చేతిలో బెల్లం ఉన్నంత వరకే

        కథ


చేతిలొ బెల్లం ఉన్నంత వరకే ...

         కలిమి, లేమి కష్టం , సుఖం కావడి కుండల్లాంటి వంటారు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవడాన్ని ఎన్నో చూశాడు జయరాం.

        అంతెందుకు తన విషయాన్నే తీసుకుంటే సిరిసంపదల్లో మునిగి తేలేంత కుబేరులు కాకపోయినా అవసరాలకు తడుముకోవలసిన పరిస్థితి లేని ఇంట్లో పుట్టి పెరిగాడు తను .

        ఉన్నంతలో అందరికీ అంతో ఇంతో సాయం చేశాడు. ఆడ పిల్లల పెళ్లిళ్లు చెయ్య లేక ఇబ్బంది పడుతున్న  ఇద్దరి దగ్గరి బంధువుల పిల్లలకు   పెళ్లిళ్లు కూడా జరిపించాడు.

        పండగల్లో, పబ్బాల్లో , సెలవుల్లో ఒకింటి మనుషుల్లా తమ పిల్లలతో పాటు కలిసి పెరిగిన పిల్లలే వాళ్లు. అందుకే ఎక్కడా తేడా చూపెట్ట లేదు.

         తన సాయం పొందిన వాళ్లు గుర్తుంచు కోవాలని ఏనాడూ ఆశించ లేదు జయరాం.

        కానీ ఇప్పుడు తనకు కష్టం ఎదురైనప్పుడు తన మన అని ఎవరూ అనుకోక పోవడమే కాస్త మనసును కలుక్కని పించింది.

        ఇన్నాళ్లూ తన వాళ్లకు చేదోడు వాదోడుగా నిలిచిన జయరాం భార్య పార్వతి మాత్రం ఓ మూల తన వాళ్ల ప్రవర్తనకు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు గిల గిల లాడి పోయింది.

        ఓ రోజు ఉండ బట్ట లేక బయటకు కక్కేసింది పార్వతి. ' ఇన్నాళ్లు అందరం ఒకటే అనుకున్నాము. ఇప్పుడు మేము ఎవరికీ పనికి రాకుండా అయినాము ' అని నిష్ఠూర మాడింది.

        దానికి వాళ్లు చెప్పిన సమాధానం, కృతజ్ఞతా భావం నుంచి బయట పడటానికి ఎన్నుకున్న పరిష్కారం నీచాతి నీచమైంది. జయరాం పైనే మచ్చ పడే మాటలు మాట్లాడి అతనిదే తప్పన్నట్లు పార్వతిని నోరెత్త కుండా చేశారు వాళ్లు.

       తన భర్త ఎలాంటి వాడో, ఎంత మంచివాడుగా గుర్తింపు ఉందో, అతని వ్యక్తిత్వం ఎంత ఉన్నత మైందో పార్వతికి తెలియంది కాదు. అంతెందుకు అందులో ఏ కొంచం నిజం ఉన్నా ఈ పాటికే రచ్చ చేసి వదిలి పెట్టే వాళ్లు . ఈ విషయం లో పార్వతికి ఎలాంటి అనుమానం లేదు .

        ఎంత నమ్మకమున్నా ఎదుటి వాళ్ల మాటల తూటాలు మనసు పైన ప్రభావం  చూపకుండా ఉంటాయా ?

        భర్తను అడిగి నిజం నిగ్గు తేల్చుకుందామని ఉంది పార్వతికి. కానీ దాని వల్ల ఉన్న బంధాలు శాశ్వతంగా మూసుకు పోయే ప్రమాదం ఉందని మౌనంగా ఉండి పోయింది.

        ఏరు దాటినాక తెప్ప తగలేసే రకాలు ఎంత నీచానికైనా దిగ జారుతారని పార్వతికి అర్థమైంది.  కానీ ఏ పుట్టలో ఏ పాముందో అనే అనుమాన బీజాలు కూడా మనసులో ఒక మూల మొలకెత్తి మారాకు వేసి మొగ్గ తొడగడం మొదలైంది. ఆ చిన్న అనుమానం పార్వతిని అశాంతికి గురి చేసి పీల్చి పిప్పి చేసి వదిలింది .

        ఏ పాపం తెలియని జయరాం మాత్రం ఎప్పటి లాగే అందరితోను కల్మషం లేకుండా మసలు కొంటున్నాడు. అతడు తనకు ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నుంచి  బయట పడే ప్రయత్నంలో తలమునకలుగా ఉన్నాడు.

        ఉత్త పుణ్యానికి పోయి మక్కెరల కొద్దీ పాపం నింపుకోనొచ్చి నెత్తినేసుకున్నారు. ఉసూరుమంటూ పడి ఉన్న ఆ దంపతులను ఆదుకోనే నాధుడే కరువైనాడు.

        తన సాయంతో పైకి వచ్చిన వాళ్లు ఇప్పుడు  డాలర్లు మూట గట్టుకొని దర్జా ఒలక బోస్తున్నారు. 

        కొడుకు విశ్వం ను విదేశాలకు పంపించి చదివించే స్థాయిలో ఉండీ అందరి బాగు కోసం కొడుకు చదువును నిర్లక్ష్యం చేశాడు.  కానీ వాళ్లు మాత్రం ఎక్కడా తగ్గ లేదు. తమ పిల్లల్ని ఫారిన్ కూడా పంపించి చదివించుకున్నారు.

         ఇండియాలో ఇంజినీరింగ్ అయిందని పించిన జయరాం కొడుకు విశ్వం బతుకు ఎదుగూ బొదుగూ లేనిదై పోయింది.

        ఒకప్పటి వాడి కజిన్స్ వాడిని హీరో లాగా చూసిన వాళ్లు. వాని వెంట బడి ఉదారంగా వాడు విదిల్చిన ఎంగిలి మెతుకుల్ని ఏరుకు తినిన వాళ్లు.  వాళ్లిప్పుడు మంచి ఉద్యోగాల్లో స్థిర పడ్డారు.

       ఇప్పుడు వాళ్ల దృష్టిలో విశ్వం  ఒక చేత కాని దద్దమ్మ. పనికి మాలిన వెధవ .

        అలా అని విశ్వం తాడూ బొంగరం లేని వాడులాగా తిరగడం లేదు కానీ వాడి చదువుకు తగిన ఉద్యోగం రాక చిన్న జీతానికి పని చేసుకుంటున్నాడు. తన ఖర్చుల కోసం తండ్రి పైన ఆధార పడ్డం లేదు. అయినా అయిన వాళ్లు చులకనగా చూస్తున్నారు.

        తల్లి పార్వతి మాత్రం తమ్ముని పిల్లలతో , చెల్లెలి పిల్లలతో కొడుకుని పోల్చుకొని ఎదుగూ బొదుగూ లేదే అని దిగులులో మునకలేస్తూ ఉంది.

        ఎప్పుడో తన సాయంతో చదువుకొని
ఐ ఏ ఎస్ పాస్ అయి డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న నీరజ్ ఈ ఊరికి కలెక్టర్ గా వస్తున్నాడని పేపర్ లో చదివిన జయరాం పార్వతితో అన్నాడు.

        కానీ నీరజ్ కూడా అందరి లాంటి వాడే అనుకొని ఇద్దరూ మళ్లీ ఆ విషయం గురించి పట్టించుకోలేదు.

        ఉన్న పళంగా ఒక రోజు సాయంకాలం చెప్పీ పెట్టకుండా ఇంటికి వచ్చి ఇద్దరి కాళ్లకూ మొక్కి ఆశీర్వాదం కోసం అర్థిస్తున్న నీరజ్ ను  చూసి జయరాంకు కళ్లలో నీళ్లు తిరిగాయి .

        పిల్లల యోగ క్షేమాలు విచారించిన నీరజ్ విశ్వం గురించి వినగానే ఆలోచనలో పడిపోయాడు. తన ఈ స్థితికి కారకులైన  వారిని నిర్లక్ష్యం చేస్తే పుట్టుగతులుండవని అతని భావన .

          బలవంతంగా విశ్వంను  చేస్తున్న ఉద్యోగం మానేసి సివిల్స్కు ప్రిపేర్ అవమని చెప్పాడు నీరజ్. అందకు జయరాంను ఒప్పించాడు .

        అంతటితో తన బాధ్యత అయిపోయింది అనుకోలేదు నీరజ్. ఎంత బ్యుజీగా ఉన్నా తనకు వీలున్నప్పుడంతా విశ్వానికి గైడెన్స్ ఇవ్వడమే కాక కావలసిన మెటీరియల్ను కూడా సేకరించి ఇస్తూ చక్కగా ప్రిపేర్ అవమని ప్రోత్సహిస్తూ వచ్చాడు .

        వరల్డు హిస్టరీ, ఇంటర్నేషనల్ అఫేర్స్ , ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ . ఇండియన్ పాలిటీ ఫార్ సివిల్ సర్వీసస్ ,ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ , ఇండియన్ ఎకానమీ , ఆక్స్ఫర్డ్ స్కూల్ అట్లాస్ ఇలా తన దగ్గర ఉన్న వాటితో పాటు లేటెస్టుగా వచ్చిన పుస్తకాలను, మెటీరియల్ను కూడా తనే తెప్పించి ఇచ్చాడు.

        అహమ్మదాబాద్ లోని సివిల్స్ ఐ. ఏ . ఎస్ అకాడెమీ సర్వీసస్ ఇన్స్టిట్యూట్ కు తనే డబ్బులు కట్టి ఆరు నెలల పాటు కోచింగ్ కూడా ఇప్పించాడు.

        తమ వల్ల లబ్ధి పొందిన వాళ్లు చాలా మందే ఉన్నా నీరజ్ లాగా కృతజ్ఞతతో ఉన్న వాళ్లు ఒక్కరంటే ఒక్కరు కనిపించ లేదు జయరాం దంపతులకు .

        నీరజ్ అందించిన సాయం వృధా కాలేదు. విశ్వం అంచలంచలుగా ఎదిగాడు.  డెప్యూటీ కలెక్టర్ గా ఖమ్మం జిల్లాలో చార్జ్ తీసుకున్నాక తల్లి దండ్రులు రామంటున్నా వినకుండా పట్టు బట్టి వాళ్లను అక్కడికే పిలిపించుకున్నాడు.

        చదువుకున్న రోజుల్లో తన ఇంట్లో ఉండి నాలుగు మెతుకులు తిన్నందుకు పెద్ద కొడుకులా బాధ్యతలు స్వీకరించి తమ్ముని లాంటి విశ్వం ను అంత పెద్ద స్థాయికి చేర్చాడు నీరజ్.

        కలెక్టర్ గా ఉన్న నీరజ్  ఆ కుటుంబంతో సన్నిహితంగా మెలగడం చూసిన బంధువులు మళ్లీ ఒక్కొక్కరే ఇంటికి రాకపోకలు సాగించడం మొదలు పెట్టారు.

        'కలెక్టర్ అంటే మాటలా? ఏ సమయానికి ఏ అవసరమొస్తుందో!' అన్నది కొందరి ఆలోచనైతే , గొప్ప కోసం కొందరు .

        ఇప్పుడిక విశ్వం కూడా అదే స్థాయికి చేరుకోవడంతో బంధు వర్గం రాక పోకలు మునుపటి కంటే ఎక్కువయ్యాయి.

        అమెరికాలో ఉన్న విశ్వం కజిన్స్ కూడా అన్నా, బావా, మామా అంటూ వాట్సాప్ లో , ఫేస్ బుక్ లో టచ్ లో ఉండడమే కాక అడపా దడపా ఆన్లైన్లో వీడియో కాల్ చేసి ప్రేమగా పలకరిస్తున్నారిప్పుడు .

        ఒకప్పుడు అన్నా వదినలు కష్టాల్లో ఉన్నప్పుడు కన్నెత్తి చూడలేదు జయరాం చెల్లెలు అమృత. ఇప్పుడు కలెక్టర్ హోదా వచ్చిన విశ్వం ను వదులుకోవడానికి మనసొప్ప లేదామెకు. అందుకే  అన్నా, వదినా అంటూ  ఆత్మీయతల్ని  ఒలక బోస్తూ చీటికీ మాటికీ వచ్చి పోతున్నది.

        బీటెక్ పూర్తిచేసిన కూతుర్ని విశ్వానికి చేసుకోమని చెల్లెలు ప్రాధేయ పడడాన్ని చూసిన తర్వాత కొడుకుకు పెళ్లి చెయ్యాల్సిన బాధ్యత మిగిలి ఉందని గుర్తొచ్చింది జయరాంకు.

        పరి పరి విధాలుగా ఆలోచించిన జయరాం ఒక శుభ ముహూర్తంలో భార్యను , కొడుకును వెంట బెట్టుకొని నీరజ్ ఇంటికి వెళ్లాడు .

        బి, ఏ పూర్తిచేసి అన్న మాట ప్రకారం ఇంట్లోనే ఉంటూ గ్రూప్ టూ కు ప్రెపేర్ అవ్వాలనుకొంటున్న నీరజ్ చెల్లెల్ని తన కొడుక్కిచ్చి చెయ్య మని నీరజ్ ను కోరాడు జయరాం . వెంటనే వంగి జయరాం కు , పార్వతికి పాద నమస్కారం చెయ్యడం ద్వారా తన ఇష్టాన్ని  వ్యక్తం చేశాడు నీరజ్  .

        కులం తక్కువని చూడకుండా గుణానికి ప్రాధాన్యం  ఇచ్చిన జయరాం దంపతులు అతని కళ్లకు దేవతల్లా కనిపించారు  .

        ' మాదా పణ్ణదు మక్కల్కాగుం 'అని పార్వతి చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి వాళ్లమ్మ పదే పదే తమిళం లో అంటుండేది. ఒకసారి 'అలా అంటే ఏమమ్మా ?'అని అడిగిన కూతురికి ' తల్లి చేసిన దానం పిల్లల్ని కాపాడుతుంది ' అని చెప్పిందామె. పార్వతి కెందుకో ఆ మాటలిప్పుడు మదిలో మెదిలాయి.

      ఒకప్పుడు సాయం అందుకున్న బంధువులు తమ స్థాయి తగ్గినాక చులకన చెయ్యడం పార్వతి మర్చి పోలేదు.

        నీరజ్ చేసిన సాయాన్ని చూశాక తల్లీ తండ్రీ చేసిన పుణ్యం  పిల్లల్ని ఇలా కాపాడుతుంది కాబోలు!  అని అనుకోకుండా ఉండలేక పోయింది పార్వతి.

        నీరజ్ చెల్లెలిని ఇంటికి కోడలుగా తెచ్చుకొని తమ అదృష్టానికి తామే మురిసిపోతున్న వీళ్లను చూసి మళ్లీ కంట్లో కారం పోసుకోవడం మొదలు పెట్టారు రక్త సంబంధమున్న బంధువులు కొంత మంది .

                        మహాసముద్రం దేవకి
                             14-11-2019

        
      

Comments