మా ఇంట్లో ఉగాది

 మా ఇంట్లో ఉగాది:


ఆరుగాలం శారీరక కష్టం మీద బతుకు వెళ్ళ దీసే  పల్లెవాసులకు పండగొచ్చిందంటే ఎంత సంబరమో చెప్ప నలివి కాదు . పిల్లల మైతే  ముందు నుంచే పండగొస్తుందని ఎదురు చూసే వాళ్ళం . దగ్గర పడుతున్న కొద్దీ గుర్తు చేసుకొని ఎగిరి గంతు లేసే వాళ్ళం .

మన తెలుగు వాళ్ళు జరుపుకొనే పండగలు లెక్కకు మించినన్ని ఉన్నాయి .  తిథి ,వార, నక్షత్రాలను బట్టి వచ్చే పండుగలను ఎవరికి వారే ఒకే రోజు ఎవరిండ్లలో వాళ్ళు జరుపుకుంటారు .సంక్రాంతి లో జరుపుకొనే కనుమ , పొంగలి లాంటి పండగలు అందరూ కలిసి చేసుకుంటారు . శివరాత్రి జాగరణ, వైకుంఠ ఎకాదశి, సుద్దులు పండగ ఎవరింట్లో వాళ్ళు చేసుకున్నా ,కొన్ని సన్ని వేశాల్లో ఊరంతా కలిసి ఆనందంగా గడపతారు. గంగ జాతర , ఉర్సు తిర్నాల, భారత ఉత్సవం , సీతారాముల పెళ్లి , పుష్ప పల్లకి లాంటి  తేరు  తిరునాళ్ళలో చుట్టు పక్కల ఊర్లన్నీ  కలిసి పోతాయి. పెళ్ళిళ్ళు , పుట్టిన రోజులు , బారసాలలు ఎవరికి సంబంధించిన దయినా అందరూ పాల్గొంటారు. వేడుకల్లో ఇలా భిన్నత్వం లో ఏకత్వం , ఏకత్వం లో భిన్నత్వం తప్పని సరి .

పండగనగానే ఇల్లు శుభ్రం చెయ్యడం , పెచ్చు లూడిన మంటి  గోడలకు మన్ను మెత్తించడం , గురుగు మన్ను తెచ్చి పేడ కలిపి అలకడం ఆ పైన గోడ లకు సున్నం పూయడం ఇంటి ఇల్లాళ్లకు అర గడియ కూడా పురసత్తు లేనన్ని పనులు . ఇల్లలికి ముగ్గులు పెట్టడం.తలంట్లు, కొత్త బట్టలు అన్ని పండ గలకు ఉండేవే. ఉగాది, దీపావళి , సంక్రాంతి తెలుగు వాళ్ళు అట్ట హాసంగా జరుపుకుంటారు .

ఉగాది పండగ విషయాన్ని కోస్తే  దేవుని మొక్కడం  కాకుండా కొత్త సంవత్సరాన్ని ఆనందంగా గడపాలని మా ఊర్లో ఉగాది పచ్చడి తిన్న తర్వాత మాంసాహారం తో మొదలు పెడతారు .

మా ఇంట్లో మా అమ్మ ఉదయం ఐదు గంటల లోపలే మమ్మల్ని నిద్ర లేపి, తలంటి స్నానాలు పూర్తి చేయించేది. మూడు గంటలకే ఊర్లో పొట్టేళ్ల సందడి మొదలై నాలుగింటికే  మాంసం ఇండ్లకు చేరేది . మా ఇంట్లో ఆ వంట వండే వాళ్ళుకారు .కారణం మా నాన్న . ఆయనకు ఆ పేరు కూడా వినబడ రాదు . ఇక్కడ మా నాన్న గురించి ఒక చిత్ర మయిన విషయం చెప్పాలి మీకు . మా నాన్న గర్భం లో ఉండగా మాంసాహారం ఇష్టంగా తినే మా నాయనమ్మ సహించక  అసలు తినడం మానేసిందట .పుట్టాక పెద్ద వాళ్ళు బలవంతం చేసి పెడితే తినీ తినక ఒక పూట తినిందట. అంతే మా నాన్నకు పాలిస్తే ఆరోజంతా తాగలేదట . మళ్లీ ఒకసారి పరీక్షించి కొడుకు కోసం పూర్తిగా తినడం మానేసింది.

మా అమ్మమ్మ వాళ్ళది మా ఊరే .మేము అయిదు మంది పిల్లలం . మాకు మాతాత అలవాటు చేశాడు. తిన్నాక బాగా చేతులు శుభ్రం చేసుకొని చేతులకు కొబ్బరి నూనె రాసుకొని ఇంటి కొచ్చినా ఆ రోజు మా నాన్న దరి దాపులకు రానిచ్చే వాడు కాదు . మేమూ వెళ్ళే వాళ్ళం కాదు .

మహాసముద్రం నుంచి వరిగ పల్లె లో ఉన్న వాళ్ళ మేనత్తకు దత్త పుత్రుడు గా వచ్చిన వాడు మా నాన్న . మా నాన్న మీది  ప్రేమతో మా అవ్వ ఇంట్లో  ఆ వంట వండడం పూర్తిగా రద్దు చేసేసింది . పండగ పూట చిత్తూరు జిల్లాలో మాత్రమే మాంసం తింటారని అందరూ ఎగతాళి చేసే వాళ్ళు .

మా ఇంట్లో అమ్మ శాకాహారం మాత్రం వండేది . ఆ రోజు దోసెలకు తప్పని సరిగా ఉర్లగడ్డల్ని కర్రీ రూపంలో గాక కుర్మా చేసే వాళ్ళు . మాంసాహారం తినే పండగలు ముఖ్యంగా మూడు . ఉగాది , నరక చతుర్దశి , సంక్రాంతి లో మూడో రోజయిన కనుమ .చిత్రంగా తెల్లవారు జామున 5 గంటలకే తినేసే వాళ్ళు .

మా ఇంట్లో స్నానాలాయ్యాక మా అమ్మ వంట చేస్తే మా అవ్వ,నాన్న ఉగాది పచ్చడి తయారు చేసే వాళ్ళు . పచ్చడంటే  పచ్చడి రూపం లో కాదు .ఒక తాంబూలం తట్టలో మామిడి కాయల్ని వీలయినంత చిన్న ముక్క లుగా కట్ చేసి బెల్లాన్ని పొడి చేసి కలిపి , ఉంటే వేప పూత లేకుంటే వేప చిగుళ్ళు వేసి , నీళ్లు ఎక్కువ వెయ్య కుండా చింత పండు గుజ్జుతో ముక్కల్ని తడి చేసి కాస్త ఉప్పు , కారం కలిపే వాళ్ళు . ఆ తట్టను నట్టింట్లో పెట్టి టెంకాయ కొట్టి కర్పూరం హారతిచ్చాక పూజా సామగ్రి తో ఇంటి ముందే ఉన్న వినాయక స్వామి గుడికి తీసు కెళ్ళి అక్కడ మళ్లీ కాయ కొట్టి కర్పూరం వెలిగించి ఉగాది పచ్చడిని స్వామికి బాదమాకులో నైవేద్యంగా పెట్టి అక్కడున్న వాళ్ళమంత ప్రసాదం స్వీకరించి, ఆవురావురని ఆ టైం లోనే దోసెలు లేదా ఇడ్లీలు పైన పడే వాళ్ళం .తిండి కోసం మేము మా అమ్మమ్మోలింటికి పరుగు పెట్టే వాళ్ళం, రోజంతా తినాలనిపించి నప్పుడంతా తింటూ, ఆటలతో కాలం గడిపే వాళ్ళం  మా నాన్న ఆ రోజు మమ్మల్ని దగ్గరికి రానివ్వడు కాబట్టి వీధుల్లో బడి ఆ రోజంతా మేము ఆడిందే ఆట , పాడిందే పాట . ఇది పెళ్ళయ్యే  దాకా మా ఇంట నేను జరుపుకున్న  ఉగాది .

నేను పుట్టింది చిత్తూరు జిల్లాలో .మెట్టింది కర్నూలు జిల్లాలో . ఉద్యోగం రెండింటికీ మధ్య ఉన్న అనంత పురం జిల్లాలో .అనంతపురంలో పండగ రోజు మాంసం వండే వాళ్ళం కాదు .నలుగురితో నారాయణా అని బొబ్బట్లు , వడలు చేసుకొనే వాళ్ళం .ఉగాది పచ్చడి మా పుట్టింట్లో లాగే చేసేదాన్ని .

అత్తగారింట్లో ఉగాది పండక్కు వీలున్నప్పుడు వెళ్ళే వాళ్ళం .మా ఇంట్లో ఉగాది పచ్చడి మాత్రం మా మామగారు చేసే వారు . చాలా రుచిగా ఉండేది . తయారీ విధానం చూద్దాం . కొత్త కుండ తీసుకొని అందులో బెల్లం చిక్కటి పానకం లా కలిపి , మామిడి కాయల తురుము వేసి వేప పూతతో పాటు కొత్త చింత పండు గుజ్జు కలిపి , ఉప్పు , కారంతో పాటు తేనె, ఎండు ద్రాక్ష, గోడంబి,యాలకల పొడి కూడా కలిపే వారు. 

పెద్ద కుండలో చేసిన యీ పచ్చడిని దేవుని ముందర పెట్టి పూజ చేసి తలా ఒక గ్లాసు హల్వా లాగున్న పచ్చడిని తీసుకున్నాక పిండి వంటలతో పండగ భోజనం కానిచ్ఛే వాళ్ళం .  మా మామ గారు చేసిన ఆ ఉగాది పచ్చడిని ఊర్లో అందరూ వచ్చి అదే పనిగా సేవించి వెళ్ళే వాళ్లు .

తర్వాత అనంతపురంలో కూడా ఉగాది పచ్చడిని మామ గారు చేసినట్లు చేసే దాన్ని. ఇంటికొచ్చిన అందరికి ఆ పచ్చడి పెట్టి శుభాకాంక్షలు తెలిపే వాళ్ళం.


దేవకీ మహాసముద్రం




Comments