సర్డు బాటు

 కథ :


సర్దు బాటు

' ఒచ్చే నెల రెండవ తేదే అక్క కూతురు పెళ్లి . పిళ్లోళ్లకు  మంచి బట్టలన్నా లేవు . ఎంత పోరాడినా తిండికి సమకూర్చుకోవడమే గగనంగా ఉంది. పిల్లోళ్ల కడుపు మాడ బెట్టి కష్టాన్నంతా  తగలేస్తా ఉండాడు మొగుడనే తాగుబోతు ముండా కొడుకు' పని చేసు కుంటూనే పరి పరి విధాలుగా అలోచిస్తోంది ఓబులమ్మ .

ఒకే అపార్ట్మెంట్లో నాలు గిండ్లలో పని చేస్తుంది  ఓబులమ్మ. ఎనిమిది కంతా ఆ ఇండ్లలో పని పూర్తి చేసుకోవాలంటే నాలుగ్గంటలకే మొదులు  బెట్టాలి. అంత మసకలో తను లేచినా పని చేపించు కొనేందుకు ఎవరూ సిద్ధంగా ఉండరు.

భారతమ్మ ధర్మమా అని టైం విషయంలో కొంచెం వెసులు బాటు దొరికింది ఓబులమ్మకు.  లేకుంటే ఒక ఇల్లు వొదులు కోవాల్సి వొచ్చేది. ఓబులమ్మ  తిప్పల్ని కళ్లారా చూసిన భారతమ్మ అదే పనిగా నాలుగ్గంటలకు అలారం పెట్టుకొని లేచి మరీ పని చేయించు కుంటుంది.

రిటైర్డ్ ప్రిన్సిపాలామె.  కూతురు కొడుకు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో వేరే ఊర్లలో ఉన్నారు. ఆమె ఒంటరిగా ఉంటుంది. పిల్లలు ఎవరికి వాళ్లే వాళ్ల దగ్గరొచ్చి ఉండమంటారు.  కానీ భర్త జ్ఞాపకాలతో ముడిపిడిన ఆ ఇంటిని వదిలి పెట్టి వెళ్ల డానికి భారతమ్మ మనసు ససేమిరా ఒప్పుకోదు. అందుకే అప్పుడప్పుడూ వెళ్లి వారం పది రోజులుండి మళ్లీ తన గూటికి చేరు కుంటుందామె. చతుష్ షష్టి  కళలు కావు కాని వాటిలో ఒక్క శిల్పం తప్ప మిగిలిన లలిత కళల్లో ప్రవేశం ఉందామెకు. ఒంటరిగా ఉన్న ఆమెకు అవే అండా దండ, తోడూ నీడ.

ఎనిమిదికి లేచినా అడిగే వాళ్లు లేరామెను . వీలైనంత వరకు ఎదుటి వాళ్ల కష్టాలను ఆకళింపు చేసుకొని  సాయం చెయ్యాలన్న తపన ఉంది కాబట్టి కష్టమైనా భారతమ్మ ఓబులమ్మకు అలా సహకరిస్తోంది.

నాలుగ్గంటలకు లేచి పనికి వెళ్లిన ఓబులమ్మ నాలుగిండ్లలోను పని పూర్తి చేసుకొని ఎనిమిదిన్నరకు హడావిడిగా భారతమ్మ ఇంటికొచ్చింది. రోజూ పనులై పోయాక అపార్ట్మెంట్ నుంచి వెళ్లే ముందు వచ్చి టిఫిను తిని , మిగిలిన కూరలూ అవీ ఉండేవి తీసుకు పొమ్మని భారతమ్మే  చెప్పింది.

'ఈ రోజు ఆలస్య మైంది. తినే టైం లేదమ్మా వెళ్లొస్తా' అని ఓబులమ్మ హైరాణా పడుతూ వెళ్ల బోతుంటే  గబ గబా రెండు దోసెలు పొట్లం కట్టి రాత్రి మిగిలిన అన్నం కూరను క్యారీరులో పెట్టి ఇచ్చి తీసుకు పొమ్మంది.

ఉరుకులు పరుగులతో ఇంటి కొచ్చి తెచ్చిన వాటిని పిల్లల కిచ్చింది . కూతుళ్లు సీత ,గీత లను పిలిచి నిలబడే తలలు దువ్వి జడలు వేసింది . రాత్రి అన్నం ఉంటే తిన్నామని ఒక దోసెను ముగ్గురూ కలిసి తిని టైమయిందని స్కూలుకు వెళ్లి పోయారు వాళ్లు.

'మధ్యానం బడిలోనే భోజనం పెడ్తున్న ప్రభుత్వానికి నాలాంటి వాళ్లు ఎంతో రుణ పడి ఉండాలి' అనుకొంటుంటుంది ఓబులమ్మ. పిల్లలకి బాక్సులు కట్టిచ్చే పని లేనందుకు .

దోసె మొగుని కుంచి భారతమ్మ ఇచ్చిన అన్నం టిఫిన్ బాక్సులో పెట్టుకొంది. మధ్యాన్నం దాకా ఉంటే కూర చెడిపోతుందని పైన చింతొక్కు  వేసుకొనింది. పక్కింటి పార్వతితో కలిసి పనికి బయల దేర బోతుంటే మొగుడు ముత్యాలు వచ్చి 'లెక్కిచ్చి పో ' అని అడ్డం నిలబడినాడు.

'అడ్డుతీ , ఆలీస మయితే మేస్త్రీ అన్న పనిలోకి రానీడు 'అనింది.

'నాకంటే నీకు ఆ మేస్త్రీ గాడు ఎక్కువైనాడా? లెక్కియ్యి పక్కకు తప్పుకుంటా' హూంకరించాడు.

'యాణ్ణించిచ్చేది లెక్క . ఇల్లు గడ్సేదే గగనం గా ఉండాది . దినాము లెక్క కావాలంటే సెట్లకేమైనా కాస్తా ఉండాదా లెక్క కావాల్సి నప్పుడంతా కోసుకోడానికి , నీ సంపాదనేమన్నా ముల్లె గట్టి సేతి కిస్తివా అడిగినప్పుడు లెక్కందియ్యడానికి ' కాస్త ఈసడింపుగా , కోపంగా అంది ఓబులమ్మ.

అప్పటికే గుర్రమెక్కున్నాడు 'సేట్ల కేందే లెక్క కాసేది?  నీ కూలి డబ్బు లేం జేసినావ్ ? మర్యాదగ ఇయి ' అని మీది మీది కొచ్చినాడు. బొడ్లో దోపుకోనుండిన నూరు రూపాయల నోటును క్షణంలో పెరుక్కొని అవాకులు చెవాకులు పేలుకుంటా బయట బడినాడు.

బిత్తర పొయి చూస్తున్న పార్వతి ' పోదాం రాక్కా ' అని భుజం మింద చెయ్యి వెయ్యడంతో
చేత కాకున్నా  దిగాలుగా పనికి బయలు దేరింది ఓబులమ్మ .

ముత్యాలు ఒకప్పుడు లారీ డ్రైవర్. ఓల్డు టవున్లో కూరగాయల మండీ పెట్టిన రాఘవయ్య వాళ్ల లారీకి వెళ్లే వాడు. ప్రతి రోజు ఇక్కడి నుంచి ఏదో ఒక లోడ్ తో బెంగులూరు వెళ్లి దాన్ని దించి రాత్రికి కూరగాయల లోడ్తో ఒచ్చే వాడు.  ఒచ్చేటప్పుడు దారిలో అనంతపురం వచ్చే వాళ్లను ఎక్కించుకొనే వాడు. వాళ్లు తృణమో పణమో ఇస్తే తీసుకొనే వాడు. జీతం గాక ప్రతి రోజు అదనపు ఆదాయం బాగానే ముట్టేది.

ఆ రోజు బెంగుళూరు నుంచి వస్తుంటే దేవన హళ్లి దగ్గర ఒక మంచి బేరం తగిలింది. ఎవరో ఇంటికి కావలిసిన ఇటాలియన్ మార్బుల్ కొన్నారు. ఇలాంటి లారీల్లో ఐతే తక్కువ ఖర్చుతో  సామాన్లు ఇల్లు చేరతాయని వాళ్లకూ తెలుసు.

ముత్యాలు రెండు వేలు అడిగాడు. వాళ్లు ' అంత ఇవ్వం వస్తే రా , లేకుంటే మానుకో' అంటే  ఎనిమిది వందలకు బేరం కుదుర్చు కున్నాడు. తనతో పాటు ఉండే క్లీనరుకు వంద ఇస్తానని మాటిచ్చాడు.

'ఈ విషయం ఎక్కడైనా పొక్కిందంటే చంపుతా ' అని వాన్ని ముందే హెచ్చరించినాడు.

అప్పట్నుంచి కాస్త ఆలస్య మైనా ప్రతి రోజూ ఇలాంటి పెద్ద బేరాల కోసం ఎదురు చూడ్డం మొదలు పెట్టాడు.

చేతి నిండా డబ్బు . సావాస గాళ్లు పెరిగారు. వాళ్లతో పాటు కొత్త అలవాట్లు తోడయ్యాయి.అలా తాగుడుకు బానిసయ్యాడు ముత్యాలు

'ఇలాంటి అలవాట్లు వొద్దప్పా '  అని కాళ్లా వేళ్లా పడింది ఓబులమ్మ. కాళ్లతో ఇసిరి తన్నాడు కాని కనికరించ లేదు.

జీతంతో బతికేటప్పుడు డబ్బులు తెచ్చి పెండ్లాం చేతిలో పోసేవాడు. ఓబులమ్మ కూడా మొగుడు సంపాదిస్తున్నాడని ఊరికే ఉండేది కాదు. వెణ్ణీళ్లకు చన్నీళ్లు తోడన్నట్లు నాలుగిండ్లలో పాచి పని చేసి డబ్బు సంపాదించేది. ఖర్చులు పోగా మిగులు డబ్బుతో నెలకు వెయ్యి రూపాయల లెక్కన చీటీ కూడా వేసింది.

ముత్యాలు తాగుడుకు బానిసైనాక పరిస్థితులు  తారుమారయ్యాయి. కూడ బెట్టిన డబ్బులన్నీ సారాయంగడి పాలు జేశాడు. కడ్తున్న చీటీని  ఎప్పుడు పాడాడో, ఏం జేశాడో తెలియదు.

ఇంకా చీటీ డబ్బు ఉందను కొంటున్న ఓబులమ్మ మొగుడు చీటీ ఎత్తేశాడని తెలిసి నిలువునా నీరై పోయింది. పాడేసిన చీటీకి ఇంకా పదకొండు నెలలు కంతులు కట్టాలి.

ముత్యాలు జీతం ఇంటికివ్వక చాలా దినాలయ్యింది. తాగు బోతు తండ్రి వల్ల ఆడ పిల్లల చదువు కూడా అటకెక్కింది. ఫీజులు కట్ట లేక, పుస్తకాలు కొనలేక వాళ్లను బడికి పంపడం మానిపించి తనకు సాయంగా ఇంటి పనికి తీసుకెళ్తోంది.

పిల్లలు పనికి రావడం చూసి భారతమ్మ సెలవులు కాబోలనుకుంది. వరసగా వారం రోజులుగా తల్లి వెంట వస్తున్న ఆడపిల్లల గురించి ఆరా తీస్తే బడి మాని పించిన సంగతి భారతమ్మకు అప్పుడు తెలిసింది. మొగ పిల్లాడిని మాత్రం అతి కష్టం మీద బడికి పంపుతున్నానంది ఓబులమ్మ.

భారతమ్మకు అలిమేలు పైన కోపం ముంచు కొచ్చింది. ' వాణ్ణి కూడా అపేయ లేక పోయావా' అంది.

'మొగ పిల్లోడు కదమ్మా' అన్న ఓబులమ్మతో 'వాడు చేసుకున్న పుణ్య మేమి ? వీళ్లు చేసుకున్న పాప మేమి? ' అని నిలదీసింది.

'చదుకోకున్నా వీళ్లు మొగుని అండతో బతికి బట్ట గలరు. మొగ పిల్లోడికి సంపాదించక తప్పదు కదమ్మా 'అంది అమాయకంగా .

'ఏడ్చినట్లుంది నీ సిద్ధాంతం . మరి మొగుడుండి కూర్చొని తినక  నువ్వెందుకు అష్ట కష్టాలు పడుతున్నావు? అని అడిగింది.

వాళ్లను బడి మాని పించక . వాళ్లకు నేనూ ఎంతో కొంత సాయం చేస్తాను.  ఈ సమత్సరం పూర్తి కాని . ముగ్గురు పిల్లల్నీ వెల్ఫేర్ హాష్టల్లో చేర్పించే ఏర్పాటు చేస్తాను.' అని భరోసా ఇచ్చింది భారతమ్మ .

భారతమ్మ వాళ్లింట్లో పనికి కుదరక ముందు లారీ డ్రైవరుగా ఉన్న మొగుడి గురించి ఆ తర్వాత వాడు చేస్తున్న నిర్వాకం గురించి చెప్పుకొచ్చింది ఓబులమ్మ.

ఒక సారి చీనీ తోట కోసం మొక్కలు కొన్న ఆసామి బేరం కుదిరింది ముత్యాలుకు. వాటిని హంపాపురంలో తోట దగ్గర దించాలి. దార్లోనే కాబట్టి యజమానికి తెలిసే వీలు కూడా లేదు. కూర గాయలతో పాటు వాటినీ లారీలో ఎక్కిస్తున్నారు. డబ్బు అడ్వాన్స్ అడిగి ఇప్పించు కున్నాడు. ఫూటుగా తాగొచ్చాడు.

నర్సరీని ఎక్కించడానికి , దించడానికి టైం పడుతుంది. ఓనర్కు ఎలాంటి అనుమానం రాకూడదు. మనుషుల్ని ఎక్కించు కోవడం అందరూ చేసే పనే కాబట్టి ఓనర్ పట్టించు కోడు. కాని లోడ్తో వచ్చే విషయం తెలిస్తే డేంజర్.

అనుకున్న సమయానికి అనంత పురం చేరు కోవాలని ఆగ మేగాల మింద బండి నడుపుతున్నాడు. దానికి తోడు తాగున్నాడు. క్లీనర్ ఒక పక్క ' అన్నా స్లో అన్నా స్లో' అంటున్నాడు. రైతు కూడా 'మెల్లింగా తోలప్పా'   అని హెచ్చరిస్తూనే ఉన్నాడు.

వాళ్లు హెచ్చరించే కొద్దీ సమయానికి లోడ్ దించి చేరుకోవాలన్న తొందరను గుర్తు చేసి నట్లయింది ముత్యాలుకు. మరింత స్పీడు పెంచాడు. ముందు వెళ్తున్న బండిని ఎడమ పక్క నుంచి ఓవర్ టేక్ చేశాడు . క్షణాల్లో లారీ డివైడర్ పై కెక్కి అటు పక్కకి బొల్తా కొట్టింది.

డివైడరు మీదికెక్కిన లారీని రోడ్ మీదికి తేవడానికి చేసిన ప్రయత్నంతో స్పీడ్ మీద అటు పక్క కెళ్లిన లారీ ఎడమ పక్కకు ఒరిగి పోయింది. లోడ్ మొత్తం చెల్లా చెదురై పోయింది. పెద్ద బండి కావడం వల్ల కాబోలు అదృష్ట వశాత్తు మనుషులకు ఎమీ కాలేదు . ఇద్దరూ వెళ్లి ఎడమ పక్క డోర్ దగ్గర కూర్చున్న క్లీనర్ మీద పడ్డంతో చెయ్యి డోర్ కు కొట్టుకోని క్లీనరుకు భుజం ఫ్ర్యాక్చరయింది.

పర్యవసానం ముత్యాలు ఉద్యోగం ఊడింది. తాగి నడిపినందుకు డ్రైవంగ్ లైసెన్సును కూడా పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. కేసు పూర్తయితే గానీ అది చేతి కొచ్చేట్లు లేదు.

పని లేదు. ఆదాయం లేదు. తాగుడుకు డబ్బులు ల్లేవు. సారాయంగడి పక్కన చికెన్ కబాబ్ బండి నడిపే రెడ్డెప్ప మనిషి అవసరమై పనిలోకి పెట్టుకున్నాడు. అవసరానికి చేరాడు కానీ అతనిచ్చే డబ్బులు తన ఖర్చుకు కూడా చాలడం లేదు.

మొగుడి ఉద్యోగం ఊడినాక పెరిగే పిల్లల ఖర్చు,  తిండీ బట్టల ఖర్చు ఎక్కువవడంతో ఓబులమ్మ పక్కింటి పార్వతి ద్వారా బెల్దారి దగ్గర సిమెంటు , ఇసుక , ఇటుకలు అందించే పనికి కూడా పోసాగింది.

శారీరకంగా అంత కష్ట పడినా మనశ్శాంతి లేదు ఓబులమ్మకు .

రోజూ డబ్బుల కోసం గొడవ. తాగొచ్చి  కన్నూ మిన్నూ తెలియక ఓబులమ్మను చావ కొడుతున్నాడు. ప్రతి రాత్రీ ఇంటి దగ్గర తిర్నాలే. రాత్రవుతుంటే మొగుడు వచ్చి తగాదా పెట్టు కుంటాడని చలి జ్వరం వచ్చిన దానిలా వణికి పోతుంది ఓబులమ్మ . మొగుడూ పెళ్లాలు కొట్లాడు కొంటుంటే పిల్లలు బిక్క మొగాలేసుకొని భయంగా చూస్తుంటారు.

వాళ్లు రాం నగర్ రైల్వే ట్రాక్  పక్కన గుడిసెలో ఉంటారు. మొగుడు ఒక రోజు తాగొచ్చి రగడ చేసి నలుగురి ముందు జుట్టు పట్టుకొని ఈడ్చి కొడుతుంటే అవమానం భరించ లేక అప్పుడే వస్తున్న రైలు కింద పడడానికి పరిగెత్తింది ఓబులమ్మ. అంత వరకు వేడుక చూస్తున్న వాళ్లలో నుంచి ఒకతను పరిగెత్తొచ్చి  పక్కకు లాగి ఆమెను కాపాడాడు.

పేద వాళ్లుగా పుట్టడం మన తప్పు కాదు. మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అని అన్నీ అమర బుడిగా అమర్చి నట్లున్న ఇంట్లో పుట్టిన తెలివి తక్కువ వాడు కూడా దర్జాగా బతికేయ గలడు. కాని లేమిలో పుట్టి కన్నీళ్లను తాగుతూ కష్టాల్లో పెరిగి సొంత తెలివి తేటలతో  పైకి రావడం అంత తేలికైన పని కాదు. కానీ నీతిగా బతికితే గొప్ప ఐశ్వర్య వంతుడు కూడా అందుకోలేనంత గౌరవాన్ని అందు కోవచ్చు అనేది ఓబులమ్మ అభిప్రాయం. అందుకే అంత కష్ట పడుతుంది. కాని మొగుడి వల్ల ఇలా అవమానాల పాలు కావడం , చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించడం భరించ లేక పోతోంది.

తాగు బోతు భర్తల వల్ల భార్యలే కాదు చదువు సంధ్యలు లేక పిల్లల భవిష్యత్తు సర్వ నాశనమై పోయిన సంసారాల్ని ఎన్నిటినో  కళ్లారా చూసిన ఓబులమ్మ భారతమ్మతో మనసు విప్పి అన్నీ చెప్పుకొంది.

' ఆ సచ్చి నోడు నన్ను సంపేస్తాడమ్మా వాడితో ఏగను ఇంగ నా సేత కాదు. బాయో కుంటో చూసు కుందా మంటే  పిలకాయిలు దిక్కు లేనోళ్లయి పోతారు. నువ్వే ఏదైనా ఒక దారి సూపించి వాని పీడ ఇరగడ సెయ్యమ్మయ్యా ' అని ఒచ్చీ రాగానే అంగలార్చింది ఒకనాడు భారతమ్మ దగ్గర ఓబులమ్మ.

'మళ్లీ ఏమయిందే'

'నిన్న ఆదివారం కదా! తాగి సంద కాడ ఇంటి కొచ్చి పొట్లి కూర సెయ్య లేదని తగువేసు కున్న్యాడు. మాటా మాటా పెరిగింది. పనితోనే ఒళ్లు హూనమై సచ్చి బతకతా ఉంటే సావ గొట్న్యాడమ్మా.

పిలకాయిలు నోరు కట్టుకోని పచ్చడి మెతుకులు గానీలే  పెట్టింది తింటారు . ఈ సచ్చినోడు దమ్మిడీ పని సెయ్యడు . వీడికి తాగడానికి డబ్బు లెక్కడిదా అనుకున్నాను. తెల్లార్తో లేచి చూస్తే ఉట్టి మిందున్న దుత్తలో శని వారం బట్వాడా చేసిన లెక్క లేదు. వారం కష్టం. మాయక్క కూతురు పెండ్లుండాది . పిల్లోళ్లకు గుడ్డలు కొందా మనుకున్న్యాను. అక్కడైతే సూడడని పెట్న్యానమ్మా . కంట్లో పాపను కూడా కత్తరించే రకం. ఎట్ల కనిపెట్టినాడో సూడమ్మా' ఓబులమ్మ కంట్లో కన్నీరు కాల్వలు గట్టింది.

'వాడి సంగతి తెలిసీ ఇంట్లో ఎందుకు పెట్టావే?'
సేతిలో డబ్బులుంటే భారతమ్మ దగ్గర ఇచ్చి పెడుతుందీ మధ్యన. అదే అడిగింది భారతమ్మ .

'శని వారం పని లోంచి ఇంటి కొచ్చే పాటికి పొద్దు బోయిందమ్మా. అలిసి సొలసి ఒచ్చినానా. ఓపిక లేక ఆడ ఎందుకు సూస్తాడులే అనుకొన్నా . ఉదయాన్నే లేచి డబ్బు సంగతి మర్చి పోయి పనిలోకి వచ్చేశా. అక్కడ జరిగింది తప్పు.'

' పొయిన డబ్బు ఆ అంటే వస్తాదా ఊ అంటే వస్తాదా ? ఇకనైనా జాగ్రత్తగా ఉండు. అవునూ ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇవ్వరాదా? ' భారతమ్మ  సలహా ఇచ్చింది.

' పోలీసులు మాత్రం ఏం జేస్తారమ్మా? పట్టక పోతారు నాలుగుతన్ని తగలేస్తారు దాని వల్ల నాకు ఒరిగేదే ముంటాది . ఒచ్చినాక నరకం సూపించడని గ్యారంటీ ఏముంది. దెబ్బలింకా ఎక్కువవతాయి ' ఓబులమ్మ కళ్లలో తనపైన తనే జాలిపడుతున్న  ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఓబులమ్మ కష్టాల గురించి విని ఆమె కంటే ఎక్కువగా బాధ పడ సాగింది భారతమ్మ. ఈ సమస్యకు పరిష్కారమే లేదా? అని పరి పరి విధాలుగా ఆలోచించింది.

భారతమ్మ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. థర్డ్ ఫ్లోర్ లో ఉండే ఝాన్సీ, ఫోర్త్ లో ఉండే సరస, సుధ భారతికి వాకింగ్ ఫ్రెండ్స్ . ఒక్క వాకింగ్ అనే కాదు ఎక్కడి కైనా వెళ్లాసి వస్తే అందరూ కలిసి వెళ్తుంటారు

వాకింగ్ సమయంలో ఓబులమ్మ గురించి వాళ్లతో చర్చించింది భారతి. సరస భర్త సి.ఐ . అతనికి ఈ విషయం చెప్పి సలహా అడిగారు.

అతను 'ఏదైనా తప్పు చేసినట్లు ఆమెను కంప్లైంట్ ఇవ్వ మనండి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను' అన్నాడు.

సాక్ష్యాలు లేకుండా కంప్లైంట్ ఇచ్చినా లాభ ముండదను కున్నారు వాళ్లు. అది విన్న ఓబులమ్మ పార్వతి సాయం కోరింది.

పార్వతికి ఓబులమ్మ మంచి తనం మింద గౌరవం ఉంది. భర్త వల్ల ఆమె పడుతున్న తిప్పల మీద సానుభూతి ఉంది. ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు, వాళ్ల ప్రవర్తన, వాళ్లు తల్లికి సాయపడే తత్వం చూస్తే ముచ్చ టేస్తుంది పార్వతికి. ముత్యాలు వల్ల వాళ్ల జీవితాల్లో చీకటి అలుముకున్న సంగతి పార్వతి నిత్యం కాళ్లారా చూస్తున్నదే .

'నేను చేసే సాయం ఏముందక్కా' అడిగింది పార్వతి.

'నా మొగుడు నన్ను కొట్టేటప్పుడు వాడికి కనిపించ కుండా వీడియో తియ్యాలి. నాకు ఫోనుంటే పిల్లల్నే తియ్య మనే దాన్ని ' చెప్పింది ఓబులమ్మ .

పార్వతి భర్త సహృదయుడు. బేల్దారు పని చేసి రోజూ 500 దాకా సంపాదిస్తాడు.  అతని కిందే పార్వతి ఓబులమ్మ కూలి పని చేసేది. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. పక్కనే ఉన్నా ముత్యాలు వ్యసనాలకు బానిస  అని తెలిసి అతనికి దూరంగా ఉంటాడు. మాట మాత్రంగా అయినా పలకరించడు. వాళ్లకు ఒక కొడుకున్నాడు. పేరు మోహన్. పదవ తరగతి చదువుతున్నాడు .

పార్వతి వీడియో తియ్యడం గురించి భర్త రాజుకు  చెప్పింది. రాజా ఒక నిముషం పాటు ఆలోచించి  'నేను తియ్యడం ఎవరైనా చూస్తే బాగుండదు'  అని అన్ని జాగ్రత్తలూ చెప్పి కొడుకు మోహన్ కు  ఆ పని అప్ప జెప్పాడు.

ఓబులమ్మ మోహన్ ను ముందే హెచ్చరించి మొగుడు తాగి ఇంటికి రాగానే ఏదో ఒక విషయంగా గొడవ పెట్టుకొనేది. కేసు బలంగా ఉండాలని బాధని పించినా మరీ రెచ్చ గొట్టి దెబ్బలు తినేది. అవన్నీ క్రమం తప్ప కుండా వీడియోకు ఎక్కిస్తున్నాడు మోహన్.

ముత్యాలుకు ఒక అల వాటుంది. గొడవ పడే టప్పుడు చేతికి ఏది దొరికితే దాంతో దాడి చేస్తాడు . అనుకోకుండా ఒక సారి దుడ్డు కర్ర దొరికింది. దాంతో తల మీద కొట్టాడు. బొట బొటా రక్తం కారుతుంటే పరారయ్యాడు. 

డాక్టర్ దగ్గరికి పోదా మంటే పెద్ద దెబ్బ కాదని ఒద్దని చెప్పింది. ఆ సర్టిఫికేట్ పనికొస్తుందని చెప్పి డాక్టర్ తో కట్టు కట్టించడమే కాక అతనికి ఓబులమ్మ దీన గాథను చెప్పి గట్టి దెబ్బే తగిలిందని రాయించారు.

ఎక్కడ దాక్కున్నాడో కొన్ని రోజులు ఇంటికి రాలేదు ముత్యాలు. అన్ని రోజులూ రోజంతా పని చేసినా కంటారా నిమ్మలంగా నిద్ర పోతా ఉంది ఓబులమ్మ

ఓబులమ్మ ఆశలపైన నీళ్లు జల్లుతూ ఉన్నట్టుండి ఒకనాడు ఊడి పడినాడు మళ్లీ. ఇంట్లో వాళ్ల సంతోషమంతా వాడి రాకతో ఆవిరై పోయింది.

'ఏ నల్ల నాగు బామన్న పెరికి వాడు కంటికి మొరుగ్గా సస్తాడనుకుంటే నా పాలిటి యముడు లాగా ఆ దొంగ సచ్చి నోడు మళ్లీ ఒచ్చి నాడమ్మయ్యా' అని అంగలార్చింది భారతమ్మింట్లో అడుగు పెడ్తూ ఓబులమ్మ

ఆ మాటతో భారతమ్మ మొహం మింద కూడా తెలియని దిగులేదో తారట్లాడింది. పోలీసులకు పట్టించడానికి తట్టుకోలేనన్ని దెబ్బలు తిన్న ఓబులమ్మ పట్ల జాలి ఎక్కువయింది కానీ ఎంత ఆలోచించినా ఆ సమస్యకు పరిష్కారం మాత్రం స్ఫురించ లేదు.

' తాగు బోతు ముండా కొడుకుల వల్ల గుట్టుగా ఉండే సంసారాలు రట్టవుతున్నాయి . శారీరక కష్టం మింద పిల్లల్ని సాకి సంతరించుకొనే ఆడవాళ్లు వేలాది మంది నరకం అనుభవిస్తున్నారు' అని వాకింగ్లో  ఫ్రెండ్స్ దగ్గర వాపోయింది భారతమ్మ.

ఆ రోజు శనివారం. కూలి డబ్బులు అందే దినం . అందుకే వచ్చుంటాడు అని అంచనా వేసిన ఓబులమ్మ  పని నుంచి నేరుగా భారతమ్మ  ఇంటి తలుపు తట్టి డబ్బులు ఆమె చేతిలో పెట్టి ఉత్తి చేతుల్తో ఇంటి కొచ్చింది. వాని అంతు చూడడానికి ఇదే సివరి దినం కావాలి అని తీర్మానం సేసుకొని కాసుకోనుండాది.

ఎం పని చేస్తాడో డబ్బులు యాన్నించి వస్తాయో కడుపుకు తింటాడో లేదో! అని ఓబులమ్మ అనుకొంటుండ గానే ఇంటి కొచ్చినాడు. కూడా ఒక యువకుడు. మంచం మీద కూచో బెట్టాడు. తనతో పాటు తెచ్చిన పకోడీ పొట్లాన్ని ఇప్పి ప్లేట్లో పోసి ఆ వొచ్చిన వాడి ముందు పెట్టాడు.

గుడిసికి వెనక పక్క పదడుగుల ఖాలీ స్థలముంది. చుట్టూ కంచెకు బీర,కాకర, చిక్కుడు, గుమ్మడి తీగలు అల్లి బిల్లిగా అల్లుకోనున్నాయి. ఒక మూలగా కనకాంబరాల చెట్లు . విరిగిన కుండలో నుంచి తొంగి చూస్తున్న చేమంతి పూలు . కంచె కానుకొని గుత్తులుగా విరగ బూసిన మైసూరు మల్లి పూలు, ఒక మూల మట్టి నీళ్ల తొట్టి , ఆశ్రమం లాగా ఉంది. కింద పచ్చని పేడతో అలికి ముగ్గులు పెట్టి గడప మెట్ల అంచులకు ఎర్ర మట్టి పెట్టి ఎక్కడా లేని కళా కాంతుల్ని తెస్తుంది ఆ ఇంటికి పెద్ద కూతురు సీత.

తన ఇంట్లో తల్లిని ఒక పని ముట్టుకో నివ్వరు పిల్లలు. మునగ చెట్టు కింద  పాత చాప పరుచు కొని హోం వర్క్ చేసు కొంటున్న కూతుర్ని పిలిచి కాఫీ పెట్టమన్నాడు ముత్యాలు. అక్కడే కట్టెలు కత్తరించు కుంటా ఉండిన ఓబులమ్మ 'నువు రాసుకో' అని తను వెళ్లింది. ముత్యాలుకు ఉడికి పోయ

Comments