అట్ల బొయ్యే మారెమ్మా మా ఇంటి దాకా వచ్చి పోమ్మా
గ్రామ దేవతలు మాతృస్వామ్య వ్యవస్థకు ప్రతీకలు . మొత్తం 101 మంది ఉన్నా ప్రధానంగా 7 మందికి ( సప్త మాతృకలు) జాతరలు ఎక్కువగా జరుపుతారు. భయంకర రూపంతో ఉండడం , రక్త పానం, బలి తీసుకోవడం మనుషుల్ని రోగాల పాలు చేసి, పట్టి పీడించి పీల్చి పిప్పి చెయ్యడం , అష్ట కష్టాల పాలు చెయ్యడం ఈ దేవతల పని .వీళ్లను సంతోష పెడితే తల్లుల్లాగా కాపాడతారు కూడా. అందుకే గ్రామ దేవతలను ప్రసన్నం చేసు కోవడం కోసం జాతరలు, తిరనాళ్లు జరిపి జంతు బలు లిస్తారు. కలరా, మశూచి, ఆటలమ్మ , పుట్టాలమ్మ లాంటి వ్యాధులకు కారకులయిన ఈ దేవతలను ఎవరైనా దూరం పెట్టడానికే ప్రయత్నిస్తారు. విరిగిన రోళ్లు, విసుర్రాళ్లు, చిరిగిన పాత బట్టల రూపాల్లో ఈ దేవతలు కొలువై ఉండి రోగాల పాలు చేస్తారని పల్లె వాసుల నమ్మకం . అందుకని అలాంటి వాటిని ఊరిబయటికి చేర వేస్తారు. అంటే దుష్ట శక్తులను ఊరి నుంచి తరమ గొట్టడమన్న మాట. అలాంటి ఒక దేవత మారెమ్మ. ఆ దేవత తనకు తానుగా తరలి పోతుంటే మా ఇంటి దాకా వచ్చి పో అని పిలుస్తారా ఎవరయినా? కష్టాలను తమకు తాముగా కోరి తెచ్చు కొనే వాళ్లను ఉద్దేశించి ఈ సామెత పుట్టింది.
మహాసముద్రం దేవకి
Comments
Post a Comment