అభిమాన సాహిత్యం
1 . గాథాసప్తశతి
తెలుగు వాళ్ల జీవన విధానాన్ని తెలియ జెప్పే గాథాసప్తశతి గురించి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకున్నాను .
ప్రపంచంలో మార్గ నిర్ధేశకులైన మహిళామణులు చాలా మందే ఉన్నారు. సాహిత్యంలో ఉన్నతమైన ఆశయాలతో జీవించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన స్త్రీ పాత్రలకు కొదవ లేదు. ఒక్కో పాత్రలో ఒక్కో గుణం నచ్చుతుంది. ఒక్కో మాట నచ్చుతుంది. ఒక్కో పాత్ర ప్రవర్తించిన విధానం బాగుందని పిస్తుంది . ఒక్కో పాత్ర వ్యక్తిత్వం ఆకట్టుకొంటుంది. కవి లేదా రచయిత ఆయా పాత్రల కిచ్చే స్థానాన్ని బట్టి పాత్ర చిత్రణ చేస్తాడు.
పురాణాలు ఇతిహాసాలు ఇతర భాషల్లోకి అనువాదాలుగా వచ్చినప్పుడు ఆయా భాషల్ని వ్యవహరించే ప్రాంతీయుల సంస్కృతీ సంప్రదాయాలను అనుసరించి పాత్రల స్వభావాలను కూడా అనువాదకుడు మార్చేస్తుంటాడు.
ప్రత్యేకించి ఈ పాత్ర ఇష్టం అని చెప్పడానికి నాకు కష్టంగా ఉంది. శ్రీమన్నారాయణ గారన్నట్లు నిగమ శర్మ అక్కను ఇష్ట పడని తెలుగు గృహిణులుంటారా?
ఒకరికి మధురవాణి నచ్చితే ఒకరికి ఉషారాణి పాత్ర నచ్చుతుది. . కొందరికి రత్తాలు లాంటి పాత్రలు నచ్చుతాయి . మన జీవితాలకు దగ్గరగా సహజంగా వర్తించే ఏ పాత్ర అయినా నాకు నచ్చి తీరుతుంది. .
ముని మాణిక్యం గారి కాంతం, భానుమతి సృష్టించిన అత్త గారు ఇలా . ఎంకి కొన్ని చోట్ల ఎంత నచ్చుతుందో నాకు!
మనలో లేకున్నా మనం చిత్రించే పాత్రల ద్వారా ఆశయాలు గుప్పిస్తాం . ఆచరణలో లేక పొయినా గొప్పగా నీతులు చొప్పించి ఉపన్యాసాలిస్తాం . వాటిని ప్రమాణాలుగా తీసుకొలేం.
గాథా సప్తశతి ముఖ్యంగా తెలుగు వాళ్ల శృంగార జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే గొప్ప సారస్వత నిక్షేపం . అది నాకు నచ్చడానికి కారణం నా జానపద మనస్తత్వం కావచ్చు . అందులోని స్త్రీ పాత్రలంటే ఇష్టం నాకు .
పనిలో పనిగా గాథా సప్తశతి గురించి , అందులో కనిపించే స్త్రీల గురించి చెప్పాలను కొంటున్నా .
నా వృత్తి నన్ను నగర జీవితానికి పరిమితం చేసి ఇక్కడే కట్టి పడేసింది. కానీ నా ఊహలెప్పుడు పల్లెల చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. పల్లెలన్నా, పల్లె ప్రజలన్నా, వాళ్ల జీవన విధానమన్నా, అరమరికలు లేని వాళ్ల ఆత్మీయతాను రాగాలన్నా, వాళ్ల సాహిత్యమన్నా, వాళ్ల ఆచార వ్యవహారాలు, అలవాట్లు, కట్టుబాట్లు, వేడుకలు ,వినోదాలు -- ఒక్కటేమిటి? ప్రతిదీ నాకు ప్రాణంతో సమానం. అలాంటిది సాహిత్యంలో ఎక్కడైనా వాళ్ల ప్రస్తావన వస్తే అది నా అభిమాన విషయం కాక పొతుందా?
చరిత్రను బట్టి , దొరుకుతున్న ఆధారాలను అనుసరించి శాతవాహన రాజుల కాలం నుంచి మనకు తెలుగు వాళ్ల ఉనికి కనిపిస్తుంది. అప్పటికే దేశి భాషగా పిలవబడే తెలుగు బాష ప్రజల వ్యవహారంలో ఉండేది. అయితే రచననలకు మాత్రం సంస్కృత ప్రాకృతాలనే వాడే వాళ్లు.
ఆనాటి రచనలలో తెలుగు ప్రజల గురించి తెలియజెప్పే గ్రంథమే గాథాసప్త శతి . అది నా మొట్ట మొదటి అభిమాన గ్రంథం. అందుకే దాని గురించిన ముచ్చట్లను మీతో పంచుకోవాలను కోవడం.
గాథా సప్తశతి 700 గాథల ప్రాకృత సంకలన గ్రంథం. సప్తశతి అని పేరున్నా ఇవి 7 శతకాలు కావు. 700 ముక్తకాలు. 700 కథలు 700 గాథలుగా అవతరించినాయి. 'అల్పాక్షరాలతో అనల్పార్థ రచన ' కు ప్రతి గాథ చక్కటి ఉదాహరణ.
ఈ ప్రాకృత గ్రంథాన్ని సంకలనం చేసిన వాడు హాలుడు. కర్తృత్వ విషయంలో 350 కి పైగా పేర్లు వినిపిస్తాయంటారు . వాళ్లలో ఆ రోజుల్లోనే స్త్రీ హృదయ సౌకుమార్యంతో గాథల్ని సృష్టించిన స్త్రీలు కూడా ఉన్నారని చెప్పడానికి , ఆ విషయం గురించి ఈ రోజు స్మరించుకొంటున్నందుకు నాకు గర్వంగా ఉంది.
గాథా సప్తశతికి సంస్కృతంలో, ఇతర బాషల్లో అనువాదాలు , వ్యాఖ్యానాలు ఎన్నో వచ్చాయి.
పెదకోమటి వేమారెడ్డి రసవంతాలనిపించిన 104 గాథల్ని సంస్కృతంలో వ్యాఖ్యానించాడు.
అతని ఆస్థాన కవి శ్రీనాథుడు ' నూనూగు మీసాల నూత్న యవ్వనమున శాలి వాహన సప్తశతి నొడవితి ' అని చెప్పుకున్నాడు కాని అది అలభ్యం. వేమారెడ్డి గ్రంథానికి కట్టమంచి రామలింగా రెడ్డి కోరిక మీద దిగుమర్తి సీతా రామ స్వామి భావదీపిక రాశాడు. అతనే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మను ప్రోత్సహించి తెలుగులోకి అనువదింప జేశాడు. అందులో 400 గాథలున్నాయి. వాటినే నేను ఉదాహరించడం. ( ఈ వివరాలు అనవసరమనుకోండి)
గాథా సప్తశతి లోని ప్రతి గాథకు శృంగారం ప్రాణం. రెండువేల ఏండ్లకు ముందు తెలుగు వాళ్ల శృంగార జీవితం ఎలా ఉండేదో ఈ గాథలు చెప్తాయి.
ఇందులో నాయికా నాయకులే కారు, చెలికత్తెలు, బాటసారులు, గృహిణులు, వితంతువులు, విరహిణులు , వియోగినులు, ఇష్టమైన వాళ్లను సంతోషంతో ఆహ్వానించే వాళ్లు , వాళ్లు వెళుతుంటే ఏడ్చే వాళ్లు , ఊర్ల నుండి రాని వాళ్లు, ఎప్పుడొస్తారో అని అంచనా వేసే వాళ్లు, వచ్చే వాళ్ల కోసం ఎదురు చూసే వాళ్లు ఎందరో కనిపిస్తారు. ఈ పాత్రల వైవిధ్యానికి కారణం విశాలమైన జీవిత నేపథ్యం .
ఈ గ్రంథానికి కట్టమంచి రామలింగారెడ్డి ముందుమాట రాశారు. అందులో ఆయన స్త్రీ పాత్రల గురించి ప్రస్తావిస్తూ ' అందులోని నాయికలు గోపికళ్లాగా ముగ్ధలు. కృత్రిమత్వం ఎరుగని వాళ్లు. వాళ్లు అనుభవించే సుఖాలు , ఆనందాలు జీవితమనే పాల నుండి తీయబడిన వెన్న ' అన్నారు . ( ఇంకా ఉంది )
మహాసముద్రం దేవకి
Comments
Post a Comment