సింగినాదం - జీల కర్ర
ఒక్కప్పుడు ఆంధ్ర దేశం లోని ఓడ రేవులు దేశవిదేశాలతో చక్కటి వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవి. విదేశీయులు వాళ్ల దేశాలలో లభ్యమయ్యే వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ విక్రయించే వాళ్లు . వాళ్లలో కొందరు జీలకర్ర తెచ్చి అమ్మే వాళ్లు. వాళ్లు తమ రాకను ప్రజలకు తెలియజెయ్యడానికి ఎనుబోతు కొమ్ములతో చేసిన బూరాల్ని ఊదే వారు.
కొమ్మును 'శృంగము ' అంటారు. కొమ్ము బూరాల నుండి వచ్చిన ధ్వనిని
' శృంగనాదం' అంటారు. జీలకర్ర వ్యాపారులు వచ్చారు అని తెలియడానికి ఈ శృంగ నాదమే గుర్తు.
ఇది గమనించిన కొందరు దొంగలు ప్రజలను మోసం చేసేందుకు కొమ్ము బూరాలను ఊదే వారు. ప్రజలు జీలకర్ర వ్యాపారులు వచ్చారని నమ్మి ఇళ్ల నుండి బయటికి వెళ్ల గానే పథకం ప్రకారం ఎవరూ లేని ఇండ్లను చూచి దోచుకొనేవారు.
ఒక టి రెండు సార్లు ఇలా జరిగాక ప్రజలు అప్రమత్తులయ్యారు. దానితో దొంగల ఆట సాగక అలా చెయ్యడం మానేసారు. అయినా కొంత మంది శృంగనాదం వినిపిస్తే చాలు దొంగలేమో అని భయపడే వాళ్లు. అలాంటి వాళ్లను చూచి దొంగలు కారని చెప్పడానికి ఒక వ్యక్తి ఈ మాటలతో భయాన్ని పోగొట్టాడు.
ఒక వ్యక్తి వివేకవంతంగా చెప్పిన మాట నలుగురి నోళ్లలో నాని ప్రాచుర్యాన్ని పొంది సామెతగా రూపు దిద్దుకొంటుంది అన్న విషయం మనకు తెలిసిందే కదా! అలా 'శృంగనాదం - జీలకర్ర ' కూడా తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూ సామెతగా నిలదొక్కుకుంది ' శృంగనాదం - జీలకర్ర' అనే మాటలు నిత్య వ్యవహారంలో ఒకరి నోటి నుంచి మరొకరి నోటికి అందేటప్పుడు 'సింగినాదం - జీల కర్ర ' గా మారి పోయింది .
లేని పోని భయాలను కొట్టి పారేయడానికి ఈ మాటను వాడతారు. ముఖ్యంగా చాదస్తాన్ని నిరసించడానికి , ఒక చిన్న పనిని ఎంతో శ్రద్ధగా చేస్తున్నా అంత ఆర్భాటం అవసరం లేదని చెప్పడానికి , ఆ పని పట్ల ఉన్న నిరసన భావాన్ని వ్యక్తం చెయ్యడానికి దీన్ని ఎక్కువగా వ్యవహరిస్తారు.
మహసముద్రం దేవకి
Comments
Post a Comment