కథ :
అలసంద వడలు
పిల్లలు బడి నుంచి ఇంటికొచ్చే టైం అయింది. అలసంద పప్పు పొట్టు పొయ్యేట్లు కడిగేసరికి ఇంత సేపయింది.
గిన్నెలో నీళ్లు తీసుకెళ్లి మల్లి పందిరి కింద అరుగు పైన ఉన్న రోలు కడిగి తెల్లబాయలు, మిరపకాయలు, ఉప్పు కావలసినంత పప్పు పైన వేసుకొని వెళ్లి రోటి దగ్గర కూచుంది శ్యామల .
కోడలు హైరానా పడటాన్ని చూసిన అత్త కామాక్షి ' ఆ మిక్సీలో ఏసి తగల బెడితే రెండు నిముషాల్లో అయ్యే పనికి ఇంత హడావిడి అవసరమా' అంటూ ప్రేమగా కసురుతూ వచ్చి కోడలి కెదురుగా అటు పక్క రోటి దగ్గర కూచుంది. పప్పు రుబ్బుతుంటే తొయ్యడానికి.
'ఎందు కత్తమ్మా ఇంతోటి పనికి ఇద్దరు కావాల్నా? నువ్వు పో నేను రుబ్బి తెస్తానులే !' అనింది శ్యామల. ఊహూ అత్త వినలేదు . చివ్వర ఈలుకత్తితో కోసి తెచ్చిన ఎర్రగడ్డ పాయల్ని కూడా వేసి రెండు చుట్లు రుబ్బినాక 'ఇంక చాలత్తా మెదిగింది' అంటూ రుబ్బు గుండు రోట్లో నుంచి పైకి తీసింది. దానికంటుకున్న పిండిని రోట్లోకి వేసి సన్నగా తరిగి తెచ్చిన కొత్తి మీరను , కరివేపాకును కూడా వేసి చేత్తో పిండిని కలగలిపి గిన్నెలోకి తీసుకుంది.
' నువ్ బో పొయ్యంటించుపో , రోలు నేను కడిగేసొస్తా ' అనింది అత్త కామాక్షి.
శ్యామల ముందు గోగు కట్టెలు విరిచి పొయిలో పెట్టి అగ్గి పుల్ల గీసి అంటించింది. ఆ తర్వాత రెండు మూర్ల ముక్కలుగా కత్తరించి తెచ్చిన చిగర కట్టెల్ని పొయిలో పెట్టి బాణలిలో నూనె పోసింది.
పని చేసేటప్పుడు వృధాగా ఒక్క క్షణం కూడా ఉండదు శ్యామల . నూనె కాగే లోపల రాత్రి తాళింపుకు కావలసిన చిక్కుడు కాయల్ని తుంపి గిన్నెలో వేసింది. పొయ్యి ముందర పీట వేసుకొంది. వెదురు బుట్ట పక్కన పెట్టు కొంది . వడలు తట్టి వెయ్యడానికి ఒక గిన్నె బోర్లించి పక్కన పెట్టుకున్న నీళ్ల గిన్నెలో గుడ్డ తడిపి బోర్లించిన గిన్నె పైన వేసింది. చెత్తో వైనంగా పిండి తీసుకొని గుండుగా ఎగరేసి గుడ్డపైన తట్టి నూనెలో వేసింది.
సుయ్ సుయ్ అని చప్పుడు వినిపిస్తుంటే మామ గారు లేచి వచ్చి ఈజీ చేర్లో కొలువుతీరాడు. వడల వాసన ముక్కుల్ని తాకి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేట్లు చేస్తోంది.
తినడానికి ఏమి పెడతారా అని పసి పిల్లోడిలా ఎదురు చూస్తుంటాడు రామక్రిష్ణ.కోడలు శ్యామలకు ఆ విషయం తెలుసు. వడలు కాలాక తీసి బుట్టలో వేసింది. పొయ్యి మంట తగ్గేట్టు కట్టెల్ని వెనక్కి లాగింది. ఒక వడను తీసుకొని చిన్న ముక్క తుంచి పొయిలో వేసింది. మరో ముక్క తుంచి పొయ్యి గడ్డ మీద పెట్టింది.
బుట్ట లోని ఐదు వడల్నీ ప్లేటు లోకి సర్ది మామ గారికి ఇచ్చి రావడానికి పైకి లేస్తుంటే ' తిండి పోతు రాయుడు తినడానికి సిద్ధంగా ఉండాడు ' అంటూ గొణుగుతూ వచ్చింది అత్త.
'నేనిస్తానులే ' అని శ్యామల చేతి లోని ప్లేట్ అందుకొంది.
శ్యామల పొయ్యి ఎగదోసి వడలు వేస్తుంటే మొగునికి నీళ్ల కోసమని వచ్చి గుండు చెంబులో కుండ లోని నీళ్లు తీసుకొని పోయింది అత్త.
ఇంకో వాయి వడల్ని తీసుకొని బుట్టతో సహా నడవలో ఉన్న మామ గారికి ఇవ్వడానికి వచ్చింది శ్యామల.
బడి నుంచి ఇంట్లోకి పరుగు పెడుతూ వచ్చిన బాబి గాడు 'అహా !వడలు ' అంటూ పుస్తకాల సంచి విసిరేసి తాత ప్లేటు లోకి కల బడ్డాడు. అది చూసిన శ్యామల వాడి వీపు మీద ఒక ఏటు వేసి
'ముందు కాళ్లూ చేతులు కడక్క రాపో ' అని కసిరింది.
పక్కనే ఉన్న నీళ్ల తొట్టి దగ్గరిరి పరిగెత్తి తడిసీ తడవకుండా కాళ్లూ , మొహమూ కడుక్కొన్నాడు వాడు. మల్లె మొగ్గలు కోస్తున్న నానమ్మ దగ్గరికి పోయి మొహం తుడ్సు కోవడానికి వెనక నుంచి ఆమె కొంగు పట్టు కొని లాగాడు. ' ఎదవా ' ఎనక్కి తిరిగి ఆమె ఒకటంటించింది. కొంగు లాగి నప్పుడు కొంగులో ఉన్న మల్లె మొగ్గలన్నీ నేల మీద చిందర వందరై పొయాయి మరి !
అప్పుడే బడి నుంచి వచ్చిన సీతి బరువుగా ఉన్న పుస్తకాల సంచిని, క్యారీరు బుట్టను అరుగు పైన పెట్టి పడి పోయిన మొగ్గల్ని ఏరడానికి వెళ్లింది. ' నాయమ్మే' అని సీతి బుగ్గలు నిమిరి ముద్దు పెట్టు కుంది కామాక్షి.
' ప్రీతి ఏదే ? నీతో రాలేదు ' అని అడిగింది. అదీ ఆనందాతో కలిసి రాము వాళ్ల ఇంట్లో మామిడి పిందెలు ఏరుకొస్తానని వెళ్లింది నానమ్మా' అంది సీతి.
మొగ్గలు పూర్తిగా కోసుకొని అందులో కలిపి కట్టడానికి కొన్ని కనకాంబరాలు , మాచి పత్రి కూడా కోసుకొని అరుగు మీది కొచ్చింది కామాక్షి .
బాబి గాడు బాద మాకులోని వడల్ని తుంచి అక్కడున్న కుక్కకు, కాకులకు వేస్తున్నాడు. విసిరేసిన వడ ముక్కల్ని గాలి లోనే పట్టుకొంటున్నాయి కాకులు రెండూ . అవి అలా పట్టు కొంటుంటే తాను తినడం కూడా మానేసి వడల్ని తుంచి వాటికే వేస్తూ మురిసి పోతున్నాడు వాడు.
కామాక్షి కుక్కను తరిమికొట్టింది. కాకుల్ని కసిరింది. బాబి గాన్ని తిట్టింది.
అప్పుడే మళ్లీ వడల బుట్టతో వచ్చిన శ్యామల మామ గారి ప్లేటులో ఇంకో వడను వెయ్య బోతుంటే 'ఇంక చాలిస్తావా 'అని కసిరింది అత్త. ఇంకా తినాలని ఉన్నా భార్యకు భయపడి 'ఇంక చాలమ్మా 'అని చేతులడ్డం పెట్టారు మామగారు .
'ఈ వెధవకు కూడా ఇవ్వకు. మొత్తం కుక్కకు , కాకులకూ వేస్తున్నాడు . ' అంటుంటే ఒక వడను తీసుకొని వీధిలోకి పరుగు పెట్టాడు వాడు.
సీతి బుద్ధిగా కాళ్లూ చేతులు కడుక్కొని హోం వర్క్ చేసే పుస్తకాలతో వచ్చి అరుగుమీద కూచుంది. నానమ్మ వడలతో వచ్చి మనవరాలి పక్కన కూచొని 'రెండు వడలు తిని మళ్లీ రాసుకో నాన్నా' అంటూ ఏడమ చేతితో సీతి వెంట్రుకలను సరి చేసింది.
కర కర లాడే అలసంద వడను నొట్లో పెట్టుకొని మాట వరసకు అంటాను కానీ రొట్లో రుబ్బితే వచ్చే రుచి మిక్సీ లో వేస్తే వస్తుందా అనుకొంది మనసులో .
అప్పుడే ఇంట్లోకి వచ్చిన ప్రీతి ఏకంగా నానమ్మ ఒడిలో వాలి పోయింది . దాన్ని అడ్డుకొంటూ 'బసివి లాగా ఊరంతా తిరిగి ఇప్పుడొచ్చావా తల్లీ . ముందు నా ఒడిలో నుంచి లే'అని కసిరింది.
నానమ్మ మెప్పు కోసం నీళ్ల తొట్టి దగ్గరికి పరిగెత్తింది ప్రీతి. నానమ్మ చూస్తోందని రుద్ది రుద్ది కాళ్లూ చేతులూ శుభ్రంగా కడుక్కుంది.
కూతురి కోసం ప్లేట్ లో వడలు తెచ్చి ఇచ్చింది శ్యామల. ' ఇవ్వు. ఇవ్వువ్వు స్కూల్లో చదివి చదివి అలిసి పోయి బుద్ధిగా ఇంటికొచ్చింది బిడ్డ' ఎగతాలిగా అంది కామాక్షి.
వడల ప్లేట్ ను చేతిలోకి తీసుకొని తల్లి వైపు, వడల వైపు మార్చి మార్చి చూడ సాగింది ప్రీతి . అది గ్రహించిన శ్యామల విసుక్కోకుండా వెళ్లి ఆవకాయతో ఉన్న బుల్లి జాడీ తెచ్చి దాని ముందు పెట్టింది. అది చూసిన నానమ్మ 'ఈ రుచుల కేమీ తక్కువ ల్యా' అని చేతులు తిప్పింది.
ఉన్నట్లుండి వడను తుంచి ఆవకాయ గుజ్జులో అద్ది నానమ్మ నొట్లో కుక్కింది ప్రీతి. 'ఒసేయ్ -- ' అంటూ కొట్టొచ్చిన నానమ్మ నొట్లో ఇంకో ముక్క కుక్కి పక పకా నవ్వింది ప్రీతి. 'నాకూ ఓ ముక్క పెట్టవే' అని అడిగిన సీతికి ప్రేమగా ముక్క నోట్లో పెట్టింది ప్రీతి.
ఆఫీస్ నుంచి వస్తున్న భర్తను చూసి వేడి వేడిగా వడలు వేసి తేవడానికి వంటింట్లోకి వెళ్లింది శ్యామల.
మొహం కడుక్కొని అందరున్న చావిట్లోకి వచ్చాడు సుబ్బా రావు. వేడిగా రుచిగా ఉన్న వడలను తింటూ పిల్లలతో కబుర్లు చెబుతున్న సుబ్బా రావు అక్కడికి నీళ్ల చెంబుతో వచ్చిన శ్యామలను చూసి 'నీ చెయ్యి మహత్యమేమో గాని ఏది చేసినా రుచి ఉంటాయోయ్ ' అన్నాడు. ఆ మెచ్చు కోలుకు ఉబ్బి పోయి అంత వరకు ఒక్క వడను కూడా తినని శ్యామల తన కోసం ఉంచు కున్న బుట్టలోని రెండు వడలను కూడా తెచ్చి వద్దు వద్దు అంటున్న భర్త ప్లేటు లోకి బలవంతంగా వేసింది.
బుట్ట ఖాలీ అవడం చూసి భార్య తృప్తి కోసం చిన్న ముక్క తుంచుకొని నోట్లో పెట్టుకొని ' ఇప్పటికే ఎక్కువ తిన్నా' నంటూ ఓరగా చూస్తూ ప్లేటును శ్యామల చేతిలో పెట్టాడు, శ్యామల త్యాగ శీలం తెలిసి తిని ఉండదని గ్రహించిన సుబ్బారావు .
మహాసముద్రం దేవకి
1-3-2020
Comments
Post a Comment