పుట్టు పూర్వోత్తరాలు
భాష , ఆయా భాషల్లోని పదజాలం, సాహిత్య ప్రక్రియలు, వాటి లోని రక రకాల పోకడలు ... ఇలా ఏదయినా కానీ ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఊడి పడ లేదు. అవన్నీ కూడా ఆయా సందర్భాల్లో , తర తరాల అనుభవం నుంచి అలవోకగా పుట్టి , ప్రాచుర్యాన్ని పొంది , ఒకరి నుంచి మరొకరికి సంక్రమించి , ప్రజల నాలుకలపై నాని నాని భాషలో స్థిర రూపాన్ని పొందాయి. శాశ్వతంగా నిలదొక్కు కున్నాయి. సంఘ జీవితానికి ప్రతిబింబాలు . మానవ మనస్తత్వాలకు నిలువు టద్దాలు , సమాజ అధ్యయనానికి మూల కారణాలు అయిన ఆ మాటలు సామెతలు కావచ్చు, జాతీయాలు, నానుడులు , సూక్తులు , సుభాషితాలు, ఆర్యోక్తులు , లోకోక్తులు , జంట పదాలు ..... ఇలా ఏవయినా కావచ్చు .
మన నిత్య జీవితంలో వినిపించే ఈ మాటలు ఎలా పుట్టాయి? ఏ విధంగా పరిణమించాయి ? ఎలా వికసించాయి? అనే వాటి పూర్వాపరాలు అందరికీ తెలియక పోవచ్చు. కొందరికి తెలిసినా ఇతరులకి చెప్పక పోవచ్చు. భాష పై పట్టు, మౌలిక కారణాల్ని తెలుసు కోవాలనే పట్టుదల ఉన్న వాళ్లు వాటి పుట్టు పూర్వోత్తరాల కోసం అన్వేషణ సాగిస్తారు.
వాటి పుట్టుకకు కుటుంబం, సమాజం , వేదాలు, ఉపనిషత్తులు , ఇతిహాసాలు , పురాణాలు , కావ్యాలు, కథలు, రక రకాల సన్ని వేశాలు కారణాలవుతాయి . అనుభవం నేర్పిన పాఠాల నుండి రూపుదిద్దుకొని భాషకు ఇంపును, సొంపును, విలువల్ని సంతరించి పెడుతున్న అలాంటి కొన్ని పదాల, వాక్యాల, మాటల గురించి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
నిత్య వ్యవహారం లోని అలాంటి భాషా ప్రయోగాల్ని వాటి పూర్వా పరాలను అన్వేషిద్దాం . మేథస్సుకు పదును పెట్టుకుందాం . సమాధానాల్ని వెతికి వెలికి తీద్దాం . తెలియని విషయాల గురించి తెలుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది కదా! మరి ఎందుకూ ఆలస్యం? మీరు కూడా మీకు తెలిసిన పలుకు బడుల గురించి , వాటి పూర్వాపరాల గురించి చెప్తారని ఆశిస్తూ -
మీ
మహాసముద్రం దేవకి
Comments
Post a Comment