సిలగుండ్లపల్లి లచ్చుమక్క
' ఊరూ నాడంతా బార్తం గుడి కాడుండాది . ఈ పొద్దు అర్జునుడు తవుసు మానెక్కతా ఉండాడు గదా! నువ్వేంది పాపా బార్తానికి బోకుండా' అంటా వొచ్చింది సిలగుండ్లపల్లి లచ్చు మక్క . '
దన్లచ్మి సిరునవ్వు నవ్వాతా ‘రా -- ‘అన్నట్లుగా కొంచిం కదిలింది.
' దినామూ పొగులు కతకు బోని పొన్నెక్క , అనుసూయా , ఆనందా గూడా పది గెంట్లకే నీళ్లు బోసుకోని ద్రవుపదమ్మకు పెట్టి మొక్కిన కొత్త కోకలు గట్టుకోని యలబారి పొయినారు. ' అనింది లచ్చుమక్క.
'పోనిలే . పొన్నెక్క యాడ బోతాది యాడ వస్తాది పాపం ' అనింది దనలచ్మి .
'అనసూయ ఐతే మెడకు నక్లీసు గూడా ఏసుకోని బోయింది. ఏడూర్ల జనం కలస్తారు గదా! సూసే వోళ్లకు నాన్నింగా కనిపించాలని అందురూ అట్ల సింగారించు కోని బోతే, నువ్వేంది పాపా కార్తీకంలో వొన బోజనాలప్పుడు తోటోడు ఊరు కాసినట్లుగా ఒయితే కూసోని సెనిక్కాయిలొల్సుకుంటా ఉండావే' మల్లీ అనింది లచ్చుమక్క.
' నన్నంటా ఉండావు గానీ పిన్నమ్మా నీకేమి సంకలో ఒగ బిడ్డి , సేతిలో ఒగ బిడ్డి ఎనకా ముందు ఇంగో నలుగురూ ఉండారా ? ఒబ్బిడి గానే గదా ఉండావు. లచ్చినంగా బొయ్యి క్రిష్నా, రామా అనుకుంటా పున్నిం పురుసార్తం సెవుల్లో ఏసుకోని రాకుండా' ఎదురు ప్రెస్న ఏసింది దనలచ్చిమి
' వొయిసుడిగిన దాన్ని . ఊరు పొమ్మంటా ఉండాది కాడు రమ్మంటా ఉండాది. నా బతుక్కింక బార్తం కతొకటే తక్కవ ' నిజమే సెప్పిందో నిష్టూరంగా మాట్లాడ్తా ఉండాదో తెలిసీ తెలీకుండా యాష్ట పొయ్యింది లచ్చుమక్క.
' కాటికి పొయ్యే దానికి వొయిసుతో పనేముండాది లే పిన్నమ్మా. ఆ పరమాత్తుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు , ఎవుర్ని రమ్మంటే వాళ్లు దోవ బట్టుకోని అదే పతా పోవాల్సిందే కదా! ' దనలచ్మి మాటల్లో వొయసుకు మించిన వైరాగ్గెం.
' నిజిమే పాపా నువ్ సెప్పేది. నలుగురు నేంద్ర పిలకాయిల్ని నీ నెత్తిగ్గట్టేసి మీ ఇంటాయిన దాటు కోలా ! పూతా రాలేదే, పిందీ రాలేదే , కాయీ రాలేదే .కాదంటానా. కానీ పండిన పొండు రాలేది మాత్తరం గ్యారంటు గదా! ' అనింది లచ్చుమక్క.
మల్లీ లచ్చు మక్కే అందుకొనింది.' నిజిం సెబ్దునా పాపా . కథలన్నా , పాటలన్నా రెయ్యాటన్నా నేనెట్లా పడి సస్తానో ఈ ఉర్లో తెలీనోల్లు ఎవురుండారు సెప్పు . మా ఉంపడానికి బయపడి నేనేడా కాలు బయట బెట్టకుండా ఉండాను. '
' ఇంగా కొత్తంగా నువు బయపడే దేముండాది మా . దినామూ సచ్చే వాళ్లకు ఏడ్సే వోళ్లెవురని ఎప్పుడూ ఉండే రామాయణమే గదా ! కథకు బోతివనుకో , వొచ్చినోళ్లను సూసు కుంటా , కతినుకుంటా ఉంటే పొద్దు పండగ మాదిరిగా గడ్సి పోతాది గదా! మంచీ సెడూ సెవుల్లో ఏసుకుంటే పున్ని మన్నా దక్కతాది ' అని దనలచ్మి అంటానే
' దన్లచ్మీ , నేను నీకు పెత్యేకంగా ఇలావరిగా సెప్పాల్నామే? ఆనా కొడుకు ఎప్పుడొస్తాడో ఎప్పుడు బోతాడో ఆ బగమంతునికే దెలియాల. ఇత్తనాల సెనిక్కాయలమ్మి దుడ్లు ఇంట్లో బెట్టు కోనుండా. బొక్కలో ఐతేనే గదా ఎలికిలు బద్రంగా ఉండేది. పొగ సూరు బెట్టి యానాది నాయాండ్లు వాటినీ బట్టు కుంటా ఉండ్లా . ఈన గాసుకోని నక్కల పాల్జేసినట్లయి పొతాదేమో అని ఆ దుడ్లకు కాపలాగా ఉండి పోతినిలే. '
' దుడ్లు నీ కూడా దీసక పోతే పోలా '
' అయ్యో ఏకాలంలో ఉండావు పాపా నువ్వు . దుడ్లు దీస్కోని బార్తానికి బొయ్యి దిగ్గొలుక్కోని రమ్మంటావా? అంపికి బొయ్యే దాని కంటే కొంపలో ఉండేది మేలని ఇట్లాంటప్పుడే సెప్పుంటారు ఇనలేదా నువ్వు దన్లచ్మీ '
'యాడన్నా ఒక మూల నర్సిమ్ముని కంట్లో బడకుండా దాంచి పెట్టి పోవాల్సింది. '
' ఉగ్గూ . సర్దాగాని బో . ఆ బంగలాలో యా మూల దాంచి పెట్టేది . ఉండేదే అంకన మిల్లు. కంట్లో పాపను గూడా కత్తరించే రకం వాడు. అయినా తాగుబోతు మొగుళ్లు , కొడుకులూ ఉండే వాళ్లకు సుకసంతోషాలు యాడ ఏడ్సినాయిలే' కండ్లలో నీళ్లు తిరగతా ఉంటే కొంగుతో తుడ్సుకోని ఎంటనే నవ్వతా -
' కస్ట సుకాల్ని కలబోసుకుంటా రొండు సేట్ల శనిక్కాయిల్ని ముడువు జేస్తిమి సూస్తివా? ' అని ఒల్చిన వాటిని కుప్పగా తోసింది నవ్వతా లచ్చుమక్క .
' ఈ బండాట్లకే పినమ్మా బార్తానికి బోంది. అందురి మాదిరిగా మనుసుల్ని బెట్టి ఇత్తనాల గింజిల్ని అరువుజేసు కోను దుడ్లు యాన్నించొస్తాయి. ఎంత పోరక లాడినా పిలకాయిల్ని సాకి సంతరిస్తానా అని ఒక పక్క బయంగానే ఉంటాది. ఏకాసొక్క పొద్దున్న్యట్లు
రెయ్యీ పొగులూ రెక్కలు ముక్కలు సేసు కున్న్యా ఆడి కాడికే ఉండాది బతుకు. ఇంగ తేరూ తిర్నాలూ అనుకుంటే జరగతాదా. కడుపే కైలాసం ఇల్లే వైకుంటం అనుకోని పడుండాల నా బోంటోళ్లు. ఆ మారాజే ఉంటే నాకిన్ని తిప్పలుండేవా పినమ్మా ' కండ్లలో నీళ్లు కమ్ముకోనొచ్చినాయి దన్లచ్మికి.
' ఒసే దన్లచ్మీ ఆ నా బట్టేనా ఆడ బోతా ఉండేది ? సేన్లోళ్ల తాటి సెట్ల మలుపులో. ' కంటి సూపానకన సేతినడ్డం బెట్టుకోని సూస్తా అడిగింది లచ్చుమక్క.
' అవును పినమా' అనంగానే లచ్చుమక్క గుండి కాయిలు నీళ్లయి పొయినాయి. పడ్తా లేస్తా ఇంటికి పరిగెత్తింది.
బార్తం గుడి కాడ అర్జునుడు తవుసు మానెక్కతా ఒకో మెట్టు దెగ్గిరా పాడే పాటలు ఇనిపించీ ఇనిపించ నట్ల గాలి వాటానికి ఇనిపిస్తా ఉండాయి.
' దన్లచ్మీ ఎంత పని జరిగి పోయిందో సూస్తివా ఒల్సి సేన్లో ఏస్తే మొలకెత్తి సెట్లయ్యేవి. కూలి మడకల్తో కూలి మనుసుల్తో ఏంగలేక ఆడికాడికి ఆదీకం అంతమాత్రమే కదా మిగిలేదేముండాదిలే అనుకుంటి . అట్లనుకోనే సేను సీండ్రెడ్డోల్లకు గుత్త కిచ్చేసి ఇత్తనాల కాయిలమ్ము కుంట్ని పాపా. వాడూర్లో లేడు గదా అని ఏమార్తిని. ల్యాకుంటే ఇంట్లోనే సచ్చుండే దాన్ని. ఒగ నూర్రూపాయిలు బెట్టేసి మొత్తం దుడ్లు వాడి యెదానేసు కోని పూడ్సినాడు' మొగం నిండా దిగులు గూడు కట్టేసుండాది.
సెనిక్కాయి లొల్సేది ఒదిలి పెట్టి లచ్చుమక్కనే దీన మొగంతో సూస్తా ఉండి పోయింది దన్లచ్మి.
' సమచ్చరం పొడుగునా నేనేమి దిని బతికేది. బీంగింజిల్ని యాన్నించి దెచ్చి ఉడక బెట్టు కొనేది . కడుపుకన్నా దింటాడా' ఒక పక్క ఒళ్లు వొణకాతా ఉంటే అదురు బట్టుకొనింది లచ్చుమక్కకు.
'అంతా ఆ ముండ నొట్లో పోసి అది బోసే ఉచ్చలు తాగతాడే దన్లచ్మీ. ' అనింది. దన్లచ్చిమి మొగంలో జాలి తప్ప నోట్లో మాట రాల్యా.
' ఉంపడానికి బుట్ని బిడ్లు. నా పాలిటి యమ దూతలయి పొయినారే బగమంతుడా . తాగి తందనాలాడి ఊరూ నాడూ ఒగిటి జేస్తారే! ' అని అంగలార్సింది లచ్చుమక్క .
' పెద్దోడు పెండ్లి జేసు కోని ఏరు బొయినాక వాడి శని నన్నొదిలి నా కోడాలికి సుట్టుకునింది. ఇంగ వీడి తాడు ఎప్పుడు తెగతాదో!' సెప్పడానికి అలివిగానంత బాద లచ్చుమక్క మొగంలో .
' నేనెవుర్ని బంపిస్తును. అంతా బార్తం గుడి కాడుండారే! అంత దూరం బొయ్యి ఎవుర్నన్నా ఎవురు పిల్సుకోనొస్తారు. ఒచ్చినా వాన్నోటికి బయపడి ఎవురు పూను కుంటారీ పనికి. ' ఒకసారి ఒక్క కొరికేంత సేపు ఆలోసనలో బడింది లచ్చుమక్క.
ఆయమ్మ మనసు యాతనతో పరి పరి ఇదాలుగా ఉండాది. ఏం జెయ్యాలో పాలు బోక తిట్లెత్తుకునింది.
' వాన్నోట్లో పుండు బుట్నాని . వాన్ని దూం పిలాకొచ్చి ఎత్తక పొనాని. వాడు ఏటెల్లవలో కొట్టక పోనాని ' శాపనార్తాలు బెడతా ఉండాది.
' సిగ్గూ సెరం లేని దొంగ ముండా కొడకా . సంపాదించి ముసిల్దాని కింత కూడు బెట్టేది ఒదిలేసి పీతి కష్టం బడి పెట్టుకున్ని దుడ్లని నా నోట్లో దుమ్ము గొట్టి తీస్క బోతావా. బాడ్కోవ్ , బతక లేక బోతే సావ గూడదా' అని కంటెదురుగా లేని కొడుకును నిలదీసింది.
నాకు సావెప్పు డొస్తాదిరాబ్బా ? అని కండ్లలో నీళ్లు గారతా ఉంటే దిక్కు తోచని దానిలా నెత్తిన సేతులు బెట్టు కోని కూసునింది .
దన్లచ్మి ఆ సేతుల్ని బట్టుకొని ' యాడ్వద్ద' ని అప్పుడప్పుడు ఆ సేతుల్ని ఓదార్పుగా కదిలిస్తా ఉండి పోయింది. ఏం మాట్లాడాలో తెలీలేదు దనలచ్మికి.
బార్తం కత ఇడ్సి పెట్టిందానికి గుర్తుగా సిల్మా పాట లేసినారు. ఒగ పది నిమసాలకు గుంపులు గుంపులుగా కతకు బొయిన జనాలు ఊరు సేర్తా ఉండారు. దన్లచ్మి పిలకాయిలు గూడా ఇల్లు సేరినారు.
కొడుకును తిట్టీ తిట్టీ నోరు నొప్పి బుట్టి మాటా పలుకూ ల్యాకుండా ఉండి పోయింది లచ్చు మక్క.
' నాయినా పట్టాబీ ఒగ సారిట్ల రా, అని నడీది సుబ్బన్న మనుముడు బోతా ఉంటే పిల్సింది దనలచ్చిమి.
'ఏమత్తా' అంటా ఒచ్చినాడు వాడు. వాన్ని సూసి కూడా ముసిల్ది నోరెత్త లేదు. మంట లంటుకున్ని కారడివి మాదిరిగా ఆ యమ్మ మనసు అల్ల కల్లోలంగా ఉండాది.
' పట్టాబీ , నర్సిమ్మన్న లచ్చుమవ్వ ఇత్తనాల సెనిక్కాయలమ్మి పెట్టుకోనున్ని దుడ్లెత్తుకొని పూడ్సినాడురా. రాంబాయి సారాయంగిడి కాడ ఉంటాడు. ఆడెవురన్నా పెద్దమనుసులుంటే వాని దెగ్గిర కొంచిమన్నా దుడ్లిప్పియ మని సెప్పి రాబో నాయినా . నీకు పున్ని ముంటాది. ' దీనంగా అడుక్కునింది దనలచ్చిమి.
' సరేత్తా' అని వాడు సారాయంగడి దోవ బట్న్యాడు.
ఆ దోవలో సుందరమ్మ కొడుకు సూరినారాయణ బోతా ఉంటే ' ఒరే నారాయణా ఇట్రా ' అని పిల్చి వాడి తోనూ ఆ మాటలే సెప్పి పంపించింది దనలచ్మి.
ఉలుకూ పలుకూ లేకుండా శక్తి లేని దాని మాదిరిగా సోలిపొయున్న ముసిల్ది ఆడే నేల మింద కొంగు బర్సుకోని వాలి పోయింది .
పుటుకూ పుటుకూ మని దన్లచ్మి ఒంటి సేత్తో సెనిక్కాయిల్ని నేలగ్గొట్టి ఒల్చుకుంటా ఉండాది. ఆయమ్మ ఆలోచనలు పరి పరి విదాలుగా పోతా ఉండాది.
బార్తం గుడి కాన్నుంచి పిలకాయిలు ఒచ్చినారు. కాళ్లూ సేతులు గడుక్కోని ఇడి బాదమాకుల్లో సంగటి బెట్టుకోనొచ్చి దిన్ని మింద కూసున్న్యారు. 'సింతాకు పులగూర బలె బాగుండాది మా ' అని రొండో కూతురంటా ఉండేది గూడా దన్లచ్మి సెవుల్లో దూర లేదు .
ఉండెట్లుండి గలాం బులాం అని అరుపులినిపిస్తే ఉలిక్కి పడింది దన్లచ్మి. ఒగరెంటొకరు రోడ్డు కల్లా పరిగెత్తతా ఉండారు. పిలకాయిలు గూడా తినేదొదిలి పెట్టి ఉరికినారు.
దన్లచ్మి ' ఏమైంద' ని అడిగితే 'ఏమో! ఏమో! 'అన్న్యారు గాని ఒగరూ పలాందని సెప్పలా .
మాగన్నుగా ఉన్ని లచ్చుమక్క దన్లచ్మి అడిగే తీరు జూసి ' ఎవురికేమయిందో ' అనుకుంటా లేసి కూసునింది.
సేన్లోళ్ల తాటి మాన్ల దాకా బొయిన దన్లచ్మి రొండు నిమసాల్లో బిర బిరా ఒచ్చి ఒల్చిన సెనిక్కాయిల్ని వారి గంపలో బోసి లోపల బెట్టొచ్చింది.
' ఏమంటా ' అడిగింది లచ్చుమక్క.
' ఏమో రా పొయి సూసొద్దారి ' అని లచ్చుమక్క రెట్ట బట్టి పైకి గుంజింది.
రోడ్డు పక్కన గుంపు జేరుండారు జనాలు .
' కొంచిం దోవిడవాండ్రాబ్బా ' అని దన్లచ్మి అనంగానే గుంపులో దూర్తా ఉన్ని వీళ్లను సూసి దోవిడ్సి నారు.
కంటికి కనబడిందాన్ని సూసిన లచ్చుమక్క
నిలువునా కూలబడి పోయింది .
' ఒరే నర్సిమ్ములూ ,నాయినా , నా కొడుకా , బంగారూ, ఏమయింది రాబ్బా , ఇట్లా పడిపోయుండావు? కన్నా, లెయిరా ?' అని లేప బట్టింది.
' లారీ గుద్దేసిందంట . సచ్చి పూడ్సినాడు ' గుంపులో ఎవురో అన్న్యారు.
అంతే లచ్చుమక్క నవ నాడులూ కుంగి పొయినాయి.
ఆ మాటలినిపించిన పక్క బిత్తర సూపులు సూసిన లచ్చుమక్క నర్సిమ్ముని పక్క జూసి వాడి మింద పడి ' ఒరే నాయినా, నర్సిమ్మా, లెయిరా నువ్విట్లా పడి పోతే నాకు దిక్కెవుర్రా? లెయిరా ' అని తల పైకెత్తి సొక్కాయి బట్టు కోని ఈడ్వ బట్టింది.
సుట్టు జనాలు ఊపిరాడనివ్వడం లేదు
కొడుకు బుగ్గలు నిమర్తా ' పాపిష్టి దాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడితినే. తల్లి శాపం తప్పకుండా తగల్తా దంటారే! ఆ మాత్తరం బుద్ది కూడా లేక పోయిందే నాకు. నా నోట్లో పుండు బుట్నాని. నా నొట్లో పురుగులు బన్న్యాని. నన్ను దూం పిలాకొచ్చి ఎత్తక పోనాని , నన్ను మొన్నులో గుంత తొవ్వి పూంచి పెట్నాని ' అంటా తల తలా కొట్టు కునింది.
' నాయినా నర్సిమ్మా నాకు తల కొరివి బెడ్తా వనుకొంటినే . నన్నొదిలి పెట్టి నువ్వే ముందు పూడిస్తివా ? నా ముత్తిమా, నా బంగారూ .... నా కొడుకు పుటక సూడండమ్మా. రాజా పుటక నా కొడుకుది. ఆరడుగుల ఆజాను బాగుడమ్మా . నర్సిమ్మా ఇంత పొడుగునా పండుకుంటివా? లే నాయినా ఇంటికి బోయి పండుకుందువు. .. '
ఆ ఏడుపుకు అంతూ పొంతూ ల్యాకుండా ఉండాది. ఆ యమ్మ పాడి పాడి ఏడస్తా ఉంటే సుట్టూ ఉన్నోళ్ల కండ్లలో మాట మాటకు నీళ్లు దూకతా ఉండాయి.
కొడుకు ఒల్లంతా నిమరతా, దుక్క పోతా ' అయ్యో సేతిలో దుడ్లు సూడండమ్మా, బిడ్డి ఒగ రూపాయి కుడా కర్సు బెట్ట కుండానే పూడ్సి నాడమ్మా. నా బిడ్ని తిట్ట కూడని తిట్లు తిడ్తినే ! నా నొట్లో పుండు బుట్నాని, నన్ను దూం పిలాకొచ్చి ...'
' డాకటరొచ్చినాడు దోవిడవండి '. అంటా జనాల సందుల్లో దూరి దోవ జేసుకుంటా ఒచ్చినాడు పాలి మోళ్ల ఎంగటేసన్న.
మింద బడి ఏడస్తా ఉన్ని ముసిల్దాన్ని రెట్టలు బట్టుకొని లేపి డాకటరును సూడనిచ్చినాడు. ఎవురో నీళ్లు దెచ్చి లచ్చుమక్క నొట్లో గుక్కిడు బోసినారు .
ఏలూరాసుపత్తిరిలో కొడుకు సేతిలో ఉన్ని దుడ్లు ఒగ దినానికి కూడా సాల కొచ్చింది
అడిగి నోళ్లు అడిగినట్లే లేదన కుండా ఊర్లో వాళ్ల దెగ్గిరునింది ఉన్నెట్లే దుడ్లు లచ్చు మక్క పెద్ద కొడుకు ఎంగటేసు సేతిలో పోస్తా ఉండారు. ఏ దేవుడు ఈ బుద్ది పుట్టించి నాడో గాని సేతి నిండా దుడ్లున్న్యా ఎంగటేసు తాగుడు జోలికి పోలేదు. వొచ్చింది వొచ్చినట్లే లెక్క రాసుకొని ఆస్పత్రి బిల్లులు కడతా ఉండాడు. మరి ఎలూరాసుపత్తిరంటే మాటలా?
దుడ్లు కర్సవతా ఉండేది కండ్లారా సూస్తా ఉన్ని లచ్చుమక్క ' ఎంత అప్పయినా గాని సామీ ! ఏ దేవుడు సల్లంగా సూసి నాడో నా కొడుకు కండ్లు దెర్సినాడు. నా కదే సాలు . నా ఆయుస్సు గూడా బోసుకోని వాడు నూరేండ్లు బతకాల. నా కుండే సేనూ సెట్రా అమ్మి యప్పు దీర్సు కుంటా ' అని చేతులెత్తి తూర్పుకు తిరిగి కనిపించని దేమునికి దండం బెట్టు కొనింది.
మహాసముద్రం దేవకి
27-11-2018
Comments
Post a Comment