వరిగ పల్లి ముచ్చట్లు - 10 వ కథ.
మిలిట్రీ కిష్ణమూర్తి
మాఇస్కూలెనక ఉండే కొట్టాల్లో కంకర కొట్టడం, కట్రాళ్లు మలచడం ,బండలు చెక్కి వాటిని బండి కెత్తడం -- ఇట్లాంటి పనులు చేసే కుటుంబరాలు అయిద్దాకా ఉండాయా .
వాళ్లందరు ఆస్తిపాస్తులున్నోళ్లు కాదు.అయితే నేం? మంచి సంస్కారం ఉన్నోళ్లు. కులం ప్రకారం వాళ్లలో మారు మనువుండాది . అయినా వాళ్ల ఆండోళ్లు ఎవురికి అట్లాంటి ఆలోచనలు లేవు. పిల్లా పాపల్ని సూసుకుంటా సంతోసంగా సంసారాలు సేసుకుంటా వుండేటోళ్లు.
మా ఊర్లో ఎవురైనా గాడి తప్పితే వీళ్ల పేర్లెత్తి పొగడతా వాళ్లను తిట్టే వాళ్లు మాయవ్వ లాంటోళ్లు .
ఆ అయిదు కుటుంబరాల్లో పాపిగాని కుటుంబరం ఒకటి. ఇద్దురు కొడుకులు ముగ్గురు కూతుర్లతో వాళ్ల ఇల్లు కసాబిసా మని ఉండేది .
పెద్ద కొడుకు కిష్ణమూర్తన్న ఉన్నెట్టుండి మిలిట్రీలో సేరి పొయినాడు. అప్పుడప్పుడూ ఆ కొడుకును తల్చుకోని సూడాలని వుండాదని వాళ్లమ్మ సుబ్బక్క మాయవ్వ దెగ్గిర సెప్పుకొని ఏడ్సు కొనేది.
' మిలిట్రీలో ఉండడమంటే ఎంత గొప్ప సుబ్బీ, మనూరు సుట్టు పక్కల ఏ మొనగాడైనా ఉండాడా నీ కొడుకు లాంటోడు. తలెత్తుకోని తిరిగే పనే గదా సేసినాడు . ముందు నీ ఏడుపాపతావా లేదా' అని మాయవ్వ మూతి మింద గొట్టినట్లు మాట్లాడేది . దాంతో సుబ్బక్క కడుపులో మంట అప్పటికి ముంతెడు మజ్జిగ దాగినట్ల సల్లంగా సల్లారి పొయ్యేది .
ఒగ దినం మిలిట్రీలో ఉండే ఆ మారాజు క్రిష్ణమూర్తన్న మాయింటి కొచ్చినాడు. లీవుల్లో సెల్లెలి పెండ్లి బెట్టుకున్న్యారంట. అందుకని నెల పాటు లీవులు దీసుకోని ఒచ్చినాడు.
సుబ్బక్క కొడుకుని మాయవ్వ ఎట్లా పొగిడేదో వాళ్లమ్మ సెప్పుంటాది. లేక పోతే ఒచ్చీ రాంగానే మా యవ్వ కాళ్లకు ఎందుకు మొక్కతాడు .
యోగ సేమాలయినాక అందురితోను ఎంతో అణకువగా మాట్లాడినాడు. మిలిట్రీలో బెట్టే తిండితిప్పల గురించి, సేసే పనులు గురించి మా యవ్వ అడగతా వుంటే ఆ యన్న సెప్తా ఉంటే మేమంతా సెవులు బెట్టి ఇన్న్యాము.
సెల్లెలి పెండ్లికి ఊరంతా అర్సోది పొయ్యేట్లుగా దుడ్లు బాగానే కర్సు బెట్న్యాడు. ఇంగో రొండు దినాలకు ఊరికి బొతా డనంగా మా యింట్లో కజ్జాలు , సెనిగ్గింజిలి మురుకులు సేయించు కొనింది వాళ్లమ్మ, కొడుక్కి ఇచ్చి పంపించాలని.
మా యమ్మకు ముందే నిలుకు లేని పనుంటాదా? రేత్రికి రైలెక్కతాడనంగా తెల్లారంగానే రొండు సేర్ల కిచ్చిలి సంబావు బీము దెచ్చి పులుసన్నం గట్టియ్యమనింది మాయమ్మను సుబ్బక్క.
' కమలమ్మ సేత్తో పులుసన్నం గట్టిస్తే మూడు దినాలయినా సెక్కు సెదరదు. ' అని మా యమ్మకు సటిఫికేటిచ్చింది మాయవ్వ ముందర. ఇంగ సేసియ్యకుండా సస్తాదా! మా యమ్మ, ఎంత పనుంటే మాత్తరం .
మా ఊర్లో పల్నేరు ఎద్దుల పర్సకు బొయ్యే వాళ్లు కూడా మాయమ్మతో పులుసన్నం సేయించుకోని గుడ్డలో మూట గట్టుకోని పోతారులే.
కిష్ణమూరితన్న మళ్లీ మిలిట్రీకి పూడ్సి నాడా.
ఒక నెలయినాకేమో మానాయిన పేరుతో ఒక కార్డు ముక్కొచ్చింది. కిష్ణమూర్తన్న రాసిన జాబది. అందులో ఆయబ్బోడు అక్కడే పెండ్లి సేసుకో బోతున్నట్ల రాసినాడంట .
' మానాయినికి నువ్వే నచ్చ జెప్పాలరెడ్డీ , నువ్ జెప్తేనే మా నాయిన ఇన గలడు. తప్పని సరి పరిస్తితిలో ఈ పెండ్లి జరగతా ఉండాది. అందురూ పెద్ద మనుసు సేసుకోని ఆశీర్వదించండి. మీరు రమ్మని సెప్పినారనుకోండి నేను నాబార్యతో మనూరికి దైర్నంగా రాగలను. మీరు రాసే బదులు జాబు కోసరం ఎదురు సూస్తానే ఉంటాను. ' ఇది మా నాయిన మాయవ్వకు సదివి ఇనిపించినాడు.
వాళ్లమ్మా నాయిన్లిని ఇద్దుర్నీ పిల్సి మా నాయిన ఇసయం సెప్పి ఎడ్సే వాళ్లకు నచ్చ జెప్పి ఓదార్సినాడు.
ముందుగా ' మీరు కొడుక్కు పెండ్లి సెయ్యాలనుకో నుండారా లేదా' అడిగినాడు మా నాయిన .
' ఒయిసొచ్చినోడికి సెయ్య కుండా ఎట్లుంటాము రొడ్డీ? నేను సెప్పేది అది కాదు. ఆడే సేసుకోను వాడికి మనసుట్టాలెవురుండారు ఆడ. అదీ నేనదేది. '
' మీ సుట్టాలు ఆడెవురుంటారు. ఆడుండే వోళ్లనే సేసుకుంటాడు. '
' అదే ఎవుర్నని ?'
' వాల్లాపీసరు కూతురంటలే . అదృష్ట మంతుడు. ఇంగేమి మాట్లాడకండి ' గెట్టింగానే సెప్పినాడు మా నాయిన.
మాయన్నదమ్ముని కూతుర్ని అడిగి సెయ్యాలని కదా ఉంటిమి ' నసిగింది సుబ్బక్క.
' వానికీ ఈ బిడ్డికీ 18 ఎండ్లు తేడా అంట కదా! అయినా మిలిట్రీలో ఉండే వాడికి సచ్చినా నా బిడ్నియ్యనని మీయన్న నాతో ఎప్పుడో సెప్పినాడు. వాడికా వొయసు ముదిరి పోతా ఉండాది. ఇదా న్లేంద్ర బిడ్డి. ఇచ్చి సేసినా దేశం గాని దేశంలో మన బాస లేక మన మనుసులు కనిపించక ఆ బిడ్డి ఉంటాదా, ఊడతాదా. '
కిష్ణమూర్తన్న మా నాయిన పైన పెట్టిన బాద్దితని అట్లా తీర్సినాడు.
ఆర్నెల్లుగడిసుంటాది., పెండ్లి సేసుకొని . కొడుకును సూడాలని ఉండాదని ఒగసారి ఒచ్చి పొమ్మని మానాయినితో కార్డు ముక్క రాయించింది వాళ్లమ్మ సుబ్బక్క .
అది జరిగి ఐదారు నెలలైపోయా. కిష్ణ మూర్తి రానూ ల్యా . ఉత్తరం పత్తరం కూడా ల్యా . సుబ్బక్క మాత్తరం పెద్ద కొడుకును తల్సుకుంటానే కూతురు కానుపు సేసింది. సిన్న కొడుక్కు పెండ్లి కూడా సెయ్యాలని సూస్తా ఉండాది .
ఒగ దినం ఊర్లోకి జట్కా బండి ఒచ్చిందని పిల్లా పీసు పరుగులు తీసినారు. అది నేరుగా పాపిగానింటి ముందు ఆగింది. కిష్ణమూర్తన్న తో పాటు ఒగ అందాల బొమ్మ గూడా దిగిన విషయం ఊరూ నాడంతా తెలిసి పొయింది.
ఊర్లో ఆండోళ్లంతా అదే పనిగా పొయ్యి వాళ్లని సూసి వస్తా ఉండారు.
మాయమ్మ పోతా ఉంటే ఈదిలో ఆట్లాడు కుంటా ఉన్ని నేను కూడ మాయమ్మ యాడికొస్తావని కసరతా ఉన్న్యా ఇనకుండా ఎంట బడినాను.
ముందుగా పాపిగాని కూతుర్లు కండ్ల బడినారు. ఎప్పుడు సింపిరి తల్లతో , మాసిన గుడ్డలతో వాడి పోయిన ఆకుల్లా ఉండే పాపి గాని కూతుర్లు జడ కుచ్చులతో , కండ్లకు కాటిక బెట్టుకొని , మంచి మంచి కోకలు కట్టుకోని , తిలకంతో నామం బొట్ల కింద సుక్కలు కూడా బెట్టు కోని ఆడికీ ఈడికీ అదే పనిగా తిరగతా ఉండారు.
వాళ్లది మంటితో కట్టిన వొండుకొనే ఒక సుట్టిల్లు, ఇంగొకటి మూడంకనాల సావిడి . సమే గాని ఇంటి ముందుండే ఎద్దుల బండి పైన కూసోనున్ని కిష్ణమూరితన్న మాయమ్మోళ్లను సూసి పరిగెత్తు కోనొచ్చినాడు. సెల్లిలితో ' మీ వొదిన్ని పిలు' అన్న్యాడు ఆ సెల్లిలెనకే మేమూ ఇంట్లో దూరినాము.
గొడ వారగా రెండు పెద్ద ట్రంకు పెట్టిల పైన పరిసిన బొంత మింద ఓరగిల్లి పడుకొనుండే ఆ బిడ్ని ' ఒదినా ' అని ఒకరు, 'సరయూ ' అని ఒకరు పిలవంగానే లేసి కూసునుంది .
' ఆ బిడ్డి సేసుకున్ని పాపమో, కిష్ణమూరితన్న సేసుకున్ని పున్నిమో అంత అందంగా బొమ్మ మాదిరిగా ఉండాదా బిడ్డి. శామన సాయి కంటే కొంచిం తెల్లంగా కోల మొగంతో కనుముక్కు తీరు తీర్చి దిద్దినట్లగా ఉండాదిలే . బారెడు జడలో ముల్లెలు, కనకాంబరాలు మొరుము కలిపి కట్టిన పూలు బెట్టుకో నుంటే ఇంగా సూద్దామా అని ఉండాది. ఇంట్లోకి పోగానే గమ గమాని పూల్లోంచి పెండ్లి కూతురు వాసనొస్తా ఉండాది. మన బాస రాదు. మొగుడు ఆ బిడ్డికి హిందీలో ఏదో సెప్తే మాకు రొండు సేతుల్తో దండం బెట్టింది .
'ఆపీసరు కూతురు గదా ! ఆ గుడ్డలూ నగా నట్రా సూస్తా ఉంటే పాప్మనిపించింది. ఏదో శాపం లేకుంటే ఈ గుడ్సిలోకొచ్చి పడ్తాదా ? పండుకోను పట్టె మంచం కూడా లేకనే కదా పెట్టిల మింద పండుకో నుండాది. 'ఇంటికొచ్చినాక మాయవ్వతో మాయమ్మ సెప్పిన మాటలివి.
ఆ మిలిట్రీ పెట్టి లేమన్నా మామూలివా ? ఒక్కోటి యాగానంతుండాది. ఆ రొండు పెట్టిల నిండా అత్తింటోళ్ల కోసం ఏరీ కొరీ ఎన్నో వస్తువులు కొనుక్కోనొచ్చిందని అందురూ సెప్పుకున్న్యారు. కిష్ణ మూరితన్న మేనమామ కూతురికైతే ఆండ బిడ్లితో సమానంగా గుడ్డా గుసురే కాకుండా సెవి కమ్మలు కూడా తెచ్చింది.
అంతంత మాత్రం బతుకుల్లోకి ఒక్క సారిగా సరయు రాక వసంతం వొచ్చినట్లుండాది. ' వాడేం తక్కవుండాడా! ఒడ్డూ పొడుగూ సూసి ఇష్టపడుంటాది, కాదన లేక ఇచ్చి సేసినారులే ' అనింది మాయవ్వ.
మర్సనాడు పొద్దున్నె పది గెంట్లప్పుడు వాళ్లిద్దురూ వాళ్లమ్మతో కూడా మాయింటికొచ్చినారు. పూలూ పండ్లూ తాంబులం మాయవ్వకు, అమ్మకూ ఇచ్చి కాళ్లు మొక్కినారు. సంక్రాంతి లీవులు గదా! అందురూ ఇంట్లోనే ఉండామా. మాయక్కని, నన్ను, మా తమ్ముళ్లనూ పిల్సి హిందీలో ఏందో సెప్పినాడు కిష్ణమూర్తన్న . . నవ్వతా దెగ్గిరికి పిల్సింది. మా చెల్లి బుగ్గ నిమిరింది. మమ్మల్ని సూసి మాకర్తం కానిదేదో అడిగింది. . మేము మెలికలు తిరిగిపోతా ఆన్నించి పరిగెత్తింది బాగా గుర్తుండాదింకా.
కాపీ ఇస్తే శానా ఇష్టంగా తాగింది. ' మా ఇంట్లో వాళ్లకు కాపీ పెట్టేది రాదు. నువ్వే పెట్టుకో అంటే పొయ్యి మింద భయపడతాది ' అన్న్యాడు కిష్ణమూర్తి.
పొయినోళ్లు మళ్లీ ఐదారేండ్లు ఈ పక్క ఐయిపు లేరు. సుబ్బక్క మాత్రం అప్పుడప్పుడూ కొడుకును గుర్తు చేసుకొని ఏడ్సేది.
' ఆ వగల మారి ముండ నా కొడుకును బుట్లో ఏసుకొని ఏం మందు బెట్టిందో! తల్లీ దండ్రీ అని లేదు. పుట్టి పెరిగి నూరు అనే గెవనం గూడా లేదు' అని కొడుకు కోడాల్ని ఉక్రోసం కొద్దీ తిట్టేది సుబ్బక్క .
' నీ కొడుకే అయినింటి బిడ్ని మాయ జేసి బుట్టిలో ఏసుకున్న్యాడు ' అని మనసులో అనుకోనొళ్లు పాపాత్ములు .
రేత్రి పూట సెనిగి వామి దెగ్గిరికి కావిలి బొయిన పాపిగాడు మర్నాటికి పేనాల్తో లేడు . ఏమి జరిగిందో ఆ దేవునికే ఎరక. సెరువు కట్ట మలుపులో బడుణ్య పాపిగాన్ని మసక లోనే కపిలి దోల్ను బొతా వున్ని నడుపబ్బ పెదనాయిన సూసి బానా మోకు ఆడ బారేసి ఊర్లోకి పరిగెత్తుకోనొచ్చి సెప్పినాడు. చూస్తే అప్పిటికే ప్న్యానాలు బొయ్యి శానా సేపయ్యిండాది.
మిత్తివి గొట్టేసిందని కొందురు . పాము గర్సి ఇసం తలకెక్కి సచ్చి పొయినాడని కొందురు, దేనికో బయపడినాడు అని కొందురూ రక రకాలుగా సెప్పుకొన్న్యారు. ' లోకులు పలు గాకులు' అని ఏదాంతం మాట్లాడింది మా యవ్వ.
కిష్ణమూర్తికి తంతి గొట్టినా రాలేదని అందుర్నీ పూర్తిగా మర్సి పొయినాడనీ తల్లి తో బాటు తోడ బుట్ణ్యోళ్లూ నిష్టూరంగా మాట్లాడినారు.
కొంచిమా నంచిమా . దూరా బారమై పోయా . ఆరో దినాని కంతా పెండ్లాం బిడ్లితో దిగినాడు కిష్ణ మూర్తన్న. కూడా వాళ్ల అత్త మామలూ ఉండారు. సూటూ బూటుతో ఉన్ని ఆ సిపాయి మామను సూసి అర్సోది పొయినారు. ఉర్లో వాళ్లు
కిష్ణమూర్తన్నకు ఇద్దురు కూతుర్లు. మంచి మంచి గవున్లేసుకోని అచ్చు లేత మనసులు సినిమాలోని లల్లీ, పప్పీ ల మాదిరిగా ఉండారు.
కూతురు అత్త గారింటినీ , ఎడ్డా మడ్డిగా ఉండే మనుసుల్నీ సాలీ సాలని బతుకుల్నీ సూసి ఇంకెవరైనా అయితే మూతి మూడు మూర్లు బెట్టు కోని వొచ్చిన దోవ బట్టే వోళ్లు. కాని వాళ్లు పాపిగాని దిన కార్యాలన్నీ కూతురు అల్లుడి బాద్యతనుకొన్న్యారు. నవ్వతా నలస్తా మంచి నీళ్ల మాదిరిగా డబ్బు కర్సు బెట్టి అట్టహాసంగా దెగ్గిరుండి జరిపించినారు. సమాది కూడా కట్టినారు. మా ఊర్లో మొదటి సమాది అదే .
క్రిష్ణ మూర్తి వాళ్లు మళ్లీ ఈ పక్కకొచ్చిన దాఖలాలు లేవు. కానీ మా ఊర్లో ఎవురు కవి గట్న్యారో తెలీదు గాని నాట్లు కలుపులప్పుడు పాడుకొనే పాటలు మాత్రం పాపిగాని రక్తం ఉత్తరాది మనుసుల్లో పారతా ఉండాది అనే సత్యాన్ని ఇలావరిగా సెప్తాయి.
మహాసముద్రం దేవకి
30- 12 -2018
Comments
Post a Comment