నాకు నచ్చిన సినీ కవి - ఆత్రేయ
(ఎందరో మహానుభావులు - ఆత్రేయ )కొందరు కొన్నివిద్యలలో ప్రత్యేకంగా కనిపిస్తారు . వాళ్లను కారణ జన్ములంటారు . నాకు సినీ గేయ రచనలో పాట విన్న ప్రతి సారీ మహాను భావుడు అనిపించే వ్యక్తి ఆచార్య ఆత్రేయ .
ధనధాన్యాలతో తులతూగే సాంస్థానమయిన కిళాంబి వారి ఇంట పుట్టాడాయన. బాల్యంలోనే తల్లే సర్వస్వం అనుకొనే వాడు. ఆమె మరణం అతని మనసును కలచివేసింది. చిన్న వయసులోనే శ్రీనివాస వరదాచార్యులు అనే గురువు దగ్గర పద్యం రాయడం నేర్చుకున్నాడు. అప్పుడు మొలకెత్తిన కవితాలత చిగురులు తొడిగి పూలు పూసింది. నాటికలుగా, నాటకాలుగా, కమ్మని చంధో బద్ధ పద్యాలుగ, తీయని గీతాలుగా ఆ పూలు పరిమళించాయి. . నరసింహాచార్యులు అని పెద్దలు పెట్టిన పేరు ఆచార్య ఆత్రేయగా మారింది. నరసింహాచార్యులు లోని ఆచార్య శబ్దం, ఆత్రేయస గోత్రం లోని ఆత్రేయ శబ్దం కలిసి ఆ పేరు స్థిరపడింది. ఆ కలం పేరు ఒక వంశానికి గోత్రానికి పేరు తెచ్చింది.
ఆత్రేయ అంటే చంద్రుడు. చంద్రునికి, మనసుకి ఉన్న సంబంధం విడదీయరానిది. మనసుకు సంబంధించిన పాటలు రాసి మనసుకవి అని పేరు తెచ్చుకున్నాడు. తెలుగు నాటకరంగంలో కొత్త శకానికి ఆచార్యుడుగా ఆచార్య ఆత్రేయ పేరు సార్థక నామధేయమయింది .
ఉత్తి అనుమానం, వెంగాలు కరువు, పిచ్చాసుపత్రి ఆత్రేయ రాసిన తొలినాటికలు. 1940 లో ఆంధ్ర నాటక కళా పరిషత్ వారు నిర్వహించిన పోటీల కోసం ' శాంతి ' నాటకాన్ని రాసి ప్రదర్శించారు. బహుమతి రాకపోవడంతో అంత వరకు రాసిన నాటకాలన్ని చించేశారట . తర్వాత హిందూ ముస్లిం సమైక్యత ప్రధానంగా ' రషీదా ' నాటకాన్ని రాశారు. ఆకలి అనే ఏకపాత్రాభినయం రాశాడు. ఆంధ్ర నాటక కళా పరిషత్ కోసం , వెంకటగిరి అమెచ్యూర్స్ సంస్థ కోసం ' సాధన ' అనే నాటకం రాసి కొండముది గోపాలరాయ శర్మ గారి సలహాతో దాన్ని రెండు గంటలకు కుదించి సవరించి దర్శకత్వం వహించి , సహాయ పాత్ర ధరించి ఉత్తమ ప్రయోక్తగా , ఉత్తమ నటుడిగా బహుమతి పొందారు. పరివర్తన, వాస్తవం , విశ్వశాంతి ఇలా నాటకాలు చాలానే రాశారు.
ఆత్రేయ రాసిన చంధో బద్ధ రచనల గురించి విశ్వనాథగారనట్లు మీగడలో పంచదార కలిపి తింటే ఉన్నంత తియ్యగా , కమ్మగా ఆత్మకథ , సుప్రభాతం, అరణ్య రోదన అనే పద్య కావ్యాలు రాశారు. సరదాగా రాసుకున్న జాతకం పద్యాలూ ఉన్నాయి.
సినీ సంభాషణలు , వ్యాసాలు ఎన్నో రాసి మెప్పించిన ఆత్రేయ జీవనయానం మాత్రం క్లిష్టంగానే సాగింది. ఇంటరుతో చదువు ఆపి , చిత్తూరులోని ఆర్యవైశ్య యువజన సంఘంలో చేరి వాళ్లను ప్రోత్సహించి నాటకాలు ప్రదర్శించారు .
సాహిత్య సరస్వతి వరించినా అతనికి లక్ష్మీకటాక్షం దూరమయింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆత్రేయను కొంత మంది మిత్రులు ఆదుకున్నారు. ఉదర పోషణార్థం నాటకాల్లో వేషాలు వెయ్యక తప్పలేదు. పస్తులతో పంపు నీళ్లతో కడుపు నింపుకున్న రోజులూ ఉన్నాయి. వీధి దీపం కింద కూర్చొని గౌతమ బుద్ధ నాటకం రాశాడు.
లెక్కకు మించినన్ని నాటికలు రాసినా నేడు లభిస్తున్నది పదిహేనే . గేయాలు , పాటలూ మొదట్లో హృద్యంగా తన డైరీలో రాసుకున్నారు. సినిమాలకు రాసిన పాటల్ని మించి అర్థవంతంగా ప్రేమ, వేదన, అ ఇన్నుభవాలు , అనుభూతులతో నిండి ఉన్నాయవి.
అన్ని రచనలు ఒక ఎత్తు అందరినీ అలరించే విధంగా ఆత్రేయ రాసిన సినీ గీతాలు ఒక ఎత్తు . 1951 లో దీక్ష చిత్రానికి రాసిన ' పోరా బాయీ పో' తో మొదలై 1989 లో ప్రేమ యుద్దం చిత్రానికి రాసిన ' ఈ మువ్వల గానం - మన ప్రేమకు ప్రాణం 'అనే పాట దాకా 1200 పైగా ఉన్నాయి. సినీ గీత రచయితగా ఆయన స్థానం పదిలమైంది.
రచయితను చూసి సినిమాకు వెళ్లటం ఆత్రేయ సినీ రంగంలోకి ప్రవేశించాకే మొదలయింది. దసరా బుల్లోడు, ప్రేమనగర్, మంచి మనసులు, వెలుగునీడలు, ఆరాధన, ఆత్మబలం మొదలయిన చిత్రాల్లో ఆయన సంభాషణలు అందరినీ అమితంగా ఆకట్టుకున్నాయి.
ఆత్రేయ రాయక నిర్మాతల్ని ఏడిపిస్తాడంటూనే ఆయన చుట్టూ తిరిగి రాయించుకొని విజయాన్ని సాధించి కోట్లు సంపాదించుకున్న సినీ పరిశ్రమ చివరి రోజుల్లో ఆయన్ని చాలా బాధ పెట్టిందంటారు.
ఆత్రేయ గారి వ్యక్తిత్వం, ఆత్మీయత ఆయన రచనల్లో ప్రతిఫలిస్తాయి. ఉత్తమ దర్శకుడుగా, నాటక రచయితగా , నటుడిగా , సినిమా పాటల రచయితగా ఎన్నో అవార్డులు పొందారాయన .
మనిషికున్న ఇంద్రియాల్లో మనసు ప్రధాన మయినది. ఆ పేరు వినగానే తెలుగు సినీ జగత్తులో గుర్తొచ్చేది ఆత్రేయ. ఆత్రేయ అనగానే గుర్తొచ్చేది మనసు. మచ్చుకు కొన్ని చూద్దామా ?
మనిషగుపించని మాపటిలో రేపటిలో - మనసగుపించెను నా కెటులో ( అగ్గి రాముడు)
మనసు మధురమైనది - మమతలు నిండినది ( మంచి మనసులు)
ఒడ్డున పెరిగే గడ్డిపోచకు - హృదయమెందుకు ఉండకూడదు ( ఇది కథ కాదు )
నీకు నాకు ఉన్నదో చల్లని మనసు ( పొట్టేలు పున్నమ్మ )
తనువెల్ల మనసై - మనసెల్ల కనులై ( మానస వీణ )
మనసు అందం మనసుకు తెలుసు ( మమత)
మౌనమె నీ భాష ఓ మూగ మనసా ( గుప్పెడు మనసు)
మనసు మూగదే కాని బాసుండది దానికి ( మూగ మనసులు )
మనసు మూగది మాటలు రానిది ( మరో చరిత్ర )
కనులకు కట్టినావు ప్రేమ గంతలు - కన్నె మనసు ఆడింది దాగుడు మూతలు ( దాగుడు మూతలు )
ఈ ఉదయయం నా హృదయం- పురులు విప్పి ఆడింది - పులకరించి పాడింది ( కన్నె మనసులు )
ఒక మనసుకు రెక్క లొచ్చి ఎక్కడికొ ఎగిరింది ( ఆరాధన)
నీవు పెంచిన హృదయమే ( డా. చక్రవర్తి )
ఇలా మనసు కవిలో ఉన్నది వైవిధ్యాల పుట్ట .
మనసు సున్నిత మయింది అందుకే అది
' ఒకరికిస్తే మరలి రాదు .
గాయ మైతే మాసిపోదు
పగిలి పోతే అతుకు పడదు ' ( ప్రేమ నగర్) అన్నారు. అందుకే
' మనిషి తోటి వేళా కోళం - ఆడుకుంటే బాగుంటాది
మనసు తోటి ఆడకు మామా - ఇరిగి పోతే అతకదు మల్లా ' ( మూగమనసులు) అన్నారు.
' తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు నేలాగైనా
మనసు కొక్క గాయమైనా మాసి పోదు చితిలో
నైనా ( ఆడ బ్రతుకు)
అంత సున్నితమయింది కాబట్టే మన్నించే గుణం మనసుకు ఉందన్నారు.
' మనసిచ్చినదే నిజమైతే
మన్నించుటయే ఋజువు కదా ' ( మురళీ కృష్ణ).
' మనసుంటే మన్నించాలి
మనిషంటే మనసుండాలి' ( అంతే కావాలి)
మనసును దేవాలయంలా భావించారు ఆత్రేయ.
' పెరిగిన హృదయం దేవాలయం
ప్రేమే దానికి ధ్వజారోహణం' ( తల్లీ కొడుకులు )
అంటారు.
భావమంటే మనసు లోని భావమే.
' ఇస్తేను మనసు ఎంతో మెత్తనైనది
ఎదురు తిరిగితే అది కత్తి వంటిది. ' ( ఆత్మ బలం) . కన్నీళ్లకు అదే కారణ మవుతుంది కనుక
' మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికి సుఖము లేదంతే ' ( ప్రేమనగర్) అన్నారు.
మనసుకున్నసహజ గుణాల్ని
' ఇమ్మంటే ఇచ్చేది మనసు కాదు
పువ్వైనా నవ్వైనా నీ కోసం పూయదు ' (ఆత్మ బలం ) అంటారు.
'మనసనేది ఒకరికొకరుఇచ్చినపుడె తెలిసేది'(సెక్రటరీ)
' ఒక మనసు పొంగితే ఉరికేది కవితరా
ఇరు హృదయాలొకటైతే పాడేదిలాలిరా '( ఆడబ్రతుకు)
' మనిషికి మనసే కాపలా ( ఇంటికి దీపం ఇల్లాలు) మనసున్న మనుషులే మనకు దేవుళ్లు ( మూగమనసులు) అంటారు.
ఆత్రేయ గీతాల్లో భావకవిత్వపు ఛాయలు కనిపిస్తాయి .
' తలుపు మూసిన తల వాకిటనే
పగలూ రేయీ నిలుచున్నా ' ( చిల్లర దేవుళ్లు ) అని నిరీక్షణను వ్యక్త పరిచారు.
' రాయి మీటితే రాగం పలుకును
రాయి కన్న రాయివి నీవు
కసాయివి నీవు ' ( కన్నె మనసులు) అని హృదయం లేని ఆమెను దూషించాడు .
మనసును వెన్నతో, మల్లిపూలతో , మబ్బుతో, మందారంతో, చిగురాకులతో , విరి పానుపుతో , గాజుతో, శిలతో, ధ్యానంతో, బలిపీఠంతో పోల్చి రక రకాలుగా చిత్రించడం ఆయనకే సాధ్యం .
మనసు స్వభావాన్ని బట్టి ఎన్నో విధాలుగా వర్ణించాడు. మరెన్నో విషేషణాలతో రూపాన్ని వర్ణించాడు . మందిరం, పాలకుండ, పుస్తకం , నిండుకుండ ,మధుకలశం, చీకటి గుహ - ఇలా ఎన్నో! ఎన్నెన్నో! ఆయన ఎద కదిలిస్తే మనసు గీతాల జల్లులు కురుస్తాయి.
ఒక్క రకం పాటలతో ఎవరూ జనప్రియులు కాలేరు. పూలదండలో దారం దాగున్నట్లు ఆత్మీయతను ప్రతిబింబించే పాటలు రాసి మనసు కవిగా ప్రసిద్ధుడయ్యాడు ఆత్రేయ .
గుండెల్లో నిలిచి గొంతుల్లో ప్రతిధ్వనించే పాటలు రాసి అందరి మెప్పూ పొందాడు. శృంగారమైనా, మమకారమైనా , బాధ్యతయినా గుండె లోతుల వరకు కదిలించ గలగిన పాటలు రాసి సినిమా పాటలకు సాహిత్య మందిరంలో పట్టాభిషేకం చేయించాడు. ఎవరైనా, ఎవరి గురించయినా 'మాంచి పాట రాశాడు' అంటే ' ఆత్రేయలా రాశాడా? 'అని అడగ గలిగిన ప్రతిభను సంపాదించాడు.
జీవిత సందేశాలు నిత్య సత్యాలు. భౌతికంగా ఈనాడు లేక పోయినా తన గీతాల్లో, జనప్రియతలో , కీర్తిలో చిరజీవి అయిన మహాను భావుడు ఆత్రేయ.
మహాసముద్రం దేవకి
Comments
Post a Comment