స్వాతంత్ర్య దినోత్సవం
1947 ఆగష్టు 15 న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది . అందుకని ప్రతి సంవత్సరం ఆగష్టు 15 న దేశమంతటా జాతీయ జండాను ఎగురవేసి పండగ జరుపుకుంటారు. భారతీయుల బానిసత్వం తొలగి స్వేచ్ఛ చేకూరిన పర్వదినమది. ఆంగ్లేయుల పాలన నుండి దేశానికి , ప్రజలకు విముక్తి కలిగించి స్వరాజ్యాన్ని సంపాదించడానికి దీక్షతో కృషి చేసిన మహాత్మా గాంధీకి ఈ పర్వదినాన ప్రజలంతా అంజలి ఘటిస్తారు .
విద్యాలయాల్లోను , ఇతర సంస్థల్లోనూ జాతీయ పతాకాన్ని ఎగుర వేయడమే కాదు , భక్తి పారవశ్యముతో దేశభక్తి గీతాలను ఆలపిస్తారు. బానిస బతుకుల్లో ముసిరిన చీకట్లను పటాపంచలు చేసి విశ్వ శాంతి సందేశాన్ని జగతికి వినిపించినది మన జండా.
' స్వేచ్ఛ లేని స్వాతంత్ర్యం కంటే నరకం మేలు ' అంటాడు ఆంగ్ల మహాకవి మిల్టన్. స్వేచ్ఛ అనేది ప్రతి మనిషికి ప్రాణం వంటిది. అది అతని జన్మ హక్కు. అందుకే లోకమాన్య బాలగంగాధర తిలక్ అనే మహాశయుడు ' స్వరాజ్యం నా జన్మ హక్కు ' అని భూనభోంతరాళాలు దద్దరిల్లేలా గర్జించాడు .
ఒక దేశ ప్రజలు పరాయి వాళ్ల పాలనలో ఉన్నారంటే ఆదేశ ప్రజలకు మాతృదేశమే లేనట్టు లెక్క . స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ . సూర్యుని వెలుతురు. పారతంత్ర్యం అంటే బానిసత్వం. చిమ్మ చీకటి . 'బానిసత్వం తప్పు కానప్పుడు ఏదీ తప్పు కాదు ' అంటాడు ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్. నార్మన్ బెతూన్ అంటాడు ' మోకరిల్లి బతకడం కంటే కాళ్ల మీద నిలబడి మరణించడం మేలు ' అని .
ప్రతి జాతికీ స్వేచ్ఛ తప్పకుండా ఉండాలనీ , ఏ జాతి భవిష్యత్తును ఆ జాతే తీర్చి దిద్దుకోవాలనీ స్వాతంత్ర్యోద్యమ భావానికి మూల పురుషుడయిన రూసో ప్రతిపాదించాడు . ఈ మాటలతో ప్రభావితమైన అన్ని దేశాలూ పర ప్రభుత్వాలపై తిరుగుబాటు చేశాయి. అవే స్వాతంత్ర్యోద్యమాలయ్యాయి .
మన దేశంలో ఆంగ్లేయుల పాలనను అంతం చేసి భారతీయులందరూ కలిసి సాగించిన ఉద్య
మమే స్వాతంత్ర్యోద్యమం.
బ్రిటిషు వాళ్ల చేతుల్లో బానిసలుగా బతుకుతున్న మన దేశానికి స్వాతంత్ర్యం ఊరికే రాలేదు. ఎంతో మంది మానప్రాణాలను పోగొట్టుకుంటే వచ్చింది . ఏప్రిల్ 13 , 1919 లో ఒక్క జలియన్వాలాబాగ్ అనే ప్రదేశంలోనే కొన్ని వందల మంది నిరాయుధులు బ్రిటిష్ ప్రభుత్వపు తూటాలకు బలై పోయారు.
1907 లో బిపిన్ చంద్రపాల్ పర్యటనతో ఆంద్ర్హ రాష్టంలో అపూర్వమైన రాజకీయ సంచలనం ఏర్పడింది . ' వందే మాతరం ' అనే నినాదం దిక్కుల్ని పిక్కటిల్ల జేసింది.
చిలకమర్తి లక్ష్మీ నరసింహం అనే కవి బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసం తర్వాత దానితో ప్రభావితుడై ఆంధ్ర ప్రజలను ఉత్తేజపరచడానికి ఆశువుగా
' భరత ఖ్నండంబుచక్కని పాడి ఆవు
హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్ల వారు
పితుకుచున్నారు మూతులు బిగియ గట్టి '
అనే పద్యాన్ని చెప్పాడు.
గాంధీ మహాత్ముని సత్యం, అహింస లేకుండా ఉంటే ఎన్ని లక్షలమంది చనిపోయి ఉండే వారో !
అలా సాధించుకున్న స్వాతంత్ర్యం ఏ కొంత మందికో పరిమితం కారాదు. దేశంలోని ప్రతి పౌరుడూ తల ఎత్తుకొని తిరగాలి . అప్పుడే మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించినట్లు . అప్పుడే మనకు పండగ. ఆ దిశగా అందరూ పయనిద్దాం.
మహాసముద్రం దేవకి
113-8-2023
. నమస్తే మేడమ్ మీరు నడిచే అక్షర సుమధుర భావాలరవళి మీ అక్షర ప్రయాణం కొండంత ... ఇంతై ఇంతింతై అన్న చందాన మీరు చేస్తున్న ఈ ప్రయాణం భూతమైనది....
ReplyDelete