కథ
ఇర్లచెంగి - రేడియో కథ
' నాకినిపిస్తానే ఉండాది. నేను సదుంకోనంటే సదుంకోను పో 'బుంగ మూతి పెట్టుకొని కోపంగా పుస్తకాన్ని మూలకిసిరేసి ఇంగింత మూతి ముడుచుకోని కూసున్నాను. '
' మీ ఇద్దురితో నాకు ఎత్తుబారమైపోయింది పాపా. ఐనా యాడ ఇనిపిస్తా ఉండాది సెప్పు? యాడో సెవులో పెట్టుకొని ఇంటా ఉండాదది. నీ కుళ్లు బుద్ది పాడుగానూ!'అని నన్ను తిట్టి మా యక్క దెగ్గిరికి బోయింది మా యమ్మ.
' నీకెన్ని సార్లు సెప్పాల పాపా! అది ఒకరు సంతోసంగా ఉంటే సూసి ఓర్సుకొనే రకమా . నువ్వు పెద్దదానివి. నీ ఎంగిలి పాలు తాగిందానితో మాటికీ ఎందుకీ తగువు. నువ్వన్నా ఇనాల నా మాట. దాన్ని ఆపు జేసి పండుకో ఇంక ' అనింది మాయక్కతో .
దాంతో రేడియోను కప్పుకున్ని బొంత కింద దాంచుకోని ఇంగా సవుండు తగ్గించింది మాయక్క.
దేవుని సాచ్చిగా నాకేమీ సరిగా ఇనిపించడం లేదు. అంతకు ముందు కూడా పాట ఏమాత్రం ఇనిపించ లేదు. కానీ ఎక్కడో కొంచిం రాగం ఇనపడతా ఉండాది . పాట ఏదనేది తెలిసి పోతావుండాది. సదువు కొనేది ఉడ్సిపెట్టి ఆ పాటే పాడుకుంటా ఉండా.
రేడియోను బొంత కింద పెట్టు కోని ఇంటా ఉండాది అని ఉక్రోషంతో ' సూడు కమలమ్మా నీ కండ్లతో నువ్వే సూద్దురా' అని మా యమ్మను నడవలోకి ఈడ్సుకొని పోయి కచ్చిగా మాయక్క కప్పుకోనున్ని బొంతను పక్కకు పెరికి సెవు కాడ పెట్టుకోనుండిన రేడియోను పెరుక్కున్న్యాను. ఆ బిడ్డి బిత్తర పోయింది.
' నీకు పరీచ్చలైతే నువ్వేడన్నా దూరంగా పొయ్యి సదుంకోవాల గాని ఆ బిడ్నెందుకు ఏపుకు తినేది సినపాపా' అని మాయవ్వ మా యక్కను ఎనకేసుకోనొచ్చింది. ' కావాలంటే నువ్వు గూడా పల్లికూటానికి పోవద్దులే ' అనింది.
అప్పుడు మాయక్క ఎనిమిది సదివి ఇంట్లో కూసొనింది. మాయవ్వ పోరు బెడితేనే పాపం ఇస్కూలు ఇడ్సి పెట్టి సట్టి కుండలు కడుక్కుంటా బుద్దిగా ఇంట్లో ఉండి పొయింది మాయక్క.
నేను యెడ్డె మంటే తెడ్డె మనే రకం కదా ! ఆండ పిలకాయిలకు సదువెందుకని మా యవ్వ ముందు నుంచి అంటానే ఉండాది. కానీ నేను మాయవ్వ వద్దనిందనే మొండికేసుకోని పోతా ఉండా ఇస్కూలుకు
' పెదిమికి మించిన పల్లై పొయినావు, యాడన్నా సావు . ఇస్కూలికి పొయ్యేటప్పుడు మాత్రం బస్సు కింద పడకుండా కొంచిం వొల్లు దెగ్గిర బెట్టు కోని పొయిరా' అనిందప్పుడు.
అప్పుడట్లా అపశకునం మాటలు మాట్లాడతా ఉండాదనే బయపడి మమ్మల్ని 'ఇంగ సదివింది సాలు ఇంట్లో కూసోండి ' అనింది మా యమ్మ కూడా. ఆ మాటతోనే ఎర్రి యామాళం మాయక్క ఇస్కూలుకు పోకుండా నిల్చిపోయింది. ఇప్పుడు మళ్లీ రేడియో రగడతో నన్నూ నిల్చి పొమ్మని రామాయణం మొదులు బెట్టింది మాయవ్వ.
మాయవ్వ శానా అసాద్దురాలు లే . ఉడుం పట్టు బడతాది దేనికయినా. ఆయమ్మకు అడ్డం జెప్పాల్సొస్తే మా నాయినిక్కూడా బయమే . అందుకే ఆయమ్మ ఏమైనా సెప్తే సద్దు లేకుండా ఇంటారు.
నేనేం తక్కువ దాన్నా ! మాయింటి గోడ కేసిన బంక మొన్నా నేనేమైనా . మా యవ్వకు అడ్డం దిడ్డం పుట్టిందాన్ని .
మాయక్క దెగ్గిర్నించి రేడివో పెరుక్కున్యానా. పాపం మాయక్క బొంత ముసుగేసుకోని ముడుక్కునింది. లోపల నన్ను తిట్టుకోకుండా ఉంటాదా?
అంతే నాకు సదవబుద్ది గాలా. 'తెల్లార్తో లేపు' అని మాయవ్వకు సెప్పి పండుకుంట్ని. అది గమనించి ' రేడియో ఇయ్యి సినపాపా ' అని మాయక్కొచ్చి సెవుల దెగ్గిర గుస గుస లాడింది. ఊహూ నేనియను అనబోయి ఇద్దురూ ఇందారి అని రేడివోను గెట్టింగా వాటేసుకోని మా యక్క బొంతలో దూరి పండుకున్యాను. అంతే ఎప్పుడు నిద్రపూడ్సినానో ఆ బగమంతునికే దెలియాల .
'యాకుందేందు తుషార హార ధవళా
యాశుభ్రవస్త్రాన్వితా
యా వీణా వర దండ మండితకరా
యా సేతు పద్మాసనా '
తెల్లార్తో ఈ శ్లోకం ఇనిపించిందా నాకు. అయ్యో తెల్లారి పొయ్యి ఇంత సేపయ్యిందా ? అని ఉలిక్కి పడి లేచినాను. మాయక్క గిన్నీ సెంబులు తోమతా రేడివో ఇంటా ఉండాది. నాకు యాడ లేని కోపం ముంచుకో నొచ్చేసింది. 'రేడియో ఆపు సెయ్. నేను సదుం కోవాల ' అని కోపంగా గెట్టింగా అర్సినాను.
'పిశాచి పిల్ల బుట్టింది నా కడుపులో 'అని మాయమ్మ గొణిగింది వాకిట్లో ముక్కర్రేస్తా . మా నాయిన పాలు బిండుకోని సెంబుతో ఇంట్లోకి వస్తా ఉండాడు. నా మాటల్ని ఇనినట్లుండాడు.
' నువ్వు ఇస్కూలుకు బొయ్యి సదువుకుంటా ఉండ్లా నాయినా , అక్క రేడియోలో సెప్పే పాటాలన్నా ఇననీమ్మా' అని నా కోపం మింద సన్నీళ్లు సల్లి సెయి బట్టుకోని పెల్లో ఉండే కనకాంబరాల సెట్ల దెగ్గిర సట్లు కడిగి బోర్లించే దిన్ని మింద కూసో బెట్నాడు, ఈడ కూసోని సదుముకో అని
ఏడుపు బిగదన్నుకోనొస్తా ఉండాది నాకు. సదువులా సట్ట బండలా. రాత్రి రేడియోను పట్టుకొని పండుకున్యాను గాని ఏదీ ఇనిన గెవనం ల్యా.
మాయమ్మొచ్చి తలకు నూని బెట్టి సెక్క దూబాని సేతిలో బెట్టి పొన్నెక్క దెగ్గిర్కి బొయ్యి రొండు జళ్లేసుకొని రాబో అని తరిమింది.
ఒచ్చినాక మాయమ్మ రాత్రి మల్లిపూలు మొరుం కనకాంబరాలు కలిపి కట్టి నీళ్లు సల్లి తెల్లని తడిగుడ్డలో సుట్టి వాకిట్లో పందిలి పైన పెట్టిన పూలు సేతి లోకి తీసు కొనింది. మద్దిలో పండ్లతో దారాన్ని తుంచను పట్టు కునిందో లేదో ! మాయమ్మ చీర బట్టుకొని కోపంగా గెట్టిగా ఈడ్సి నాను. నోటితో తుంచడానికి పెట్టు కున్న పూలను నోట్లోంచి తీసేసి ' ఏం పాపా' అనింది .
' ఏం పాపా అని మాయమ్మను ఎక్కిరించి ' నేను ఇస్కూలుకు పొయ్యే బిడ్నని నీకు తెల్దా ! ఇంట్లో సూసే వాళ్లు ఎవురుండారని? ఆ బిడ్డికి కూడా నాతో సమానంగా పూలు తుంచతా ఉండావే ' అన్న్యాను
' ఇందా . తిరుగిట్లా. మొత్తం నీకే పెడ్తాను ఊరేగు ' అనింది. సగం నీకిచ్చి సగం అక్క నేను పెట్టు కుందా మనుకుంటే ఓర్పు లేదే నీకూ ' అని మొత్తం నాకే పెట్ట బోయింది .
నేను ఒద్దని ఆ పక్క తిరిగి నాను. పద్దన్నే ఊరికే ఉడకాడించి సంపొద్దు పాపా నన్ను . నా నెత్తురు నా నోట్లో పోసేదానికి పుట్న్యావు నువ్వు . ఏమన్నా సేసుకో నాకు పనుంది ' అని పూలు దిన్ని పైన బెట్టేసి కూలోళ్లకు సద్ది కలపక పోను గుడ్సింట్లోకి పోయింది.
నేను కత్తి పీట దెచ్చి రొండు బాగాలు నాకు. ఒగ బాగం వాళ్లిద్దరికి తెగ కోసి ఒక బాగం ఆడే గుడ్డలో సుట్టి మిగిలింది నా తల్లో పెట్టమని మాయమ్మ దెగ్గిరికి పొయినాను . అవి తల్లో బెట్టి ' తేరు సింగారించి నట్ల బాగుండాది పో ఇంక ' అని తోసింది . ఇట్లా సేస్తాననే నన్ను కుళ్లు బోతు అని ఏడిపిస్తారు మా ఇంట్లో వాళ్లు .
మా కంటే రొండుమూడేండ్లు ముందే మా మామ రేడియో కొనుక్కో నొచ్చినాడు. ఐద్దాక నేను మాయవ్వోలింట్లోనే గదా ఉండి సదుంకొనింది. ఆ పొద్దు రేడియో తెచ్చిన్నాడు నా సంతోసం సెప్పనలివి కాదు . దాని గురించి సెప్పడానికి మాట లేడ సరి పోతాయి.
నడీదిలో సల్బీలాట ఆడుకుంటా ఉండాము పిలకాయలంతా. ' మేయ్ సిన్నెయ్య ఒంటెద్దు బండిలో మీ ఇంటి కేందో తెచ్చినాడుమే ' అని నీల పరిగెత్తుకోనొచ్చి సెప్పింది.
ఆట్లాడ్తా ఉన్ని కుశాలను నడీదిలోనే దిగ్గొలికేసి ఇంటి పక్కకు పరిగెత్తబొయినానా . దాంతో నా జతలో ఆడతా ఉన్ని పిలకాయిలికి కోపమొచ్చేసింది.
'సగమాటలో బొయ్యింది సాకలోడి పెండ్లాం
మద్ద్యాటలో బొయ్యింది మంగలోడి పెండ్లాం'
అని అరవ బట్టిరి . కాంత అయితే
' అడ్లా బుడ్లా- నాగలా బుడ్లా
పండగ నాడు- పైడు బీమేసుకొని
పటుక్కని సావాల '
అని నా ఎనకే పెరిగెత్తుకుంటా ఒచ్చి మెటికలు ఇర్సింది.
ఏదీ పట్టించుకోలా ఒకే పరుగుతో ఇంటికొచ్చినాను. వాకిట్లో దిన్ని మింద పెద్ద పెట్టొకటి గుడ్డ కప్పి పెట్టుండాది. మాయవ్వ సిన్నెయ్యతో మాట్లాడ్తా ఉండాది .
నేను మెల్లింగా పొయ్యి ఎందో సూద్దామని గుడ్డ పైకెత్తినానా, మాయవ్వ ' ఒసేయ్ నీకు పున్నిముంటాది. దాన్ని అంటొద్దు ' అని అర్సినంత పని జేసింది. ఎట్ల సిన్నెయ్యా ఈ తులవ బిడ్డితో ఏంగేది. అని సిన్నెయ్య దెగ్గిర యాష్ట పోయింది.
మెల్లింగా మా యవ్వ దెగ్గిరికొచ్చి కొంగు బట్టుకోని యాలాడతా ' ఏందివా అది ' అని ముదిగారాలు పొయినాను.
'ఏందో మీ మామొస్తే గాని తెలీదు . రేడివోనో ఏందో నంట. ఆ పెట్టి మాట్లడతాదంట. పాటలు కూడా పాడతాదంటా. అంగిట్లో దీన్ని తెచ్చే ముందు సూపించినారంటలే. సిన్నెయ్య తాత సెప్తా ఉండాడు.' అనిందో లేదో తుర్రుమని తూనీగి మాదిరిగా ఈదిలోకి పెరిగెత్తుకోనొచ్చి ఆట్లాడతా ఉన్ని వాళ్ల మద్దెన గెసబోసుకుంటా నిలబడినాను. అందురూ ఏమి అన్న్యట్లు నా పక్క సూసినారు.
' మేయ్ మా మామ రేడివో తెచ్చినాడు ' అన్న్యాను సంతోసం పట్టలేక. అవునామే అంటా అందురూ నా సుట్టూ సేరినారు. అంతా ఇని మాయవ్వోలింటికి బయలుదేరినారందురూ .
వాకిట్లో దూరం నుంచే ఆ పెట్టిని సూస్తా నిలబడి నారు. శానా సేపైనాక మా మామ సైకిల్లో వొచ్చి దిగినాడు. ఎనకే అందురూ ఇంటి వాకిటి దాకా బొయినాము. మా మామ ఓర సూపుతో దాన్నొక సారి సూసి ఏమీ పట్టనట్లు పెళ్లోకి బొయ్యి కాళ్లూ సేతులు కడుక్కో నొచ్చినాడు.
అంత మంది వాకిట్లో మేము కాసుకోనుండేది సూసి ' ఏం పాపా ఈడేమన్నా కోతులాడతా ఉండాయా? ఫొండి ముందు ' అని గెదిరినాడు . నాకు వాళ్ల ముందర తల తీసేసి నట్లయింది. వాళ్లను సందు దాకా పిల్చుకోని బొయ్యి ' రేడివో పెట్నాక సూద్దురు గానీ ఇప్పుడు పొండి మే ' అని బలమంతంగా పంపించేసి లోపలికొచ్చినాను .
మా మామ రాసుకొనే చిన్న బెంచీని పెద్దింట్లో పెట్టి దాని పైన రేడివోను పెట్నాడు. దానికుండే మరల్ని ఇట్లా అట్ల తిప్పినాడు . గుర్రు గర్రు అని శబ్దమొస్తా ఉంటే నాకు శానా కుశాలయింది.
' ఒరే నర్సిమ్మా అప్పుడే దాన్ని పెట్టొద్దుండురా' అని తట్టలో పసుపు కుంకం సాంబ్రాని కడ్డీలు, కాయా కర్పూరం తెచ్చింది మాయవ్వ. రేడివోకు అక్కడక్కడా పసుబ్బూసి కుంకం బొట్లు పెట్టింది. 'ఏం పనమ్మా ఇది తలుపులకు బెట్టినట్లు'అని మామ కోప్పడినాడు. .
' నీకు తెలీదుండురా . కను దిష్టికి కొండలో ఉండే బండలు కూడా పగిలి పోతాయి. ఇంగ లేక లేక దెచ్చిన దీని మింద ఎంతమంది కండ్లు పడతాయో ! పూజ సేస్తే తప్పేముండాది' అని కాయ గొట్టి కర్పూర మెలిగించి ఆరతిస్తా ఉండాది. నేను పరిగెత్తుకోని బొయ్యి బద్రాచ్చి పూలు కోసకొచ్చి రేడివో పైన బెట్టి మా మామ పక్క సూసినాను. 'అవ్వా మనవరాలు కలిసి అప్పచ్చులు కాల్చి తళిగెయ్యక పొయినారా?' అన్న్యాడు నవ్వతా.
మామామ నవ్వు సూసి ఆరతి నేనూ ఇస్తానని మాయవ్వ సేతిలోని గెంటి పెరుక్కున్యాను.
' ఆ బిడ్డి ఆడినట్టంతా ఆడుమా . మింద ఏసుకోని పావడ గీవడ కాల్చుకుంటే గానీ నీ సెల్లాటం తీరదు ' అన్న్యాడు మా మామ . మా తాతను పిల్చకొద్దామని పెద్దింట్లోనుంచి బయటికి అడుగు పెట్న్యానా. సందులో కాంతా వాళ్లు తొంగి తొంగి చూస్తా ఉండారు.
మా మామ రేడివో దెచ్చిన సంగతి ఊరంతా తెలిసి పోయింది. ఆ సివరుంటాదా మా ఇల్లు. మాయమ్మ మాయక్క , మా యవ్వ, మా అబ్బొడోళ్లు అందురూ ఆ ఇంటి నుంచి పరిగెత్తుకోనొచ్చినారు. వాళ్లొచ్చేది సూసి ఇంకా ఈదిలో ఉన్నొళ్లు కూడా ఒచ్చినారు. ఇల్లు కొంచేపిటికే తేరు తిర్నాలయి పోయింది.
రేడివోలో పాటలు, పద్యాలు , బుర్ర కథలు , సేద్దిం పనులు అన్నీ వస్తాయి. దినాము ఇంటా ఉండాము.
మామామ ఎప్పుడొస్తాడా అని ఉర్లో వాళ్లొచ్చి కాసుకోనుంటారా . రాంగానే పిల పిల మంటా అంతా పెద్దింట్లోకి నువ్ ముందా నేను ముందా అని పొయ్యి గప్ చిప్ గా కూసుంటారు. మొగోళ్లు నడవలో దిన్నిల పైన సేరతారు. మామామ రేడివో పెట్టి బయటికి పోంగానే సందు ల్యాకుండా రేడివో దెగ్గిరికి జరిగి కూసుంటారాండోళ్లు.
అందురి కంటే నేను ముందరుంటానా? ఉన్న్యట్లుండి నీళ్లు దపికవతాది. లేసి పోవాల్నా, దోవుండదు. నాకు కోప మొచ్చి 'జరిగి దోవిడ్సండి . ల్యాక పోతే మా ఇంటికి రావొద్దండి ' అని కోపంతో అంటాను. మరి మా రేడివో కదా ! అడ్డంగా కూసుంటే నాకు కోపం రాదా. అందుకే కావాలనే మాటికీ లేసి ఈడికీ ఆడికీ తిరగతా ఉంటాను నేను.
'ఈ బిడ్డి ఒక సోట కుదురుగా కూసోదు కదా ! 'అనింది సుందరమ్మవ్వ సిలగుండ్ల పల్లి లచ్చుమక్కతో.
' మీ అక్క సూడు ఎంత అనుకువుగా కూసోనింటాది. నువ్వేంది మాటికీ లేసేది పొయ్యేది వొచ్చేది అనింది ఎగవింటోళ్ల కమలమ్మత్త.
' మా ఇల్లు మా రేడివో నేను అట్లే తిరగతా ఉంటా' అన్యాను .
వాళ్లంతా పూడ్సినాక ' సినపాపా పెద్దా సిన్నా ల్యాకుండా ఏందా మాటలు. నీకు శానా పెగ్గి అనుకుంటారు. సీటికీ మాటికీ నీళ్లని నిప్పులనీ లేసి తిరిగినావంటే మామకు సెప్తా. నీ కాళ్లిరగ్గొడతాడు 'అని తిట్టింది మాయమ్మ.
ఇంగో మూడేండ్లయిపోయా. నేను సిత్తురిస్కూల్లో ఆరులో సేరినాను. ఎట్లా ఎనిమిదిలో ఉండే మాయక్కకు క్యారీరు కడతాది కదా! మాయమ్మ . అందుకని మాయవ్వోలింటి నుంచి కాకుండా మా ఇంటి నుంచే పోతా ఉండా ఇస్కూలుకు .
మా నాయిన కూడా కొన్నాళ్లకు మర్పీ
రేడియో తెచ్చినాడు. అది 1929 లో కనిపెట్టినారంటా. 'ఆ సమత్సరమే నేను పుట్టింది కూడా ' అని మా నాయన సెప్పినాడు. ' ఆ రేడివో సంగతి నీ కెట్ల తెల్సు నాయినా ' అంటే రేడియో అంగిడోడు సెప్పినాడనినాడు. మా నాయిన దాని గురించి ఇంగా ఎన్నో సెప్పినాడు . దాన్ని ఇంగిలీసోళ్లు కనిపెట్టినారంటా వాళ్లది ఇంగులాండ్ దేశమంటా. వాళ్లు మన దేశంలో మీరు పుట్టక ముందు శానా ఏండ్లు ఉండి పొయినారు ' అనినాడు.
మా నాయన తెచ్చిన రేడివో ఒకడుగు పొడుగే ఉండాది. మామోలంత పెద్దది తేలేదని ఏడ్సినాను నేను .
' తిక్క దానా . ఇదైతే యాడన్నా పెట్టుకోవచ్చు . పెద్దదయితే ఒగ సోటే ఉంటాది' అని సెప్పింది మాయక్క. రేడివో కాదు రేడియో అనాలని కూడా మా యక్క శానా సార్లు సెప్పిచ్చింది.
నేను మూడులోకి రాంగానే మాయక్క మా యవ్వోలింటి నుంచి మా ఇంటికి పూడ్సింది. నేనూ మా ఇంట్లోనే ఉండి ఇస్కూలుకు బొయ్యి సదుకుంటానని ఏడ్సినాను . ఇద్దురూ కొట్లాడు కుంటామని మాయమ్మ వొద్దనింది. మనింట్లో రేడియో కూడా లేదు కదా ! అని గుర్తు చేసింది మాయమ్మ. ' నువ్వు పక్కన లేకుంటే నాకు నిద్దర్రాదే రాజా కుట్టీ ' అని మాయవ్వ కూడా వాళ్లింట్లోనే ఉండమని బంగ పొయింది
మా నాయన రేడియో తెచ్చినాక మాయక్కకు, నాకు , మా పెదబ్బోడికి పండగే పండగ.' ఏ వస్తువైనా ఒగరి సేతి మింద సుగురుగా వాడాల లేక పోతే సెడిపోతాది ' అంటాది మాయమ్మ. 'ఐతే నేనే తిప్పతా మీరెవురూ ముట్టుకోకండి' అన్న్యాను నేను. ముగ్గురూ నేనంటే నేనని కొట్లాడు కున్నాములే
' గండా గుండి ' అని నన్నే తిట్టింది మాయమ్మ. అయినా నేనియలేదు. కానీ నాకు సరింగా పెట్టేది ఒక్కోసారి రావడం లేదు. అప్పుడు మాయక్కను పెట్టియ్య మంటాను. పాటలు, ఆదివారం పిలకాయిల బాలానందం , బాల వినోదం తప్పకుండా ఇనే వాళ్లం .
నాటకాలు, సినిమాలు ఇనేటప్పుడు నా వొళ్లోనే పెట్టుకుంటానని నాతో కొట్లాడతారిద్దురూ. . ఎవురి సేతిలో ఉంటే ఏమి అని నేను ఎదురు తిరగతా. అయితే నాకియ్యి అంటాది మా యక్క. నేనిస్తానా ?
మంచి నీళ్లకు సేంద బాయికి ఒస్తారా. అప్పుడు రేడియో పట్టుకొని ఈది దిన్ని మింద బోయి కూసుంటాను. నీళ్లకొచ్చినోళ్లు నా దెగ్గిరికొచ్చి కొంచేపు ఇని పోతారు. మా యక్కయితే అట్ల కూసోదు. ఆ బిడ్డికి రేడియో ఉందని అందురికీ సూపెట్టుకుంటా ఉంది అనుకుంటారని బయం.
ఎండా కాలం లీవులిచ్చినారు. మా పెద్దమ్మోళ్లూరికి పొమ్మంటే పోనని ఏడ్సినాను. ఆడ వాళ్లింట్లో రేడియో లేదని. ఏండా కాలం లీవుల్లో రాత్రి ఎన్నెట్లో పండుకోని రేడియో పెట్టుకోని అందురూ ఇంటా ఉంటే మా యానందం సెప్ప నలివి కాకుండా ఉండేది.
మాయక్క ఎనిమిదిలోనే ఇస్కూలు మానేసిందా . నేను ఎనిమిది పాసయితే సేతికి గడియారం కొనియ్యాలని ముందే మా నాయనకు సెప్పే సుండా. క్యామీ వాచ్చే కావాలని నాను.
సిలోన్ లో మద్యానం మూడున్నరకనుకుంటా తెలుగు పాటలు ఏసే వాళ్లు . ఆ పాటలు ఇనేటప్పుడు ఆ వాచ్ గురించి దినాము సెప్తారు రేడియోలో . అదిప్పటికీ నా నోటికొస్తాది. 'క్యామీ వాచ్చిగల్ . ఉళగు యంగుం తేవై . కనక్కాగ కాలం కాట్ట క్యామీ వాచ్చిగల్ ' అని. అప్పుడు నా కొచ్చిన అరవం ప్రకారం అది అట్లా గుర్తుంది. తప్పుంటే సరి జేసి కొండి. ఆ వాచ్చే తెచ్చినాడు మానాయన . అదింగా మాంగడ పట్టి పోయి యాడో ఉండాల. దొరికితే మీకూ సూపిస్తాలే .
మహాసముద్రం దేవకి
13-2-2020
పెరిగి పెద్దయినాక రేడియో అన్నయ్య అక్కయ్యలతో నాకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. వాళ్లు రేడియో వాళ్లు కాబట్టి సెప్తా ఉండా. అన్నయ్య న్యాయపతి రాఘవ రావు గారు నన్ను ఎవరికి పరిచయం చేసినా 'నా వారసురాలు' అనేవాడు. నాకంత సీన్ లేదనే దాన్ని నేను. అదే నిజమైంది. నా ఫీల్డ్ వేరైపోయింది. చాలా చిన్న వయసులోనే బాలల అకాడెమీ సభ్యురాలుగా కూడా ఐదేండ్ల పాటు చాలా పెద్ద వాళ్లతో కలిసి పనిచేశాను .
నేను ఎడిట్ చేసిన తారంగం- తారంగం , గోరుముద్దలు అనే రెండు పిల్లల పుస్తకాలను బాలల అకాడెమీ ప్రచురించింది. వాటిలోని గేయాలు బాలానందం పిల్లలు రేడియోలో పాడే వాళ్లు.
విజయవాడ రేడియో స్టేషన్ లో పిల్లల కార్య క్రమాలు నిర్వహించిన ఏడిద కామేశ్వర రావు గారికి కూడా నేనంటే చాలా ఇష్టం . తురగా జానకి రాణి గారూ , నేనూ బాలానంద సంఘం లో కలుసుకొని గంటల కొద్దీ మాట్లాడు కొనే వాళ్లం . ఇదీ నా రేడియో సంగతులు . ఓ ఎనభై దాకా రేడియో ప్రసంగాలున్నాయి . కడప ఆడిషన్ కమిటీలో (జానపద గేయాల సెలెక్షన్ ) ఒక్కోసారి మూడేండ్ల చొప్పున మూడు సార్లు ( తొమ్మిదేండ్లు) సభ్యురాలిగా ఉన్నాను. రేడియో స్టేషన్ డైరెక్టరుగా పని చేసిన మల్లేశ్వరన్న మనకందరికీ ఆత్మీయుడు కావడం ఒక కుటుంబంలో వ్యక్తుల్లాగా మెలగడం సంతోషాన్నిచ్చే అంశం .
(రేడియో దినోత్సవ సందర్భంగా రమ అడిగితే ఆత్మీయులతో నా జ్ఞాపకాలను ఇలా పంచుకున్నాను . )
మహాసముద్రం దేవకి
13-2-2020
Comments
Post a Comment