సంక్రాంతి - పెద్ద పండగ
సచ్చి పోయిన వాళ్లకు గుడ్డలు పెట్టి మొక్కే పెద్దోళ్ల పండగ ఇది. నాలుగు రోజుల సంక్రాంతిలో నిష్టగా చేసే పెద్ద పండగ . కొత్త పంచలు,సొక్కాయి గుడ్డలు, తువ్వాళ్లు , కోకలు నట్టింట్లో పీటేసి పీట పైన పెట్టింది మా యమ్మ. కుత్తెలకులు ( దీప స్తంబాలు ) రెండూ రొండు పక్కల పెట్టి వత్తులేసి ఇప్ప సమురు పోసి ఎలిగించింది. మా బాలడు చెరుకు గెడలు రెండు , పసుపు చెట్లు వేర్లతో పాటు పెరుక్కోనొచ్చినాడు .వాటిని కూడా అక్కడే ఒక మూల నిలబెట్టినారు. మామిడాకులు , బంతిపూలు దెచ్చి తలవాకిలికి దొర్నాలు కట్టినారు.
పెద్దింట్లో ఒక పక్కగా సున్నం గోడను నాలుగడుగుల వెడల్పు నాలుగడుగుల పొడుగు మాత్రం ఎరమట్టితో అలికి ఉంటారు . అది ఎప్పుడూ అట్లే ఉంటాది . ఏ పండగొచ్చినా ఆ తావునే తలిగేసి టెంకాయ కొట్టేది మాఇంట్లో .
పొద్దున్నే అందురి స్నానాలు ఐపోయినాయి . మా యమ్మ , నాయిన , మా అవ్వ ఒక్కపొద్దున్నారు. మేము మాత్రం అవీ ఇవీ తింటూనే ఉన్నాం. అది సాలదని మా యమ్మ మా కోసం ఉప్పిండి సేసింది. ఊరిబిండి సెయ లేదని మా సినబ్బోడు ఏడ్సినాడు కానీ అన్ని పనుల్లో ఊరిబిండి ఎప్పుడు రుబ్బేది? మేము మామిడి కాయ ఊరగాయేసుకోని బాగానే తిన్నాం. వాడేడిస్తే మాయవ్వ ఓర్సుకుంటాదా? అందులోను ఈ పొద్దు . మా తాతే సచ్చిపోయినాక వాడుగా పుట్టినాడని మాయవ్వ నమ్మకం. అందురూ మాతాత పేరుతో సుబ్బారెడ్డనే వాడిని పిలస్తారు. మాయవ్వ వాడికోసం మిరపరాతి మింద కొంచం ఊరిబిండి నూరిచ్చింది.
మా యమ్మ పొయ్యింట్లో పండగకు ఏమేమో సేస్తా తలమునకలగా ఉంది. మాయవ్వ మాయక్క ఇసుర్రాయిలో పగల బెట్టి నాన బెట్టిన అలసంద పప్పు పొట్టు కడిగి రుబ్బు రోట్లో ఏసి రుబ్బ బట్టిరి . అదేమన్నా కొంచిమా నంచిమా ? అంత పెద్ద రోట్లో నాలుగు వాయిలు రుబ్బినారు .
పెద్దోళ్లు ఇష్టంగా తినే మునగాకు, చిక్కుడు కాయలు , కంద గెడ్డ , ఉర్ల గెడ్డలే గాక పెద్దపండక్కు తప్పకుండా సెయ్యాల్సిన గుమ్మడి కాయ అనప గింజలు, అవిశాకు ఒండి రోజు మాదిరిగా గిన్ని ల్లో ఎయకుండా సిబ్బి తట్టలో ఇస్తరాకు పరిసి కుప్పలు , కుప్పలు గా పెట్టింది . శానా రకాలు కదా! గిన్నెలో ఏస్తే మళ్లీ వాటిని కడిగేదెవురు . రామప్ప తాత కూడా లేడు. పండక్కు కూతురింటికి పొయినాడు . ఒక పెద్ద సట్టి నిండా బెల్లం పాయసం. ఇంకో సట్టి నిండా గుమ గుమలాడతా సాంబారుసేసింది .
పెళ్లో బాడ్సి సెట్టు కింద ఉండే పొయ్యి మింద పెద్ద రాగి అండాలో ఉప్పిడి బియ్యంతో అన్నం వార్చింది. పెద్ద గుండాయి నిండా రసం పెట్టింది. పనోళ్లకెయడానికిది. మాకు లోపల కిచ్చిలి సంబావు బియ్యంతో అన్నం వండింది. ఇన్ని పనులు ఆడా ఈడా ఒడుపుగా ఎట్ల సేస్తాదో మాయమ్మ .
వడలు ఎప్పుడెప్పుడు కాలుస్తాదా అని కాసుకో నున్ని నేను పెనములో సుయ్ అనగానే రొండియమని అడిగినాను. పెద్దోళ్లకు తళిగేసినాకే తినాలని , మనం తినింది ఏదీ పెట్ట రాదని ఇయలేదు మాయమ్మ .
ఇంట్లో ఎరమన్ను పూసిన సోట మాయవ్వ చిక్కటి పసుపు నీళ్లలో చిన్న గుడ్డ ముక్కను ముంచి పైన గోడ కానించి పిండితే అది దారగా కారతాది . అట్లా ఐదు దారలు పోలు పోసింది. మా నాయిన ఈ సివర ఆ సివర సెంకు సెక్రాలు, మద్దిలో మూడు నామాలు గీసినాడు. ఐదిస్తరాకుల్లో ( పచ్చిబాదమాకులతో కుట్టింది ) వొండిన వన్నీ తళిగేసింది మాయమ్మ . ఒక గిన్నిలో సలిబిండి . ఒక బాదమాకులో కాకికి అన్నం పైన సప్పని పప్పేసి రొండు సుక్కల నెయ్యి పోసింది . అది కాయి కొట్టినాక కాకికి పెడతాము . కాకి తింటేనే మేము తినాల . సూస్తా ఉంటే అప్పుడే అన్నీ తినేద్దారా అని ఉండాది.
ఇంకా కాయకూడా కొట్ట లేదు . ఇంటి ముందు గిన్నెలు పట్టుకోని బీదా బిక్కీ, , పనోళ్లు వొచ్చి సోలుపుగా నిల్సుకోని కాసర బీసరగా మాట్లాడ్తా ఉండారు . అసలే పొద్దున్నుంచి ఏమీ తినలేదా కొంచేపుండి రమ్మనింది మాయమ్మ.
అందరూ సేరి మానాయన టెంకాయ కొట్టి ఆరతిచ్చినాక మొక్కుకున్నాము. చెంబులో మా యక్క నీళ్లు పట్టుకుంటే మానాయన కాకికి పెట్టిన తళిగి తీసుకున్నాడు. బయట మదుర గోడ మింద నీళ్లు సల్లి దాని పైన తళిగి పెట్టంగానే కాకులు రాలేదు. మానాయన కావు కావు మని కాకుల్ని పిలస్తా ఉంటే మేమూ కావ్ కావ్ మని గోల సేసినాము. కొంచేపటికి మూడు కాకులొచ్చి వాలినాయి . అవి అన్నం ముట్టుకున్నాక మేము లోపలికొచ్చినాము. మా నాయన చేతులో తీర్తం పోసినాడు . అది అయినాక ఒక్కపొద్దు ఇడిసినాము.
మాయమ్మకు అన్నాలు దిన్న్యాక అరకాసు పని లేదు- అర గడియ తీరుబాటు లేదు అనేట్లుంది పాపం. దినమంతా నిలుకూ నిబందం లేకుండా వస్తానే ఉండారు . రేపు కుంచిలు దోలే పండగ ( kanuma) కదా!సూర్యుడు పడమట మునిగే యాలకంతా మళ్లీ అలకడం, ముగ్గులెయ్యడం, ఎరమన్ను పూయడం, అందరికి అన్నాలు పెట్టడంతో ఆ రోజు పని పూర్తయింది. ఒక్కపొద్దున్నోళ్లు రాత్రి పండు దిని పాలు దాగి పండుకున్న్యారు .
మహసముద్రం దేవకి
Comments
Post a Comment