పుష్ప

 పుష్ప


ఆకాశం మబ్బురంగు పైన మిల మిల మెరుస్తా ఉండే సరిగ చుక్కల సీర కట్టుకోని , సందమామ  బొట్టు పెట్టుకోని దిక్కులు నాలుగు పక్కలకీ సల్లని ఎండి ఎన్నెలను ఎదజల్లతా దానికదే మురిసి పోతా ఉండాది.

పుష్ప మాసిన సిరుగుల సీరను కుచ్చిండ్లు పైకెత్తి ఎగజెక్కుకోని మంటి  కడవను సంకలో బెట్టుకోని  ఈదిలోకి అడుగు బెట్టింది.

ఎగవింటోళ్ల ఒరుగు దిన్ని మింద మాగన్నుగా పండుకోనున్ని నల్ల కుక్క లేచి అపర కాళికా దేవి మాదిరిగా ' భౌ .. 'మంటా పుష్ప పైకి ఎగ  దూకింది .

'సెయ్ 'అంటా అదిలించిన పుష్ప  గొంతు ఇని
' నువ్వా పుస్పక్కా ' అన్న్యట్లుగా  తోకాడిస్తా పుష్పతో  బాటు అదీ ఎంట నడిసింది.

పుష్ప  సేండ్లోళ్ల  సేంద బాయి కాడికొచ్చి కుదురుగా కడవను కింద బెట్టి రాట్నంలో సేంతాడు  దూర్సింది.  దాని కొనకు బొక్కిని ముడేసి బాయిలో కిడ్సింది. మూడు బొక్కిన్ల నీళ్లు సేందింది . రొండున్నర బొక్కిన్లకే కడవ నిండి పోయింది. తాడూ బొక్కిని ఆడే పెట్టి కడవ సంక నేసుకొని ఇంటికి బయలు దేరింది. 

అంత వరకు దెగ్గిరే ముడుక్కొని ఎనక్కాళ్లతో మూతిని సెవుల్ని రుద్దుకొంటా వున్ని నల్లకుక్క పుష్ప బయలు దేరగానే ఒక మొరుగు మొరిగి 'తప్పు సేసినందుకు శమించు కా' అన్న్యట్లుగా మళ్లీ తోకాడించు కుంటా పుష్ప ఎంట నడ్సింది.

ఎక్కడే గాని అలికిడి లేదు. ఊరిజనమంతా ఎచ్చటి బొంతల కింద సుకనిద్ర పోతా ఉండారు.

నిండు గర్భిని పుష్ప కుండ బరువుతో రచ్చ బండ దెగ్గిరికొచ్చింది. పుష్ప కష్టాలకు సాచ్చం సెప్పడానికా అన్న్యట్లు రచ్చ బండ మింద ఇనాయక సామి రాతి ఇగ్రహం నిలబడుండాది.

పక్కనే ఉండే పున్నాగ సెట్టులోని  మొగ్గలు నువ్ ముందా నేను ముందా అని  రెక్కలు ఇప్పుకుంటా గుమ  గుమా వాసనల్ని ఎదజల్లతా నవ్వుకొంటా ఉండాయి. గాలికి మెల్లింగా ఊగతా ఉండే కొమ్మల సందుల్లోంచి సంద మామ తొంగి తొంగి సూస్తా ఉండాడు.  సల్ల గాలి పుష్ప ఒంటిని తాకి ఒణికించింది. మొగుని ఉగ్ర రూపం గుర్తొచ్చి అడుగుల్లో జోరు పెంచింది పుష్ప.

పెల్లో నిలబడి ఎదురు సూస్తా ఉన్ని  మున్సామి
'బిన్న్యా తగలబడతావా ' అని గెద్దించినాడు. కాంగతా ఉన్ని నీళ్ల కాంగులోకి కడవలోని  సగం నీళ్లు గుమ్మరించి సెయి  బెట్టి సూసింది. సరిపోయినట్లుందని పించింది. నీళ్ల కడవ సేతిలో పట్టుకొనే మొగుని పక్క సూసింది.

మున్సామి ఒగ ముంత నీళ్లు ఒంటి మింద పోసుకోని ' ఇంగ సాలు పో ' అని కర్సినట్ల అర్సి నాడు. మిగిలిన నీళ్లు మంటి తొట్టిలో పోసి కాలీ కడవను సంకనేసు కోని మళ్లీ సేంద బాయి దెగ్గిరికి బయలు దేరబోయింది. 

' ముండా ఆగు. మొగుడు నీళ్లు పోసుకుంటా ఉండాడే ఈపు రుద్ది పోదామనే అరువు లేదా' గెట్టింగా కట్టితో కొట్టినట్లు అర్సినాడు మున్సామి.

' సల్ల పూట ఎవురికైనా ఇనిపిస్తే నవ్వు కుంటా రన్న అరువు నీకుండాదా ?  ' అని మనసులోనే కసిగా అనుకొని బరా బరా ఈపు రుద్ది బాయి నీళ్లకు బయలు దేరింది .

రచ్చ బండ కాడ నాగుల కట్ట మింద పండుకున్ని నల్లకుక్క ' నేనింగ రాలేనుకా నువ్ బో ' అన్నెట్లుగా సూసింది .

దినామూ ఇదే తంతు నడస్తాది పుష్పా  వాళ్లింట్లో . ఏనాడు మున్సామి పుష్ప బొట్నేలు దొక్కి బొట్టు గట్న్యాడో ఆ పొద్దు నుంచి పుష్ప మొగునికి బయపడ్తానే ఇద్దురు బిడ్లికి తల్లయింది. మళ్లీ ఇప్పుడు నీళ్లు పోసుకొని ఈ పొద్దో రేపో కనేట్లుగా ఉండాది.

ఆ ముండ మోపి మొగుని మొగం పైన నవ్వు సూసి ఎరగదు పుష్ప. ఎప్పుడు సూసినా మొగం మొట మొట లడతా పేలాలేస్తే ఎగిరెగిరి పడతాయేమో అనేట్లుంటాది.

మున్సామికి పెద్దక్క కూతురే పుష్ప. ఇద్దురి మద్దిన   పదారేండ్ల తేడా ఉండాది. 'మున్సామికి ఎగూరి పిన్నమ్మ మనవరాలి సంబంధం కుదిరేట్లుండాది కో ' అని  కానుపు కోసరం పుట్నింటి కొచ్చిన సెల్లెలు శాంత వాళ్ల పెద్దక్క కుప్పమ్మకు ఎవురితోనో సెప్పి పంపించింది. అంతే ఆగ మేగాల మిందొచ్చి పుట్నింట్లో వాలి పోయింది కుప్పమ్మ.

' మనవరాల్ని  బెట్టుకోని మారు సంబందం సూస్తావా? నీకు సిగ్గూ ఎగ్గూ రొండూ లేవా ? సొంత మనవరాలిని కాదని ఏరే దాన్ని తెచ్చి కడ్తే నలుగురూ కారూంచతారన్న ఇంగితం యాడ బోయింది నీకు? ' అని తల్లిని ఎంత మాటొస్తే  అంత సులకన సేసి మాట్లాడింది.

తండ్రిని తిట్ట లేదు. మొగోళ్లకు బిడ్లి పైన తల్లి కున్నంత పేమ ఉండదని కుప్పమ్మకు తెలుసు. అందుకే తల్లిని తిట్టిన కుప్పమ్మ తండ్రిని దీనంగా ఏడుకొనింది. ' నీ మనవరాల్ని తమ్మునికి సేసు కోలేదనుకో దాన్ని బాయిలో దోసి నేనూ దూకి సస్తా' అని బెదిరించింది.

ఆడే ఉండిన తల్లి 'మాదేముండాదమ్మా. నీ తమ్మున్నడుగు. మీ పిన్నమ్మ వాన్ని బుట్లో ఎప్పుడేసుకునిందో !మనవరాల్ని కట్ట బెట్టాలని  సూస్తా ఉండాదంటా. మాకూ  ఇప్పుడే దెలిసింది . వాడు సెప్తే గదా! మేము వాన్ని దండించేది. నేల నెట్రా ఉండాది కదా ! అందురి సూపులు వాడి మిందే. అరే! సొంత అక్క కూతురుండాదే నా బిడ్నిస్తానని  ఎట్లా అడిగేదీ అనే ఇంగితం ఆ ఎగూరిదానికి లేక పోయిందే' అని వాడికి పిల్ల నిస్తాననిన పిన్నమ్మ  కూతురు గురించి అంగలార్సింది తల్లి

బాయి దెగ్గిరి నించి తమ్ముడు ఎప్పుడు ఇంటికొస్తాడా అని కాళ్లు పట్టు కోడానికి కూడా సిద్ద పడి కాసుకో నుండాది కుప్పమ్మ.

సంద కాడ ఇంటి కొచ్చిన తమ్ముడు ఎద్దల కొట్టంలో గొడ్లకు కసువేసి  ఇంట్లోకి రాంగానే తాగడానికి గుండు సెంబులో నీళ్లు దిస్కోని బొయి ఇచ్చింది .

'ఎప్పుడొస్తివి కా' అని పలకరించి నాడు తమ్ముడు.

' ఒరే మున్సామీ , నేను ఊరికే రాలేదు రా నిన్నొక ఇసయంగా ఎచ్చరించి పోదామని అదే పనిగా  పని గట్టుకోని వొస్తినిరా ' అనింది .

' ఏందా ఇసయం సెప్పుకా ' అన్న్యాడు
'ఒరే మున్సామీ  అమ్మ నిన్ను కనింది గానీ ఎత్తుకోని సాకింది నేనేరా ' అనింది కండ్లలో నీళ్లు కమ్ముకోనొస్తా ఉంటే .

' ఇప్పుడేమయిందికా ? నేనేమన్నా అంటినా  నిన్ను'  అని అడిగిన తమ్మున్ని నిష్టుర మాడతా అసలు ఇసయం బయటికి కక్కింది.

నెల దినాలకే మున్సామీ పుష్పల పెళ్లి జరిగి పోయింది. కుప్పమ్మకు జరుగుబాటు తక్కవ . పుట్నింటోళ్లకు మాదిరిగా బూముల్లేవు. నాలుగిండ్లల్లో గుడ్లుతుక్కోని బతకడమే .
అయినా తల్లె గొట్టినా పెండ్లే తప్పెట గొట్టినా పెండ్లే అని ఉన్నంతలో పెండ్లి జేసినా అప్పు జేసి తమ్ముని మెడకు మైనీరు సైను , ఏలికి ఉంగరం బెట్టి తన గొప్ప తనాన్ని సాటుకునింది.

ఈడేరే దాకా పుట్నింట్లోనే ఉన్ని పుష్ప కొన్నాళ్లకు మెట్నింట్లో అడుగు పెట్టింది. అత్తయిన సొంత అవ్వే  పనీ పాటా నేర్పించి మెల్లింగా సట్టీ కుండా దాని మెడకు కట్టేసింది.

కాపురాని కొచ్చిన  పుష్పను శాన్నాళ్లు ఎగా దిగా కూడా సూళ్లేదు మున్సామి. కొన్నాళ్లకి వాడికి  వాడే మంత్ర మేసినట్లుగా ఉన్నట్లుండి పుష్పతో  కాపురం సెయ్యడం మొదులు బెట్న్యాడు.

పుట్నింట్లో తల్లితో బాటు ఎండలో ఊరి గుడ్లుతకను ఏటికి బొయ్యేది పుష్ప  . తెల్లంగా  ఉండే పుష్ప మొగం ఆ ఎండకు మంగు పడినట్లుండేది . ఇప్పుడు వయసు కొచ్చిన పుష్ప ఇంటి పట్టునే ఉండేసరికి రంగుదేలి ఒళ్లు కూడా  సేసింది. సీకి కంప మాదిరిగా బక్కగా ఉండే పుష్ప  ఇప్పుడు నిండుగా ఇడిగిన సెండు మల్లి పువ్వు మాదిరిగా మిస మిస లాడతా ఉండాది.

పెండ్లయిన యాడదిన్నరకు పుష్పకు కొడుకు పుట్న్యాడు. అత్త సేద్దిం పన్లకు పోతే పుష్ప  పిలగాన్ని, ఇంటి పన్లను సూసుకొనేది.

పెద్ద మేనమామ పుష్ప పెండ్లి కాక ముందు నుంచే పెండ్లాం బిడ్లితో ఏరు కాపుర ముండాడు. తోడి కోడలు మానిక్కింతో పుష్ప  కలిసి మెలిసి ఉంటాది. పేడతట్ట దిబ్బలో పోసి రావాలన్నా, సేంద బాయికి నీళ్లకు బోవాలన్నా మానిక్క్యం దెగ్గిర పిలగాన్ని ఇడ్సి పెట్టి పొయ్యేది పుష్ప.

మరో ఏడాదిన్నర  కంతా పుష్పకు రొండో కానుపయ్యింది. ఆండ బిడ్డి పుట్టింది. ఆసమత్సరమే మామ బాయికాడ జొన్న సేన్లో కసువు పెరుక్కుంటా ఉంటే పాము కాటేసి పాడెక్కినాడు. యాడాది గడ్సిందో లేదో కలరా సోకి అత్త కాలం సేసింది.

అప్పుడు మొదులయినాయి పుష్పకు అసలు తిప్పలు. సేద్దిం పనుల్లో సేదొడు వాదోడు గా ఉండే అమ్మా నాయిన్లు దూరమై పొయ్యేసరికి మున్సామికి ముందూ ఎనకా దిక్కు తెలీకుండా అయిపోయింది.

దాంతో సేన్లొడపను , మిరప్పండ్లేరను, గొడ్లకు పచ్చ గెడ్డి కోసక రాను, సెరుకు మోసులించక రాను, కళ్లం సెయ్నూ పుష్పకు తలమునకలుగా ఉండాయి పన్లు. ఇంట్లో పనీ సేసుకోక తప్పదు. ఎంతగా తోడి కోడలు సేదోడు వాదోడయినా దినాము పిలకాయిల్ని సూసుకో మంటే ఏం బాగుంటాది? దిక్కూ దివానం లేని సంసార మై పోయింది. అందుకే ఎడ పిలగాన్ని ఎంట నడిపించుకోని  సంక సాటు బిడ్ని కూడా సంకలో ఏసుకొని పోయి ఊడగ సెట్టుకు ఉయ్యాల కట్టి పండ బెట్టి సేద్దిం పన్లు సేసొస్తా ఉండాది .

మున్సామికి ముందే కోపం ముక్కు మిందుంటాది . పుష్ప ఎంత పని సేసినా ఇంకా సెయలేదని తిట్టేటోడు. టయానికి సద్దీ సంగటి తేలేదనో , యాళకు పాలు పిండ లేదనో ఏదో ఒక సాకుతో అప్పుడప్పుడూ సెయి సేసు కోవడం కూడా మొదులు బెట్న్యాడు.

పుట్నింట్లో కూడా పుష్పకి దాపుగా ఉండే వాళ్లు ఎవురూ లేరు. ఇద్దరన్నదమ్ములున్నా తల్లికే వాళ్లు కడుపునిండా కూడు బెట్టరు. తండ్రి కాలం సేసి రెండేండ్లవతా ఉండాది. 

ముస్మామి పుష్పను కట్టు బానిసనుకుంటాడు. అంత కంటే హీనంగా సూస్తాడు. జీతం లేని పనిమనిసామి. శారీరక అవసరాలకు వాడుకొనే ఒక కొరముట్టు. ఒకటి రొండు సార్లు మొగుని మాటకు ఎదురు మాట్లాడితే చమడా తోలు ఊడేట్ల కొట్టినాడు. పెండ్లామని గానీ, సొంత అక్క కూతురని గాని, కనీసం ఒక మనిసని  గానీ అనుకోడు. దానికీ కొట్నప్పుడు నొప్పి తగల్తాదని గానీ, యాడస్తాదని గానీ దయా దాచ్చిన్యాల్లేవు మున్సామికి. అంత కఠినంగా మారతాడని పుష్ప కూడా అనుకోలేదు.

ఇంటి పని , వంటింటి పని, కూలిదాని మాదిరిగా సేసే సేద్యం పని , పిలకాయియిల పన్లతో నారా గోరంగా తయారయింది పుష్ప. సంసారం గుట్టు- యాది రట్టని నమ్మి  ఎంత కష్ట పడ్తా ఉన్న్యా ఒకరి దెగ్గిర పల్లెత్తి  పదిరింది లేదు. 'నామొగుడిట్లా' అని సెప్పుకొనింది గాదు . అందుకే వాడి ఆటలు అట్లా సాగతా ఉండాయి.

ఒంటరిగా ఉన్న్యప్పుడు కనిపించని దేమునికి  సెప్పుకోని కన్నీరు మున్నీరవతాది పుష్ప. ఇంతగా బయపడతా,  దెబ్బలు దింటా బతకాలా? అని అనుకుంటాది. కండ్ల ముందు తిరగాడే కన్న బిడ్లను సూసి ఎప్పుటి కప్పుడు మళ్లీ గుండి కాయిని రాయి జేసుకుంటాది. 

అదే గాదు. సచ్చి పోవాలని ఆలోచన ఒచ్చినప్పుడంతా అట్లా బతక లేక సచ్చినోళ్ల గురించి ఎంత నీచంగా మాట్లాడు కుంటారో తన తెలివి తక్కవ  బుర్రకు కూడా ఎక్కిన ఒగ సంగటన గుర్తొస్తాది పుష్పకు.

ఆ వూరి కర్నమోళ్ల రంగసామి రెన్నెళ్లకు ముందు సెరువు కట్ట దెగ్గిరున్న మర్రి మానుకు ఉరి బోసుకోని  సచ్చి పూడ్సినాడు. ఊరంతా ఆలగోడు బాల గోడుగా ఉండాది. ఆడ సేరిన జనాలు కండ్ల నీళ్లు పెట్టు కుంటా ఉండే వాళ్లను చెడా మడా తిట్టిపోసింది సుందరమ్మత్త.

'ఎందుకు ఆ బతక లేని ఎదవ కోసం ఏడ్సి సస్తారు. వగా వాకు లేనోడు.  వాని ముడ్డెత్తు కోని వాడు బొయినాడు. సచ్చే ముందు అమ్మా నాయిన్లు ఏమైపోతారని ఆ బాడ్కోవ్ ఒగ నిమసం పాటు ఆలొచన జేసినాడా? బతికి సూపెట్టాలి గాని సచ్చి ఏమి సాదించినాడు ' అని రంగసామిని ఈసడించు కునింది అందరి ముందు సుందరమ్మత్త. అది పుష్ప మనసులో ఇంటిని నిల బెట్టిన కంబం మాదిరిగా మనసులో గెట్టింగా నాటు కొనింది

ఎప్పుడూ దిగులుగా ఉండే పుష్పకు తిండి కూడా సరిగా దిగేది కాదు. పెడ్లైయిన కొన్నాళ్లకు పొట్టకర్ర మిందున్న ఒరి పైరు మాదిరిగా నవ నవ లాడతా 
తిరగాడే పుష్ప  పిలకాయిలు పుట్టి పెద్దవతా ఉంటే పంటుడిగిన  మిరప సెట్టు మాదిరిగా కంప ఐపోయింది. అత్తైన అవ్వ పొయినాక పస్తున్నా తినమని సెప్పే వోళ్లు కూడా లేరు.

అదే కాదు. దాని బతుకులో ఒక ఊరు ల్యా పల్లి ల్యా . ఒక పండగ ల్యా పబ్బం ల్యా. ఒక సినిమా ల్యా సికారు ల్యా, ఒక సుకం ల్యా సంతోసం ల్యా . మొగుని చేష్టలతో వాని మింద కూడా  బెమలు  ల్యాకుండా బోయింది. వాడు కంట బడితే పులో , సింగమో ఎదురు బడినట్ల వొణికి పోతాది.

పెద్ద పిలగాడి ముద్దు మాటలు ఇన్న్యప్పుడు,  రొండో బిడ్డి బుడి బుడి నడకలు సూసి నప్పుడు, వాళ్లని అడ్డాల్లో పెట్టుకొని ముద్దు లాడినప్పుడు సిరు జల్లులో తడిసినప్పుడు కలిగే ఆనందం ఒల్లంతా పాకి ' నీకూ సంతోస ముండాది పాపా' అని ఎవురో ఎచ్చరించి మరీ గుర్తు సేసి నట్లవతాది పుష్పకు.

సందులో సడేమియా అన్న్యట్లు ఇన్ని పనుల మద్ది లోనే మళ్లీ ఆండ బిడ్డికి జన్మ నిచ్చింది పుష్ప.

'ఒక నెల దినాలన్నా  సన్నీళ్లలో సెయి పెట్టొద్దు పాపా !'అనింది ఎదురింటి పొన్నెక్క . పుష్ప పడే కష్టాన్ని కండ్లారా సూసిందామె.

'నన్ను కూసో బెట్టి సేసే వాళ్లెవురుండారు పిన్నమ్మా , మా యమ్మకు కండ్లు కూడా సరింగా కనిపించవే ' అని అంగలార్సింది. 'దిక్కు లేనోళ్లకు దేముడే దిక్కు'   అని కళ్ల నీళ్లు పెట్టు కొనింది పుష్ప . 

కాన్పు సెయ్యడానికి  కుప్పమ్మ ఒచ్చింది. కానీ నీళ్లు నిప్పులు తెచ్చుకోడానికి ఆమెకు సేత కాదు. కనే దాకా పుష్పే తంటాలు బడింది . బిడ్డి పుట్నాక పుష్పోళ్ల సిన్న పిన్నమ్మ నాగమ్మొచ్చి పద్దినాలు అక్క కుప్పమ్మకు చేదొడు వాదోడయింది.

బిడ్డికి నెల గూడా నిండకనే ఇంట్లో అన్ని పనులు సేసుకో బట్టింది పుష్ప. గొడ్లకు గడ్డి గాదం కోసుకొచ్చే వాళ్లు లేక అల్లాడి ఆకులు మేస్తా ఉండాడు మున్సామి . అట్లాంటప్పుడే ఒళ్లు తెలియనంత కోపమొస్తాది మున్సామికి. మళ్లీ యధా ప్రకారం తిట్లు , దీవెనలు తప్పడం లేదు పుష్పకు.

ఒగ దినం సంగటికి పిండి బొస్తా ఉండాది. ఉయ్యాల్లో నిద్ర బోతా ఉన్ని సిన్న బిడ్డి కేర్ కేర్ మని గెట్టింగా ఏడ్వ బట్టింది.  సేతిలో పనొదిలేసి ఉయ్యాలున్ని నడవలోకి పరుగు దీసింది పుష్ప .  రొండో బిడ్డి ఉయ్యాల కాడ బిక్క మొగమేసు కొని గోడను గిల్లతా నిలబడుండాది. దాని వాలకం సూస్తే అదే ఏందో సేసిందని అర్త మయింది.

'ఏం సేస్తివి పాపా' అని దాన్ని గెద్దిస్తా ఉయ్యాల్లో బిడ్డిని సేతి లోకి తీసుకునింది. బిడ్డి గుక్క దిప్పుకోకుండా ఏడస్తానే ఉండాది. సూస్తే ఆ బిడ్డి పెదుము పక్కన ఎర్రంగా కంది పోయింది . కూతుర్ని గెట్టింగా అడిగితే  అప్పుడు సెప్పిందది.   'సిచ్చి పోసింది. అందుకే గిచ్చి  పెట్నాను ' అనింది ఒచ్చీ రాని మాటలతో . దాన్ని రెండేట్లేసే సరికి అదీ రాగ మెత్తుకునింది.

పసి బిడ్డికి పాలిచ్చి పండుకో బెట్టి, ఏడస్తా వున్ని బిడ్ని అనవరించి పొయ్యింట్లో కొచ్చేపాటికి సంగటి కాటు వాసనొస్తా ఉండాది . గుండెలు గుబేల్మనినాయి. మొగుడొచ్చే ఏలయింది. ఇప్పుడు ఎసురు బెట్టి సేసేంత  సమయమ్యాడ్ది 
అనుకునింది.

మున్సామి రానే ఒచ్చినాడు. గెట్టిగా ఉందని పయ్యెసురు నీళ్లు బోసి అడుగు మాడుకు తగలకుండా పై పైనే కెలికింది సంగటి. పెసులు ఏంచి ఎనిపిన పులగూరతో ఒక ముద్ద సంగటి  దెచ్చి తినడానికి కూసున్ని మొగుని ముందర బెడ్తా ఉంటే 'ఎండలో పీతి కష్టం సేసి ఇంటికొచ్చిన మొగోడికి నీళ్లియ్యాలని తెలీదా ' అని ఉరిమి సూసినాడు. గుండు సెంబుతో కుండలోని సల్లని నీళ్లు ముంచుకోనొచ్చి ముందర పెడతా ఉంటే అనుకనుగ్గా ఉన్ని కాలే సంగటి ముద్దొచ్చి కండ్ల మింద, రెప్పల మింద , ముక్కు మింద దవడల మింద అంటుకొనింది. కాటు బొయిన సంగటిని నోట్లో బెట్టుకోని అణుగ్గా వున్ని ఉడుకుడుకు సంగటి ముద్దను పుష్ప మొగం మిందికి ఇసిరి కొట్టినాడు మున్సామి.

'అమ్మా ' అని కుప్ప కూలిన పుష్పను  పట్టించుకోకుండా 'తుపూ.. ' అని ఎంగిలూంచి అది సాలక తిప్పించి మళ్లించి దొక్కల్లో తన్ని తిరిగి సూడకుండా ఈదిలోకి పూడ్సినాడు మొగుడు.

మొగంలో కాలిందాని కంటే మనసులో మంట జాస్తయింది పుష్పకు. ఆ శనంలో ' ఈ బతుకొద్దురా దేముడా ' అని సావడానికి తీర్మానం సేసుకొనింది. ఇస్కూలిడ్సినాక ఇంత సేపూ యాడేడ తిరిగినాడో
'అమా ఆకిలీ' అంటా పిలగాడు ఇంట్లోకి ఒచ్చినాడు.

'ఎంత అరువూ తెరువూ లేకుండా సావాలనుకున్న్యాను. నేను పొతే ఈ ముగ్గురు నేంద్ర పిలకాయిలు ఏమై పోతారు' అనుకునింది. వాడు మాత్రం కాటు బొయిన సంగటి ఎట్లా తింటాడు అనుకోని రాత్రి నీళ్లలో ఏసి పెట్టిన మిగిలిన ఆన్నాన్ని పిండి తట్టలో కేసి కూరబోసి వాడి ముందర పెట్టింది. మొగుడు వస్తాడేమో అని ఎసురు బెట్టి అన్నం వండి వార్సింది.

రాను రాను పుష్పకు మొగడంటే బయం పోయి ఆ తావులో  అసింకం పేరు కుంటా ఉండాది.

పూరేకులు మాదిరిగా మెత్తటి మనసుండే పుష్పలో గుండికాయ రాయి మాదిరిగా రాటు దేలడం మొదులయింది .

'ఎన్నాళ్లు బతికినా ఈ కుక్క బతుకింతే. ఇంట్లో ఏసుకోని కొడ్తే పిల్లయినా తిరగ బడ్తుందంటారు. . నేనేమీ దండక తిండి తినడం లేదు . కూలీ నాలీ సేసుకొని దర్జాగా బతికే దైర్నం లేకనా ఈ తన్నులు దింటా ఉండేది. ఆరు నూరు గానీ అగ్రారం పడు గానీ , వాడికి కోప మొచ్చి తన్ని తగలేయనీ ఇంగా ఓర్సుకోని పడుండే ఓపిక నాకు లేదు' అని ఆలోచిస్తా ఒక తీర్మానాని కొచ్చింది .

కిరాతకంగా ఉండే మొగునిలో మార్పు దీసుకోనొచ్చే మార్గమేమైనా ఉందా అని శాన్నాళ్లుగా యోసన సేస్తానే ఉండాది.

'ఏం సేస్తే మారతాడీ మనిసి . ముద్దులు మూట గట్టే ముగ్గురు పిలకాయిల్ని ఎత్తుకొని ఏనాడన్నా ముద్దు సేసినాడా ? మనిసయితే కదా ! అడివి జంతువు కన్నా కనా కష్టమైనోడు.

ఇంట్లో తిండి గింజిలికి కొదవ లేదు.  బోషాణంలో శానానే దుడ్లుండాయి. వడ్డీలకు తిప్పతా ఇంకా రేక సెయ్యడమే కానీ కర్సు పెట్టింది లేదు. అది సూసుకోనే కదా తమ్ము డెట్లాంటి వాడనే యోసన కూడా సెయ్యకుండా ఆ మహాతల్లి తమ్ముని కాళ్లు బట్టుకొని మరీ కట్ట బెట్టింది తనను. రేయింబగుళ్లు ఇవే ఆలోచనలు పుష్పకు .

ఎంత అడుక్కున్నా మంచి తనంతో మారే రకం కాదు మొగుడు . ముల్లును ముల్లుతోనే తియ్యాలన్నారు పెద్దోళ్లు. కష్టమో నష్టమో  ఆ పని జేసి  నేను తప్ప ఇంగో దిక్కు లేదు అని తెలిసేట్టు సేస్తే తప్ప దార్లోకి రాడు అని అనుకుంది.

సేద్దిం పనులు పూర్తయి పండింది ఎండింది ఇంటికొచ్చే దాకా ఓపిక బట్టింది.

ఆ పొద్దు కావాలనే గొడ్లకు పచ్చి కసువు కోసక రాను పోలేదు పుష్ప. సంతకు బొయిన మొగుడు సందకాడ గాని ఇంటికి రాలేదు. రాంగానే తిండి మెక్కినాడు. కొట్టం లోకి పోయి గొడ్లకు నీళ్లు  దాపినాడు . కసువేస్తామని సూస్తే ఎప్పుడూ ఉండే కొట్టం లోని కట్టెల వామి పైన గడ్డి మోపు లేదు . అంతే! కోపం  నసాలాని కంటింది.

ఊరి బయట ఉండే ఎండు గెడ్డి వామిలో నుంచి కసువు తేవాల, లేకుంటే పసువులుని పస్తు పడుకో బెట్టల్ల. కోపంతో రగిలి పోతా చిమ్మ సీకట్లో  గడ్డి వామెక్కి కసువు నాలుగు కట్టలు తెచ్చి గాట్లో  గొడ్ల ముందేసి ఇంట్లో కొచ్చినాడు.

' కోసకొచ్చిన  కసువు మోపు యాడ? ' అడిగినాడు.

' యాడుందీ ?'

' నేనడిగితే నన్నే ఎదురు ప్రెశ్నేస్తావా? ' మెల్లింగానే అడిగినాడు

' నేను తేలేదు , ఇంగ మిందట త్యాను . నా సేత కాదు పిలకాయిల్నిడ్సి పెట్టి ఆ పనులు సెయ్యడానికి .' శానా దైర్యాన్నే కూడ గట్టు కొనింది పుష్ప.

' సూస్తా ఉండా నేను.  ఈ మద్య బయమూ బక్తీ రొండూ లేదు . తిమ్మిరెక్కువై పోతా ఉండాది' గెట్టింగా గెద్దించినాడు. మారు మాట్లడ కుండా బిడ్డి ఈపు నిమరతా పడుకోనుంది పుష్ప.

బదుల్లేక పొయ్యే సరికి మున్సామిలోని మొగతానానికి రోసం పొడ్సుకోనొచ్చింది

ఎకంగా పొయ్యి పండుకోనున్ని పుష్పని ఈడ్సి నిల బెట్టి 'ఊరికే ఉండే కొద్దీ బదులు మాట్లాడ్తావా?  పెదిమికి మించిన పల్లై నావే' అని రొండేట్లేసినాడు. దానికోసమే కాసుకోని ఎప్పుడెప్పుడా అని సిద్దంగా వున్ని పుష్ప దుడ్డు కర్ర దీసుకోని ఏమైతే కానని మొగుని ఎడమ కాలు మోకాటి చిప్ప ఇరిగేట్లు వాంచి పారేసింది.

మున్సామి మంచాన పడినాడు. పుష్పకు కూడా మొగున్ని సూసినప్పుడంతా 'అయ్యో' అనిపిస్తా ఉండాది. అది తెలిసి సుడ్డానికొచ్చి నోళ్లకు గాట్లో  ఎద్దుల్ని కట్టేస్తా నెట్టెగిరి గాటి బండ మింద పడినానని సెప్పు కున్న్యాడు.

ఇప్పుడు పూర్తిగా పుష్ప  మింద ఆదార పడాల్సొచ్చింది మున్సామి. పెండ్లాం కొట్టిందని ఎవురికీ సెప్పు కోడు. అగ్గి మింద గుగ్గిలం  మాదిరిగా ఎగిరి పడే వాడు కుక్కున పేను మాదిరిగా మంచాన పడి ఉండాడు. 'దాన్ని ఇప్పుడేమన్నా అంటే ఇంకేమైనా ఉండాదా? నీళ్లు నిప్పులూ ఇచ్చే దిక్కు కూడా ఉండరు' అనుకున్న్యాడు.

పుష్ప మంచి తనంగా మాటలు చెప్తా మొగున్ని మార్సుకొనే పనిలో బడింది. 'మారినాడా కాపురం సక్క బడతాది. లేదంటే ఏం సెయ్యాలో మళ్లీ ఆలోసించాలి' అనుకొని కష్టమైనా ఆన్ని పనులూ చేసుకోసాగింది.

ముక్కింగా మొగుడు పెండ్లాలు ఎట్లా ఉండాలో , నవ్వతా  నలస్తా ఎట్లా కాపురం సేసుకోవాలో దినామూ సందు దొరికినప్పుడంతా పాటాలు సెప్తా ఒచ్చింది. ' నువు మారక పోతే నిన్ను పిలకాయిల్ని కూడా సంపి నేనూ సస్తా' అని బెదిరించింది. 'నిన్నిప్పుడు సావగొడ్తిననుకో!   నీకు  దిక్కెవురు?' అని కూడా అడిగింది.

'నువ్వు లేక పోయినా  నా బతుకు నేను బతగ్గలను. నేను ల్యాకుండా ఏళకు తిండి దిన గలవా? పిలకాయిల్ని సాకి సంతరించ గలవా? ' అని అడిగింది.

' ఇది అన్నింటికి తెగించే మాట్లాడ్తా ఉండాది. ల్యాకుంటే  నా మోకాలి చిప్పల్ని ఇరగ్గొడ్తాదా ' అనుకున్న్యాడు.

‘నేను నిన్ను కట్టుకున్ని నాటి నుంచి ఎంత ఏడ్సినానో నీకు తెలుసా ? ఎప్పుడూ  నీకు బయపడడమే గాని సంతోసంగా ఒగ దినమన్నా ఉంట్న్యా. సచ్చి పోవాలని ఎన్నాళ్ళనుకున్నానో ! నేనా పని చేసుంటే నీ బతుకు కుక్క బతుకయ్యేది' అని కండ్లలో నీళ్లు కార్సింది. '

' నన్ను కొడ్తే, తిడ్తే నీకు ఏమి ఒరిగిందో నాకైతే తెల్దు. నీ కాళ్లించి మూల పండుకో బెట్టి నేను బాపు కొనిందీ ఏమీ లేదని నీకూ తెలుసు. నీ మల మూత్రాలతో సహా ఎత్తి పోసి సేవ సెయడం తప్ప నాకు దక్కిందేముంది? నువ్వు మారాలనే నేనీ పంజేసినా. మార్తివా సరి. ల్యాకుంటే నా దోవ నేను సూసుకుంటా. ఇంగో పద్దినాల్లో కట్టు ఇప్పతారంటా బాయి కాడికి  కూడా ఇప్పుడే పోకూడదంటా. '

అన్నం పెట్టే టప్పుడు, నీళ్లు పోసేటప్పుడు , ఇట్లా మొగునికి సేవజేసే టప్పుడంతా మనసులోని మాటల్ని సెప్తా ఉంటే కిక్కురు మనకుండా ఇంటా ఉండాడు మున్సామి.

ఎప్పుడూ లేంది పెండ్లాం అందు బాటులో లేనప్పుడు పిలకాయిల్ని దెగ్గిరికి పిల్సుకోని వాళ్లు ముద్దు ముద్దుగా మాట్లాడ్తా ఉంటే ఇంటా ఉండాడిప్పుడు. అది గమనించిన పుష్ప కావాలనే పిలకాయిల్తో నీళ్లిచ్చి పంపించడం , తినడానికిచ్చి పంపించడం సేసి పిలకాయిల్ని గూడా దెగ్గిర సేసింది.

మున్సామి సెప్పే వోళ్లు లేక సెడిపోయిన మొండోడే కాని సెడ్డోడు కాదనే ఇసయం అర్త మయింది పుష్పకు.

పనీ పాట లేకుండా మంచం మింద తిని పడుకోవడంతో పుష్ప  సెప్పిన మాటలు తలలో గింగిర్లు కొడతా ఉంటే ' అది సెప్పింది కూడా నిజమే కదా' అనిపించ సాగింది మున్సామికి.

ఏదో అద్బుతం జరిగినట్లుగా మున్సామి లో మార్పు జరగతా ఉండాది. పెండ్లాం బిడ్లితో అందురి  మాదిరిగా ఉండ సాగినాడు.

అతని మాట తీరు మారింది. కోపమంటే ఏమిటో కూడా తెలీని వాని మాదిరిగా మంచం మింది నుంచి లేసినాక మసులుకుంటా ఉండడం పుష్పకు సెప్ప లేనంత సంబరంగా ఉండాది.

కలిసి మెలిసి పనులు సేసుకుంటా సంసారాన్ని పెద్దది సేసుకోవాల అని పుష్ప సేసిన ఉపదేశం గుర్తొచ్చి ఒగ దినం  ' నీకుండేంత తెలివి తేటలు నాకు లేదు గాని సెప్పు ఏం సేస్తాం' అని మొగుడడిగినాడు.  మొగుని ముందు సిగ్గు పడ్డం పుష్ప వంతయింది.

కాళ్లూ సేతులు ఆడతా ఉండంగానే కొత్తిల్లు కట్టు కోవాలని పుష్ప ఆశ. అది బయట పెట్టిందో లేదో మేస్త్రీలను మాట్లాడి కొత్తింటికి కడగాలేసే పనిలోపడినాడు మున్సామి.

ఎండా కాల మొచ్చింది. ఇస్కూళ్లకు సెలవులిచ్చినారు. సెరుగ్గానిగాడే పని గూడా అయిపోయింది. యాందమూరి తిరనాళ్లకు సాటింపు ఏసినారు. దినం మార్సి దినం నాలుగు దినాలు జరగతాదది.

తేరునాడు కొత్త కోక కట్టుకోని , తల్లో మల్లి పూలు పెట్టుకోని సీరూ సింగారంగా తిర్నాలకు బయలు దేరింది పుష్ప. ప్రయాణానికి ఎద్దుల బండి గట్న్యాడు మున్సామి.కాలీగా ఉందని పొన్నెక్క , ఎగవింటి కమ్మలక్కను కూడా బండ్లో రమ్మని పిల్సింది పుష్ప. పిలకాయిలతో కలిసి తిర్నాలుకు పోతా ఉన్ని మొగుడు పెండ్లాలను సూడ్డానికి నాలుక్కండ్లు సాల్లేదు ఆ ఊరి జనానికి.

                                  మహాసముద్రం దేవకి
                                       16 - 4 - 2020

Comments