పరిశోధనలో పదనిసలు : 23
గేయాల్ని ఇంతగా అధ్యయనం చేశాక ప్రత్యేకంగా కాదు గాని ఎక్కువగా కొన్ని లక్షణాలు నా దృష్టికి వచ్చాయి .అందుకని ఈ ఐదవ అధ్యాయంలో బాల గేయాల్లో చోటు చేసుకున్న భాష, ఛందస్సు ,అలంకారాల గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉందని పించింది. ఎందుకంటే ప్రతిభాషా సమాజంలోను పిల్లలతో వ్యవహరించడానికి పరిమితమయిన పదాలు కొన్ని ఉంటాయి . మాటలు నేర్చే దశలో పిల్లలు పలకడానికి వీలుగా పెద్దలు కల్పించి వాడే ముచ్చటయిన మాటలివి. బువ్వ, లాల, జేజి, బచ్చో , అప్పచ్చి, తువ్వాయి , బూచోడు లాంటి పదాలను పిల్లలతో మాత్రం వ్యవహరిస్తాం. అవన్నీ బాల గేయాల్లో చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు :
' తువ్వాయి తువ్వాయి ఎవరి తువ్వాయి
తువ్వాయి తువ్వాయి మాది తువ్వాయి
తువ్వాయి కాళ్లళ్లో ఏమి ఉన్నాయి
తువ్వాయి కాళ్లల్లో పరుగులున్నాయి
తువ్వాయి తువ్వాయి ఎవరి తువ్వాయి
ఆవు గారి తువ్వాయి అసలు మా తువ్వాయి
సూర్యుడొచ్చాడు
వెలుగు తెచ్చాడు
చీకటిని బూచాడు
ఎత్తుకెళ్లాడు
పాల బువ్వ తింటుంది
పంచలో బచ్చుంటుంది
పగలు నిద్రలు తీస్తుంది
రాత్రులు ఇల్లు కాస్తుంది
ఛందస్సు :
కవిత్వానికి ఛందస్సు వ్యక్తా వ్యక్తంగ ఉండదగిన లక్షణం .బాల గేయ రచనల్లో ఎదో ఒక ఛందశ్శిల్పం ఉంటుంది. అవి అధికంగా గతి ప్రధానాలు . త్ర్యస్ర గతి, చతురస్ర గతి , ఖండగతి మొదలయిన మాత్రా ఛందస్సులు బాలగేయాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
కొండ మీద వెండి గిన్నె
కొక్కి రాయి కాలు విరిగె ( ౩ మాత్రల విరుపులు )
బడిలో బాలల గురువే దైవము
గుడిలో కదలని బొమ్మే దైవము ( 4 మాత్రల గణాలు )
అందాలు చిందుతూ ఆనంద మొసగుతూ
మబ్బుల్ల చాటునే దోబూచు లాడుతూ
అందకుండామమ్ము ఆడించు తుంటావు
మోమాట మునకైన మామాట కౌననవు ( 5 మాత్రలు )
నాల్గు దిక్కుల చిట్ట చివరకు
నడచి చూస్తే ఏమి టుండును ( మిశ్ర గతి )
ఛందస్సు నడకనాశ్రయిస్తే అలంకారాలు భావాన్ని ఆశ్రయిస్తాయి. తెలుగు ఛందస్సులో విలక్షణంగా యతి ప్రాసల నియమం కనిపిస్తుంది . అలంకరించేది అలంకారం అని కాకుండా ఉద్దిష్ట విషయానికి వివరణ నిచ్చేదిగా అలంకారం ప్రసిద్ధమయింది. శిల్పదృష్ట్యా శబ్దాలంకంకారాల్లో బాలగేయ రచయితలకు అనుప్రాసలపై మక్కువ ఎక్కువ. కొంత మంది అంత్య ప్రాసలతో బాల బాలికలను ఉక్కిరి బిక్కిరి చేశారు. ఉదాహరణలకు కొన్ని గేయాలు
తత్తిం బిత్తిం - తగడా బిత్తిం
ఏకో జిల్ల - ఎలగా పండు
మామిడి ముట్టి - మల్లేరాకు
కీరకాయి - బీర కాయి
ఈ గేయంలో మొదటి మూడు పాదాల్లొ యతి నాల్గవ పాదంలో ప్రసయతి పాటించ బడింది.
మా చిన్ని పాపాయి మంచి పాపాయి
అల్లరులు చేయక ఆడుకుంటుంది
మొండి పట్టూ పట్టి మూల కుచ్చోదు
పొద్దున్న బడిలోకి పోక మానాదు
ఈ గేయంలో ఆది యతి పాటించ బడింది. ఇది తాళ లయానుగుణంగా , శబ్ద రూపం చెడ కుండా పాటగా పాడడానికి వీలు కల్గిస్తున్నది.
పాదా మధ్యంలో యతిని పాటించినప్పుడు పాద ప్రధమాక్షరమేదో దానినే ఉపయోగించడం అత్యంత ప్రాచీనమైన సంప్రదాయం. బాల గేయాల్లో ఎక్కువగా ఈ పద్ధతి కనిపిస్తుంది.
పొడుస్తూ బాలుడూ - పొన్న పువ్వూ చాయ
దబ్బున వచ్చెను - దసరా పండగ
బాల లందరు - భక్తితొ గూడగ
తత్తిం బిత్తిం - తగడా బిత్తిం
ఏకో జిల్లా - ఎలగా పండు
మామిడి ముట్టి- మల్లేరాకు
కీరకాయి - బీరకాయి
బాల గేయాల్లో పాద మధ్యంలో యతిని పాటించి నప్పుడు పాద ప్రధమాక్షరమేదో దానినే ఉపయోగించడం ప్రాచీన జనపద అధునిక బాల గేయాలు రెండింటిలోను కనిపిస్తుంది . ఉదాహరణకు:
పొడుస్తూ బాలుడు - పొన్న పువ్వూ చాయ
దబ్బున వచ్చెను - దసరా పండగ
బాలలందరూ - భక్తితొ గూడ
బాల గేయాల్లో గణాధ్యక్షరాలకు కుదిరే యతి మైత్రి చాలా రకాలుగా కనిపిస్తున్నది చూడండి .
1, 4 గణాల ఆధ్యక్షరాలకు యతి మైత్రి :
గోడ మీద బొమ్మ - గొలుసూల బొమ్మ
వచ్చే పొయ్యే వారికి - వడ్డించె బొమ్మ
1,3 గణాధ్యక్షరాలకు :
సంజ దీవికి - చక్కని జే జే
గుడి దీపానికి - గుప్పెడు జేజే
పాదం లోని అన్ని గణాల ఆధ్యక్షరాలకు :
వానా వానా వల్లప్పా
చేతులు చాచూ చల్లప్పా
పాదం లోని మొదటి రెండు గణాధ్యక్షరాలకు :
కాకీ కాకీ కడు దూరం
నీకూ నాకూ పెను వైరం
1,2,3 గణాలకు :
మాపాప మామల్లి మత్స్యావతారం
వరసైన బావల్లు వరహావతారం
నట్టింట నా యత్త నరసింహావతారం
ఈ 5 రాకాల గణాల యతి మైత్రి తమిళ గ్రంథాల్లో పేర్కొన్న మెం నై విభాగాల్లో కనిపిస్తుంది.
బాల గేయాల్లో ప్రాస యతి కూడా కనిపిస్తుంది చూడండి :
చిటపట చిటపట మెటికలు విరుచుచు
చిటికలు వేయుము బొటిమిన వేలా
అనుప్రాసతో కూడిన బాల గేయాలు పొడి పొడి మాటలతో పొట్టి పొట్టి పాదాలతో ఉన్నాయి . దీర్ఘ వాక్యంలో లాగా వృత్యను ప్రాస కనిపించ లేదు .
బడిలో అడుగిడి అలజడి చేయక
చదువు రాని మొద్దు
వద్దు మనకు వద్దు
కదల లేని ఎద్దు
వద్దు రైతు కొద్దు
అంత్య ప్రాసలు
పిల్లికి ఎలుక
పాపకి పలక
పంతులకు పిలక
నూతికి గిలక
ఆధ్యంత ప్రసాలు రెండూ ఉన్నవి
గుట్టపై నొక చెట్టు
చెట్టుపై నొక పిట్ట
పిట్ట కట్టెను గూడు
పెట్ట గుడ్లను జోడు
రెండు మూడు అక్షరాలా ప్రసను పాటిస్తే అది ద్విప్రాస అవుతంది .ఉదాహరణకు :
వెన్నెల రాయుని రాజ్యంలో
వన్నెల చుక్కలు చూద్దామా
2,3,4 అక్షరాలకు ప్రస ఉంటే అది త్రి ప్రాస అవుతుంది .
చెట్టులన్ని కాయ లిచ్చు
గుట్టలన్ని రాళ్ల నిచ్చు
తెలుగు బాల గేయాల్లో శబ్దాలంకార తుల్యమైన బాల గేయాల్లో ధ్వన్యనుకరణ పదాల ప్రయోగం గమనార్హం .
చక చక ఎగిరే గాలి పటం
రెప రెప లాడే గాలి పటం
తళ తళ మెరుపులు మెరియంగా
ఫెళ ఫెళ ఉరుములు ఉరమంగా
తుర్రు మన్నది పిట్ట
బుర్రు మన్నది కారు
లెక్కకు ప్రాచీనులు చెప్పిన అలంకార భేదాలు నూటికి పైగా ఉన్నా అధునిక బాల గేయ్యాల్లో ఎక్కువగా శబాలంకారాలు మాత్రమే కనిపిస్తున్నాయి . వటి లోను వృత్యను ప్రాస ఎక్కువ .
శిల్ప ప్రియులయిన ఆధునిక బాల గేయ రచయితలు అర్థాలంకారాల్లో ఉపమ, రూపకం, స్వభావోక్తి , దృష్టాంతలంకారాలను మాత్రం స్వల్పంగా ప్రయోగించారు.
ఉపమ:
గాలి లోన పిట్ట వోలె
తేలి పోవ సాగెను
నీటిలోన చేప వలెనె
నిలిచి ఈద నేర్చెను
రూపకం :
చుక్కల దృక్కులతో నిను
చూచెద ఆకాశము నుండి
కొదమ చంద్ర కిరణమునై
హృదయాబ్జము పై వ్రాలెద
స్వభావోక్తి :
వీడేనమ్మా కృష్ణమ్మ
వీడే వీడే కృష్ణమ్మ
కాళ్లకు గజ్జెలు చూడండి
మొళ్లో గంటలు చూడండి
మెళ్లో హారము చూడండి
తల్లో పింఛము చూడండి
దృష్టాంతాలంకారం :
సత్యం నిత్యం పలుకుట వీడకు
అబద్ధాలు అసలాడ కూడదు
హరిశ్చంద్రుడు అసత్యమాడక
శాశ్వత కీర్తిని పొందాడు
ఇలా బాల గేయాలకు సంబంధించి బాషా పదజాల స్వరూపం, ఛందో లక్షణాలు , అలంకారాది విశేషాలు ప్రత్యేక సిద్ధాంత వ్యాసాలకు స్వీకరించదగినవి. గేయాల పరిశీలనలో ఈ లక్షణాలు కంపించడం వల్ల స్తూలంగా నైనా చెప్పాలనే ఉద్దేశంతో వాటిని కూడా పరిశీలించానన్న తృప్తితో నా పరిశోధన ముగించాను .
* సమాప్తం *
మహాసముద్రం దేవకి
Comments
Post a Comment