ఉప్పోడు పులిశా పప్పోడు పులిశా తమల పాకు లోడు తనకు తానే పులిశా
గంగ వరం అనే పల్లెలో ప్రతి ఆది వారం సంత జరిగేది. పక్క పల్లెల్లోని రైతులు ,చిన్న చిన్న వ్యాపారులు , తాము పండించినవి, వస్తువుల్ని కొనుగోలు చేసినవి సంతకు తెచ్చి అమ్ముకొనే వాళ్లు.
ఇరువారం అనే గ్రామం నుంచి రంగయ్య అనే రైతు తన కున్న గుంట స్థలంలో తమల పాకుల తోటలో నుంచి ఆకుల్ని కోసుకొని సంతలో అమ్మకానికి సిద్ధం చేసుకున్నాడు . ఉప్పమ్ముకొనే రామయ్య రెండు బస్తాల ఉప్పుతో సంతకు బయలు దేరాడు. మోతుబరి రైతు రాఘవయ్య దగ్గర బస్తాడు కంది పప్పును కొని మారు బేరానికి అమ్ముకోవడానికి సంతకు పోవాలని ఎదురు చూస్తున్నాడు రాజయ్య.
ఇరువారం నుంచి గంగవరానికి నాలుగు మైళ్ల దూరం. తమలపాకుల బుట్ట తల మీద బెట్టుకొని నడీధిలో ఎవరయినా తోడు దొరికితే దారి శ్రమ ఉండదని ఎదురు చూస్తున్నాడు రంగయ్య . ప్రతి సంతకు బాడుగ బండి తోలే చిన్నయ్య రెండెడ్ల బండి ఎక్కారు ముగ్గురూ . కొంత దూరం వెళ్లంగానే మబ్బులు ముసురుకొని పెద్ద పెద్ద చినుకులతో జోరున వర్షం కురవడం మొదలైంది. దారిలో ఎక్కడా నిలువ నీడ లేదు. అందరూ తడిసి ముద్దయ్యారు.
కాసేపటికి చూసుకుంటే ఉప్పు మొత్తం కరిగి నీరై కారి పోయింది . పప్పు బస్తాలు పూర్తిగా నాని పోయాయి. ఆకుల బుట్టలో నీళ్లు నిండి పోయాయి . ఉప్పు కరిగి నీరై పోయినందుకు రామయ్య దిగులుతో తల పట్టుకున్నాడు. పప్పు నానిందని రాజయ్య కుమిలి కుమిలి ఏడుస్తుంటే తమలపాకుల రంగయ్య పాడి పాడి ఏడవడం మొదలు బెట్టాడు. అది చూసి ఆశ్చర్య పోయిన బండి వాడు ఊరికి తిరిగొచ్చిన తర్వాత కనిపించిన ప్రతి ఒక్కరితోను ' ఉప్పోడు పులిశా పప్పోడు పులిశా తమల పాకులోడు తనకు తానే పులిశా ' అని చెప్పడం మొదలి పెట్టాడు .
ఉప్పు పూర్తిగా కరిగి పోతుంది కాబట్టి అతనికి పూర్తిగా నష్టం . అతను బాధ పడడంలో అర్థం ఉంది. కంది పప్పు నానినా తిరిగి ఎండ బెట్టుకొని వాడుకోవచ్చు. నానిన్ పప్పు ఉడకకుంటే కనీసం పచ్చడి కానీ , పొడి కానీ చేసుకోవచ్చు. కానీ ఉప్పోడి కంటే ఎక్కువే ఏడ్చాడు వాడు. ' ఆకుల తట్ట హరిదాసు పొట్ట తడుపుతూ ఉండాల' ని సామెత. నీళ్లలో ఎంత తడిస్తే ఆకులు అంత బాగా నవ నవ లాడుతాయి. ఏ నష్టం లేని వాడు అందరి కంటే ఎక్కువ బాధ పడ్డంలో అర్థం లేదు. అనవసరంగా బాధ పడే వాళ్లను చూసి వ్యంగంగా ఈ సామెతను ఉపయోగిస్తారు.
ఉప్పోడు ఏడిస్తే, పప్పోడు ఏడిస్తే కొబ్బరి బోండాల వాడు పొర్లి పొర్లి ఏడ్చాడనే సామెతను ఇదే అర్థం లో కొన్ని ప్రాంతాల్లో ఉపయోగిస్తారు.
మహసముద్రం దేవకి
Comments
Post a Comment