సంక్రాంతి - బోగి పండగ
సంక్రాంతిని పెద్ద పండగ, పొంగిటి పండగ , కుంచిలి దోలే పండగ, గొబ్బియ్యాల పండగ అని మా ఊర్లో రకరకాల పేర్లతో పిలుచుకుంటాం.
సరదాలు తీర్చడానికి సందడి చేసే సంక్రాంతి పండగ నెలరానే వచ్చింది . పిలకాయిలంతా సంతోసం పట్ట లేక పోతున్నాం. ఎటొచ్చీ పెద్ద వాళ్లు మాత్రం తలకు మించిన పనులతో తనకలాడి పోతా ఉండారు . పెచ్చులూడిన గోడలకు పేడా మన్ను మెత్తించి సున్నం పూసుకోవాల. పెరట్లో పోసిన మిరపనారు, వంకాయ నారు పీకి నాట్లు వేసుకోవాల. ఇది కూలోళ్లు కాకుండా ఊర్లో ఉండే ఆండోళ్లే పని మార్పిడి చేసుకుంటారు . రోజూ ఒక రెండు గంటలు కనీసం నాలుగైదు రోజులు ఆ పని సరిపోతుంది .అందురి నాట్లూ అయి పోతుంది. మూడో రోజు ఎవురి కయ్యలో వాళ్లు నారు నాటిన కాలవ గట్టుల్లో సన్నెరగడ్డ పాయిలు, బీర, కాకర , బెండ , దనియాలు నాటతారు. అక్కడక్కడ వంకాయ నారుతో పాటు సెండు మల్లి మొలకల్ని కూడా గుచ్చతారు. మిరపతోటలు నా సామి రంగా అన్నీ కలగలిసి మదరాసు కదంబం మాదిరి కండ్లు గోరగిస్తాయి సుడ్డానికి . ఇంకా ఆడే ఉండాలనిపిస్తాది .
పండిన గింజల్ని పనోళ్లకు కూలి గింజలు కొలిసి , కమ్మరి, కుమ్మరి , వడ్రంగి, మేదరి , సాకలి అందురికి మేరలిచ్చి మిగిలిందాన్ని ఎండలో ఒడిపి ఇల్లు జేర్చేసరికి మా నాయనకు , అమ్మకూ నడుములిరిగినంత పనయింది. పాపం మాయమ్మకు ఇంట్లో పనికూడా ఉంటుంది కదా! .
ఆకిరికి యవసాయం పనులన్నీ పూర్తైనాయి . బోగి పండగైతే పున్నమి నాడు సెంద్రు డొచ్చినట్ల వచ్చేసింది. తెల్లార్తే బోగి . నేను మా అబ్బోడోళ్లు ఇద్దరూ సమకూర్చి పెట్టుకున్న ఎండు సెరుకాకు , పిప్పి, తాటి మట్టలు , శనగ తొండు నానాబీనా కనాకసమాలంతో పాటు ఇంట్లో పాతగుడ్డలు, తట్టలు, బుట్టలు, సేటలు , పొరకలు అన్నీ సందకాడే ఈదికి నేరుగా సేందబాయి దెగ్గిర కుప్పేసి పెట్టుకున్నాం. . మరి ఊరికంతా పెద్ద మంట, ఎత్తుగా బోడి కొండ మాదిరిగా ఎలిగే బోగి మంట. ఊహ తెలిసి నప్పటి నుండి ఊరి మొత్తానికి మాదే కదా !
ఆ రాత్రి కన్ను పొడుచుకున్నా కంటి మింద కునుకు లేదు. మాటి మాటికి పండగ పనులతో పాటు మా నాన్న కొత్తగా కుట్టించిన ఎరగెడ్ల పూల పావడ , జోలారు పేటోని దగ్గర ఎత్తుకున్న పనస పండ్ల బొమ్మలున్న పావడ , మా మామ దెచ్చిన వాడ మల్లి పువ్వు కలర్ క్రేప్ సిల్క్ పావడ టైలరు ఆంజన్న దగ్గరికి కుట్టి ఇచ్చేదాకా రోజూ తిరిగి తెచ్చి ట్రంకు పెట్టెలో పెట్టుకున్నా . ఎప్పుడెప్పుడు కట్టుకుందమా అనే ఆత్రం పెరిగి పోయా ఉంది. అంత కంటే ముందు బోగి మంట ఏసే పనుంది కదా! .
తెల్ల వారు జామున మూడయి ఉంటుంది. ఇంకా కోడి గుజ్జాము కాలేదు. అయినా లేసి కూసున్న్యాను. మా యమ్మను లేపితే అలిసి నిదరపోతా ఉన్నామె కసిరి కొడుతుందని తెలుసు . అందుకే సలికి ముసుగు పెట్టుకొని ముడుక్కున్న మానాయన కాలుగీరి మెల్లింగా లేపినాను.
'కోడయినా కూయని' అన్న్యాడు మా నాయిన . ఊర్లో అందురు ఏసేస్తారు అని ఏడుపు మొహం పెట్టి గుయ్ గుయ్ మన్నా. సేసేది లేక లేసినాడు . నాకు బెడ్షిట్ను మెడ చుట్టూ చుట్టి గొంతుకింద ముడి పెట్టినాడు . నేను మా పెదబ్బోడు గోపీని లేపినాను. వాడు కండ్లు నులుము కుంటా ఉలిక్కి పడి లేచినాడు . పక్కనే ఉన్న మా సిన్న తమ్ముడు రవిగాన్ని , మాయమ్మ పక్కన ముడుక్కోని పడుకున్న మా సెల్లెలు వినయాను లేపినాము . అలికిడికి మాయవ్వ లేసి కూసోని వక్కాకును రోట్లో దంచుతుంటే మా యమ్మకూ మెలకువ వచ్చేసింది . కానీ లెయ్ లేదు.
వక్కాకు పుక్కడ పెట్టుకోంగానే మా దొరసానవ్వకు యాడ లేని ఉసారొచ్చేసింది . ' మీయమ్మ పండుకోనీ పాపా నేనొస్తా పదండి ' అనింది . లాంతరు ఎత్తుక్కొని మా నాయన ఈది వాకిలి తియ్యంగానే నువ్ ముందా , నేను ముందా అని తోసుకొని మేము ముగ్గురం బయట కురికినాము . రచ్చబండ ఇనాయక సామి గుడి ఎనకుంటాది మా ఇల్లు . ఇల్లు ఒక ఎకర తావులో పక్కకుంటాది. ఈదికి నేరుగా సేందబాయి . ఆ బాయి ముందరేస్తేనే బోగి మంట ఊర్లోవాళ్లకు కనిపించేది. అక్కడికి బోయినాము . పెద్ద పెద్ద దుంగల్ని బోటుగా గుడి గోపురం మాదిరిగా నిలబెట్టినాము . సెరుకాకయితే తొందరగా అంటుకుంటాదని దాని పైనే కాకుండా మాను తుండ్ల సందుల్లో కూడా సెరుకాకు దూర్సినాము .
అగ్గి పెట్టి తేలేదని మా రవిగాడు పరిగెత్తినాడు. వాన్ని ఎనక్కి పిల్చుకోని మా యవ్వొచ్చింది. మా నాయన ఎద్దుల కొట్టంలో మా సేద్ది గాణ్ణి లేపి ఇద్దురు వాటికి గాట్లో పచ్చి గెడ్డి ఏసి వచ్చేసరికి మాయవ్వ పసుపు కుంకాలు చెత్త పైన ఏసి పూజ చేసింది. చెరుకాకు మంచుకు తడిసింది .ఒక మానాన అంటుకుంటాదా? అందుకని లాంతరు మూత తీసి కిరసనాయులు కొంచం ఆకు పైన వంచి ముట్టించింది మా యవ్వ.
చిటపట లాడతా , దగ దగా మండతా మంట పైకి లేసింది . అందురూ ఆనందంతో సప్పట్లు కొడతా కేరింతలు పెట్టినాము. దూపరదొండి మాయక్క అప్పుడు లేసొచ్చింది, ఏదయినా ఆ నిమసంలో పనై పోవాల మాయక్కకు .
వచ్చీరాంగానే ఈదికల్ల పార జూసింది . నారాన్సామి మామోళ్ల ఇంటిముందు సలిమంట మాదిరిగా బోగి మంట ఎలగతా ఉంది . సూస్తా ఉండంగానే కురప కెంపక్కోళ్ల ఇంటి ముందు పెద్ద మంటే లేసింది. రచ్చముందు పొన్నెక్కోళ్ల ఇంటి ముందు మాటలినిపిస్తుండాయి.
అంతే తాటి మట్టల్ని రెండు మంట పైన బెట్టింది మాయక్క . మంట పైకి లేచింది . అందురూ సూడాల కదా! ఓ అని అరస్తా తలా ఒక తాటి మట్ట , టెంకాయ మట్టలూ తీసి మంట పైన ఏసినాము. ఇనాయక సామి గోపురం ఎత్తును ఎక్కిరిస్తా దాన్ని దాటి మంట పైకి లేసింది. అంతే మంట తగ్గ కుండా చెత్తా చెదారం ఏస్తానే ఉండాము .
మాయవ్వ ఇంటినుంచి తెచ్చిన ఒస్తువుల్ని ఒకొకటే మంటలో ఏసింది. ఒకో ఒస్తువు ఏసి నప్పుడంతా మాయవ్వ బోగి మంటకు దండం పెట్టుకుంటా ఉంటే మేమంతా కిలకిలా నవ్వినాము. అప్పుడొచ్చింది మాయమ్మ. మాయమ్మ రాంగానే మాకు సంతోసం ఎక్కువయి పోయింది. ఇంకో ఐదు నిమసాలు పెద్ద మంటే ఏసినాము . దుంగలు మొత్తం అంటుకోని మండినాయి. ఊర్లో పిలకాయిలు పుర్సోత్తం, బూశమ్మ, చిట్టి, యామలత, జమున , పాండు రంగడు , ఏ . సుబ్రమన్నెం, రంగ పిల్ల పరిగెత్తుకోనొచ్చి మా బోగి సుట్టూ సేరినారు.
మాయక్క ఎప్పుడు పోయిందో చులుక్కు చులుక్కని కాళ్లాపి సల్లతా ఉంది. ఆ బిడ్డికి ఎప్పుడూ పనిమిందే కలవరం. ఊరంతా తిరిగి అందరిండ్ల ముందు పెద్ద పెద్ద ముగ్గులేస్తాదిలే. ముగ్గులెయిను నేనూ పోతాననుకో . ఆ లోపల మా వాకిట్లో ముడువు సేసుకొని పోవాలని మాయక్కకు ఆరాటం.
' అమా రామ్మా సాలింక ముగ్గులేద్దారి ' అని ఒచ్చి మాయమ్మను రమ్మని సతాయించింది .సలికి ఎచ్చంగా మంట కాసుకుంట ఉన్ని మా యమ్మకు లేవబుద్దవతాదా!! ' ప్యాన్నీళ్లు కొంచం ఆరని పాపా' అనింది. ' ' నేల బాగ పిల్చేసింది మా ' అని గొనిగింది మాయక్క. . ఆ పిల్ల పోరు తట్టుకోలేక మాయమ్మ పోయింది.
ఒకే సారి ముగ్గుపిండిని ఒడుపుగా వేళ్ల సందుల్లోంచి వొదిలి మూడు గీతలు గీస్తాది మాయమ్మ. అసలు మాయమ్మ మాదిరి ముగ్గులేసే వాళ్లు ఈ బూప్రపంచం మింద ఎవురూ ఉండరేమో ! .సుక్కలు పెట్టిందంటే ముత్యాలే .గీతలు ఏమాత్రం దారి తప్పవు . గీసే గీతలు ఒకే లావుతో ఉంటాయి. ముగ్గెసిందంటే అచ్చు గుద్దినట్లే
ఇటు ఎనిమిదడుగులు అటు ఎనిమిదడుగులు వెడల్పుతో గళ్లు గీసి ముగ్గులేసుకో అని మాయక్కకు సెప్పి నీళ్లు మంటేయను పొయ్యింది మాయమ్మ.
ముగ్గులేసినాక నెలంతా పేడ ముద్దలతో గొబ్బెమ్మలు పెడతామా ! ఆగొబ్బెమ్మల్ని పిడకలు తట్టి ఏండబెడతాము . అవి కొన్ని బోగి మంటలో ఏసినాము. బోగి మంటేసుకున్న్యాక ఆ పిడకలతోనే మాయవ్వ బెల్లమన్నం వొండి తళిగేస్తుంది .
రేపు చాల వరకు పిడకల్ని వాడతారు . దాలి కిందికి కూడా పిడకలేసి ఆ బూడిదతోనే రామప్పను బోకులు తోమ మంటుంది. బోగి మంటలో పెద్ద దుంగ లేస్తామా. అగ్గి రెండు దినాలయిన బూడ్ది కెలికితే లోపల నిప్పులు కణ కణ లాడతా ఉంటాది. పెద్ద పండగనాడు ఆ అగ్గి తీసక పోయే ఇంట్లో పొయి ముట్టిస్తారు .
పండగ నాలుగు రోజులు పేండ గొబ్బెమ్మలను పెట్టరు. ముగ్గుల పైన ఒట్టి , గుమ్మడి, బంతి పూలను పెడతారు . గొబ్బెమ్మలను గోడకు పిడకలు తడతాము. అవి పండగప్పుడే వాడేయాలి కదా ! చివరి పండగ దాకా పేడతో గొబ్బెమ్మలు పెడితే అవి ఎండేదెప్పుడు? వాడే దెప్పుడు?
బోగిమంటయినాక పిలాకాయిలం గోంగు కట్టెలు అంటించుకోని పక్కనే ఉన్న మా రేంగి మాను కింద ఇంకా మొబ్బులోనే పండ్లేరుకోను పోయినాము .
మాయమ్మ తలకు పోసుకోని నట్టింట్లో అంబిలి తళిగేసి మొక్కి ఒక దుత్తకు పసుప్పూసి బొట్లు బెట్టి నిండా అంబిలి కలిపి పెట్టింది. దుత్తలో ముంచి పొయడానికి ఒక మూకుడు మూత పెట్టి దాని పైన బుడిగి పెట్టింది.
ఇంకా ఏడు కూడా కాలేదు. అందురు పిలకాయిలు గలాసులు పట్టుకోని మా యింటి ముందు వాలినారు. ఊర్లో మా ఇల్లేలే ముందుండేది. వొచ్చిన పిలకాయిల్ని మాయక్క వరసగా కుసోమని దుత్తలోని కమ్మటి జొన్నంబిలిని బుడిగితో ముంచి అందురి గలాసుల్లో కొంచం కొంచం పోసింది. అందురిండ్లలో తాగాల కదా వాళ్లు. మాయబ్బోడోళ్లు కూడా వాళ్లతో కూసున్నారు.
ఇంకా తాగతా ఉండంగానే ' సల్బీలో , సల్బీలో ' అని అరస్తా నేను మాయక్క వాళ్ల పైన నీళ్లు సల్లబట్తిమి. అదే పతా లేసి కేక లేసుకుంటా పిలకాయిలు ఇంకోక ఇంటికి పరిగెత్త బట్టిరి . బోగి నాటి ముక్కిమైన ముచ్చట ఇది. గంటలు గంటలు మంట కాగతారు కదా! కడుపులో సల్లంగా ఉండాలని అంబిలి పోస్తారంట. మా యవ్వ సెప్పిందిలే .
మర్నాడే కదా అసలయిన పండగ. మళ్లీ ఇల్లూ వాకిలి అలికి ముగ్గులుపోసి గడపలకు . దిన్నెలకు ఎర్రమన్ను పెట్టాల్నా . మాయక్క, నేను, మాయవ్వ ఆ పనిలోకి దిగినాము . ఐదుకంతా ముడువు సేసుకోని రచ్చ దెగ్గిర బోగి పండ్లు పోసేది సూడను పోవాల్నా . అందుకే ఆదరబదరా ఆ పనుల్లోకి దిగినాము .
మాయమ్మ , యగవింటోళ్ల పొన్నెక్కను, మత్యం రాజేస్వరక్కను పిల్సుకోని కజ్జాలకు బియ్యం పిండి దంచాతా ఉంది . కొంచిమా ? నంచిమా ? నాలుగు బల్లల బీము నాన బోసింది . బీదా బిక్కీ , కులోళ్లు నాలోళ్లు ఇంటి ముందు కొచ్చి నిలబడితే అన్నం మేసి , రసం పోసి , అందురూ ఒకటీ రెండు ఇస్తే ఇంట్లో ఎంతమందుటే అంత మందికి రెండేసి కజ్జాల లెక్కన ఇస్తాది. మా సేద్దిం పనులు సేసే వాళ్ల కైతే లెక్కా పక్కా లేకుండా దండిగా ఇస్తాది. కమలమ్మ సెయ్యి ఎముక లేని సెయ్యి అని మాయమ్మను పొగడతారులే .
ఆరాత్రి ముందు దినమే కజ్జాలు సేసుకోని మా యమ్మకు బెల్లం పాక మెత్తడానికి మా కుక్కల పల్లి పెద్ద పెద్దమ్మ, సిన్న పెద్దమ్మ ఒచ్చినారు. ఊర్లో కూడా ఇద్దురో ముగ్గురో వొస్తారు కదా! పాకం కెలికినాక తట్టే వాళ్లు తట్టతా ఉంటే , నూనిలో ఏసే వాళ్లు ఏస్తా ఉంటే మా నాయిన పొయ్యి దెగ్గిర స్టూలేసుకొని కూసోని నూనెలో నించి తీసినాక వాటిని ఒత్తి ఇస్తరాకుల పైన ఆరబెడతాడు . ఆరింది ఆరినట్లే మా యవ్వ మంటి కుండల్లో వాటిని పేరుస్తాది. సంక్రాతి ఒచ్చిందంటే ఇది పెద్ద పని.
మా ఊర్లో సిన్న పిల కాయిలు ఐదారు మంది ఉండారు . ఎవురిండ్లలో వాళ్లు కాకుండా రచ్చబండ దెగ్గిర సాయంత్రం 5 గెంటలకు బోగి పండ్లు పోస్తా రంట. మా రేంగి మాన్లో పండ్లు బలే తీపుంటాయి. మా సేద్ది గాడు బాలన్ని ఎక్కించి పండ్లు రాలిపించి పంపించింది మా యావ్వ. ఏదైనా కాని దానదర్మాలు సెయ్యడంలో మా ఊర్లో మాయవ్వ తరువాతే ఎవురైనా. దొండి కాల్నాలు, గుర్రం కాల్నాలు, పెద్ద కాల్నాలు మేము ఉండీలో ఏసి పెట్టుకోనుంటే దబ్బనముతో తీసి రూపాయి బందాలు రొండు తీసుకొని సిల్లర ఇచ్చింది కూడా మాయవ్వే. సెరుకు తోటలో రొండు గెళ్లు సెరుకు దెమ్మని గుడ్లు కొట్టించి దానిలో సిల్లర, రేంగి పండ్లు , సెరుగ్గుడ్లు, కిచ్చిలి పెప్పరమెంట్లు బొరుగులు , పప్పులూ , నూగులూ , బెల్లం అన్నీ పెద్ద డేకొసాలో కలిప్పెట్టింది . పిలకాయిల్ని కూసో బెట్టి అందురూ నెత్తిన పోసి అక్షింత లేసి దీవిస్తానవ్వతా ఉంటే ఆ పిలకాయి లేమో ఏడ్వ బట్టి నారు. సివర ఎర నీళ్లను మాయవ్వ సేతి కిచ్చి పిలకాయిలికి దిష్టి తీపించినాక పెసాదం పంచినారు. మొత్తానికి బోగి పండగ సుట్ర గాలి మాదిరొచ్చి అంతా ముడువు సేసికొని పొలో మని ఎల్లిపోయింది .
మహసముద్రం దేవకి
Comments
Post a Comment