Kavita - కృష్ణా నది

           

వెన్నెలలో కృష్ణా నది


నది నీళ్లలో  కులుకుతూ  ఆడుకుంటున్న 
చేప  పిల్లలకు పడుతున్న  దివిటాలా 
నీళ్లలో ప్రతిబింబిస్తూ
ఆకాశంలో  చందమామ

అల్లనల్లన మెల్లగా కదలాడే
నది అలల తాకిడికి
డాలు పట్టి
మురిసి పోతోంది వెన్నెల

అడవి కాసిన వెన్నెల అంటారు కాని
పిండార బోసి
అడవి ప్రాణులకు
ఆనందాన్ని పంచుతూ
బతుకును సార్థకం చేసుకున్నానని
ముసి ముసి నవ్వులు నవ్వుతోందది

జగమంతా వెన్నెల స్నానం చేసి పునీతమై పోయింది
ఇసుక తిన్నెలపై వెన్నెల పరుపు పరిచి
నీళ్లపై నుంచి వచ్చే చల్లని పిల్ల తెమ్మెరలను ఆస్వాదిస్తూ సేదదీరమని ఆహ్వానిస్తోంది

పూపొదల నీడలో నక్కి నక్కి
తొంగి చూస్తోంది చీకటి .
చెట్ల ఆకులు చెట్టుకు చెప్పకుండానే రాలి పోతూ
కాలధర్మాన్ని అనుసరిస్తున్నాయి

ఎక్కడో  కోయిల కూస్తొంది.
పాపం పిచ్చిది పికిలి పిట్ట
అందమయిన పూల చెట్లను వదిలి
ముళ్ల పొదల్లో ఆడుకొంటోంది

మండే ఎండలు
కురిసే వానలు
చల్లగ వీచే గాలులు
ఏం చెప్తున్నాయో
ఎవరికయినా తెలుసా !
ఏ విశ్వకర్మ  నిర్మించాడో ఈ భూ ప్రపంచాన్ని
ఎంత శ్రమ పడ్డాడో !

ఎత్తయిన కొండలు
లోతయిన లోయలు
విశాలమయిన పచ్చిక బయళ్లు
దట్టమయిన అడవులు
పారే నదులు
హోరెత్తే సముద్రాలు
అన్నీ ప్రాణుల కోసమే
కానీ అర్ధంతరంగా
అనుభవించకనే
ముగిసిపోయే బతుకులెన్నో ! 


మహాసముద్రం దేవకి 

Comments