మనువు

 కథ


మనువు

        ఊరంతా అల్ల కల్లోలంగా ఉంది. ఎవరి నోట్లో చూసినా  వసంత , పొన్ను రంగని పేర్లు నాని,నలిగి, మెలికలు తిరిగి, గిరికీలు కొడుతూ ఉంది. ఇద్దరు మనుషులు ఒకరి కొకరు ఎదురు పడితే చాలు . ఏం మాట్లాడదామా అని ఇద్దరూ అనుకోవడమే. వినడానికీ అంతే ఉత్సాహం .

        ఆంజి రెడ్డి ఇంట్లో మాత్రం మౌనం రాజ్య మేలుతోంది. పొయిలో పడుకున్న పిల్లిని లేపే ప్రయత్నం ఆ ఇంటి ఆడవాళ్లు చెయ్యలేదు . ఇంటి యజమాని తల కొట్టేసినట్లు నులక మంచానికి అంటక పోయినాడు.

        ఇంటి కోడలు సౌభాగ్య మాత్రం తప్పని సరి అయి ఏడుస్తున్న పిల్లాడిని అడ్డాల్లో ఏసుకొని పాలివ్వ సాగింది.

         వాడి కడుపు నిండలేదు కాబోలు! ఉండుండి పెద్ద గొంతుతో ఏడుస్తూ వాడి శక్తినంతా దారబోస్తున్నాడు.

       అది విని తట్టుకోలేని వాళ్ల నానమ్మ  అన్నపూర్ణ  కళ్లలో నుండి ఉప్పెనలా పొంగు కొస్తున్న కన్నీటిని తుడుచుకొని , ఊడి పోయిన జుట్టును ముడి పెట్టుకొని వంటింట్లోకి నడిచి చెంబులో నీళ్లు తీసికొని ఎద్దుల కొట్టం వేపు నడిచింది.

      కొట్టంలో గూటాలకు కట్టేసిన తరుపు  దూడ,  లేగ దూడ తప్ప పశువులు లేవు . రాత్రి కొట్టంలో కట్టాల్సిన ఎద్దులు, ఆవులు చేద బావికి అవతల పక్కన ఉన్న చిగర చెట్ల దగ్గరే ఉన్నాయి. తినడానికి  వాటి ముందు గడ్డి లేక ఖాలీ కడుపులతో నెమరు వేసే పని కూడా లేక పండుకొని ఉన్నాయి . పాలిచ్చే ఆవు మాత్రం ఎంత ఆకలో ఏమో మట్టిలో పూడుకు పోయిన ఒకటి రెండు గడ్డి పోచల్ని మోరతో మట్టిని రక్కి పైకి లాక్కొని కొరికే ప్రయత్నంలో ఉంది.

        ఆ ఇంట్లో పాలు పిండే పని మొదలు పశువుల పని కూడా సేద్యం పనులతో పాటు పొన్ను రంగడే చేసే వాడు . ఉన్నట్లుండి వాడు ఇంత పని చేస్తాడని ముందు ఊహించలేదు అన్నపూర్ణ.

        పాలు పిండుతూ ఇల్లాలిగా, తల్లిగా ఏమాత్రం ముందు జాగ్రత్త పడనందుకు లోలోపలే కుమిలి పోసాగింది అన్నపూర్ణమ్మ.
           
                   *******************

        అది ఒక కుగ్రామం. ఆ ఊర్లో చేనూ చెట్టూ ఎక్కువగా ఉన్న కుటుంబాలు నాలుగంటే నాలుగు. మిగిలిన వన్నీ అర ఎకరా, ఒక ఎకరా పెట్టుకొని పై పనులు చేసుకుంటూ , ఆవుల్లో పాలు పిండి డైరీలో అమ్ముకొని , బండీ ఎద్దులున్న వాళ్లు దాన్ని ఆధారం చేసుకొని బతుకు బండిని లాగుతున్న వాళ్లే .

           ఏ కష్టమొచ్చినా  అవసరానికి ఆదుకొనే ఆంజిరెడ్డి అంటే ఆ వూరి వాళ్లకు ఇష్టంతో కూడిన గౌరవం. ఇక అన్నపూర్ణమ్మ సాక్షాత్తు అన్నపూర్ణే .

        ఆ ఊర్లో మిగిలిన మోతుబరి ఇండ్లు మూడూ కూడా వీళ్లకు దాయాదులే . వాళ్ల బతుకు గురించి తప్ప ఇతరుల కష్ట సుఖాలు వాళ్లకు అంతగా పట్టవు.

        ఒకనాడు రోడ్లో చింత చెట్ల కింద ఉన్న సలాబండ్ల దగ్గర కూర్చొని ఇద్దరు పెద్ద మనుషులు , ఒక నడి వయసు వ్యక్తి ఏ పనీ లేక పిచ్చా పాటి మాట్లాడుకొంటున్నారు. రాత్రి వర్షం కురిసి అంతా చిత్తడి చిత్తడిగా ఉంది.

        చేన్లో కలుపు తియ్యడానికి ముందు రోజు మనుషుల్ని మాట్లాడుకున్నాడు వరదరాజులు. రాత్రి కుండ పోతగా వర్షం కురిసింది. అంత తేమలో గడ్డి తవ్వడం కష్టం.

        కూలి మనుషులకు ఈ రోజు వద్దని చెప్పి వీళ్ల దగ్గరికి వస్తున్నాడు వరదరాజులు .  అటు పక్క చింత మాను మొదట్లో పేర్చిన బండ రాళ్ల పైన దిగాలుగా మొగం వేలాడేసుకొని కూర్చొని ఉన్న మనిషిని చూశాడు. ఎవరని అక్కడ కూర్చున్న తన ఊరి వాళ్లకు సైగ చేశాడు. అంత వరకూ గమనించని వాళ్లు అప్పుడు చూశారు అటు వైపు .

        ఊరికి కొత్త. ఎవరింటికీ చుట్టమూ కాదు. అంతే పోకూ వర్తూ విచారించి ,ఎక్కడైనా పని కావాలంటే ఆంజిరెడ్డి ఇంటికి చేర్చారు.

        ఇంటరు ఫెయిలయి ఇంట్లో వాళ్లు తిట్టినారని అలిగి వచ్చిన బాపతు. వాళ్ల ఊరికి పంపించాలని ఎంత గానో నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు ఆంజిరెడ్డి , అన్నపూర్ణ ఇద్దరూను. ఊహూ! అడ్రసు తెలిస్తే వర్త మానం పంపించొచ్చని నాలుగేండ్లుగా ప్రయత్నించి ఊరుకున్నారు.

        అందరి తల్లో నాలుకలా నడుచుకొంటూ ఇంట్లో మనిషిలా చలామణి అవుతున్నా ఎద్దుల కొట్టం, ఇంట్లో నడవ వరకే తన అడుగులకు  హద్దు పెట్టుకున్నాడు పొన్నురంగం .

        ఎంత పిలిచినా లోపలికి రాని పొన్నురంగం అంటరాని వాడుగా ఆ ఊర్లో ముద్ర వేసుకున్నాడు.

        ఆంజిరెడ్డికి కొడుకు తర్వాత ఆరేండ్లకు  పుట్టిన పిల్ల వసంత. వసంత రుతువులా కళ కళ లాడుతూ చూసే వాళ్లకు ఇంకా చూస్తూ వుండి పోవాలనిపించే  మొహం వసంతది. పెద్ద కళ్లు , ఒత్తయిన జుట్టు , పొడవాటి జడ సన్నని నడుము , తెల్లటి తెలుపు కాదు కానీ పసుపు వన్నెతో కూడిన తెలుపు . బాపు బొమ్మలా ఉంటుంది. మెత్తని మనసు, అమాయకత్వం ఉట్టి పడే మొహం .

        ఊర్లో బడి లేక పోవడం వల్ల , ఏడవతరగతి వరకు చదివింది చాలని పెద్ద వాళ్లు నిర్ణయించడంతో చదువు అటకెక్కి కూర్చుంది.  రేడియో వినడం  , వాళ్ల చిన్నాయన కొడుకు తెప్పించు కొనే వార పత్రికలను చదవడం అలవాటుగా పెట్టుకుంది. మిగిలిన టైంలో పిల్లలతో కలిసి అచ్చన రాళ్లు, వామన గుంటలు ఆడుకోవడం అదీ లేనప్పుడు గోర్లు గిల్లు కుంటూ కూర్చోవడం వసంత పని అయింది.

        వదిన కానుపు కోసం పుట్టింటికి వెళ్లి నప్పుడు ఇంటి పనిలో అమ్మకు సాయం చెయ్యక తప్పలేదు. అందులో భాగంగానే పొన్ను రంగనికి పూట పూటా అన్నం పెట్టి నీళ్లు ఇచ్చే పనిని వసంత తీసుకుంది.

        వయసు ప్రభావమో , అందరి మెప్పూ పొందుతున్న వాడు కావడం వల్లనో , చామన ఛాయతో, ఒడ్డూ పొడుగుతో మగ వాడంటే ఇలా ఉండాలి అన్నట్లుండే పొన్నురంగం క్రమంగా వసంత మనసును ఆక్రమించుకున్నాడు.

        తనకు తెలియ కుండానే బావి దగ్గరికి వెళ్లిన పొన్నురంగం ఇంటి కెప్పుడొస్తాడా అని ఎదురు చూడ్డం మొదలు పెట్టింది వసంత . మిరప తోటలో కాసిన వంకాయలు, బెండ, బీర, కాకర కాయలు తెస్తానంటూ బుట్ట పట్టుకొని బావి దగ్గరికి పోతోంది. పనిలో ఉన్న పొన్నురంగాన్ని పిలిచి కూరగాయలు కోసివ్వ మనడం, చెరుకులూ, బాదం కాయలు, జామ కాయలు తెమ్మనడం ఇలా ఏదో ఒక సాకుతో అతనికి దగ్గరగా మసలడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది వసంత.

        పొన్నురంగం తన ఇంటి జీతగాడన్న ధ్యాసే లేదు వసంతకు .

        వసంత చూపులు, ఆమె తనపట్ల చూపుతున్న శ్రద్ధ , అప్పుడప్పుడూ ఏదో సాకుతో తనను ముట్టుకోవడానికి ప్రయత్నించడం పొన్నురంగని మనసులో మొదట కలవరం రేపింది. తర్వాత అతని మనసు కూడా ఆమె సాన్నిహిత్యాన్ని కోర సాగింది.

         ముద్దుగా బొద్దుగా ఉన్న అన్న కొడుకు ఎనిమిది నెలల బాబి గాన్ని బలవంతంగా పొన్నురంగని చేతుల్లో పెడుతూ అతన్ని తాకడంతో బెంబేలెత్తి పోయాడు పొన్ను రంగం .

         ఒకరోజు అతనికి అన్నం పెట్టి మారు వడ్డించడానికి వచ్చిన వసంత అతనిపైన ప్రేమను ఆపుకోలేక పోయింది.

        పొన్నురంగని కంచంలోనించి ఎవరూ చూడకుండా చెయ్యి పెట్టి ముద్ద తీసుకొని నొట్లో పెట్టుకుంది . అతడు అవాక్కయి చూస్తూ ఉండి పోయాడు. వసంత చర్యకు భయపడ్డాడు కూడా .

        మొదట వారించిన పొన్నురంగం కూడా శ్రుతి మించి రాగాన పడుతున్న వసంత ప్రేమ చేష్టలకు ఆకర్షితుడవుతూ వచ్చాడు.

         కానీ వాళ్లిద్దరి మధ్య ఉన్న అంతరాల్ని దృష్టిలో పెట్టు కొని వసంతను హెచ్చరిస్తూ తన హద్దుల్లో తాను ఉంటూ వచ్చాడు.

        వసంత పొన్నురంగం చుట్టూ తిరగడం ,  సన్నిహితంగా మెలగడం అన్న పూర్ణ దృష్టిలో పడినా ఇంట్లో కలిసి పెరగడం వల్ల ఏర్పడిన దగ్గరి తనమని  పట్టించు కోవడం మానేసింది .

        ఇప్పుడు పాలు పిండుతూ తన నిర్లక్ష్యం వల్ల జరిగిన పర్యవసానానికి పశ్చాత్తాప పడసాగింది అన్నపూర్ణమ్మ .
      
                  *******************
            అనుకుకోకుండా వదిన పెద్దన్న కొడుకుతో పెళ్లి చెయ్యడానికి ఇంట్లో వాళ్లు నిర్ణయించడంతో అవాక్కయిన వసంత పొన్నురంగని అదిలించి, చస్తానని బెదిరించి, కాళ్లు పట్టుకొని చివరికి అతని చెయ్యి పట్టుకొని వెళ్లి పోయింది.

       తెల్లారే సరికి వార్త ఊరంతా పొక్కి పోయింది.
ఇంట్లో వాళ్లు చుట్టు పక్కల వెతికించి పొన్నురంగని ఊరు పేరు కూడా తెలియక , ఎలాంటి ఆనవాలు దొరకక నీళ్లు వదిలేశారు .

      మూడు రోజులు గడిచిపోయాయి. కోడలు సౌభాగ్య , ఇంట్లో అడుగు పెట్టిన వాళ్లను  కూర్చోమంటుండడం విని అన్న పూర్ణ ఎవరా అని తొంగి చూసింది. ఎప్పుడూ చూడని ఇద్దరు పెద్ద మనుషులు .

        మిద్ది మీది ఆంజిరెడ్డికి పిలుపు వెళ్లింది .

        ఇంటి యజమానిని చూసిన ఆగంతకులు నమస్కారం చేశారు. అందరూ కూర్చున్న తర్వాత ఎవరు? ఏమిటి? అన్నట్టు చూశాడు ఆంజిరెడ్డి .

        ' మా ఊరు గుడియాత్తం దగ్గర కొండ్రాసు కుప్పం . నా పేరు దొర నాయుడు. ఇతను మా ఊరి ప్రెసిడెంటు. పేరు అప్పల నాయుడు . ' అని పరిచయం చేశాడు .

        'ఇంతకూ మీరు వచ్చిన పని ...?' అడిగాడు ఆంజిరెడ్డి .

        ' మీరు ఎంత బాధలో ఉన్నారో ఊహించగలం. రెండు రోజుల ముందే రావాల్సిన వాళ్లం. కోపంలో ఉన్నప్పుడు ఆవేశంతో ఒక మాటంటే దాన్ని వెనక్కి తీసుకోవడం కుదరదు. అందుకే రెండు రోజులాగి వచ్చాము.

        వసంత విషయం మాట్లాడుతున్నారని  వింటున్న ఆంజిరెడ్డికి , చాటుగా వింటున్న అత్తా కోడళ్లకూ అర్థమై పోయింది. ఏం చెప్తారా అన్న కుతూహలం అందరిలోను మితిమీరి పెరిగి పోయింది.

        ' మీ వసంతను పొన్నురంగం మా ఊరు తీసుకొచ్చాడు. ఇందులో వాడి తప్పు లేదు . అది మీరు మొదట గమనించాలి . మీ అమ్మాయి ప్రోద్బలం వల్లనే ఇది జరిగింది. నేరుగా మా యింటికి తీసుకొచ్చి వదిలి పెట్టాడు. వాడు మీరనుకున్నంత మోసగాడు కాదు. మీ అమ్మాయి చస్తానంటే మరో దారి లేక ఈ పని చేశాడట. వచ్చిన రోజు నుంచి మా ఇంట్లో మా పిల్లలతో పాటు సురక్షితంగా క్షేమంగా ఉంది మీ అమ్మాయి. మీరు వచ్చి పిల్చు కొచ్చుకుంటారో మమ్మల్ని తీసుకొచ్చి
వదిలి పెట్ట మంటారో అడుగుదామని వచ్చాము .'

        ఆ మాటలు విన్న తర్వాత అందరి మనసుల్లోను కుండెడంబలి పోసినట్లయింది.

        ఆంజిరెడ్డి ఆలోచనలో పడ్డాడు. తన బిడ్డ తెలియని తనమో, అమాయకత్వమో , వయసు ప్రభావమో, నిజమైన ప్రేమో జరగాల్సింది జరిగి పోయింది. కన్న బిడ్డల్ని కడుపులో పెట్టుకొని కాపాడాల్సిన తామే వేలెత్తి చూపిస్తే తన బిడ్డ బతుకు అన్యాయమై పోతుంది. తమకూ మనశ్శాంతి కరువవుతుంది. .

         ఇంట్లో అందరూ కలిసి కూడబలుక్కున్న తర్వాత ముందు కూతుర్ని ఇంటికి తెచ్చుకున్నాక ఏం చెయ్యాలి అన్నది నిదానంగా ఆలోచించు కోవచ్చన్నాడు ఆంజిరెడ్డి  . బావ మరిదిని వెంట బెట్టుకొని వాళ్లతో బాటు వెళ్లాడు .

        వసంత తండ్రిని చూడాగానే వచ్చి కాళ్లను చుట్టేసు కుంది.

        కూతుర్ని చూడగానే అగ్గి మీద గుగ్గిల మవతాడనుకున్న ఆంజిరెడ్డి  ఓదార్పుగా తల నిమురుతూ ఉండడాన్ని చూసి దొర నాయుడు కుటుంబీకులు తెగ సంతోష పడి పోయారు.

        బయలుదేరాలనుకున్న వాళ్లను భోంచేసి కానీ వెళ్లడానికి వీళ్లేదని బలవంతం చేశారు వాళ్లు.

        పొన్ను రంగం వాళ్ల నాన్న ముత్తు సామికి వర్తమానం వెళ్లింది కాబోలు! భార్యను వెంట బెట్టుకొని వచ్చి చేతులు కట్టుకొని నిల బడ్డాడు.

        'ఇన్నేండ్ల  తర్వాత వచ్చిన కొడుకును చూసి సంతోష పడాలో , ఇన్నాళ్లూ అన్నం పెట్టి ఆదరించిన మీ ఇంటి వాసాలు లెక్క పెట్టి ద్రోహం తల పెట్టిన కొడుకును చూసి సిగ్గు పడాలో తెలియకుండా ఉంది. వాడు చేసిన తప్పును పెద్ద మనసు చేసుకొని క్షమించండి ' అని వేడుకున్నాడు ముత్తుస్వామి.

        దొరనాయుడు  ముత్తుస్వామిని కుర్చీ చూపించి కూర్చో మనడం, చాలా మంచి వ్యక్తి , ఒక విధంగా చెప్పాలంటే మాకు గురువుతో సమానం . మేము ఇతని దగ్గరే పౌరాణిక నాటకాలూ , వందలాది పద్యాలు నేర్చుకున్నాం. అని అనడం చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు వచ్చిన వాళ్లు .

        కోపమో తాపమో అని ఇల్లు వదిలి పెట్టిన కొడుకును ఇన్నాళ్లూ ఆదరించినందుకు కృతజ్ఞతలు చెప్పారు భార్యా భర్త లిద్దరూ  , వాడు చేసిన తప్పును మన్నించమని పదే పదే వేడుకొన్నారు.

        భోజనం చేసినాక బయలుదేరుతుంటే , ఊర్లో వాళ్లకు మొహం చూపించ లేక వసంత ససేమిరా రానని మొండికేసింది.

        దొరనాయుడు ఇంట్లో వాళ్లు మళ్లీ లోపలికి పిల్చుకొని ఏం చెప్పారో కాని బ్యాగ్తో సహా వచ్చి తండ్రి దగ్గర తలదించుకు నిలబడింది.

        ఇంటికొచ్చిన తర్వాత శతవిధాలుగా ఆలోచించాడు ఆంజి రెడ్డి . ఎవరో చెప్తే కాని తెలియని కులం గురించి పట్టించు కోవడమంత మూర్ఖత్వం మరొకటి లేదనుకున్నాడు.

        పొన్ను రంగం ఎంత ఉత్తముడో తనకు తెలుసు. తన కూతురు అంతగా ఇష్ట పడిన వాణ్ణి కాదని వేరే వాడికిచ్చి చెయ్యడం సబబు కాదనుకున్నాడు.

      కూతుర్ని పొన్ను రంగానికిచ్చి కులాంతర వివాహం చేస్తున్నట్లు కనిపించిన వాళ్ల కంతా చెప్పాడు ఆంజి రెడ్డి. అతని మాటను గౌరవించడం తప్ప ఎదురు మాట్లాడే సాహసం ఆ ఊర్లో వాళ్లకు లేదు.

        ముందు ఇంట్లో వాళ్లను ఒప్పించాడు. అందరూ కలిసి పెళ్లి పనులు మొదలు పెట్టారు. వసంత పరోక్షంలో ఎన్నో జరిగి పోయాయి.

        శుభలేఖల కట్ట ఇంట్లోకొచ్చింది. అది చూసి వసంత బిత్తర పోయింది. పరమాన్నం చేసి , ఇంట్లో వాళ్ల నోర్లు తీపి చేసి పత్రికలకు పసుపు కుంకాలు పెట్టడం మొదలు పెట్టారు అత్తా కోడండ్లు .

         వసంత పత్రిక చూసే సాహసం చెయ్యలేక పోయింది.

         ఆంజిరెడ్డి పత్రికలు తీసుకొని బయలు దేరుతుంటే ఇంట్లో వాళ్లు అతన్ని సాగనంపుతూ బయటికి వెళ్లారు. అంత వరకు తన కుతూహలం మీద నీళ్లు చల్లుకొని నిస్తేజంగా ఉండిపోయిన వసంత ఒక శుభలేఖను తీసుకొని లోపల గదిలోకి పరుగుతీసింది.

        గుండెలు లబ్ డబ్ మని కొట్టు కోవడం బయటి వాళ్లకు కూడా వినిపిస్తుందేమో ! అన్నట్లుంది.

        కవరు పైన ఏమీ రాయ లేదు . వణికే చేతులతో కవరు లోనుంచి శుభ లేఖను బయటికి తీసిన వసంత మొహం వెయ్యి దీపాల కాంతితో వెలిగి పోయింది.

        ఇంక పొన్ను రంగాన్ని  పూర్తిగా మరిచి పోవాల్సిందే అనే నిర్ణయాని కొచ్చి లోలోపలే కుమిలి పోతున్న వసంత తన తండ్రి ఇంత ఉదారంగా తనకు వరమిచ్చి ఆదరించడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని మురిసి పోయింది.

        ముందు దొర నాయుడు ఇంట్లో పత్రికిచ్చి అతన్ని తోడు తీసుకొని పొన్నురంగం ఇంట్లో అడుగు పెట్టిన ఆంజిరెడ్డిని చూసి అవ్వాక్కయ్యారు ఆ ఇంట్లో వాళ్లు .

        ప్రేమ వివాహమైనా, కులాంతర మతాంతర  వివాహాలైనా పెద్దలు ఆమోదించి చేస్తే ఏ గొడవా ఉండదు. పైగా అందరి మద్దతు ఉంటుంది అన్నట్లుగా వసంత, పొన్ను రంగం పెండ్లిలో ఊర్లో వాళ్లు , బంధు మిత్రులు యధావిధిగా పాలు పంచుకున్నారు.

        ఒక పెద్ద మనిషి తీసుకునే నిర్ణయానికి ఎంత శక్తి ఉంటుందో నిరూపించి చూపాడు ఆంజిరెడ్డి.

        కళ్యాణ మంటపంలో పెళ్లి తంతు పూర్తి చేసుకొని అందరూ ఇంటి కొచ్చారు .

        అన్నేండ్లు ఆయింట్లో మసలినా లోపల అడుగు పెట్టని పొన్నురంగాన్ని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి నట్టింట్లో చాపేసి వధూవరుల్ని కూచో బెట్టారు. ఇద్దరితో ఒకరిచేత ఒకరికి పండు తినిపించి పాలు తాపించారు.

        అది అయిపోయిన వెంటనే పొన్నురంగాన్ని చెయ్యి పట్టుకొని ' నా గది చూస్తువు రా ' అంటూ లాక్కెళుతున్న వసంతను చూసి చుట్టూ ఉన్న బంధు మిత్రులు చప్పట్లు కొడుతూ గల గలా నవ్వేశారు .

                                 మహాసముద్రం దేవకి
                                      13- 10- 2019
 
       

        కథ :

పాతాళ  బేరి 

        మా ఊర్లో నడీదిలో సరకారు సేందబాయుండాది. సర్కారోళ్లు ఎప్పుడు తొవ్వించి నారో కానీ శానా పెద్ద బాయది. సుట్టూ సిమెంట్ కట్టడం అడుగు ఎడల్పుతో . దానికి బీముడు బిగదన్ని నిల్చున్నట్లు నాలుగు  సిమెంటు కంబాలు. వాటి మింద అర్జునుడు అడ్డం బడి నట్లు అటు రెండు ఇటు రెండూ  రాతి దూలాలు .నాలుగు దూలాలకు నాలుగు రాట్నాలు . ఏ అర్ద రాత్రో తప్ప వాటికి నిద్రుండదు. ఎప్పుడూ నిలికు నిబందం లేకుండా అవి గిర గిర లాడతా ఉంటాయి.

        పొద్దన్నయితే రాట్నం దొరక్క ఒంగి సెందుకొనే వాళ్లెక్కువ . అందురికీ ఇనప బొక్కిన్లుండవా , శానా మంది మంటి దుత్తల గొంతులికి తాడు బిగించి నీళ్లు సేంది కడవల్లో పోసుకొనే వాళ్లే . ఒంగి సేందుకొనే వాళ్లు దుత్తలు బాయి గోడకు తగల కుండా బాగా బాయిలోకి ఒంగి ఒడుపుగా సేందుకోవాల నీళ్లు . లేదా దుత్తగోయిందా .

       సర్కారొళ్లు ఎంత మంచోళ్లో! ఆ బాయి చప్టా  మింద అక్కడక్కడా కుండలు పెట్టుకోడానికి సుట్ట కుదుర్లు అమర్చినట్లు సిమెంటు మింద గుంతలు గుంతలుగా సేసినారు.

         బాయి సుట్టూ కింద రెండు బార్ల ఎడల్పుతో సెమెంటు ఏసుండారు. దాని సుట్టూ నీళ్లు  ఈదిలోకి పారి రోత కాకుండా అరిచెయ్యడల్పుతో జానడెత్తు గోడ. అక్కడ పడిన నీళ్లంతా పది బార్ల దూరంలో ఒనీలో ఉండే వంకలోకి పోయి ఇసకలో ఇమిరి పోతాయి.

       ఎండాకాలం రావాల,  నా సామి రంగా ఎన్నెళ్లో ఆడి ఆడి ఆలిసి పోయిన పిలకాయిలం బాయి దెగ్గిర కూసోని, పండుకోని కతలు సెప్పుకోడమేనా, పందేలేసుకోని పొడుపుకత లేసుకోడమేనా , పాటలేనా లోకంలో ఉండే సంతోస మంతా ఆ బాయి సుట్టూనే మాతోనే ఉండేది.

        సర్కారోళ్లు ఇంత మంచి సేంద బాయి తొవ్వినారా. కానీ తాగడానికి యాడ పనికొస్తాయా నీళ్లు. ఉప్పు కసిం. పోసుకోను, అవసరాలకు, గిన్నే సెంబు తోముకోను, గుడ్లుతుక్కోను, వాకిళ్ల ముందు పేండ నీళ్లు సల్లుకోను, ఇల్లలుక్కోను గొడ్డూ గోదకు ఒకో ఇంటికి ఎన్ని నీళ్లు కావాల. ఆ అవసరాలన్నీ ఆ బాయే తీర్సేది.

        అన్నిటికీ మంచి నీళ్లు కావాలంటే మాటలా . ఊరి మద్దెలో రాగి రెడ్డోళ్ల సేంద బాయుండాది కానీ అదీ ఉప్పులే . ఊరందరికీ దాహం తీర్చే బాయి ఒగటే ఉండాది. సేన్లోళ్ల సేంద బాయి. అదే మా బాయి .ఊరి మొగదల్లో ఆ సివరాకరన ఉంటాదా మాఇల్లు . అణ్నించి అన్నింటికి నీళ్లు మోసుకోవాలంటే సెత్ర స్రెమ పడాలా. తాగనూ, పప్పుడికించుకోనూ తలా రెండు మూడు కడవల నీళ్లు సేందు కోని పోతే గగనం. ఈ సివర ఉండే పది పన్నెండిండ్లోళ్లు  మాత్రం అన్నిటికీ ఈ నీళ్లే సేందుకుంటారు.

        మా బాయికుండేది ఒకటే రాట్నం. మేము నీళ్లు సేందుకొనే దాకా ఏరే వాళ్లకు రాట్నం దొరకదు. అప్పుడంతా ఒంగే సేందు కుంటారు.నాలుగు పక్కల బండలు  రాట్నం కోసం రెండు కంబాలు .

      సర్కారు బాయి శానా లోతు గానీ మిగిలిన రొండు బావులు ఐదారు మట్ల లోతే. అందుకే ఎండాకాలం వొచ్చెందంటే నీళ్లు అడుక్కు పూడస్తాది. మేము సేదుకున్న్యాక ఈ పక్కిండ్లోళ్లకు  కూడా తాగను మాత్రమే దొరికేది. అదీ ఊర బెట్టీ ఊరబెట్టీ కాసుకో నుండి సేందుకోవాల.

        వానా కాలం ఒచ్చిందంటే యా బాయి సూసినా తటంగలుగా ఉంటాది. మూడు బార్ల సేంతాడుంటే సాలు . ఆండోళ్లకు నీళ్ల పని సుళువై పోతాది.

        సంక్రాంతి పండకొచ్చి పూడ్సింది . బాయిల్లో  నీళ్ల ఊట కొంచిం కొంచిం తగ్గతా ఉండాది. మట్టున్నర లోతుండాయి మా బాయిలో నీళ్లు .

        కర్నమోళ్ల సాయిత్రి నీళ్ల కొచ్చింది. తెల్లార్తో  , పైటేల ఐతే సేందబాయి సుట్టూ జనాలుంటారు కాని అందురూ సేద్దిం పనులు కాడికి పూడ్సినాక ఎవురుంటారు? అందుకే కూలోళ్ల సంగటికి  పొయి మింద ఎసురు పోసి పెట్టి నాలుగ్గడవలు నీళ్లు సేంది ఎత్తక పోయి కాలీ అయిన తొట్లు నింపుకుందామని వచ్చింది.

        నీళ్లు సేందుకొని కడవ సంకలో దుత్త సేతిలో పెట్టుకొని  ముందు ఎద్దల తొట్లో పోసి కడవ దుత్తల్ని దిన్ని మింద బెట్టి గుడ్సింట్లోకి పోయింది.  ఎసురు తెర్లతా ఉండాది . నాన బెట్టిన నూకల్ని ఎసిట్లో ఏ

Comments