మా సుబ్బా రెడ్డి సిన్నాయన- కథ

 మా సుబ్బా రెడ్డి సిన్నాయిన


        సుబ్బారెడ్డి  సిన్నాయన మా చింతాత కొడుకు. ఆయనికి ఇద్దురు కొడుకులుండారు. ఒక్కూతురు గూడా ఉండాది. దాచ్చాయిని దాని పేరు. మా పిన్నమ్మ బంగారి  ముద్దుగా దాన్ని 'దాచ్చ పండూ ' అని పిల్చుకుంటాది.

        దానికింకా సమత్సరమే వొయసు.  ముద్దుగా బొద్దుగా వుంటాదా. ఊర్లో పిలకాయిల సంకల్లోనే అది పెరిగి పెద్దయి పోతా వుండాది.

        మా సిన్నాయనకు ఇద్దురు కొడుకులుండారని సెప్పినానా . పెద్ద కొడుకు సాంబశివుడు . రొండో వోడు సదాశివుడు. కానీ వోళ్లను ఎవురూ గూడా పేర్లు బెట్టి పిల్చిన పాపాన బోలేదు.

        పెద్దోన్ని పెదబ్బ అని రొండో వోన్ని సినబ్బ  అని పిలుస్తారంతా.

        మా సిన్నాయినికి సదువంటే సలికాలం సలిమంటేసుకొనేంత ఇష్టం. కానీ ఏం లాబం ఆయన సదువుకోడానికి అప్పుడు ఇస్కూల్లేవి మా ఊరు సుట్టు పట్ల.

        ఒక్కడే కొడుకని ఓ న మాలు గూడా నేర్పించ కుండా ముదిగారంతో పెంచి పెద్ద జేసినారు వాళ్లమ్మా నాయిన. సదువుకో  మంటే అయివోరు దెగ్గిర దెబ్బలు దినుకుంటా  బిడ్డి ఎంత కష్ట పడాల్సొస్తదో అని వాళ్ల ఆలోచన. అందుకే మా సుబ్బారెడ్డి సిన్నాయినికి అచ్చరం ముక్క రాదు.

        ' సదువు లేక నా మాదిరిగా నా పిలకాయిలు నవ్వుల పాలు గాకూడదు సామీ నా కొడుకుల్ని శానా బాగా సదివించు కోవాల ' అని మనసులో గెట్టింగానే అనుకున్న్యాడాయన. 

        పెదబ్బోడు సాంబడు ఇస్కూలుకు  మూడొరకు బాగానే బొయినాడు .మూడో తరగతి పాసయి నాలుగులోకి ఒచ్చినాక వాడికేం శని బట్టుకొనిందో .

        లీవుల్లో బాయికాడ పికిలి పచ్చి మాదిరిగా సేచ్చగా తిరుక్కుంటా సెరుకులు, జామ కాయిలు, ఎలగ పండ్లు,  కలింకాయిలు తినుకుంటా సేద్దిగానితో , కూలోల్లతో ఆట్లాడుకుంటా సుకం మరిగినాడు వాడు .

        ' ఇస్కూలుకు బోక పోతే అయివోర్లకు బయపడే పని లేదు గదా! ' అనే ఆలోచన ఒచ్చేసింది వాడికి . ఏడో ఎక్కం ఒప్పజెప్ప లేదని ఒగ దినం అయివోరు వాన్ని బాగా కొట్టినాడులే లీవులకు ముందు.

        ' లీవులయి పొతానే నన్ను ఇస్కూలుకు  పొమ్మంటారేమో ! ఇంగ నేను సదువుకోను మా '. అని వాళ్లమ్మకు  ముందే సెప్పేసినాడు వాడు.

        ' నా దెగ్గిర నాలుగో తరగతి పుస్తకాలుండాయి . సెక్కు చెదర లేదు. కరుకు మాయ లేదు. ఆపురేటుకిస్తామని సెప్పమన్న్యాడు మా నాయన.  మీ యబ్బోడికి కావాలేమోనని అడిగి రమ్మన్న్యాడు' అని పురుసోత్తం గాడొచ్చి మా పిన్నమ్మతో సెప్పినప్పుడు  వీడు ఆడే ఉండాడు.

         ' నాయిన కొట్టినా తిట్టినా కూడా నేను  మాత్రం ఇస్కూలు పక్కకు కూడా పోను మా  నాకెందుకు పుస్తకాలు ' అని ఎదురు ప్రెశ్న ఏసినాడు వాడు.

        ఆయమ్మ పోకపొతే పోనీలే అనుకునింది కానీ అయ్యో పిలగాడు సదుంకోకుంటే ఎట్ల అనుకోలా

        బాయికాడ సేద్ది గానితో కూడా మాడా తిరగతా సెట్టు గుట్టల్ని ఎక్కి దిగతా  సిన్నా సితక పనుల్ని ఎవురూ సెయమన కుండానే సేస్తా ఉండాడు. అట్ల పనీ పాటా సేస్తా ఉంటే ఇస్కూలుకు పోకున్న్యా ఏమీ అనరు. అనేది వాని అవుడియా.  అదే సుకంగా గూడా ఉండాది వాడికి. 

        ఇంగ సిన్నో డుండాడే ,  సామీ అసాద్ద్యుడు. సెరువులో ఏస్తే తూములో దూరొచ్చే  రకం. అయిదేండ్లొచ్చినా  వానకూ, గాలికీ తిరుక్కుంటా  బాయి కాడికి బొయినప్పుడు వాళ్లమ్మ కొంగు బట్టుకోని సిట్టి సేతుల్తో మళ్లోకి నీళ్లు మళ్లిస్తానో, అర్సరిసి గువ్వల్ని దోల్తానో , ఒంటి నిండా బురద బూసుకొని కాలవ నీళ్లలో తప తపలాడతా, గెనాలెంట పరిగెత్తతా కాలం గడపతా ఉండాడు.

        వాని తులవ సేష్టల్ని జూసి మా సిన్నాయన 'వీన్నెట్లరబ్బా ఇస్కూలుకు ఏగించేది'  అని మనసులో మదన పడతా ఉండాడు.

        ఎండాకాలం లీవులైపోయి ఇస్కూల్లు తెరస్తా ఉండారు.  కర్ణం క్రిష్ణపిల్లెతో పలకా బలపం , ఒక సిన్న సంచి ముందే  తెప్పించి దాంచి పెట్టినాడు మా సిన్నాయిన.

ఇస్కూళ్లు దెర్సే దినం రానే ఒచ్చింది.

        బార్య బంగారితో ' ఈ పొద్దు  దినం  గూడా బాగుండాదంటా సిన్నబ్బోన్ని గూడా ఇస్కూల్లో సేర్సేసొస్తా' అన్న్యాడు.

        ఆయమ్మ మొగం నల్లంగా సేసుకోని 'ఇప్పుడు వాళ్లు ఇస్కూలుకు పోకపొతే మన బతుకులు తెల్లరవా? 'అని అడిగింది .

        మా సిన్నాయినికి కోపం నసాలాని కంటింది.

        'ఎందుకూ పనికి రాకుండా, నీ తోక బట్టుకోని తిరగతా ఓగయి పోతా వుండారు పిలకాయిలు. పెద్దోడు లేస్తానే బాయికాడికి పూడస్తాడేమో ! పోవద్దని సెప్పు. వాడు ఇప్పుణ్నించి సేద్యం పింగటించక్కర్ల్యా. మనసు బెట్టి  సదువుకోమను ' అని ఆడ్రేసినాడు.

        సేద్ది గాడు కాండి మాను, మడక దీసుకోని బాయికాడికి బొతా ఉంటే ఎనక ఎద్దుల్ని బట్టుకోని పోబోయి నాడు మాసిన్నాయిన.

        పిలకాయిల్ని ఇస్కూలుకు పంపించాలన్న్యప్పటి నుంచీ మా పిన్నమ్మకు గుండెల్లో రైళ్లు పరిగెత్తతా ఉండాయి.

        ' నాసేత గాదు సామీ ,  వాళ్లు నా మాటింటారా పెడ్తారా . నువ్వే దెగ్గిరుండి మారాజుగా కొడుకుల్ని కలకటేరు సదువుకు పంపించేసి పో. ఓగులు వొజ్రాలయి పోతారు  ఇస్కూలుకు బొతానే' అని దెప్పి పొడిచింది.

        ' ఈ పొటుకు మాటలే మాట్లాడొద్దని మూతిమింద గొట్టేది. ' అని సేద్ది గానితో 'ఎద్దల్ని గూడా  నువ్వే పట్టుకోని పోరా' అని చెప్పి ఇంట్లో కొచ్చినాడు.

        పిన్నమ్మ ఇంగా సణగ తానే ఉండాది. ' ఎవుర్నీ సంతోసంగా ఉండనీయడీయన , అట్లా బతకనిస్తే సుబ్బారెడ్డెందు కవతాడు ' అని తనలో తానే గొణిగింది. దాలి కింద నీళ్లు మంటెయ్యడానికి వామిలో నుండి కంది కంప పెరుక్కో నొస్తా. ఆ మాటలు సిన్నాయిన సెవుల్లో ఒద్దన్న్యా  పడినాయి.

        ' ఏమే , పెదుముకు మించిన పల్లై పోతా వుండావే. మర్యాదిచ్చే  కొద్దీ ' అని గెద్దించినాడు.

        ' లేక పోతే ఏందబ్బా . కయ్యి కాడా కాలవ కాడా ఆడుకుంటా పాడు కుంటా ఏపుగా పెరిగే పైరు మాదిరిగా పెరిగి పెద్దవతా ఉండారు నా కొడుకులు . ఊరికే ఉండే ప్న్యానాల్ని  ఉపద్ర బెట్టేస్తా ఉండావే . వాళ్లేమి సదుంకోని ఉద్యోగాలు సెయ్యాల్నా? ' కంది కంపల్ని పొయ్యి కాడేసి నడిం మింద సెయ్యి బెట్టుకోని నిలదీసింది.

        ' ఆహా ఏమనింది నువ్వు?  నీ కొడుకులా. ఇంగోసారి జెప్పు. వాళ్లాడినట్లంతా ఆడి మంచని పించుకొనేది నీ కొడుకులనిపించుకోవాలనా ? రేపు పెద్దయినాక కిరీటం దెచ్చి పెడ్తారులే ' అన్న్యాడు ఎంగ్యంగా  మా సిన్నాయన.

        ' లేక పొతే సదివి సిమ్మాసనం మింద కూసో బెడ్తారులే నిన్ను ' బదులుకు బదులు సెప్పింది దాలి కింద మంట బెడతా.

        సుబ్బారెడ్డి సిన్నాయనకి  ఏడ లేని కోపం ముంచుకోనొచ్చింది.

        ' తుపూ , సిగ్గూ శరముండాదా నీకు? ఊర్లో ఆండ ముండలే సిత్తూరిస్కూలుకు  బొయి సదుంకుంటా ఉంటే ఉండూర్లో ఇస్కూలు బెట్టుకోని మొగపిలకాయిలికి సదువొద్దంటావా? వాళ్ల మంచి గోరే దానివేనా నువ్వు? అసలు నువ్వేం తల్లివే , వాళ్లను  కంటివా కక్కితివా? ' అని కారూంచి నాడు.

        వాళ్లమ్మ , అంటే మా సిన్నవ్వ రంగమ్మ ఊర్లో లేదు. ఆయమ్ముంటే ఇద్దురాండోళ్లూ సేరి సుబ్బారెడ్డికి సుక్కలు సూపించే ఓళ్లు . కూతురింటికి బొయ్యుండాదాయమ్మ.

       పిలకాయిలింకా ముడుక్కోని పండుకోనుండారు . మా సిన్నాయిన ఈ కోపం దీసక పోయి వాళ్లమింద  సూపించినాడు.

        కప్పుకోనుండే బొంతల్ని బెరికి పిర్రల మింద తలా ఒకటంటించి నాడు . 'లెయ్యండ్రా ఇస్కూలుకు టయిమవతా వుండాది  ' అంటా .

        పెద్దోడు లేసి కండ్లు నలుపుకుంటా 'నేనిస్కూలుకు బోను నాయనా ముందే అమ్మతో సెప్పుండా ' అన్న్యాడు.

        ' పొండ్లు రాలతాయి ఆ మాటంటే . అంతా నీ ఇష్టమేనా. పెద్దంతరం  సిన్నంతరం లేదా నీకు . మీయమ్మ నీళ్లు కాంగ బెట్టింది . పొసుకోని రాబో ' అని తరిమి నాడు .

        వాడు వాళ్లమ్మ  కొంగును మొగానికి కప్పు కోని రాగం దీస్తా వుంటే , ఏకంగా సినబ్బోన్ని  దెచ్చి దిన్ని మింద కుదేసి పిడక బూడిది దెచ్చి  ఇద్దురి సేతుల్లో  ఏసినాడు.

        రాగాలు దీస్తానే పెద్దోడు నీళ్లు కూడా  బోసుకొని వచ్చి నీరెండలో నిలబణ్యాడు . సిన్నోడు పండ్లు తీటుకుంటా ఉండాడింకా  .

        ' నీళ్లు పోసుకుందువు రారాబ్బా ' సిన్నోన్ని  పిలిసింది పిన్నమ్మ

        ' నిన్నే గదా పోసుకున్న్యాను. నేను పోసుకోను బో ' అన్న్యాడు మూతి మూరెడు బెట్టు కోని.

        ' నీళ్లు బోసుకుంటే నీ గంటేమన్నా పోతాదారా. లమ్మిడీ కొడకా , ముందు పోతావా లేదా' అని గెదిరించినాడు సిన్నాయిన

        వాడికి వాడే రొండు సెంబులు నీళ్లు మింద కుమ్మరించు కోని ఒచ్చి ఎండలో నిలబడినాడు.

       ' మూతీ ముక్కూ కూడా సుద్దంగా తడవకుండా ఏం నీళ్లు బోసుకోవడంరా ' అని వాళ్లమ్మొచ్చి వాన్ని మళ్లీ ఈడ్సుకోని బొయ్యింది.

       ఆయమ్మను  సూడంగానే పెద్ద గొంతెత్తు కొని ఏడ్వ బట్టి నాడు వాడు. సుబ్బారెడ్డి సిన్నాయిన పరిగెత్తుకోనొచ్చి ' మూస్తావా లేదా' అని బర్ర పైకెత్తినాడు.

        మా పిన్నమ్మ నీళ్లు బోసి గుడ్డలేసు కోమని పంపించి సేంద బాయికాడికి బొయ్యి నీళ్ల కడవెత్తుకోనొచ్చే లోపల వాడు ఇప్పిన గుడ్లే ఏసుకోని  ఎండలో కూసోనుండాడు, ఇంగా రాగాలు  దీస్తా. 

        ' అయ్యో ! ఆ గుడ్లే ఏసుకుంటివెందుకురా ?' అని సొక్కాయి గుండీలు దియను బొయ్యింది. .

        ' ఈ పొద్దు సాకలోల్ల మంగ రాదు. రేపొస్తాది  అప్పుడు దీస్తా' అని సేతులడ్డం బెట్టి పెనక లాడతా ఆ యమ్మకు మూడు సెరువుల నీళ్లు దాపించేసినాడు వాడు.

        ఇద్దురికీ నీళ్ల లోని సద్దెన్నం పిండి మజ్జిగ బోసి తినమని ముందర బెట్టింది .  ఏట్లు బడితే గాని తినలా వాళ్లు .

        పెద్దోడు బెక్కతానే సంచి తగిలించుకోని నిలబణ్యాడు.

        ' సిన్నోడికి పలకా బలపం ఏదీ ' సిన్నాయిన్ని పిల్చి  అడిగింది పిన్నమ్మ

        కొత్త పలకా బలపం, సంచీ సూడంగానే యాడలేని ఉషారొచ్చేసింది వాడికి. అవి జూసి పెద్దోడు నాకూ కొత్తవి గావాలంటా మూతి మూరెడు బెట్టు కున్న్యాడు.

        ' ఇప్పుటికి వీటితో పింగటించు . పదా ' అని గదిమినాడు.

        సుబ్బారెడ్డి సిన్నాయినే స్వయంగా పిల్చుకోని బొయ్యి ఇద్దుర్నీ ఇస్కూల్లో ఇడ్సేసొచ్చినాడు.

        ఇంట్రవెల్లుకు గెంట కొట్టంగానే మన సిన్నోడు 
ఇంటి కొచ్చినాడు . ' టైమయింది ఇస్కూలుకు బోరా నాయినా ' అంటే వాడు ఇచ్చింది తిని నీళ్లు దాగి  అదే పతా పరిగెత్తి బాయి మొగం బట్టినాడు.

        మర్సనాడు వాడి జోబీ నిండా పప్పులు బోసి, జామకాయంత బెల్లం సేతిలో బెట్టింది వాళ్లమ్మ. 'ఇంట్రవెల్లో ఇంటికి రాకుండా అంగిడాయిన దెగ్గిర కిచ్చిలి పెప్పరమెంట్లు కొనుక్కోమ'ని  తలా కాల్నా ఇచ్చినాడు వాళ్ల నాయిన .

        సిన్నోన్ని మా పిన్నమ్మే సొయంగా సంకకెక్కించు కోని బొయ్యి ఇస్కూల్లో వొదిలి పెట్టింది.  'కొట్ట కుండా తిట్టకుండా సూసుకో సా' అని అయివోరికి కూడా సెప్పొచ్చింది.

        పన్నెండుకు అన్నానికి బెల్లు గొట్టినప్పుడు . పెదబ్బోడొకడే ఇంటికొచ్చినాడు

        'వాడేడిరా ' అడిగింది ఈది పక్క జూస్తా .

        ' ఏమో నాకేం తెలుసు . ఆకిలిగా ఉంది మా , ముందు నాకు అన్నం బెట్టు ' అన్న్యాడు.

        అన్నం బెట్టి పప్పు కూర బోసి వాడికిచ్చి ఈదిలోకి పరిగెత్తింది.

        సిన్నోడు అయిపు లేడు. ఇంట్లో పెద్దొడు తప్ప ఎవురూ లేరు. దాచ్చాయినిని కూడా సంకలో ఏసుకోని ఇస్కూలు దాకా బొయ్యింది. ఆడా లేడు.

        ' సూసుకోమని సెప్తిగద సా ' అయివోర్నడిగింది.

        ' ఇంటెర్వెల్ దాకా ఉన్న్యాడమ్మా . మళ్లీ సూస్తే రాలా . నిన్నటి మాదిరిగా ఇంటికే బొయ్యుంటాడులే అనుకుంటిమి ' అన్న్యాడు పెద్దయివోర్ని కూడా కలుపుకోని .

        వూర్లో పిలకాయిల్నంతా అడిగింది. ఒక పిలగాన్ని  బాయికాడికి తరిమింది. ఆడా లేడు. ఇసయం తెలిసి ఆగమేగాల మింద మొగుడొచ్చినాడు కానీ కొడుకు ఎంట లేడు.

        కొడుగ్గనిపించక బాయీ కుంటా ఎతికి యాసారిన మా పిన్నమ్మ , సిన్నాయిన అన్నం గూడా దిన కుండా దిగాలు మొగాలతో ఎతకతా ఉండారు.

         మద్యానం నాలుగ్గంట లయ్యుంటాది. 'అమా' అని ఒచ్చి కొంగు బట్టుకొని ఏలాడినాడు వాడు సిలక నవ్వులు నవ్వతా. ఎంట వాడి అత్త అవ్వా ఉండారు.

        ఇంటికి బోతే ఇస్కూలుకు పంపిస్తారని వాడు ఏకంగా వాళ్ల మేనత్తోలూరికి బొయినాడు. వాళ్లవ్వ గూడా అడే ఉండాదని తెలుసు వాడికి .

        ఒంటిగా  ఒగిటిన్నర మైలు నడిసొచ్చి నాడంటే  అనుమానమొచ్చింది వాళ్లకు. గుచ్చి గుచ్చి అడిగినారు. అబ్బోడు జరిగింది జరిగినట్లే సెప్పినాడు.

        వాని కోసం ఎతకతా ఎన్ని అగచాట్లు పడతా ఉండారో అని వాడు తిండి తిన్ని ఎంటనే ఉన్న పలంగా  అమ్మా కూతుర్లు కలిసి  వాన్ని పిల్చుకోనొచ్చినారు.

        కనిపించని కొడుకు కండ్ల బడిందే సాలను కునింది  పిన్నమ్మ . వాన్ని మా సిన్నాయిన తిడతా ఉంటే ముగ్గురాడోళ్లు అడ్డం బడినారు.

        మా పిన్నమ్మయితే వాన్ని సంకలో ఏసుకొని ముద్దులతో ముంచెత్తి మురిసి పోతా ఉండాది. .

        తిట్టాల్సింది బోయి వాళ్లట్ల సేసే సరికి మా  సిన్నాయనకి ఒళ్లు మండి  పోతా  వుండాది.

        ' ఇంత బతుకూ బతికి ఇంటెనక సచ్చినాడని ఒక మంచి పని సెయ్యాలనుకుంటే ముగ్గురాడోళ్లు అడ్డం బడతారా. ' అని ఏకారినాడు.

        ' ఆ ఎదవ మూరెడు లేడు ముప్పు తిప్పలు బెడతాడా? ఎంత తెలివి వాడికి ,నువ్వొస్తే వాడి ఆటలు సాగతాయని అదే పతా వొచ్చి నిన్ను ఎంట బెట్టుకోనొస్తాడా  ' అని మాయవ్వ దెగ్గిర వాపోతా మాట్లాడినాడు సిన్నాయన.

        వాడు సేసిన పనిని తల్చుకుంటే మా సిన్నాయినకు కడుపులో దేవినట్లుండాది.

        ' నాలుగచ్చరాలు నేర్చుకోకుంటే ఎట్లమా? పెద్దబాల శిచ్చ, బార్తరమాయణాలు  సదువుకొనే పాటి తెలివి తేటలన్నా లేక పోతే నలుగురిలో నా మాదిరిగా నగుబాట్ల సేటు కావాల్సిందే '  అని సందకాడ మెల్లింగా తన కడుపులో వుండే ఆలోచనల పొట్లాన్నిప్పి  తల్లీ పెండ్లాల  ముందర
పర్సినాడు మా సిన్నాయిన.

        ' ఎందుకొచ్చిన సదువు, బిడ్ని బిత్తరపొయ్యేట్లు సేసే సదువు. మన పిలకాయిలేమన్నా కూటికి లేనోల్లా గుడ్డకు లేనోళ్లా. లేకుంటే ఇంటింటికీ పొయ్యి అడక్కతింటా ఉండారా ? కయ్యాగాలవా లేనొళ్లయితే సదుంకోవాల. ఒకరి కింద పంజేసి సెయిసాపి బతకాల్సిన కర్మ నా బిడ్లికి పట్టలేదు.
కాలు మింద కాలేసుకొని దొర మాదిరిగా బతికే ఒరుంబడి ఇచ్చినాడు దేముడు. దాన్ని అనుబోగిస్తే సాలు . ' అని శానా యాకారతా మాట్లాడింది మా పిన్నమ్మ బంగారి.

        ' ఆకాసం లో నుంచి ఊడొచ్చి నీ ఒళ్లో పడినాడా. మాటెత్తితే నా కొడుకూ నా కొడుకూ అంటావే, దవడ పిండ్లు రాలతాయి ఇంగో పారి నీ నోట్లోనుంచి ఆ మాటొచ్చిందంటే '  సుబ్బారెడ్డి సిన్నాయిన కోపమంతా ఆ మాటల్లో ఇనిపిస్తా ఉండాది.

        ' పెద్దోడు సదుముకుంటా ఉండాడు గదరా? ఆ సంబడం సాలదా. ఎద్దులు గొట్టి ముద్దలు దినే మన బోటోళ్లకు అచ్చరాలంటవు. వాన్నొదిలి పెట్టేయిరా' అనింది ముసలామి.

        ' సదువంట కుండానేనా పెద్దోడు పెద్ద బాల శిచ్చను అలవోకగా సదవతా ఉండేది. నువ్వడిగినప్పుడంతా పంచాంగం సూసి తిది వార నచ్చత్రాలను సెపతా వుండేది? అదేమన్నా అంటే మన ఒంట్లో బారేది రక్తం గాదురా కయ్యా కాలవలే అంటావు. ' అని నిష్టూర మాడినాడు మా యవ్వతో సిన్నాయిన .

        ' కయ్యా గాలవలు గాకుండా రక్తం బదులు అచ్చరాలను బారించి వాడిని కలకటేరును  సెయ్యక పోతే నా పేరు సుబ్బారెడ్డే కాదు 'అని శపదం  కూడా సేసినాడు .

       మర్స నాడు వాడి ఇస్కూలు వూసు ఎత్త లేదెవురూ . అట్లని  సిన్నాయిన  నిద్దర బోలేదు. ఇస్కూలుకు బొయ్యి అయివోర్లతో  మాట్లాడేసొచ్చినాడు. .

        ఏం మాట్లాడి నాడో , ఇంటికొచ్చి ఏం జెప్పినాడో ఆ మర్సనాడు సూడల్ల నా సామి రంగా . ఇంట్లో పెద్ద యుద్దమే జరిగింది. ఆ యుద్దంలో సివరాకిరికి సిన్నాయినిదే గెలుపు .

        ఆ మర్సనాడు సాయంత్రం వాకిట్లో సాపేసు కోని ఓం వర్క్ సేసుకుంటా ఉండారు పిలకాయిలిద్దురూ.

        పగిలి పోయిన పలక మింద అ , ఆ అనే రొండచ్చరాలు దిద్ది నేర్సుకోని ఎంగిలితో తుడిపేసి దాని తర్వాత ఒచ్చే అచ్చరాలు రొండు రాసియ్యమని పెద్దబ్బోన్ని అడగతా వుండాది మాయవ్వ.

        అవ్వకు అచ్చరాలతో ఏం పనొచ్చిందా అని సూస్తా ఉండాది మా పిన్నమ్మ.  'నాకు ముందు రాసియి నా ' అని సిన్నోడు  వాళ్లవ్వకు అడ్డం బడినాడు.

        నువ్వా నేనా అని పోటీ బడి  అచ్చరాలు నేర్సుకుంటా వున్ని అవ్వా మనవళ్లను  సూసి మా పిన్నమ్మ ' ఔరా 'అని ముక్కు మింద ఏలేసు కునింది.

        ' నాకూ  రాసియ్యత్తా ' అని ఒక దినం పలకా బలపం పట్టుకో నొచ్చింది పిన్నమ్మ.

        మనవళ్లతో బాటు దినాము ఇస్కూలుకు పోతా వస్తా ఉండాది మాయవ్వ.  సుబ్బా రెడ్డి  సెప్పినాడని అయివోర్లు అవ్వని ఇస్కూలుకు రానిస్తా ఉండారు .

        ఇస్కూలుకు పోతా వస్తా ఉన్ని అవ్వను సూసి 'సిన్నోడి వల్ల పెద్ద డూటీనే పడిందే'  అని ఎనక ముసి ముసిగా నవ్వుకుంటా ఉండారు ఊర్లో వాళ్లు.

      ఒకనాడు తపాలాయిన రచ్చబండ దెగ్గిర ఎదురు పడి సేతిలో పెట్టిన పెండ్లి పత్రికను  అలవోకగా సదవతా వున్ని అవ్వను సూసి అర్సోది పొయినారు ఆడ ఉన్న్యోళ్లు .

        ' అమ్మ కొచ్చినంత సదువు కూడా నాకు రాక పొయెనే'  అని మా సుబ్బారెడ్డి సిన్నాయన మదన పడి పోయినాడు.

        పిలకాయిల్ని అడిగి రాపిచ్చు కోవడం నామార్దాగా అనిపించింది ఆయనకు. ఇంటి కాడికే అయివోర్ని రమ్మని ప్రైవేటు పెట్టుకున్న్యాడు.

        ఆడు కుంటా పాడుకుంటా వున్ని దాచ్చాయిని కూడా  ఇస్కూల్లో సేరకనే అచ్చరాలన్నీ  రాస్తా ఉండాది.

        మా సుబ్బారెడ్డి సిన్నాయినేమన్నా మీ యింటి బంక మొన్నా? గబురు  కన్నయ్య  సిత్తూరు  సిన్నయ్య .

-- మహాసముద్రం దేవకి 
    17- 11 2018 

Comments