సంక్రాంతి- పొంగిటి పండగ

 సంక్రాంతి-  పొంగిటి  పండగ


నాలుగో నాడుగ్రామ దేవతలకు పొంగళ్లు పెట్టే పండగ .ఈ దినం  దూడలకు కూడా పండగే . ఎందుకంటే రోజు మాదిరిగా పాలు దాగినాక వాటిని కట్టేయ కుండా వొదిలేస్తారు. అవి ఇష్టమొచ్చినప్పుడు పాలు తాగి గెంతులేస్తుంటాయి.

ఈ రోజే ఇరపాక్షమ్మ గుడికాడ పొంగళ్లు పెట్టే పండగ. మద్యాన్నం అన్నాలు దిన్నేకే అడావుడి మొదలయింద . పొంగలెత్తుకోని పోవడానికి మాయక్క సిద్దమయింది . గొబ్బిదట్టిన గవరమ్మల్ని జల్దిలో కలపడానికి మేమూ సిద్దంగా ఉండాము .

ఈ రోజు పండగ సివరి రోజాయే  . ఇంక రోజూ ఇల్లు కడగరు కదా! వారానికి ఒకసారే శుక్రారం కోసమని ఇల్లు పేండతో అలికి , ముగ్గులు పోసి ఎరమన్ను పెడతారు . ఈ రోజు పొద్దన్నే మాయక్క వాకిట్లో ముగ్గుపిండితో పెద్ద పెద్ద ముగ్గులు పోస్తే మాయమ్మ ఇల్లలికి ఆరినాక పిండి ముగ్గులు పోసింది. ఎరమన్ను పూసే పని మాత్రం ఎప్పుడూ మాయవ్వదే . మేము అంచులు సరిగా పుయ్యమని ఎరమన్ను సట్టి మా కియదు . ఎద్దులు కొట్టంలో ఒక మూల ఒకేసారి మూటొడ్లు పోసి దంచే యాతముంది. అంకణం ఎడల్పున ఆడ సెరగను, జల్లిడ పట్టను పేడతో అలికుంటారు. ఆడమాత్రం నేనే ఎరమన్ను పెట్టేది.

ఆదినం మాయమ్మ తొందరగా అన్నం సేసేసి మాకు సాయం సేస్తాది. ఐదుమంది కలిసి గొబ్బి తడ్తామా. వాళ్లమ్మోళ్లు ఎవురూ ఏమీ పట్టించుకోరు. మాయమ్మ సిన్నపుడు ఆడుకుంటా, పాడుకుంటా పెరిగిన బిడ్డి కదా! అందుకే మాకు అన్నీ సేసిస్తాది.

గుజ్జిళ్ల బువ్వ వొండుకోడానికి మా బాడ్సి సెట్టుకింద బయటి బాపణోళ్లొస్తే అన్నం వొండుకోడానికి ఏసిన పొవ్వుల దెగ్గిర మా యమ్మ నడిగి బొమ్మరిల్లు కట్టించుకున్న్యాము . మాయమ్మ ఆ బొమ్మరింటిని  పేండతో అలికి ముగ్గులు కూడా పోసిచ్చింది .

గుజ్జిని బువ్వొండి గుమ్మడి కాయ ,అనప గింజిలు , సిక్కుడుకాయలు కలిపి కూర సేసిచ్చింది మాయమ్మ . మిగిలి పోయిన బియ్యం, పప్పు , సింత పండు , మిరక్కాయిలు అయివోరోలక్క తీసుకొని ఆరణాలిచ్చింది . నూని రెండు ముంతలు నిండి  , ఒక బుడిగికి ముక్కాలు కొచ్చింది. ఆ సమురు అంగిడాయన ఐదణాలిచ్చి తీసుకున్నాడు. దుడ్లు మొత్తం మా ఐదు మందికి పంచి పెట్టింది మాయమ్మ.తలా తొమ్మిదణాల పైన మూడు కాల్ణాలొచ్చినాయి. నాకు సంతోషం పట్టను కాలేదు . మాయవ్వది చినిగి పోయిన గ్లాస్కొ మల్లు జాకిట్టుతో ఎప్పుడో సిన్న తిత్తి కుట్టిచ్చింది మాయమ్మ. దాంట్లోఆ దుడ్లేకొని జాకిట్టు తొలి గుండీ దగ్గర పిన్నీసుతో తిత్తిని పెట్టుకొని తిరగలాడత ఉన్న్యాను. ఆ తిత్తి పల్సగా ఉంటాదా! దుడ్లు కనిపిస్తా ఉంటాది . కనిపించాలనే కదా ఇన్ని తంటాలు . మాయమ్మ ఎత్తిపెడతానన్నా ఊహూ! నేనెందుకిస్తాను!
మాయబ్బోడోళ్లు కిచ్చిలి పెప్పరమెంట్లు  కొనుక్కుంటామని  కాల్నా అడిగినా ఇయలేదు నేను.

మద్యాన్నం మూడు గంటలకే పొంబలో ళ్ల మానిక్కెం రచ్చ బండ దెగ్గిర పొంబల కొట్టి అందుర్నీ తయారు కమ్మని ఎచ్చరించినాడు. మూడు దినాలు కొత్త కోకలు కట్టుకొని మురిసినారా ? ఈ పొద్దు పెట్టిళ్లో ఉన్న దాపుడు పట్టు కోకకు కట్టుకొని ఉన్ని నగలు పెట్టుకొని తయారయినారు.

మాయమ్మ అలికిన గంప నట్టింట్లో పెట్టి పూజకు కావాల్సిన సమాన్లన్నీ అమిర్చి ,చిన్న రాగిసట్టిలో పొంగలి పెట్టడానికి బియ్యం కడిగి పెట్టింది. మాయవ్వ కట్టి పుల్లలు వాదెడు మోపు కట్టి పెట్టింది. తళిగెకు సలిబిండి కెలికింది. పొంబలోడు ఇంటిముందు కొచ్చి మాయక్క నెత్తిన గంప పెట్టు కోగానే పొంబలి వాయిస్తా ముందు నడ్సినాడు. అట్ల ఒకోరి ఇంటి ముందు పోయి నప్పుడు ఆ ఇంటి వాళ్లు గంప నెత్తుకోని గుంపులో కల్సినారు . ఊరిలో అందరు ఎనక నడిచోస్తా ఉంటే పొంబలి కొట్టుకుంటా వరిమళ్ల మద్దిలో ఉన్న ఇరుపాక్షమ్మ గుడి దెగ్గిరికి పోయినాము . గుడి సుట్టూ రాళ్లతో పొయ్యిలు బెట్టి పొంగలి వొండేదాక పిలకాయిలు పక్కనే ఉన్న సెరువు కట్టమింద ఆట్లాడు కున్యారు . అంకనం ఎడల్పున్న సిన్న గుడి అది . గుడినిండా పుట్ట . పుట్ట కానిచ్చిసిన్న రాళ్ల రూపంలో  ఏడుగురు అక్క మార్ల  ప్రతిమలు . ఎదురుగా  పోతురాజు ఇగ్రహం ( అది కూడా బండే ) . దానికి  పెద్ద దేవగన్నేరు మాను ఆమాను మొదులు కానుకొని దిగుడు బాయి . బాయిలోకి జారే బండ మాదిర్తో దోవ . ఆదోవలో బయపడతా బాయిలోకి దిగినాక అక్కడ సదరంగా ఒక బండుంది . ఆడ నిలబడి పేండ బంక మొన్ను గొబ్బెమలను  , నెల దినాలుగా గవరమ్మకు వాడిన పూలను జల్దిలో కలిపి పసుపు గవరమ్మను మొహాలకు సేతులకు పూసుకొనినాము . మాయమ్మ ఒండిన ప్రసాదాన్ని బాదమాకుల్లో పెట్టుకొని ఆడే బాయిలోనే తిని బాయి గెట్టెక్కినాము. అప్పటికి మాయమ్మ కూడా ఇంటినుంచి వొచ్చింది. మాయమ్మను  సూస్తే మాకు కుశాల ఎక్కువయి పోతాది . మేము వాలుగ ఉన్న దోవలో సెరువు కట్ట ఎక్కి. ఆటలాడుకున్న్యాము. పూజ పూర్తయింది. ఊరిని ఏ రోగాలు రాకుండా, కరువు కాటకాలు లేకున్Fఆ సల్లంగా కాపాడ మని అందురు ఇరపాక్షమ్మకు మొక్కుకున్న్యారు . గంపలు సర్దుకొని అందురూ నెత్తిన పెట్టుకున్యాక పొంబలి వయిస్తా ఉంటే అందురూ ఊరు సేరినారు.

మహసముద్రం దేవకి








Comments