పాతాళ బేరి

 కథ :


పాతాళ  బేరి 

        మా ఊర్లో నడీదిలో సరకారు సేందబాయుండాది. సర్కారోళ్లు ఎప్పుడు తొవ్వించి నారో కానీ శానా పెద్ద బాయది. సుట్టూ సిమెంట్ కట్టడం అడుగు ఎడల్పుతో . దానికి బీముడు బిగదన్ని నిల్చున్నట్లు నాలుగు  సిమెంటు కంబాలు. వాటి మింద అర్జునుడు అడ్డం బడి నట్లు అటు రెండు ఇటు రెండూ  రాతి దూలాలు .నాలుగు దూలాలకు నాలుగు రాట్నాలు . ఏ అర్ద రాత్రో తప్ప వాటికి నిద్రుండదు. ఎప్పుడూ నిలికు నిబందం లేకుండా అవి గిర గిర లాడతా ఉంటాయి.

        పొద్దన్నయితే రాట్నం దొరక్క ఒంగి సెందుకొనే వాళ్లెక్కువ . అందురికీ ఇనప బొక్కిన్లుండవా , శానా మంది మంటి దుత్తల గొంతులికి తాడు బిగించి నీళ్లు సేంది కడవల్లో పోసుకొనే వాళ్లే . ఒంగి సేందుకొనే వాళ్లు దుత్తలు బాయి గోడకు తగల కుండా బాగా బాయిలోకి ఒంగి ఒడుపుగా సేందుకోవాల నీళ్లు . లేదా దుత్తగోయిందా .

       సర్కారొళ్లు ఎంత మంచోళ్లో! ఆ బాయి చప్టా  మింద అక్కడక్కడా కుండలు పెట్టుకోడానికి సుట్ట కుదుర్లు అమర్చినట్లు సిమెంటు మింద గుంతలు గుంతలుగా సేసినారు.

         బాయి సుట్టూ కింద రెండు బార్ల ఎడల్పుతో సెమెంటు ఏసుండారు. దాని సుట్టూ నీళ్లు  ఈదిలోకి పారి రోత కాకుండా అరిచెయ్యడల్పుతో జానడెత్తు గోడ. అక్కడ పడిన నీళ్లంతా పది బార్ల దూరంలో ఒనీలో ఉండే వంకలోకి పోయి ఇసకలో ఇమిరి పోతాయి.

       ఎండాకాలం రావాల,  నా సామి రంగా ఎన్నెళ్లో ఆడి ఆడి ఆలిసి పోయిన పిలకాయిలం బాయి దెగ్గిర కూసోని, పండుకోని కతలు సెప్పుకోడమేనా, పందేలేసుకోని పొడుపుకత లేసుకోడమేనా , పాటలేనా లోకంలో ఉండే సంతోస మంతా ఆ బాయి సుట్టూనే మాతోనే ఉండేది.

        సర్కారోళ్లు ఇంత మంచి సేంద బాయి తొవ్వినారా. కానీ తాగడానికి యాడ పనికొస్తాయా నీళ్లు. ఉప్పు కసిం. పోసుకోను, అవసరాలకు, గిన్నే సెంబు తోముకోను, గుడ్లుతుక్కోను, వాకిళ్ల ముందు పేండ నీళ్లు సల్లుకోను, ఇల్లలుక్కోను గొడ్డూ గోదకు ఒకో ఇంటికి ఎన్ని నీళ్లు కావాల. ఆ అవసరాలన్నీ ఆ బాయే తీర్సేది.

        అన్నిటికీ మంచి నీళ్లు కావాలంటే మాటలా . ఊరి మద్దెలో రాగి రెడ్డోళ్ల సేంద బాయుండాది కానీ అదీ ఉప్పులే . ఊరందరికీ దాహం తీర్చే బాయి ఒగటే ఉండాది. సేన్లోళ్ల సేంద బాయి. అదే మా బాయి .ఊరి మొగదల్లో ఆ సివరాకరన ఉంటాదా మాఇల్లు . అణ్నించి అన్నింటికి నీళ్లు మోసుకోవాలంటే సెత్ర స్రెమ పడాలా. తాగనూ, పప్పుడికించుకోనూ తలా రెండు మూడు కడవల నీళ్లు సేందు కోని పోతే గగనం. ఈ సివర ఉండే పది పన్నెండిండ్లోళ్లు  మాత్రం అన్నిటికీ ఈ నీళ్లే సేందుకుంటారు.

        మా బాయికుండేది ఒకటే రాట్నం. మేము నీళ్లు సేందుకొనే దాకా ఏరే వాళ్లకు రాట్నం దొరకదు. అప్పుడంతా ఒంగే సేందు కుంటారు.నాలుగు పక్కల బండలు  రాట్నం కోసం రెండు కంబాలు .

      సర్కారు బాయి శానా లోతు గానీ మిగిలిన రొండు బావులు ఐదారు మట్ల లోతే. అందుకే ఎండాకాలం వొచ్చెందంటే నీళ్లు అడుక్కు పూడస్తాది. మేము సేదుకున్న్యాక ఈ పక్కిండ్లోళ్లకు  కూడా తాగను మాత్రమే దొరికేది. అదీ ఊర బెట్టీ ఊరబెట్టీ కాసుకో నుండి సేందుకోవాల.

        వానా కాలం ఒచ్చిందంటే యా బాయి సూసినా తటంగలుగా ఉంటాది. మూడు బార్ల సేంతాడుంటే సాలు . ఆండోళ్లకు నీళ్ల పని సుళువై పోతాది.

        సంక్రాంతి పండకొచ్చి పూడ్సింది . బాయిల్లో  నీళ్ల ఊట కొంచిం కొంచిం తగ్గతా ఉండాది. మట్టున్నర లోతుండాయి మా బాయిలో నీళ్లు .

        కర్నమోళ్ల సాయిత్రి నీళ్ల కొచ్చింది. తెల్లార్తో  , పైటేల ఐతే సేందబాయి సుట్టూ జనాలుంటారు కాని అందురూ సేద్దిం పనులు కాడికి పూడ్సినాక ఎవురుంటారు? అందుకే కూలోళ్ల సంగటికి  పొయి మింద ఎసురు పోసి పెట్టి నాలుగ్గడవలు నీళ్లు సేంది ఎత్తక పోయి కాలీ అయిన తొట్లు నింపుకుందామని వచ్చింది.

        నీళ్లు సేందుకొని కడవ సంకలో దుత్త సేతిలో పెట్టుకొని  ముందు ఎద్దల తొట్లో పోసి కడవ దుత్తల్ని దిన్ని మింద బెట్టి గుడ్సింట్లోకి పోయింది.  ఎసురు తెర్లతా ఉండాది . నాన బెట్టిన నూకల్ని ఎసిట్లో ఏసి పొంగి పోకుండా మంట తగ్గించి మళ్లీ  నీళ్ల కడవ తీసుకోని బాయికి బయలుదేరింది .

        బొక్కుని బాయిలోకేసి సర సరా చేంతాడును బాయిలోకి ఇడ్సింది. గోంగు నార చేంతాడు బాలిక్కి రాదని టెంకాయ పీసుతో అల్లిన చేంతాడు తెచ్చినాడు వాళ్ల నాయిన . ఆ తాడును సర సరా బాయిలోకి ఇడస్తా ఉంటే అరి చేతులు మంట బుడ్తా ఉండాయి . అందుకని సేతుల్ని సేంతాడుకు అంటి ముట్ట నట్ల పట్టు కునిందా ? అంతే గిర గిర తిరిగే రాట్నం మింది నుంచి సేంతాడు కొన సేతి నుంచి పట్టు దప్పి సర సరా మొత్తం బాయి లోకి జారి పోయింది .

        ఎండ కాల మైతే నీళ్లు తక్క ఉంటాయి. పడి పొయిన వొస్తువేదైనా గానీ అద్దం లో మాదిరిగా కంటికి కనిపిస్తా ఉంటాది.

        బాయిలో దిగే ఈరులూ సూరులూ ఒగరో ఇద్దురో ఉంటారా ఊర్లో . వాళ్లు తీరిగ్గా ఉండేది సూసుకోని 'అబ్బా,  నాయినా ' అని గెడ్డం పట్టుకోక పోయినా పట్టుకున్నట్లే అడుక్కోని బాయిలోకి దింపతారు. దిగినోళ్లు ఒక్కో మట్టుకూ ఏర్పాటు సేసిన గుంతల్లో కాళ్లు తాటించు కొని బాయి లోకి దిగి  నీళ్లలో బుడుంగున మునిగి పడి పోయిన సేంతాడు బొక్కిన్ని ఎత్తి రాట్నం పైనించి ఒదిలిన తాడుకు కడితే పైనుండే వాళ్లు సేందుకొని సునాయాసంగా వాటిని అందుకుంటారు . కానీ ఇప్పుడు మునిగిన వస్తువేదీ కనిపించట్లేదు. నీళ్లు శానానే ఉండాయి.

         ఏం సేసేదిరా బగమంతుడా అనుకుంటా దిగులు మొగాన పర్సుకోనుంటే సంగటికి పిండి బొయ్యాలని కాలీ కడవ దుత్తా తీసుకొని ఇల్లు సేరింది సాయిత్రి.

        పద్దినాలకు  పైనే అయిపోయా . కొత్త సేంతాడు బొక్కిని తేను దుడ్లు సర్దు బాటు కాలా. నాట్ల కాలం కావడంతో వాళ్లక్కోళ్లు కౌసల్య, సరస్పతి ఇంటి పని పట్టించుకోడం లేదు. సేంతాడు , బొక్కిని పూట పూటా వాళ్లను వీళ్లను అడగా లంటే నామర్దాగా ఉండాది సాయిత్రికి . అమ్మ రాజమ్మను సేంతాడు కావాలని అడిగినప్పుడంతా తిట్టిన తిట్టు తిట్ట కుండా తిడతా ఉండాది.
       
        మాయమ్మ తిడ్తాదిమే అంటానే,  సావాస గత్తె జోతి  వాళ్లమ్మకు తెలీకుండా సాయిత్రికి సేంతాడు బొక్కిని ఇచ్చి అడపా దడపా సాయం సేస్తా  ఉండాది.

        బాయిలో నీళ్లు తగ్గతాదేమో అని తొంగి తొంగి దినాము సూత్తా ఉండాది సాయిత్రి . ఊహూ ఆ పోవిడేమీ కనబళ్లా. ఎవురైనా నీళ్లు సేందుకొనేది సూసి వాళ్లు కడవ సంకనేసుకొని ఇంటికి బొయ్యి నీళ్లు పొసొచ్చే లోపల గబ గబా నాలుగ్గడవలు సేందుకుంటా ఉండాది . కొందురు పోనీలే అనుకున్న్యా మా నడుపబ్బ పెదనాయిన కూతురు కాంత లాంటి వాళ్లకు ఒప్పదు.

        ఒగ దినం  'మా సేంతాడూ బొక్కిని ఎట్టి కొస్తాదా మే, ఒగ దినమైతే మర్యాద.  నా సేంతాడు ముట్టు కున్న్యా వంటే బాగుండదు సూడు ' అని మరీ ఎచ్చరికలు చేసిందది. సాయిత్రి కండ్లలో నీళ్లు దిరిగినాయి .

        సేంద బాయి వాళ్లదే కాబట్టి జోతి వాళ్లు పొద్దన్నే రాట్నం మింద పెల్లోకి , ఎద్దల తొట్టికే కాకుండా పూల సెట్లకు కూడా నీళ్లు సేంది పోసుకుంటారు.

        పాపం సాయిత్రి కోసమని జోతి అదే పనిగా నీళ్లు ఎక్కువగా ఒలక బోసి 11 గంటలప్పుడు మళ్లీ నీళ్ల కొస్తా ఉండాది. వాళ్ల సెల్లి ఇస్కూలుకు పూడస్తాదా ? అప్పుడు ఇది సెందుకొని నీళ్లు పోసొచ్చే లొపల సాయిత్రి సేందుకుంటాదని దాని అవుడియా .

         జోతి వాళ్లమ్మ కమలమ్మేమన్న వాళ్లింటి బంక మొన్నా . వర్సగా కూతురు ఎప్పుడూ లేంది 11 గెంటలప్పుడు నీళ్లకు పోతా ఉంటే అదే పనిగా గమనించి 'ఇట్ల చేసినావంటే చీల్చి సీసం పోస్తా' అని తిట్టింది .

        ఒగ దినం నీళ్లు బొత్తిగా లేవు. కడవ, దుత్త తెచ్చి బాయికాడ పెట్టి ఎవురన్నా నీళ్లకు రాక పోతారా అని కాసుకో నుండాది సాయిత్రి. బాయి దెగ్గిరే నిలబడ లేక పక్కనే ఉన్ని సిట్టోళ్ల  ఎద్దల కొట్టంలో సిట్టితో కలిసి అచ్చన రాళ్లాడతా ఉండాది .

        రాట్నం గరగర లాడింది . ఎవురా అని ఆడేది ఇడ్సి పెట్టి తొంగి సూసింది . సాకలోళ్ల రాజమ్మ . వాళ్లిల్లు కొంచం దూరం .నీళ్లు పోసి రాను కొంచేపు పడ్తాది. ఇదే సందనుకొని అది కడవెత్తుకొని అట్లా పోంగానే అచ్చన రాళ్లు ఆడ బారేసి బాయి కాడి కొస్తుంటే ఆట మద్దిలో పొయినందుకు సిట్టికి కోపమొచ్చి అడ్లా బుడ్లా అని మెటికలిరిసింది .

        ' పొయే ' అని దాన్ని పట్టించుకోకుండా రొండు  కడవలకు గబ గబా నీళ్లు సేంది పోసుకొనింది. ఒక కడవ సంకనేసుకొని పోతా ఉంటే రాజమ్మ ఎదురొచ్చింది . ఏమీ ఎరగనట్టు నోరు మూసుకొని రాజమ్మ పక్క సూడను కూడా సూడకుండా దాటు కొనింది .

      సాయిత్రి సేంద బాయికాడికి వచ్చే పాటికి రాజమ్మ ' ఏ నా సవితి కొచ్చిందో రోగం . ఏమార్తే సాలు కంట్లో  పాపను కత్తరించేస్తారు కంత్రీ ముండలు. కాలమంతా ఊరి కుక్కల మాదిరిగా ఊరి సొమ్ము దిని బతికే వోళ్లు ' అని తిట్టిన తిట్టు తిట్ట కుండా సాయిత్రికి తగిలేట్లుగా తిడ్తా ఉండాది .

        సాయిత్రికి  ఏడుపు ఎగదన్నుకోనొచ్చింది . బిక్క మొగ మేసుకొని సుట్టూ ఎవురన్నా ఇంటా ఉండారేమో అని సూసింది. సిట్టి , వాళ్ల కొట్టం లో నుంచి తొంగి తొంగి సూస్తా ఉండాది . ఓహో దీని పనా అనుకుంటా ఈసడింపుగా సూసి అత్త మింద కోపం దుత్త మింద సూపించి నట్లు నిండు కడవను ఇసిరి సంకలో ఏసుకొని కాలీ కడవను సేత బట్టు కొని ఇంటికి పూడ్సింది. అయినా దానికి దుక్కం ఆరూ అంటే ఆరడం లేదు.

        మద్ద్యాన్నం ఇంటికొచ్చిన వాళ్లమ్మతో సేంతాడు బొక్కిని తెచ్చియ కుంటే సంగటీ కూరా  సెయ్యనని ఏడ్సి గగ్గోలు పెట్టింది.

        'ఉన్న్యట్లుండి దుడ్లు యాణ్ణించి తెచ్చేది పాపా. ఉండే దాన్ని బాయిలో ఏసొచ్చి నన్నిట్లా సాతాయిస్తే నేనేం సేసేది. కొంచం పనులు తెరపిస్తే సిత్తూరుకు బొయ్యి సింత పండు అమ్మి తీసకొస్తాను ' అని సెప్పింది.

        సేంతాడు బొక్కిని ఎన్ని సార్లు ఎంత మందివి బాయిలో బళ్లేదు. దిగి ఎవురో ఒకరి తీసియ లేదు.

        సాయంత్రం నడీదిలో ఆట్లాడి అలిసి పోయి నలుగురూ ఒక సోట కూసోని మాట్లాడు కొనే టప్పుడు సిట్టి సేసిన మోసాన్ని, రాజమ్మ తిట్టిన తిట్లను జోతికి, కాంతాకు సెప్పుకొని కండ్ల నీళ్లు పెట్టు కొనింది సాయిత్రి. అది ఇని నీలావతి పాతాల బేరి గురించి సెప్పింది. సర్కారు బాయిలో వాళ్లక్క ఇట్లే సేంతాడు బొక్కినీ ఏసేస్తే పక్కనుండే గాండ్ల కొత్తురు  నించి వాళ్లన్న పాతాల బేరి తెచ్చి తీసిచ్చినాడనింది.

         గాండ్ల కొత్తూర్లో పండ్రెడ్డో లింట్లో పాతాల బేరి ఉందని తెలిసి సాయిత్రి వాళ్ల సేద్ది గాన్ని పంపించింది. వాడు ఉత్త సేతుల్తో తిరిగొచ్చినాడు .

       ఏమిరా సేతులూపుకుంటా వొస్తా ఉండావు , పాతాల బేరి ఏదీ' అని అడిగింది రాజమ్మ

        ' ఏదైనా వొస్తువు పెడితే గానీ ఇవ్వరంటా' అన్న్యాడు వాడు. రాజమ్మ ఆలోచన చేసి తనకు పుట్నింటి వాళ్లిచ్చిన రాగి కట్రావును ఇచ్చి పంపించింది. పాతాల బేరంటే ఇదా ఇట్లా ఉంటాదా అని అర్సోది పొయినారు దాన్ని ఎప్పుడూ సూసి ఎరగనోళ్లు. దాని తలకాయి సుట్టు కొక్కీలు . ఆ కొక్కీలకు ఇంగో వరస కొక్కీలు .

        బాయిలో నుంచి తియ్యడానికి కర్నమోళ్ల  బాలడు  సిద్దమయినాడు . బాయి సుట్టూ జనాలు సేరి తొంగి సూస్తా ఉండారు . సంపూర్ణక్క  మొగుడు జయరామన్న వచ్చి సింత బర్రతో పిలకాయిల్నంతా బాయి దెగ్గిరి నుంచి తరమ గొట్టినాడు .

        శాంతాడుకు  కట్టిన పాతాల బేరిని రొండు సార్లు బాయిలో కేసి కెలికి నాక పైకి ఈడ్సినారు .
ఊహూ ఏమీ రాలేదు . మూడోసారికి నీళ్ల పైకి తేలిన పాతాల బేరికి ఏదో సుట్టు కోని కనిపించింది శాంతాడే అనుకున్న్యారంతా. సాంతాడయితే మిగిలిన తాడు బొక్కినేది? సగం బాయికొచ్చింది . సూస్తే అది పాము. పాతాల బేరికి సుట్టుకొని కదలతా ఉండాదది. ఉల్సర పొయినారు సూసే వాళ్లు . మూలకొకరు దూరానికి పరుగు దీసినారు.


          బాలడు కూడా బయస్తుడే.  వాడు కట్టిన దారాన్ని ఈడ్సుకొని దూరానికి పరిగెత్తినాడు . రాట్నం దెగ్గికొచ్చింది పాతాల బేరి. పాము దానికి సుట్టు కొనే ఉండాది. దాన్ని ఎట్లా బయటి కెయ్యాలో తెలీలేదు ఎవురికీ .

        అప్పుడు చిర్రలు బర్రలుగా ఉండే ఒక పెద్ద సిగర కొమ్మను తెచ్చి దానికి తాకేట్లుగా  పట్టుకున్న్యాడు జయరామన్న.

        తగులుకొని నీళ్ల పైదాకా వొచ్చింది కాని అది కొనాల తగులుకోడం  వల్ల జారి పోయింది . బయిలోకిడ్సి తిప్పి తిప్పి బాలడి సేతులు నొప్పి బెట్నాయి కాని దానికేది తగులుకో లేదు.
       
        ఈసారి జయరామన్నే ఇట్లియిరా అని వాని సేతి నుంచి తాడందు కొనినాడు. ఏపక్క నువు నీళ్లు సేందిందని అడిగినాడు సాయిత్రిని . అది సెప్పింది . రాట్నం మిందని కూడా సెప్పింది . అంటే బాయి నడి మిద్దిలో పడుంటాదని అర్తం సేసుకోని సెయ్యి సాపి మద్దిలో కెల్కినాడు.  శానా సేపు తిప్పి తిప్పి పైకి ఈడ్సి నాడు . నీళ్ల పైకి ఒచ్చి నాక దాని కేదో సుట్టు కోనుండేది కనిపించింది . సేంతాడే అని సంబర పడినారు . ఒకడుగు పైకి ఈడ్సినాక తాడు అయితే దాని ఎంట యాలడతా రావాల కదా! ఊహూ !

        సూస్తా ఉండంగానే పైకి ఒచ్చింది పాతాళ బేరి . దానికి సుట్టు కొని పెద్ద పాము . ముందు నీళ్ల పామనుకున్న్యారు. అది అంత పొడుగ్గా లావుగా ఉండదు. అది జెర్రి పోతని తెగేసి సెప్పినాడు నడుపబ్బ పెద నాయిన. సేంద బాయి బండ సందుళ్లోంచి పడి పోయినట్లుండాది. తాడు పట్టుకున్ని బాలడు చేతి లోని తాడుతో దూరానికి  పరిగెత్తినాడు. బాయి సుట్టూ ఉన్నోళ్లు దూరంగా పోయి బితుకు బితుకు మని సూస్తా ఉండారు. అది మెలికలు తిరగతా  బయట పడే దారి లేక సుట్టు కుంటా ఉంది.

          ' రేయ్ ! ఉపాయం లేని దాసరి  ఊర్లో ఉపాసం పండుకున్నాడంటా  అని పెద్ద సిగర కొమ్మను తెచ్చి పతాల బేరి మిందికి అందేట్టుగా కంబాలకు తాటించి పెట్టి నాడు. అట్ల తిరిగి ఇట్ల తిరిగి అది మెల్లిగా కొమ్మ పైకి చేరు కునింది.

        'రేయ్, దురంగా పోండి పొండి అంటా కొమ్మ మొదుల్ని పట్టు కొని పాముతో సహా దూరానికి ఇసిరి కొట్టి నాడు. దాన్ని చంపేయ మని కొందరంటే ఒద్దని కొందురు.

        అదేమన్నా నాగుబామా ఇడ్సి పెట్ను . సంపండిరా అని జయరామన్న అనడం ఎగవింటోళ్ల సినబ్బన్న పెద్ద దుడ్డు కట్టి దెచ్చి దాన్ని సంపి ముళ్ల కంపల్లో పారేయడం నిమసాల్లో జరిగి పోయింది .

        బాలడు మళ్లీ పాతాల బేరిని బాయి లోకి దించినాడు. ఈ సారి సాయిత్రి సేంతాడు బొక్కిని పైకొచ్చింది. ఆ బిడ్డి ఆనందానికి అంతు లేదు వాళ్లమ్మ రాజమ్మ వక్కాకు నమలతా ఉన్ని నోటి మింద నవ్వు పూలై పూసింది.

         అంతొరకు ఆడే కాసుకోనున్ని సిలగుండ్ల పల్లి లచ్చుమక్క ' ఒరే బాలా ఇంకో సారి కల బెట్టరా , మా ఇనప దుత్త పడి పోయి శాన్నా ళ్లయింది ' అని బంగ పోయింది.

          ' మా కింకేం పంగ లేదా ? అని రాజమ్మ మూతి మూరెడు పెట్టు కుందింది . బాలడు రొండు మూడు సార్లు బయిలో కెలికి నాడు. దుత్తకు తాడు లేదు జురుకు జారి పోయి దుత్త బొర్ల పడి నట్లుంది . బాయి సుట్టూ తిరిగి ఎంత కెలికినా దుత్త తగల లేదు .

         నీళ్లెండినప్పుడు దిగి తీసిస్తాలే అని చివర బగా పాతాల బేరిని నీళ్లలో తిప్పి పైకి సేందినాడు . ఖాలీ పతాల బేరి తిరుగు కుంటా పైకి వస్తా ఉంటే నల్లగా ఉన్ని దానికి మాటుకొని ఎదో తళ తళా మెరవడం కనిపించింది . తీరా పైకి తీస్తే దానికి మాటుకొని బంగారు సైను .

        అంతే అక్కడంతా అరుపులతో  తేరూ తిర్నాలయి పోయింది . అది అదెమ్మక్క కోడలు ఇశాలాక్షిదని అందురూ తీర్మానం చేసినారు. ఆ వార్త వాళ్లింటి దాకా పొయ్యింది. సైను దొరికిందన్న సంతోసం ఒక పక్కనుంటే వాళ్లింట్లో పెండా చెత్త తోసే బొజ్జి దొంగలించిందని నానా యాగీ సేసి పంచాయితీ పెట్టి దాన్ని ఊర్లోకి పనికి రాకుండా సేసినందుకు సిగ్గుగా ఉంది.

        చైను తెగి పోయుండాది. అంటే నీళ్లు తోడినప్పుడు తెగి బాయిలో పడిందన్న మాట . 'పాపం బొజ్జి'  అని అననోళ్లు పాపాత్ములు. జయరామన్న ఆ చైను తీసుకొని జోబీలో ఏసుకున్న్యాడు. రచ్చ బండ దెగ్గిర పంచాయితీ పెట్టి బొజ్జితోనే దాన్ని వీళ్ల కిప్పిస్తామని తీర్మానం జేసి నాడు. దానికి ఒప్పుకోకుంటే అది ఊరి ఉమ్మడి సొత్తుగా ఇనాయక సామి గుడికి సేరుతుందన సెప్పినాడు. అందుకు అందురూ సరే నంటే సరే అన్న్యారు.

         పాతాళ బేరి సేసిన మేలు ఊరంతా పాకి పొయ్యింది. సర్కారు సేంద బాయిలో ఎప్పుడో బాయి గెట్టు మింద పెట్టు కున్న ఇత్తడి బింది జారి పోయిందని దాన్ని తీసియ్య మని బాలన్ని కాళ్లు పట్టు కొనేంత పని సేసింది కొండని పెండ్లాం.

మహాసముద్రం దేవకి


Comments