నాకు ఇష్టమైన రచయిత్రి - మాలతీ చందూర్

 




నాకు ఇష్ట మైన రచయిత్రి

మాలతీ చందూర్ పరిచయం .

        నాకు ఇష్టమైన రచయిత్రి మాలతీ చందూర్. నచ్చిన నవల ఆమె రాసిన ' శతాబ్ది సూరీడు' .

        తెలుగు సాహితీ రంగంలో లబ్ధ ప్రతిష్టురాలైన రచయిత్రి మాలతీ చందూర్. పత్రికా రచనలో ,  నవలా రచనలో చేయి తిరిగిన రచయిత్రి. విభిన్న ప్రక్రియల్లో వివిధ అంశాలను విభిన్న పోకడలతో రచనలు చేసి దేశ విదేశాల్లోని సాహితీ ప్రియులను అలరించిన ఉత్తమ రచయిత్రి.

        దాదాపు ఆరు శతాబ్దాలకు పూర్వం 'ఆంధ్ర ప్రభ 'వార పత్రికలో మొదలైన 'ప్రమదావనం' లో సామాజిక సమస్యలకు పరిష్కారాలను విడమరిచి చెప్పిన సంఘ సంస్కర్త ఆమె. వ్యక్తిగత, సామూహిక, ప్రణయ, ప్రణయేతర దాంపత్య సమస్యలకు పరిష్కారాలను సూచించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ విషయాలనెన్నింటినో పాఠకులకు తెలిపారామె. అంతే గాక అతివల అందచందాలను , గృహ సౌందర్యాన్ని పెంపొందించుకొనే రీతుల్ని  , వంటల్ని,  పిండి వంటల్ని ....ఇలా ఎన్నో విషయాలను తెలియజెప్పారు  .

        కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించిన మాలతికి  జగతి పత్రికా సంపాదకులు, మేన మామ అయిన చందూరి నాగేశ్వరరావు తో పెళ్లయింది .సాహితీ రంగంలో రాణించడానికి పత్రికా రంగం, చందూరి సాహచర్యం రెండూ ఆమెకు బాగా తోడ్పడ్డాయి. సాహితీ పరంగా 20 అవార్డులు ఆమెను వరించాయి .

        దూరదర్శన్ , చలన చిత్ర రంగాల్లో సెన్సార్ బోర్డ్ మెంబరుగా, ఆంధ్ర మహిళా సభ ముద్రణ విభాగ కార్యదర్శిగా, వినియోగదారుల సంఘ కార్య నిర్వాహక సభ్యురాలుగా, పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ సభ్యురాలుగా వివిధ హోదాలలో ఎన్నో శాఖలలో పనిచేసిన అనుభవం ఆమెది.

సాహిత్యం:

        పాఠకుల నాడి పట్టుకొని వాళ్ళకు నచ్చే విధంగా రచనలు చెయ్యడంలో సిద్ధహస్తురాలు మాలతీ చందూర్. పాఠకులకు తెలియని ఎన్నో అంశాలను తన రచనల్లో పొందుపరిచారామె. ఆమె రచనలు చదివి తమ వ్యక్తిత్వాలను సైతం మార్చుకున్న పాఠకులు ఆమెకున్నారు.

       విభిన్న ప్రక్రియల్లో రచనలు చేసి సాహిత్య రంగంలో సుస్థిరమైన స్థానాన్ని సాధించారు . ఎంతగానో రాణించారు. ఆమె రాసిన 'నాలాగ ఎందరో ' నాటిక హిందీ లోకి అనువదించబడి దూరదర్శన్ జాతీయ కార్య క్రమాల్లో ప్రసారమైంది.

        మాలతి రాసిన తొలి కథ 'రవ్వల దుద్దులు 'ఆనంద వాణి ' పత్రికలో ప్రచురితం. దాదాపు 150 కి పైగా కథలు ప్రచురితమైనాయి. నవలలు 50 కి పైగా రాశారు. ఆమె తొలి నవల ' చంపకం- చెద పురుగులు'  కూడా ఆనంద వాణి లోనే ప్రచురిత మైంది. ఇవి కాక వంటలు- పిండి వంటలు, అల్లికలు- కుట్లు, అందాలు- అలంకారాలు, మహిళలకు మధుర జీవనం , మనసులోని మనసు, ప్రశ్నలు- జవాబులు, జాబులు- జవాబులు మధుర స్మృతులు, వంటి రచనలెన్నో చేసి పాఠకులకు చాలా దగ్గరయ్యారామె . స్వాతి మాస పత్రికలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నవలలను, నవలా కారులను
'పాత కెరటాలు 'శీర్షికన పరిచయం చేశారు.

        ఆంగ్ల సాహిత్యంలో అత్యుత్తమ మైన మూడు వందల రచనలను ప్రామాణికంగా సమీక్షించిన ఏకైక రచయిత్రి మాలతీ చందూర్. మూడు తమిళ నవలలను తెలుగులోకి అనువాదం చేశారు. ఆమె రాసిన కాంచన మృగం నవల తమిళం లోకి అనువాదమైంది.

        ఏ విషయాన్ని అయినా సాధికారికంగా చర్చించ గల విజ్ఞాన ఖని డాక్టర్ మాలతీ చందూర్ .

        మాలతి సహజం గానే స్త్రీ పక్ష పాతి. ఆమె నవలల్లోని స్త్రీ పాత్రలు స్వతంత్ర్య భావాలు . పోరాట పటిమ,స్పష్ట మైన వ్యక్తిత్వం ఉన్న ఆధునిక యువతుల్ని ప్రతిబింబిస్తాయి. సాహితీ ప్రియులకు చక్కని చుక్కాని మాలతీ చందూర్ 

మహాసముద్రం దేవకి
        11-5-2021

        

Comments