సంక్రాంతి పండగ రోజుల్లో మా ఊరు
'కొలని దోపరికి గొబ్బిళ్లో
యదుకుల సామికి గొబ్బిళ్లో
కొండ గొడుగుగా గోవులు కాసిన
కొండొక శిశువుకు గొబ్బిళ్లో '
ఇది అన్నమయ్య రాసిన సంక్రాంతి గొబ్బి పాట. తెలంగాణ లో బతుకమ్మ పాటలకు ఎంత ప్రసిద్ధి ఉందో రాయల సీమలో సంక్రాంతి గొబ్బి పాటలకు అంత ప్రాముఖ్యత ఉంది. అందుకే శిష్ట సాహిత్య కారులు కూడా గొబ్బి పాటలు రాశారు .
దక్షిణ భారత దేశంలో తమిళులు ' పొంగల్ ' అని కోస్తాంధ్రాల్లో ' సంక్రాంతి 'అని రాయల సీమలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ' పొంగటి పండగ' ని ' పెద్ద పండగ ' ని , గొబ్బియ్యాల పండగని ఈ పండగను పిలుచు కుంటారు. రైతు ఆరుగాలం కష్ట పడి పండించిన పంట ఇల్లు చేరిన సమయంలో ఆనందంగా జరుపు కొనే అతి పెద్దపండగ 'మకర సంక్రాంతి'
ముగ్గులు వెయ్యడంలో, భోగి మంటల్లో, పశువుల జాతరలో, కోడి పందేలలో , గ్రామ దేవతల కొలుపుల్లో , బొమ్మల కొలువుల్లో కులమతాల కతీతంగా ఊరు ఊరంతా కలిసి పాలు పంచు కునే పండగ ఇది .
కాని ప్రతి సంవత్సరం పత్రికల వాళ్లు అడగడం, రాయడం ఇప్పటికి చాలా వ్యాసాలు వచ్చాయి. ఏది చెప్పినా చర్విత చర్వణ మవుతుందని పించింది . అందుకే మా ఊరిలో సంక్రాంతి మాసంలో ఎలాంటి సందడి ఉంటుందో చెప్పాలనుకున్నాను.
జన సాంద్రతలో, విస్తీర్ణంలో భారత దేశం గ్రామాలకు పుట్టినిల్లు . ఇక్కడి పల్లెటూర్లు ప్రకృతి సౌందర్యానికి , ప్రశాంత వాతావరణానికి ( ఫాక్షన్ గ్రామాలను వదిలి పెడితే ) ఆట పట్టులు .
అలాంటి పల్లెలో పుట్టి పెరిగిన దాన్ని నేను . మా ఊరు ఒక అందమైన చిన్న పల్లె టూరు. ఓ యాభై ఇండ్లుంటే ఎక్కువ. జాతీయ రహదారికి ఆనుకొనే ఉన్నా చుట్టూ పచ్చని పంట పొలాలు , చింత తోపులు, మామిడి తోటలు, ఏపుగా పెరిగిన చెరకు తోటలు, కంది చేలు, ఉల్లి, వంగ, బెండ, గోరు చిక్కుడు , కాకర, చిక్కుడు , బీర పొదలతో అక్కడక్కడ విరగ కాసిన బంతి పూల చెట్లతో నిండిన మిరప తోటలను చూడడానికి రెండు కళ్లు చాలేవి కావు.
ఊరికి పడమరగా గల గల పారే కట్టే కాలవ, దాని కానుకొని ముచ్చురాళ్ల గుట్ట, ఊరి నడి వీధి నుంచి ఉత్తరం వైపు పొలాలకు వెళ్లడానికి ఓనీ అని పిలవ బడే బండి బాట , ఆదారిలోనే పంట నూర్పిళ్లకు, నూర్పిన ధాన్యం ఎండడానికి ఎత్తుగా వెడల్పుగా కొలువు తీరిన పిడకలు తట్టే బండ, చుట్టూ ధాన్యపు గుబ్బు, దానికి కాసింత దూరంలో చిన్నగా ధాన్య మెండ బొసే మరో చట్టు బండ గుర్తుకొస్తున్నాయి.
ఇటు వైపు పడమరకు మల్లితే 'కట్టే కాలవ' గట్టున సిపాయిల్లా నిలిచిన ఈత మాన్లు. పక్కన చేన్ల మధ్య తలలో పాపిట తీసినట్లున్న ఏనుగుంట పల్లెకు వెళ్లే బండి బాట . వంక దాటితే చూపుకు ఆననంత దూరం విస్తరించిన పాలెం జమిందార్ల మామిడి తోటలు, ఆ పక్కనే అక్కమార్ల గుట్ట
కళ్లముందు కొచ్చి నిలుస్తున్నాయి.
ఒక్క చిన్న ఊరే ఇట్లుంటే సుందరమైన ప్రకృతి దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని ఉంటాయో ఎలా ఉంటాయో అని మనసు పరి పరి విధాలుగా ఆలోచిస్తూ ఎక్కడెక్కడికో పరుగు పెడుతున్నది. మధుర మైన జ్ఞాపకాలు అల్లి బిల్లిగా అల్లుకొని అల్లకల్లోలం సృష్టిస్తుంటే ఏది రాయాలో తెలియడం లేదు . ఇందాకే వార్తల్లో అట్టహాసంగా జరుపుకొన్న కృత్రిమ మైన పండగ సంబరాలను చూసి మనసు కకావికలమై పోయింది
సరే! మళ్లీ మా వూరికి పోదాం. పిడకలు తట్టే బండ గురించి చెప్పాను కదా! దానికి ఉత్తరంగా ఊడల మర్రి. దాని కానుకొని చెరువు కట్ట, అటు పక్క చెరువు, చెరువులో నుంచి పొలాలకు వెళ్లే దారికి ఎడమ వైపు కాటమరాయుని బండ, పొలాల మధ్య ఇరపాక్షమ్మ గుడి. చెరువు కవతల స్మశానం, దాని కాపక్క మేము చెరుకు గానిగాడే కానగ చెట్ల గుంపు , దాని కానుకోని చెరువు వైపుకు కాక ఉత్తరానికి ప్రవహించే సెలయేరు, పక్కనే చేపలు పట్టే కశిం. ఇవన్నీ వానాకాల మొక రకంగా, ఎండా కాల మొక రకంగా అందాలను ఆర బోసేవి.
నాకు ఇష్టమైన కొళ్లోడొంక, ఓ కిలో మీటరు దూరంలో ఎత్తగా నిలచి ఎంత దూరానికైనా కనిపించే బోడి కొండ , ఊరికి తూర్పు వైపు మా ఎర్ర మన్ను చేను , దాని కాపక్క నల్ల రాళ్ల గుట్ట ఆ గుట్టలో అక్కడక్కడ చింత మాన్లు , చేను కివతల జాతీయ రహదారి. అదే మూడు మైళ్ల దూరంలో ఉన్న చిత్తూరుకు వెళ్లే తారు రోడ్డు.
దక్షిణాన రోడ్డు కావల పెద్ద పాంచెరువు. దాని కింద సారవంత మైన పచ్చని పంట పొలాలు , కీనేరు బావులు . అబ్బ, మా వూరి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ మోస్తరుగా మా ఊరి స్వరూప మిది.
ఈ ప్రాంతాల ప్రసక్తి , ఊరి భౌగోళిక రూపు రేఖలు అవసరమా? సంక్రాంతి పండగలో భాగంగా నెల రోజులు జల్లెడ నిండా పూలు పరచి కొన్నాళ్లు పేడతో, కొన్నాళ్లు బంక మట్టితో , పండగ నాలుగు రోజులు పసుపు ముద్దతో గౌరమ్మను చేసి ఆ పూలపై నిలిపి ఇల్లిల్లు తిరిగి పాటలు పాడుతూ గొబ్బి తట్టే వాళ్లం. పువ్వులు ఏరోజు కారోజు తాజాగా ఉండాలని మార్చేసే వాళ్లం. ఒక రోజా? రెండు రోజులా? నెల రోజుల తతంగ మిది. గొబ్బి పూలు( నేల తంగేడు పూలు) కాశీ రత్నాలు , అడవి మల్లి పూలు, గురుగు పూలు, పిండి వర్ధని పూలు, ముళ్ల గోరింట పూలు ఇంకా రక రకాల పూల సేకరణ కోసం అప్పటి నా నేస్తాలు, నీలావతి, హేమలత, కాంత, చిట్టి , ఆనంద, హంసవేణి ( ఇప్పుడు కొందరి ఊసే లేదు, కొందరి జాడే లేదు) లతో కలిసి పావడాలు ఎగచెక్కు కొని కబుర్లు చెప్పుకుంటూ రోజుకో దిక్కు తెగ తిరిగే వాళ్లం. ఆ ప్రాంతాలు ఎంతో సాదరంగా మాకు ఆహ్వానం పలికి సమృద్దిగా పూలను సమకూర్చేవి. వాటిని ఎప్పటికీ మరిచి పోలేమని చెప్పడానికే ఇదంతా. ఒక్క దక్షిణ దిక్కులో మాత్రం ఇవి దొరికేవి కావు.
ఇక పండగ సుద్దులు వినండి. ధనుర్మాసం మొదలవగానే గడ గడ వణికించే చలిలో పండగ పనులు ఊపందు కుంటాయి. పంటలు ఇల్లు చేరతాయి. మిరప నాట్లు డిసెంబరులో ఇంటికి సరిపడా ఒక కుంటో రెండు కుంటలో భూమి ఉన్న ప్రతి ఒక్కరు నాటు కుంటారు. దానితో వ్యవసాయ పనులకు తెరపి దొరుకుతుంది. వరి, శెనక్కాయలు ఇల్లు చేరి గాదెలు, గరిసెలు, బొట్టలు, మట్టి కాగులు, దొంతి కుండలు నిండి పోతాయి. వడ్లను ఏతంతో తొక్కించి బియ్యం సిద్ధం చేసుకుంటారు. కందుల్ని రాత్రి నాన బోసి ఉదయాన్నే ఎర్ర మట్టితో తడిపి ఎండ బెట్టి విసుర్రాయితో పగల గొట్టి పప్పు సిద్ధం చేసుకుంటారు. శెనగ కాయల్ని దుడ్డు కర్రలతో మోది పప్పు కొట్టి నూనె గానుగాడించి పెట్టుకుంటారు.
అలసంద, అనప, కంది , పెసలతో నిండిన బస్తాలు ఇంట్లో ఒక మూల చేరి ఒదిగి ఉంటాయి. వ్యవసాయ దారుల ఇండ్ల లోనే కాదు. కూలీ నాలీ చేసే ఇండ్లలో కూడా చేతినిండా పనులు దొరకడం వల్ల ధాన్యం సమృద్ధిగానే ఉంటుంది.
పంట ఒడిపే సమయంలోనే కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చాకలి మొదలైన వృత్తి పనుల వాళ్లకు కూడా మేర అందుతుంది. బిచ్చ గాళ్లకు కాదన కుండా, కసురుకోకుండా , లేదనకుండా, దోసిట్లోనో , చేటలోనో ధాన్యం తెచ్చి దానమిస్తారు గృహిణులు.
పండగకు ముందు దాసరమ్మ జోలెలో తెచ్చి అమ్మే రిబ్బన్లు, పౌడర్లు, కాటుక డబ్బీలు, తిలకం బుడ్డీలు, సవరాలు , మొలతాళ్లు , బొంగారాలు పిల్లలు ఏది కావాలన్నా లేదన కుండా, కాదన కుండా, కసర కుండా కొనిస్తారు తల్లులు. వీటికి డబ్బుతో పని లేదు . అంతా వస్తుమారకం . వడ్ల గింజలు, కంది పప్పు, చింత పండు, ఎండు మిరప కాయలు ఇచ్చి కావలసిన వాటిని కొనుగోలు చేసేవారు.
మా ఊరికి గోపాలం అనే గాజుల శెట్టి పండగ ముందు తప్పని సరిగా వచ్చే వాడు. ఆడపిల్లలందరం చేతుల నిండా గాజులు తొడిగించుకొని గల గల లాడిస్తూ అదే పనిగా ఇటూ అటూ తిరిగే వాళ్లం. ఇరుగు పొరుగున ఉండే దగ్గరి బంధువులను ఆత్మీయంగా ' ఒక బంతి గాజులు తొడుక్కుందువు గానీ రా' అని లాక్కొచ్చి బలవంతంగా గాజులు తొడిగించడం పండగ నెలలోని ప్రత్యేకత.
అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు నాలుగు గంటల మధ్య అందరూ సుఖంగా నిద్రలో మునిగి ఉన్న సమయంలో బుడ బుడ లాడించు కొంటూ బుడ బుడక్కల వాడు ఊరంతా తిరిగే వాడు. ఇంటి ముందర కొచ్చినప్పుడు దుప్పటి ముసుగులో చెవులు రిక్కించుకొని అతను చెప్పే భవిష్యత్తును అందరూ వినే వాళ్లు. మంచి జరుగుతుందని చెబితే సంతోషం . కష్టాలున్నాయంటే విచారం. ఉదయం పది, పదకొండు ప్రాంతంలో దానం కోసం వచ్చిన అతన్నే పరిష్కారం గురించి విచారించే వాళ్లు. మూఢ నమ్మకాల ముసుగులో ఇవ్వన్నీ జరిగిపోయేవి.
బైరాగులు మూలికలను వీధిలో పరచుకొని అమ్మే వాళ్లు. గంగిరెద్దుల వాళ్లు, దొమ్మరాటల వాళ్లు, పగటి వేష గాళ్లు , గారడి విద్యల్ని ప్రదర్శించే వాళ్లు, బుర్ర కథల వాళ్లు, తంబుర మీటే వాళ్లు విరామ మనేది లేకుండా ఊర్లో సందడి చేసే వాళ్లు. సంక్రాంతి ముందయితే తిండి గింజలు దొరుకుతాయని వచ్చే వాళ్లని ఇప్పుడర్థ మవుతుంది.
కుమ్మరి కొత్త కుండలు తెచ్చే వాడు. సోదమ్మ ఊరూరూ తిరిగేది. అమ్మలక్కలంతా చేరి ప్రతి సంవత్సరం సోది చెప్పించుకోవడం డెబ్బై ఏండ్లు కావస్తున్నా నిన్నో మొన్నో జరిగి నట్లుగా అనిపిస్తోంది నాకు. వ్యవసాయం పైన ఆధార పడి ఇలా ఎంతో మంది జీవనం సాగించే వాళ్లు. పండిన ధాన్యమే ఇంత మంది బువ్వకు , భుక్తికి మార్గం .
వ్యవసాయం పనులు పూర్తి కావడంతో మగ వాళ్లు పరిగి ఒదిలిన చేలలో పశువుల్ని బాగా మేపి తీరిక సమయంలో అరుగుల మీదో , రచ్చ బండ దగ్గరో మారాజుల్లా కొలువు తీరి లోకాభిరామాయణంలో మునిగి పోయే వారు. ఎటొచ్చీ పండగొచ్చినా పబ్బ మొచ్చినా ఆడ వాళ్లకు మాత్రం పనులు పెరిగేవే కాని తరగేవి కావు.
మావూర్లో ఒకప్పుడు అందరివి పెంకుటిండ్లు, బోద కప్పడాలున్న ఇండ్లు , తాటాకులతో కప్పిన పశువుల కొట్టాలు. సంక్రాంతికి ప్రతి ఒక్కరూ ఇంటికి సున్న మేసుకుంటారు. అన్నీ మట్టి గోడలతో కట్టిన ఇండ్లే . సంవత్సర మయ్యేసరికి అవన్నీ పెచ్చులూడి వికారంగా తయారయ్యేవి . వాటికి మట్టిని మెత్తించి , గురుగు మన్ను పేడా కలిపి దానిపైన నున్నగా పూత పూసి ఒక రోజు ఆర నిచ్చి సున్నం పూసే వాళ్లు .ఆ పనులు ఆడవాళ్లే చేస్తారు. సున్నం వెయ్యడం కంటే దొంతి కుండలతో సహా అన్నీ దించి సర్దడం పెద్ద పని అయి తల పట్టుకొనే వాళ్లు . పండగకు కావలసిన పిండి వంటలను తయారు చేసుకోవడం ఒక పెద్ద పని . ఇవన్నీ ఆడవాళ్లకు పండగ ప్రసాదించే అదనపు పనులు .
నేను రాసిన ' ఈనాటి సంక్రాంతి పేదల పండుగ ' లోను ' సంక్రాంతి జ్ఞాపకాలు ' లోను నాలుగురోజుల పండుగ విశేషాల వివరణ ఉంది. మిగిలిన రెండు వ్యాసాల్లో గొబ్బి పాటల ప్రసక్తి ఉంది. అందుకని వాటి గురించిన ప్రస్తావన తేవడం లేదు. అందరికీ తెలిసిందే అయినా కింద పెట్టిన వ్యాసాలన్నీ చదివితే సంక్రాంతి సమగ్ర స్వరూపం అవగత మవుతుంది .
అనంతపురం జిల్లాలో ముగ్గుల పోటీలు తప్ప ఈ పండుగను చిత్తూరు జిల్లాలో జరుపుకున్నంత గొప్పగా జరుపు కోవడం ( 1979 నుండి ఇప్పటి దాకా )నేను చూడ లేదు. గొబ్బి తట్టడం అనే క్రీడా రూపం కూడా నా కంట పడ లేదిక్కడ. కానీ మా ఊర్లో మాత్రం సంక్రాంతి నిజంగా పెద్ద పండగే . అందరూ కలిసి జరుపుకొనే అపురూప మైన పెద్దల పండగ.
సంక్రాతి నెల మొదలవగానే కళ్ళాపి చల్లడం, ముగ్గులెయ్యడం, గొబ్బెమ్మలను పెట్టడంలో ఎంతో అనంద ముండేది. అన్నిటి కంటే గొప్పి తట్టడం పైసా ఖర్చు లేకుండా అందే వినోదం .
'సంక్రాంతి పండగ వచ్చింది - సరదాలెన్నో తెచ్చింది
ఇంటికి సున్నం వేశాము. - కంటికి అందం తెచ్చాము
అక్కా బావా వచ్చారు - చక్కెర చిలకలు తెచ్చారు
అక్కలు వాకిలి అలికారు - చక్కని ముగ్గులు పెట్టారు
గొబ్బెమ్మలు మేం పెట్టాము - గొప్పగ ఉందని మురిశాము
అత్తా మామా వచ్చారు - కొత్త బట్టలు తెచ్చారు
భోగి మంటలు వేశాము - రేగి పండ్లను తెచ్చాము
సాయంకాలం పేరంటం - సరదానెంతో ఇచ్చింది
పాపను కూర్చో బెట్టారు - పళ్లను నెత్తిన పోశారు
మొదటి రోజు భోగి పండగ - ముచ్చట తీరగ ముగిసింది
సద్దు చేయక మర్నాడు - పెద్దల పండగ వచ్చింది
అమ్మా అత్తా కలిశారు - కమ్మని వంటలు వండారు
పెద్దల పటాలు పెట్టారు - ముద్దుగ అలంకరించారు
బట్టలు పెట్టి మొక్కారు - భలేగ ఉందనుకున్నారు
పిండి వంటలు వండారు - దండిగ అందరు తిన్నారు.
మూడవ నాడు కనుమ పండగ - ముచ్చట తీర్చగ వచ్చింది
పెద్దా చిన్నా కలిశారు - పశువుల నలంకరించారు
కొత్త బట్టలను కట్టుకొని - కోరిన నగలను పెట్టుకొని అరుగుల మింద చేరారు - పరుగు పశువులను చూశారు
గొబ్బి తట్టుతూ ఆడపిల్లలు - గొబ్బి పాటలను పాడారు
నాల్గవ రోజు వచ్చింది - నలుగురినొకచో చేర్చింది
గ్రామ దేవతల కొలుపులను - ప్రేమ మీరగా చేశారు'
సంక్రాంతి సమగ్ర స్వరూపాన్ని చెప్పడం కోసం నేను చేసిన ప్రయత్నం ఈ గేయం .
ఒకప్పడు పల్లెల్లో ఎక్కువ సందడి చేసే సంక్రాతి పండగ ప్రస్తుతం (టీ వీ వార్తల్లో చూస్తుంటే ) సహజత్వాన్ని కోల్పోయి కృత్రిమంగా మారి జాతర్లను తలపిస్తున్నది. గొబ్బి పాటలు వినిపించడం లేదు. గొప్పి తట్టే వాళ్లు కనిపించడం లేదు. కోళ్ల పందాలు, భోగి మంటలు , ముగ్గుల పోటీలు, ఎద్దుల పందాలు మాత్రం ఘనంగా రాజకీయ నాయకుల పరమై పోయి వాళ్ల కనుసన్నల్లో నిర్వహించ బడుతున్నాయి . లక్షల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి
కుల మతాల కతీతంగా, ధనిక పేద తేడా లేకుండా సమిష్టిగా జరుపు కొనే సంక్రాంతి పండగ, సామరస్యానికి పెద్ద పీట వేస్తూ శాంతికి మారు పేరుగా నిలిచిన ఈ పెద్ద పండగ పూర్వ వైభవాన్ని సంతరించుకొని కల కాలం నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను.
ఈ సందర్భంగా మీ మససునంటి పెట్టుకున్న మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి. వీలైతే పంచుకోండి . అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు .
మహాసముద్రం దేవకి
అమెరికా భారతి
Comments
Post a Comment