సంక్రాంతి పండగ - రైతులపండగ

 సంక్రాంతి పండగ -  రైతులపండగ


ముందుగా సమూహ సభ్యు లందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

ఇంటింటా ఎవరికి వారు పండగ చేసుకొంటూనే ఊరంతా కలిసి జరుపుకొనే పండగ సంక్రాంతి. భిన్నత్వంలో ఏకత్వం ఈ పండగ లక్షణం. అందరూ కలిసి ఉండాలనే లక్ష్యం కూడా . అందుకే  ఇంటింట పిండి వంటలు, పూజా విధానం లో ఎవరి ప్రత్యేకతలు వారివైనా సంబరాలన్నీ ఊరంతా కలిసి సామూహికంగా జరుపుకుంటారు.

సంక్రాంతి అంటే కొత్త కాంతి .సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడానిని మకర సంక్రమణం అంటారు. అదే సంక్రాంతి.  దీన్ని అందరూ జరుపుకున్నా రైతులు అత్యంత ఇష్టంగా జరుపుకుంటారు .దానికి వ్యవసాయ సంబంధ మైన కారణాలు అనేకం .

పోలోమంటూ ఎడాది కొకసారి పొంగటి పండుగ వచ్చేస్తుంది .అప్పటికి పంట ఒడుపులు పూర్తవుతాయి. వడ్లు, శనక్కాయ బస్తాలు బండ్ల మీద ఇల్లు చేరతాయి. గాదెలు గరిసెలు ,వెదురు బొట్ట( పదిహేను ఇరవై బస్తాలు పట్టేవి) లలో ధాన్యపు సిరులు ఒదిగిపోయాయి. మెట్ట చేల నుండి పండిన కందులు, అలసందలు, అనుములు, పెసలతో దొంతికుండలు నిండి పోతాయి.

ఇండ్ల మీద ,పేడదిబ్బల మీద, ఎద్దుల కొట్టాల పైన అల్లుకున్న గుమ్మడి తీగలు మొగ్గలు,పూలు ,పిందెలతో పుట్టెడు బిడ్డల తల్లుల్లా మురిపిస్తాయి.ఎవరి పెరట్లో చూసినా చిక్కుడు పందిళ్లు,వాటి నిండా గుత్తులు గుత్తులుగా విరగ కాసిన కాయలు కనువిందు చేస్తాయి. పొట్ల పాదుల నిండా చారల చారల పొట్ల కాయలు  వేలాడుతుంటాయి .

పొలం దగ్గర సంవత్సరం చివరాకిరిగా నాటిన మిరప తోట రకరకాల మొక్కలను తనలో కలుపుకొని మద్రాసు కదంబంలాగా కళకళలాడుతూ కలిసిమెలిసి పెరిగి పెద్దవుతాయి. చెట్ల మధ్య ఉన్న కాలువల్లో నాటిన సన్న ఉల్లిపాయలు భూమిలో గుత్తులుగా ఊపిరి పోసుకొని ఊరుతుంటాయి. అక్కడక్కడ నాటిన ముల్లంగి విత్తనాలు ఏపుగా పెరిగి మట్టి లోపలి గడ్డలను పెంచి పెద్ద చేస్తుంటాయి. వంకాయలు బెండకాయలు.బీర.  కాకర చెట్లు మేమేం తక్కువా అన్నట్లు పోటీ పడుతుంటాయి.     

మిరప తోట మధ్యలో కాలవ lగట్లపై వరసగా పోసిన ధనియాలు మొలకెత్తి ఏపుగా పెరిగిన కొత్తిమీర మొలకలు పచ్చ బట్టలు వేసుకున్న సిపాయిల లాగా వరసగా నిలబడి మిరప తోటకు కాపలా కాస్తూ కబుర్లు చెప్పుకుంటున్న చందం గా పిల్ల గాలికి తలలూపుతుంటాయి .అక్కడక్కడ ముచ్చటగా పొదల్లాగా పెరిగిన బంతి చెట్లు ఎరుపు పసుపు రంగుల ముద్దబంతి పూలతో నిండుగా, నవ నవ లాడుతూ కంటి కింపుగ కనిపిస్తాయి. అక్కడక్కడ మొలకెత్తిన గోగు చెట్లు పసుపు, వక్క కలరు పూలతో నిటారుగా నిలబడి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు ఉంటాయి.

అప్పుడే పూతకు వస్తున్న ఆ మిరప చెట్లుకు పూసిన తెల్లని పూలు క్రమంగా పిందెలుగా మారి  పెరిగి పెద్దవు తాయి. పచ్చని పచ్చ పావడాలు కట్టుకున్న ఆడ పిల్లల్లాగా  మెరిసిపోతాయి.మరి కొన్నాళ్లకు ఎర్రటి జిలుగు పైటలు  ధరించిన కన్నె పిల్లలా వగలు పోతుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవనిపిస్తుంది.  చూస్తే మిరప తోటల వయ్యారాలు చూడాలి. జరుపుకుంటే సంక్రాంతి  పండగే జరుపుకోవాలి .

ఇంతగా. మిరప తోట గురించిన కథా కమామీషు ఎందుకంటే సంక్రాంతి ముందు అన్ని పైరులు ఒడుపు కొచ్చి పొలాలన్నీ బీళ్లుగా ఉన్న సమయంలో వాటి మధ్య కల కల లాడుతూ సంక్రాంతి తర్వాత చిత్తూరు జిల్లాలో కనిపించే సుందర దృశ్యం మిరప తోటే.

రైతుల కళ్ళనిండా సంతోషం తాండవమాడుతుంటే సంక్రాంతి పండగ వస్తున్నానంటూ ఊరిస్తూ రానే వస్టుంది. సేద్యం పనులన్నీ ముగియడంతో రచ్చ బండ మీద , అరుగుల పైన కూర్చొని పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేస్తుంటారు మగవాళ్ళు .పాపం ఇంటి ఇల్లాలికి మాత్రం పండగ వచ్చిందంటే  ఊపిరి సలపనన్ని పనులు .మరీ సంక్రాంతి పండగంటే ఇంటికి సున్నాలు, పిండివంటలకు సన్నాహాలు వాకిళ్ళలో కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలతో అలంకరించడం అన్ని పండగల పనుల కంటే అదనంగా ఉండేవి.

పండగ నెల మొదలవగానే పావడాలు ఎగజెక్కి తంగేడు పూలతో వొడులు నింపుకొని జల్లెట్లో ఆ పూలు పోసి గొబ్బెమ్మని తీర్చి రాత్రిపూట ఇంటింటా గొబ్బి పాటలు పాడుతూ సంబర పడిపోతుంటారు. ఆడ పిల్లలు.గొబ్బి తట్టడం పూర్తయ్యాక గౌరమ్మను నిద్రపుచ్చి , మళ్లీ ఉదయాన్నే మేల్కొల్పే పాటలు పాడి సరదాలు తీర్చుకుంటారు వారు . 

ఇదంతా మా పల్లెలో ప్రతి ఇంటా  కనిపించే పండుగ సంబరాలు. ఇక మా ఇంటి విషయానికొస్తే ఉదయాన్నే కొక్కొరొకో అని మా కోడి పుంజు లేపకనే అందరం లేచి ఇంటి మలుపులో జంటగా నిల్చున్న తాటి మాన్లను తలదన్నే విధంగా భోగి మంటలు వేస్తాము. పిల్లలందరూ కలిసి  మండుతున్న గోగు కట్టెల దివిటీలు తీసుకొని  చీకట్లోనే రేగి మాను కిందపడిన పండ్లను ఏరుకొని తింటాం. ఎలా తెల వారుతుండగానే పెద్ద వాళ్ళ హెచ్చరికలతో స్నానాలు ముగించి ఇంటింటా పోసే అంబలి తాగి భోగిమంట వల్ల ఏర్పడిన కడుపు మంటను చల్లార్చు కొని ఆటల్లో మునిగిపోతాం. మా అవ్వ అమ్మ  ముందే చేసి పెట్టుకున్న కజ్జాలు( అరిసెలు),  మురుకులు, కజ్జికాయలు, సద్ద రొట్టెలు అడప దడపా ఏదో ఒకటి తింటూనే ఉంటాము కదా!

అసలు పండగ భోగి తర్వాతి రోజు వచ్చేదే.పెద్దల పండుగగా పిలుచుకొనే  అతిపెద్ద పండుగ అది తలంట్లు, కొత్త బట్టలు , రక రకాల కూరలు ,వడలు, పాయసాలు మొదలయిన పిండి వంటలతో  చనిపోయిన వాళ్లకు  నట్టింట్లో కొత్త బట్టలు పెట్టి  నైవేద్యం తో పాటు కాయ కర్పూరం సమర్పించి కడుపునిండా భోజనాలు చేస్తాము. ఆ పని ఇంకా  పూర్తి అయ్యీ కాకుండానే సంవత్సరం పొడవునా పొలం పనులకు వచ్చే  కూలి వాళ్లు  ఇంటి ముందు గిన్నెలు పట్టుకొని వరసగా నిలబడి ఉంటారు .వాళ్లకు అత్తిరసాలు,  అన్నం చారుతో తృప్తిగా భోజనం పెడు తుంది మా అమ్మ. అందరిండ్లలోను ఈ తంతు మామూలే .

మరునాడే కనుమ.  అదే పశువుల పండగ.   మా  తమ్ముళ్ళు ఇద్దరు జీతగాళ్లు కలిసి పశువుల కొమ్ములు జివిరి బావి దగ్గరికి తోలు కెళ్ళి వాటికి స్నానం చేయించి కొమ్ములకు రంగులు పూసి, కుచ్చులు కట్టి ,మెడలో మువ్వల గంటలు కట్టి అందంగా అలంకరిస్తారు. ఆరోజు ఇండ్లన్నీ మాంసం వంటలతో ఘుమఘుమలాడతాయి. భోజనాలు పూర్తయినాక  పశువులను. రచ్చబండ ముందు చేర్చి వినాయకునికి పూజ చేసి సూరా  టెంకాయలు కొట్టి  (కొబ్బరికాయల్ని మామూలుగా కాకుండా నేలకేసి పిచ్చలు పిచ్చలు చేయడం )పశువుల్ని వీధిలో పరిగెత్తిస్తారు. కొంటెగాళ్లు గాడిదలను కుక్కలను అలంకరించి అందర్నీ నవ్విస్తూ వీధుల్లో పశువులను తిప్పి నట్లే పరుగెత్తిస్తారు.  రైతులు అన్నం లో ఎర్రటి  కుంకుమ కలిపి  పొలాల్లో ఆ అన్నాన్ని పొలి చల్లుతారు. ఆలా చల్లితే పంటలు బాగా  పండుతాయని రైతుల నమ్మకం.

మరునాడు పొంగటి పండుగ. ఆరోజు గ్రామదేవతలకు పొంగళ్ళు పెట్టీ పూజలు చేసి నైవేద్యాలు పెట్టి మొక్కులేమైన ఉంటే తీర్చుకుంటారు. పశువులను కాపాడమని కాటమరాయునికి పూజలు చేస్తారు.

గొబ్బితట్టిన ఆడపిల్లలు గౌరమ్మను చేసిన పసుపును మొహాలకు రాసుకొని పేడతో, బంక మట్టితో చేసిన గౌరమ్మలను నీళ్లలో కలుపుతారు. వచ్చిన బియ్యాన్ని గుజ్జన గూళ్ళు వండి అందరూ కలిసి తిని ఆనందంగా కబుర్లు చెప్పుకొంటూ ఇండ్లకు చేరుకుంటారు.


అందరికీ మరో సారి సంక్రాంతి శుభాకాంక్షలతో

మహాసముద్రం దేవకి
     13-1-2024

Comments