడు పెద్దోళ్లు కూడా .
ఇంటి లోపల కూడా మంటి నేలే . పేండతో అలక్కుంటే దుమ్ము రేగతాది. వారాని కొకసారి అలికి ముగ్గులు పోసి ఎరమన్ను పెట్టే సరికి నడుములు బోతాయని మా యమ్మ యాష్ట పోతా ఉంటాది .
' మీరు అలికేది నాకు సగించదు. మీరు ముగ్గులు పోసేది నాకు పట్టదు. అదేమన్నా ఎర మన్ను పూయడమా? ' అని సాలమ్మత్త ఎప్పుడూ సేసిన పనికి ఒప్పారాలు సెప్తా ఉంటాది. అది కావాలని సెప్పేది కాదు. నిజంగానే ఆ యమ్మ సేసే పని అంత సుబ్బరంగా కంటికింపుగా ఉంటాది మరి. .
' అరువులు సెప్ప కుంటే సేసి సూపించ కూడదా ?' అనిందొక సారి మాయవ్వ. అంతే అప్పుట్నించి మాయమ్మ పేండతో అలికితే ముగ్గులు అత్త బోసేది. ఏమి కొంచిమా నంచిమా!
మళ్లీ ఇంటి బయట కళ్లాపి సల్లే వాకిలి , అలికి ఎరమన్ను పెట్టాల్సిన పెద్ద పెద్ద దిన్నెలు రెండు పక్కల , గడప్మెట్లు , పెద్దింటి ముందర తాల్వారం , ఈ పక్క ఆ పక్క నడవ . ఎర్ర మన్ను సట్టి ఎత్తుకుంటే గంటకు పైనే పడతాది .
ఓపికున్నంత వరకు పాపం అత్త ముగ్గులెయ్యడంలో, ఎర మన్ను పెట్టడం లో సాయం సేసేది. యాడ తప్పినా పెండ్లి దిన్ని మింద ముగ్గు, దాని అంచులకు ఎర మన్ను పుయ్యడం అత్తకు తప్పేది కాదు. శానా సింగారంగా ఉండేది అత్త సెయ్యి బడితే ఆ దిన్నె.
ముగ్గు కర్ర ఏసిందంటే అచ్చులో అయినా గీత ఒక సోట కొంచం లావుగా , ఒక సోట సన్నగా వస్తాదేమో కాని సాలమ్మత్త గీసే గీత నున్న పిండి బలపం మాదిరితో ముగ్గంతా అచ్చు గుద్ది నట్లే ఉంటాది .
అత్తమ్మ సుక్కలు పెట్టే తీరు సూసి తరించాల ఎవురైనా. సుక్కల మద్దిన ఉండే ఎడంలో ఏమాత్రం తేడా కనిపించదు. ఎరమన్ను పూసినా అంతే అంచులు కర్ర బెట్టి గీత గీసినట్లు సక్కంగా ఉంటాయి .
మా ఇంట్లో సాలమ్మత్త సేసే సాయం అంతా ఇంతా. ఆ రుణం తీర్సు కోడానికి మాయమ్మ సాలమ్మత్త ఒకతే పిండి రుబ్బు కుంటా ఉంటే అప్పుడప్పుడు రెండు వాయిలు సాయం సేస్తాది . మాది పెద్ద రోలు తొందరగా మెదగతాదని ఈడే రుబ్బుకుంటారు శానా మంది. . దోసెల పండగప్పుడైతే మా రోలుకు నిలుకుండదు.
సాలమ్మత్త సుట్టూ పిండి ఎగ దోసేది సూడల్ల నా సామి రంగా . ఏళ్లకు తప్ప అరిచేతిగ్గాని, రుబ్బు గుండు సుట్టు పక్కల గాని కొంచిం కూడా పిండి అంటదు . అంత వైనంగా ఉంటాదామె పని జేస్తే .
' ఒకరు పిండి దోస్తే నాకు సరి పోదు. మూతీ ముక్కు , గుండూ బండా రోత జేసి పెడ్తారు' అని ఎవరైనా సేతి సాయం సెయ్యడానికొస్తే రుబ్బ నిచ్చేది కానీ ఎవుర్నీ తొయ్య నిచ్చేది కాదు.
మా సిన్న తమ్ము డు రవి గాడికీ , ఆ యమ్మకూ ఎప్పుడూ పడదు. 'సుబ్బా రెడ్డీ' అని మాతాత పేరు బెట్టి పిలస్తాదని వాడికి ఉక్రోషం . అట్లా పిలిస్తే వాడు పలికే వాడు కాదు. అప్పుడు
' ఉత్త నా బట్టా' అని పిలిచి మరింత ఉడికించేది. రుబ్బేటప్పుడు వాన్ని పిలిచి అరిచేతిలో అంత పిండి బెట్టందే ఊరుకోదు.
ఇంత కథా నడిపిన నేను సాలమ్మత్త సేసే దోసెల తీరు తిరనాలు సెప్ప కుంటే ఏమన్నా బాగుంటాదా?
ఆ దోసెలు గుర్తొచ్చి నూరూరి పోతా ఉందే . ఈ జల్మలో ఇంగ అట్లాంటి దోసెలు తిన బోతామా ! మాయమ్మ ఆయమ్మ నడిగి అట్లే సేసినా కూడా రాదే అని మేమంతా ఏకారి నోళ్లమే లే .
ముందునాడు దోసెలకు నాన బోసేది సూడాల. పచ్చి బీము కడిగి ఆర బోసి రొట్లో దంచి పిండి జల్లిడ బట్టి పక్కన బెట్టుకుంటాది. ఉప్పిడి బియ్యం ఒక సేరుకు తవ్వ ఉద్ది పప్పు , పిడికిడు అలసంద పప్పు, ఒకన్ని అటుకులు. మెంతులు ఏసి కడిగి నాన బెడతాది. మద్యానం రెండు గెంటలప్పుడు నానిన దాన్ని నున్నంగా రుబ్బతాది . ఒక గలాసు బీప్పిండిలో నీళ్లు బోసి గెంజి కాంచి దాన్ని సల్లార్చి రుబ్బిన పిండిలో పోసి బాగా చేత్తో కలిప్పెడతాది. ఆ పిండితో సేసిన దోసెలు మెంతుల వల్ల అనుకుంటా మంచి సువాసనతో గుమ గుమ లాడి పోతా ఉంటాయి.
సాలమ్మత్త దోసెలు బోసే పెనాలు రొండుండాయి . రొండూ తండాలం పెనాలే. అరిచెయ్యి మందంతో ఉంటాయి . ఒగటి కొంచం గుంత పెనుం. ఇంగోటి మామూల్దే .
ఉర్లో ఎవురికి ఏ దోసెలిస్టమో అట్లా సేసిస్తాది. చాలా మంది సాలమ్మత్త పోసే మెత్తటి దోసెల్ని ఇష్ట పడతారు .
పిండిని చిటికెడు సోడా ఏసి గెంటి జారుడుగా కలుపు కుంటాది. గుంతగా ఉండే పెనుం కాలినాక కట్టెపుల్లకు ఒక కొనలో ఏలెడు పొడవు కట్టు మాదిరిగా కట్టు కున్ని దాన్ని నూని ముంతలో ముంచి పెనుం పైన బాగా రుద్దతాది. గెంటిలో పిండి దీసుకోని పెనుం సుట్టూ పోస్తే అది మద్యకు జారి పెనుమంతా అలుము కుంటాది. మద్దిలో కొంచం మందంగా , సుట్టూ పల్చగా ఉంటాయా దోసెలు. రొండు పక్కలా తిరగేసి కాల్చి బాదమాకులో పెట్టి చట్నీతో ఇస్తాది.
' తూట్ల తూట్ల గుర్రాలు ఒకటెక్కతా ఉంటే ఒకటి దిగతా ఉంటాది 'అనే పొడుపుకథకు
'దోసె 'విడుపా? మేము మాత్రం 'సాలమ్మత్త దోసె' అనే చెప్పే వాళ్లం . ఎందుకంటారా? అత్త పిండిని పెనుం మింద సుయ్ అని పొయ్యంగానే దోసె మొత్తం మింద తూట్లు అలుము కుంటాయి.
దూది మాదిరిగా ఉండే ఆ దోసెల్ని అత్త చేసే చట్నీలో ముంచి తింటా ఉంటే --.
కొందురుండారే ముందే పల్చటి దోసే కావాలంటారా. కొడి పొయ్యి కదా, పక్కన మంట ఒచ్చేట్లు ఎగదోసి సమంగా ఉండే పెద్ద పెనుం బెడ్తాది. కాలినాక సుక్క నూని తడిమి నీళ్లు సిలకరించి పుల్లతో దన దన రుద్దతాది. గెట్టింగా కలిప్పెట్టుకున్ని పిండిని ఒక గరిటెడు పెనం మింద ఏసి పల్చగా పెనుమంతా రుద్దేస్తది. సుట్టూ
కొంచం నూని వదులుతాది. ఎర్రంగా కాలిన ఆ దోసె కర్రుం కర్రుం అంటా ఇంగా తినాలని పిస్తాది.
ఆ రోజుల్లో అణాలు, అర్దనాలే కదా! పదారణాలయితే ఒక రూపాయి. కాల్నాకు ఒక దోసె . బాగా తినే వాళ్లకు అణా పెడితే ఎక్కాతుక్కా అయి పోతాది.
నడీది లచ్చుమవ్వ బోండాల్ని, సాలమత్త దోసెల్ని రుసి సూసినోళ్లు ఎవురయినా బొందిలో పాన ముండగా మర్సి పోగలరా ?
మహాసముద్రం దేవకి
22-3--2019
Comments
Post a Comment