ఆచార కాండ

  కథ:



   ఆచార కాండ

    ' కళ్యాణ మంటపంలో ఖర్చే 18 లక్షలంటా . పది  లక్షలు అడ్వాన్సు కూడా కట్టేసినాడు.'

       'నగలకు రెండు కొట్లంటా వొదినా'

        ' ఏం రెండు కోట్లు,  వడ్డానం, పూల జడతో గుడా వొజ్రాలే . ఏడెనిమిది కోట్లు అంటుంటే '

        'నవరత్నాల సెట్టంటా, పచ్చలు, కెంపులు , ముత్యాలు , పుష్యరాగాలు  ఇంగా ఏమేమో పేర్లు గుర్తుండి సస్తే గదా! అన్నీ సెట్లు సెట్లుగా మద్రాస్ కు బొయ్యి తెచ్చుకున్నారంటా. '

        'అవేనా ? వెండి సామాన్లు , పట్టు చీరలు , పెట్టుడు బట్టలు , మేకప్ కిట్టులు ఐద్దినాలు ఆడే సరిపొయ్యిందంటా. '

         'జుట్టున్నాయమ్మ ఎన్ని తీరుల కొప్పులైనా పెడ్తుంది. కోట్లు మూలగతా ఉంటే దర్జాలకు తక్కువా? '

        ' ఏమాట కామాటే చెప్పు కోవాల అంతుందన్న గర్వం మాత్రం ఏ కోశానా  కనిపించదు'

        'దాన ధర్మాలు చెయ్యడంలో కూడా ఆయన్న ముందుటాడులే '

         ' టైలర్లిద్దురూ, జాకిట్లకి డిజైన్ కుట్టే వాళ్లు ఏడెనిమిది మంది దాకా ఇంట్లోనే పద్దినాలుగా కుడతా ఉండారంటా'

         ' వచ్చినోళ్లకు దినాము మూడు పూట్లా వొండి వొడ్డించే వాళ్లు, ఇంట్లో పని చేసే వాళ్లు, పందిళ్లేసే వాళ్లు ఏమని పెండ్లను కున్న్యారో ఊర్లో సాయం జేసే అయ్యలు అమ్మలక్కలతో కూడా ఒక దినానికి నూరు నూట యాభై ఇస్తళ్లు ఎంగిలవుతాయంటా'

        ' అందర్నీ ఆదరిస్తాడు. అందుకే అడగ కున్నా అన్ని పనులు ఐపోతాయి. పిలవక పోయినా ఒచ్చి పనందు కుంటారు '

       ' కష్ట పడినాడు. సంపాదించినాడు. ఇప్పుడు మంచి నీళ్లు మాదిరిగా సెలవు పెడతా ఉండాడు'

        ఎవురి నోట్లో  చూసినా ఇలాంటి మాటలే .

        రేపు పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. అవధులు లేని ఆనందం ఆ ఇంటి నట్టింట నాట్యమాడు తోంది.
       
        పెళ్లి కొచ్చిన బంధు మిత్రులకు బాక్సుల్లో పార్సెల్ చేసి ఇవ్వడానికి అయిదు రకాల స్వీట్లు సిద్ధం చేశారు. పాత చావిటింట్లో  కూర్చోని ఊర్లోని అమ్మలక్కలు ఓ ఆరు మంది కబుర్లు చెప్పుకుంటూ ఆ పని కానిస్తున్నారు.

         పెళ్లి కూతురు సుస్మిత , ఆమె పెద్దమ్మ కోడలు అంటే సుస్మితకు వదిన వరసైన నీలాంబరి, ఇంకో పెద్దమ్మ కూతురు ఐశ్వర్య , నాన్నకు చిన్న తమ్ముడి కూతురైన సుస్మితకు అక్క  సురేఖ , సుస్మిత స్నేహితురాళ్లు అంతా బెడ్ రూంలో చేరారు.

        వాళ్ల సలహాతో పెళ్లికి కట్టు కొనే పట్టు చీరలు, బ్లవుజులు, కల్యాణ మంటపంలో స్నానం చేశాక ఆ రాత్రి వేసుకొనే నైట్ డ్రస్సులతో సహా  అన్ని మంచం పైన వేసింది నీలాంబరి. 

       మర్నాడు పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు, నలుగుకు, ఆ తర్వాత కట్టు కొనే చీరలకు సరి పోయే నగల సెట్లు పక్కకు తీసి ఒక అరలో సర్ది పెట్టింది సురేఖ.

        కల్యాణ మంటపానికి తీసుకు పోయే పెద్ద సూట్కేసును మంచం పైన పెట్టారు. రాత్రి వక్కాకు శాస్త్రం మొదలు పెళ్లయ్యాక కాణిపాకం, ఆ తర్వాత తిరుమలకు వెళ్లి వచ్చే దాకా కావలసిన బట్టలు, నగలు , మేకప్ కిట్ దాకా అందరూ కలిసి సూట్ కేస్ లో సర్ది జాగ్రత్తగా తాళం వేసి ఆ తాళాలను అందరికంటే పెద్దదయిన నీలాంబరికి అప్ప జెప్పారు.

        భోజనాలకు పిలుపు వచ్చింది. వెళ్దామని లేస్తుండగా సుస్మిత ఫోన్ రింగయింది. అవతల ఫోన్లో అవినాష్ . ఇంక అయినట్లే అనుకుంటూ అందరూ గది బయట లాంజ్లో ఉన్న సోఫాల్లో కొలువు తీరారు.

         పది నిముషాలకు గాని సుస్మిత గది వదిలి రాలేదు .

        అందరూ కబుర్లు చెప్పుకొంటూ భోజనాలు కానిచ్చారు .

                    *****************

        రవి , విజయల ముద్దుల కూతురు సుస్మిత . తర్వాత  పుట్టిన వాడు సురేష్. వాళ్లది ఒకప్పుడు మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. సుస్మిత పుట్టిన తర్వాత రవి ఏ పని చేసినా పట్టిందల్లా బంగారమవుతూ వచ్చింది. రోడ్డుకు ఫర్లాంగ్ దూరంలో ఉంటుంది వాళ్ల ఊరు . బెంగులూరు చెన్నై హైవేలో. 

        రవి వాళ్లకు వరి, చెరకు పండే పొలాలు,  ఊరి కానుకొని ఉన్నాయి.  శెనిక్కాయిలు పండే చేన్లు మాత్రం రోడ్డు కానుకొని ఉన్నాయి. మెట్ట చేన్లే అయినా అవే బంగారం గుడ్లు పెట్టే బాతులని నిర్ణయించు కున్నాడు రవి.

        బాతులు గుర్తుకు రాగానే కోళ్ల ఫారం పెట్టాలన్న ఆలోచన వచ్చింది రవికి. చేన్లో బోరు వేస్తే నీళ్లు బాగా పడ్డాయి. అదొక శుభ శకునంగా భావించాడు.

        మొదట రెండు వేల కోళ్లతో మొదలైన వ్యాపారం రెండు మూడేండ్ల లోనే లక్షకు పైగా విస్తరించింది. మంచి లాభాలతో కోట్లకు పడగెత్తాడు.

        సుస్మిత బీ. టెక్ పూర్తయినాక అమెరికా వెళ్లి ఎం .టెక్ పూర్తి చేసింది. అక్కడే యాపిల్ కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది.

         తనకు పెండ్లి చెయ్యాలని చూస్తున్నారన్న విషయాన్ని ముందు తల్లి ద్వారా వినింది సుస్మిత. ఏమాత్రం భయ పడకుండా తాను తన క్లాస్ మేట్ అవినాష్ ను ప్రేమించానని . అతను తెలుగు వాడేనని ,కడప జిల్లా లోని రాయచోటి  అతని సొంత ఊరని చెప్పింది. అతని ఫోటోలు మిగిలిన వివరాలు తండ్రి వాట్సాప్ లో పెట్టింది.

        అందగాడు, ఉన్న వాడు, చదువులో , ఉద్యోగంలో అన్నిట్లో తన కూతురికి సరి తూగే వాడని తెలిశాక అభ్యంతరం చెప్ప లేదు రవి .

        కార్తిక మాసంలో మంచి మూహూర్తా లున్నాయని పంతులు గారు చెప్పడంతో ఇరు వైపుల పెద్దలూ కలిసి ముహూర్తం నిర్ణయించారు.  వాళ్లిద్దరిని సెలవు పెట్టి రమ్మన్నారు . ఒకే ఫ్లైట్లో వచ్చిన కాబోయే వధూవరులను చెన్నై లో రిసీవ్ చేసుకున్న ఇరు కుంటుంబాల వాళ్లు అక్కడే నాలుగు రోజులుండి షాపింగ్ కూడా ముగించు కొని ఎవరి ఊర్లకు వాళ్లు వెళ్ళి పోయారు.

        పెళ్లి రోజు రానే వచ్చింది. రేపే ముహూర్తం. ఈ రోజు సుస్మితను పెళ్లి కూతుర్ని చేస్తారు. ఉదయమే అందరూ లేచారు. రాత్రి చాలా సేపు మేల్కోవడం వల్ల ఎన్ని సార్లు లేపినా లేవడం లేదు కొంత మంది పిల్లలు. బాత్ రూంలు ఖాళీగా కనిపిస్తే చాలు నిద్ర పోతున్న వాళ్లను బలవంతంగా దుప్పట్లు లాగి స్నానాలకు సిద్ధం చేస్తున్నారు తల్లులు.

        వంట వాళ్లు ఓ ఐదు వందల మందికి సరి పడా కేసరి, పొంగలి, ఇడ్లీ, చట్నీ, సాంబారు, ఉద్ది వడలు చేశారు. ఒక వైపు మధ్యానం వంటకు కొంత మంది కూచొని కబుర్లు చెప్పుకుంటూ కూరగాయలు తరుగుతున్నారు. సాంబారుకు, రసానికి పెద్ద పెద్ద డేక్సాలలో కంది పప్పు కుత కుత ఉడుకుతోంది . గ్రైండర్లో పోలీల కొసం ఇద్దరు వ్యక్తులు పూర్ణం సిద్ధం చేస్తున్నారు. వాకిట్లో పెళ్లి కూతుర్ని చెయ్యడం కోసం పచ్చని టెంకాయాకుల కీతులతో వేసిన పందిరిని పూలతో అలంకరిస్తున్నారు కొందరు.

        చాలా మంది ఫోన్లు ఒక్కసారిగా రింగ్ కావడం మొదలయింది. మాట్లాడిన వాళ్ల మోహాలు ఆందోళనతో భయంకరంగా మారిపోతున్నాయి. ఫోన్లో మాట్లాడిన వాళ్లు పక్కనున్న  వాళ్లకు వార్తనందించి ఇలాంటి సమయంలో ఇలా జరిగిందేమిటి అని కళ్ల నీళ్లు కమ్ముకొస్తుంటే ఆశ్చర్య పోతున్నారు. బైకుల్లో ఒకేసారి ఐదారు మంది వచ్చి ఇంటి ముందు దిగారు. అందరూ వాళ్లను చుట్టు ముట్టారు.

        రవి చిన్నాన్న కొడుకు  అప్పటికే విషయం తెలిసి నట్టింట్లో కూలబడి బిత్తర చూపులు చూస్తున్న రవి భార్య విజయను  రెక్క బట్టి లేపాడు. కార్లో కూర్చోబెట్టాడు. గబ గబా మరో నలుగురు అదే కార్లో ఇరుక్కొని  కూచున్నారు. మీరూ వచ్చేయండి అని సుస్మితా వాళ్లనుద్దేశించి అన్నాడు. వాయు వేగంతో కారు చిత్తూరు వైపు దూసుకు పోతోంది.

        సుస్మిత , ఆమెతో పాటు ఉన్న వాళ్లు కూడా కార్లలో బయలుదేరి పోయారు.

       నిముషాల్లో వార్త చుట్టు పక్కల ఊర్లంతా పాకి పోయింది. సానుభూతి మాటల్లో అట్టహాసంగా చేసిన పెళ్లి ఏర్పాట్లు కూడా బాధగా అందరి నోళ్లలో నానుతున్నాయి.

        ఉదయం పందిరిని అలంకరిస్తున్న వాళ్లు చూట్టూ వెదురు కూసాలకు కట్టడానికి కావలసిన అరటి చెట్ల గురించి రవికి గుర్తు చేశారు. నేనెలాగు అటు వైపు వెళ్తున్నాను . ఎవరితోనైనా  పంపిస్తానని బైకు మీద బయలు దేరాడు రవి.

        కట్ట మీది నుంచి వెళ్తే రెండు ఫర్లాంగుల దూరమవుతుంది.  అది చుట్టు దారి. అందుకని  కట్ట మీది నుంచి కాకుండా అడ్డ దారిలో చెర్లో నుంచి వచ్చి రోడ్డెక్కాడు. అంతే క్షణాల్లో ఎడమ వైపు నుంచి వస్తున్న లారీ బైకును గుద్దడం రవి ఎగిరి పోయి చెర్లో పడ్డం జరిగి పోయింది. లారీ వాడు ఆపకుండా స్పీడుగా వెళ్లి పోయాడు.

        పక్కపల్లె నుంచి చెరువు కట్ట మింద కూరగాయల గంపలతో నడిచి వస్తున్న  ఇద్దరు ఆడవాళ్లు చూసి భయంతో కేకలు వేశారు. క్షణాల్లో  జనం చుట్టు ముట్టారు.

        రవి చెర్లో ఉన్న రాయి మీద పడడంతో తలకు పెద్ద గాయమైంది.

         రోడ్లో వస్తున్న కారును ఆపి రవిని ఎత్తి సీట్లో పడుకో బెట్టారు. ముందుగా ప్రయివెట్ డాక్టర్ దొరస్వామి రాజు దగ్గరికి తీసుకెళ్లారు. అతను రక్తం ఎక్కువ పోవడం చూసి ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని , వాళ్ల అనుమతి లేకుండా యాక్సిడెంట్ కేసు టేకప్ చెయ్యరాదని చెప్పి ధర్మాసుపత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చాడు.

        సీరియస్ గా ఉండడంతో వాళ్లూ అడ్మిట్ చేసుకోలేదు. ఫస్టైడ్ చేసి అంబులెన్స్ ఇచ్చి వేలూరుకు తీసుకు పొమ్మన్నారు.

      రాయ వేలూరు  సి. ఎం.సి  హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసుకున్నాక అందరూ ఇక భయం లేదనుకున్నారు. చుట్టు పక్కల ఊర్లలో వాళ్లు కూడా తెలిసిన వాళ్లు తెలిసినట్లే  రవిని చూడటానికి వేలూరు వెళ్లి చూసి వస్తున్నారు. ఎవరినడిగినా ఇంకా స్పృహలోకి  రాలేదంటున్నారు.

        సాయంకాలం నాలుగవుతుండగా రవి ఈ లోకం వదిలి వెళ్లి పోయాడన్న వార్త చుట్టు పక్కల ఊర్లలోనూ గుప్పు మంది.

        విజయ హాస్పెటల్లోనే స్పృహతప్పి పడి పొయింది. కూతురు సుస్మిత కూడా చలనం లేకుండా నేల కంటక పోయింది.  ఆ విషయాలతో పాటు అట్టహాసంగా ఏర్పాటు చేసిన పెళ్లి విశేషాలనూ చెప్పు కొని  జనం కన్నీరు పెట్టుకొంటున్నారు.

        పెళ్లి కొడుకు వాళ్లకు యాక్సిడెంట్ అయిందని  తెలిసిన వెంటనే ఆ రోజు పెళ్లి కొడుకును తీసుకొని రావలసిన వాళ్లు ఉన్న పళంగా ఆగ మేఘాల మీద వచ్చి మధ్యానానికంతా హాస్పెటల్లో వాలి పోయారు.

        రేపు ఉదయానికి గానీ శవం ఇంటికి రాదని తెలిసింది.  స్పృహ లేకుండా పడి ఉన్న విజయను డాక్టర్ కు చూపించి తేరుకున్నాక బలవంతంగా కారులో ఇంటికి చేర్చారు . ఆ రాత్రంతా ఇంట్లో ఉన్న వాళ్లకే కాదు,  ఊర్లో వాళ్లకు కూడా ఎవరికీ కంటి మీద కునుకు లేదు.

        తెల్లవారకుండానే చుట్టుపక్కల ఊర్లలో ఉన్న వాళ్లు ఇంకా పెళ్లిల్లు చేరని బంధువులు రావడం మొదలయింది. ఒక్కొక్కరు వచ్చినప్పుడంత ఏడుపులు మిన్ను ముట్టి ఇల్లంతా ఆలగోడు బాలగోడుగా ఉంది.

        పరామర్శకు వచ్చిన వాళ్లు పెద్ద ఏడుపు అయిపోయాక ఎక్కడో ఒకచోట సర్దుకు కూర్చొని మాటల్లో మునిగి తేలుతున్నారు. మళ్లీ ఎవరో ఒకరు వచ్చి  విజయను , సుస్మితను, సురేష్ ను  పట్టుకొని ఏడుస్తున్నారు. వాళ్లతో పాటు  ఇంకొంతమంది కూడా గొంతు పెంచి ఏడుస్తున్నారు. ఆ తర్వాత కొంత సేపటికి నిశ్శబ్దం ఆవరించినా  చని పోయిన రవి గురించి ఎవరో ఒకరు ఏదో ఒకటి గుర్తు చెయ్యడం , దాంతో ఉండుండీ ఏడుపులు తూడుపులతో గగ్గోలు కావడం, అంతా ఒక ప్రహసనంలా సాగుతోంది.

        అవినాష్  తల్లిదండ్రులు ఏడుస్తున్న విజయను, సుస్మితను ఉండుండి ఓదారుస్తూనే ఉన్నారు. కొంత సేపటికి బయటి నుంచి వచ్చి అవినాష్ మెల్లగా సుస్మిత పక్క చేరాడు. అక్కడే అక్క పక్కన కూర్చొని ఏడుస్తున్న సురేష్ ను ముందు అక్కున చేర్చుకున్నాడు.

        సుస్మిత కుమిలి కుమిలి ఏడుస్తోంది . ఓదార్పుగా  అవినాష్ ఆమె తలను తన ఒళ్లో పెట్టుకొన్నాడు. అది చూసి కొంత మంది గొల్లుమన్నారు. మరి రేపు ఉదయానికి భార్యా భర్తలు కావలిసిన వాళ్లు.

        సుస్మితను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు అవినాష్ కు. తలపై నిమురుతూ మౌనంగా ఉండిపోయాడు .

        ' పెళ్లి ఈ పొద్దు కాకుంటే రేపు అవుతుంది. పోయిన ప్రాణం తిరిగి రాదు కదా! ఇంకొన్నాళ్లకు పెండ్లి చేసుకున్నా ఏం సంతోష ముంటాది వీళ్లకు.  జీవితాంతం ఈ పొద్దు జరిగింది గుర్తొచ్చి ఆ బిడ్ని సంతోసంగా ఉండ నిస్తాదా? ఆ పెళ్లి. ' సానుభూతిని వ్యక్తం చేస్తూనే  వాస్తవాన్ని గుర్తు చేసింది మంగమ్మ . ఆమె రవి తమ్ముడు రాజుకు పిల్ల నిచ్చిన అత్తగారు.

        అంతే ఆ మాటలకు గట్టిగా ఏడుస్తూ అవినాష్ ఒడిలోనుంచి లేచి కూర్చొని బిత్తర చూపులు  చూడ సాగింది సుస్మిత. అందరి కళ్లూ వాళ్లిద్దరి మీదే ఉన్నాయి.

      ఆడంబరంగా చేస్తున్న పెళ్లి ఏర్పాట్లను చూసి కళ్లల్లో కారం పోసుకున్న వాళ్లే ఎక్కువ. వాళ్లలో మంగమ్మదే మొదటి స్థానం . అప్పుడు కడుపులో పండ్లు పెట్టుకొని  పెదవులపై తేనె పులుముకొని బాగానే మాట్లాడింది. ఇప్పుడు పైకి సానుభూతిని వ్యక్తం చేస్తూ వాళ్ల పెళ్లిని చెడగొట్టే ప్రయత్నాన్ని ముమ్మరంగా సాగిస్తోంది.

     అవినాష్  సుస్మితను ఆదరిస్తున్న తీరు చూసి ఓర్వలేకపోయింది మంగమ్మ.  పక్కనున్న వాళ్లతో గుస గుస లాడ సాగింది.

        ' గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. కాబోయే అల్లుడైనా సరే. శుభం జరగాలి గాని అశుభం జరగడం మంచిది కాదు. మళ్లీ  ఈ సంబంధాన్ని ఏం మంచి జరిగిందని చేసుకుంటారూ ? అని దీర్ఘం తీసింది.

        ' నిజమే నువ్వు చెప్పింది. లోకం గొడ్డు పోయిందా? అచ్చొచ్చే సంబంధం చూసి చేసుకుంటే సరి పోతుంది. ' అని తనేదో మంచి పరిష్కారాన్ని సూచించినట్లు అక్కడున్న వాళ్ల మొహాలను ఏమంటా రన్నట్లు చూసింది ఇంకొకామె.

        మూడ నమ్మకాలకు పెద్ద పీట వేసే అమాయక పల్లె వాసులు కొందరు ఆ మాటలు విని అదీ నిజమే అనుకున్నారు.

        ఒకరిద్దరికి మంగమ్మ మాటలు విడ్డూర మనిపించాయి. బాధలో వాళ్లుంటే ఇప్పుడా ప్రసక్తి తేవడం అవసరమా అని చీదరించుకున్నారు.

        వాళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకొంటుంటే వీళ్లేంటి ఇలా మాట్లడుతున్నారు అనుకున్నారు కొందరు.

        ' దేనికయినా సమయం సందర్భం ఉండదా? ఎప్పుడూ అంతే . ఈ మంగమ్మ నోటికి అడ్డూ ఆపూ ఉండదు' అని పక్కన కూర్చున్న వాళ్లతో గుస గుసలాడింది పక్కింటి సుందరమ్మ.

         తేలుకు పెత్తన మిస్తే రెయ్యంతా కుట్టిందని మంగమ్మ మళ్లీ విజృంబించింది. 'వాళ్లను ఇంక బయలు దేర మనడం మంచిది. కట్టుకున్న మొగుడు మాదిరిగా ఆ బిడ్డిని ఒళ్లో పడుకో బెట్టుకున్నాడే. చూసే వాళ్లు ఏమనుకుంటారనే ఇంగితమన్నా ఉండొద్దా ' అంది ముక్కు మీద వేలేసు కొని.

        అక్కడే ఉన్న కూతురు ' నువ్వు నోరు  మూసుకుంటావామ్మా' అని కసిరింది.

        వెంటనే' అమ్మ సెప్పిన దాంట్లో తప్పేముండాది లేమ్మా' అనింది వాళ్ల ఇంట్లో బట్ట లుతికే రాజమ్మ.

        వాళ్లు  ఎంత మెల్లగా మాట్లాడుకున్నా  నిశ్శబ్దం రాజ్య మేలు తుండడతో అందరి చెవుళ్లోనూ పడ్డాయి.  సుస్మిత ఉన్నట్టుండి లేచి కూచొని గట్టి గానే ఏడ్వడం మొదలు పెట్టింది. విజ్ఞత తెలిసిన అవినాష్ మాత్రం వాళ్ల మాటల్ని ఏమాత్రం పట్టించుకోలేదు . సుస్మిత భుజాల్ని నొక్కి పెట్టి వాళ్ల మాటల్ని పట్టించుకోకు సుస్మితా ' అన్నట్లు ఓదార్చాడు.
 
        ఆ రాత్రంతా అందరితో పాటి మగ పెళ్లి వారు ఎవరూ కూడా వాళ్ల కోసం ఏర్పాటు చేసిన గదులకు వెళ్ల మన్నా వెళ్ల లేదు. కంటి మీద రెప్పా వెయ్య లేదు.

        మర్నాడు పోస్ట్ మార్టం అయి రవి బాడీ ఇంటికొచ్చే సరికి మధ్యాన్నం రెండు దాటింది. ఏడ్పులతో ఊరూ నాడంతా దద్దరిల్లి పోయింది.

        అంత్య క్రియల ఏర్పాటులన్నీ సిద్ధంగా ఉన్నాయి . ఇక ఆలస్యం చేసే కొద్దీ వాళ్లను అనవరించడం కత్తి మీద సాము అనుకున్నారు. ఊరి పెద్ద అయిన అన్నాసామి అదేశంతో వెంటనే దహన  సంస్కారాలు పూర్తి చేశారు. దగ్గర ఊర్లలో ఉన్న వాళ్లందరూ ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లి పోయారు. మిగిలిన వాళ్లు స్నానాలు ముగించారుఈ రోజు  .

        ముందు రోజు చేసిన వంటలన్నిటిని  ఊరి మొగదలలో ఉన్న దిబ్బలో పెద్ద గొయ్యి తవ్వి  అందులో వేసి మట్టితో కప్పేశారు  పని వాళ్లు .

        ఊర్లో ఉన్న దగ్గరి బంధువులు  తాము చేసిన  వంటకాలను తెచ్చి వంటిట్లో పెట్టారు. రెండు వందల మందికి సరిపడా వంటకాలు ఇల్లు చేరాయి. పిల్లా పీచుకు వడ్డించి ఆ తర్వాత ఒకరినొకరు బలవంతం చేసుకుంటూ ఎంగిలి పడి లేచారు.

        బలవంతం చేస్తే విజయ మజ్జిగ ఒక గ్లాసు తాగి ముడుచుకొని పడుకొంది . మగ పెళ్లి వాళ్లు భోజనాలు అయిందనిపించి వచ్చిన వాహనాల్లో బయలు దేరారు. దూరా బారం నుంచి వచ్చి రైళ్లలో , బస్సుల్లో  వెళ్లే వాళ్లను కార్లలో తీసు కెళ్లి స్టేషన్లో దింపి వచ్చారు . కానీ పెళ్లి కొడుకుతో పాటు వాళ్ల అమ్మా నాన్న , మేనమామ  మాత్రం ఉండి పోయారు .

        సుస్మితకు కాబోయే అత్త గారు బలవంతంగా రెండు ముద్దలు తినిపించింది. దగ్గరి వాళ్ల కంటే చొరవగా వాళ్లు మసలడం చూస్తున్న వాళ్లకు ఆత్మీయంగా అనిపించింది.

       ఆ మర్నాడు రవి ప్రాణం పోయి మూడవ రోజని కొంత మంది వెళ్లి దొంగ పాలు పెట్టి వచ్చారు. తర్వాత ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లి పోయారు.

        అవినాష్ కు  దిగులుతో ఉన్న సుస్మితను వదిలి పెట్టి వెళ్లాలంటే  చాలా బాధనిపించింది. అయినా వెళ్లక తప్పదు కదా! ఇప్పటికే ఓర్వ లేని వాళ్లు అదే పనిగా పని కట్టుకొని అవినాష్ వాళ్ల చెవుల్లో పడేట్టు ఎదో ఒకటి అంటూనే ఉన్నారు. కానీ వాళ్లు  సహృదయులు కాబట్టి ఆ మాటల్ని ఏమాత్రం పట్టించుకోలేదు.

        ఆ మాటల కంటే భర్తకు దూరమైన విజయ, తండ్రికి దూరమై వేదన పడుతున్న సుస్మిత ముఖ్యం అనుకున్నారు. బాధ పడకుండా ఉంటామని విజయ, సుస్మితల చేత చెప్పించుకొని
బయలు దేరి వెళ్లారు వాళ్లు .

        అవినాష్ వాళ్లు వెళ్లి పోయాక సర్వం శూన్య మనిపించింది సుస్మితకు.

        పదకొండవ రోజు దిన కార్యాలు. పెళ్లికి తెచ్చిన సరుకులతో ఆడంబరంగా జరిగి పోయింది.ఎక్కడి వాళ్లక్కడ వెళ్లి పోయారు . సుస్మిత , అవినాష్ లు  మరో వారం రోజులు లీవ్ ఎక్స్టెండ్ చేసుకున్నారు. 

        రోజు ఫోన్లలో అక్కడి నుంచి ఇక్కడికి ఓదార్పులతో కూడిన పరామర్శలు సాగుతూనే ఉన్నాయి. రవి లేని లోటు జీవితాంతం ఉంటుంది. కానీ క్రమంగా బాధ తగ్గు ముఖం పట్టింది.

        విజయ, సుస్మితలు మౌనంగా ఉన్నా దగ్గరి బంధువులు, సన్నిహితులు ఎవరి అభి ప్రాయాలను వాళ్లు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

        సంవత్సరం లోపు పెళ్లి జరపాలన్నది మెజారిటీ అభిప్రాయం. అచ్చి రాని ఆ సంబంధాన్ని తెగదెంపులు చేసుకోవడమే మంచిదని కొందరు.మూణ్ణెళ్లు దాటాక పెళ్లి జరిపించిన వాళ్లను ఉదాహరించిన వ్యక్తిని ఒకరిద్దరు బలపరచిన వాళ్లూ ఉన్నారు. తల్లీ కూతుళ్లు మాత్రం నోరు తెరవ లేదు.

       సుస్మిత తమ్ముడు సురేష్ చిన్న వాడు . స్కూలుకు వెళ్లి రావడం తప్ప ఇంటి విషయాల్లో అవగాహన లేదు.

        సుస్మితకు ధైర్యం చెప్తూ అన్నిట్లోను ఆత్మీయంగా మసలుతూ ఉన్నది తన పెద్దమ్మ కోడలు నీలాంబరి. తాను సహకరించడమే కాక భర్తను కూడా సుస్మిత వాళ్లకు అనుకూలంగా మార్చింది నీలాంబరి.

        అవినాష్ కుటుంబ సభ్యులు కూడబలుక్కొని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆచారాలన్నీ మనం ఏర్పాటు చేసుకున్నవే కాబట్టి ఎవరి వీలును బట్టి వాళ్లు వాటిని సడలిస్తే తప్పు లేదని వాళ్ల భావన. రిజిస్టర్ పెళ్లి చేసుకొని వెళ్లడం సబబుగా ఉంటుందని అవినాష్ అభిప్రాయం. సుస్మితకు కూడా తోడుగా ఉన్నట్లుంటుందని అదే మంచిదను కున్నారు అత్తింటి వాళ్లు. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ అవినాష్ సిద్ధం చే

Comments