పొడుపు కథలు - స్వరూపం

 పొడుపు కథలు - స్వరూపం


    జానపద సాహిత్య ప్రక్రియల్లో కథ, గేయం ఇవి రెండూ సాహిత్య సంబంధమైనవి. సామెత, పొడుపు కథ భాషకు వెలుగు నిచ్చేవి.    

(పొడుపుకథల గురించిన కొన్ని విశేషాలను చూద్దాం . ప్రధానంగా పొడుపు కథలకున్న ప్రత్యేక లక్షణాలేమిటి ? అవి ఎలా పుట్టాయి? కథలకు, పొడుపు కథలకు ఏమైనా సంబంధం ఉందా?  అనే అంశాలను పరిశీలిద్దాం. )

        వాటిలో  విజ్ఞానాన్ని , వినోదాన్ని సమానంగా పంచి పెట్టే ప్రక్రియ ఏదయినా ఉందా అంటే అది పొడుపు కథ.

నిద్ర పోతున్న మనసును తట్టి లేపి వెలుగు ప్రసాదించి తెలివి తేటలకు సవాలు విసిరి కాచుకో చూద్దాం అని పోటీకి సిద్ధం చెయ్యడం దీని ప్రత్యేకత .

         పొడుపుకథలు ఇతర సాహిత్య ప్రక్రియల్లాగా కేవలం వాగ్రూపమైనవి కావు. వీటిని బొమ్మలుగా వేసి చూపవచ్చు. భంగిమలుగా ప్రదర్శించ వచ్చు. లెక్కల రూపంలోనూ ఇవి ఉన్నాయి. గేయాలు, కథలు, కథా గేయాలు, సామెతలు, చిన్న చిన్న వాక్యాలు, పద్యాలు , గొలుసు కట్టు -- ఇలా ఎన్నో రకాలుగా పొడుపు కథలు కనిపిస్తాయి. అంటే సాహిత్య ప్రక్రియలనన్నిటిని తనలో ఇముడ్చుకున్న ఘనత పొడుపు కథలకు దక్కుతుంది .

       కథలు ఎన్నో రకాలు. పురాణ కథలు, చారిత్రకాలు , నీతి కథలు, అద్భుత కథలు, జీవిత కథలు, పిట్ట కథలు, కట్టు కథలు - ఇలా. వీటిని ఎవరైనా చెబితే ఊ కొట్టి గ్రహించేవి. వీటిలో కథాకథనం మొదట మౌఖికం. అందుకే వీటిని ఊకుడు కథలని కూడా అంటారు.

      దాసరులు, పంబలి వాళ్లు, జంగం వాళ్లు, జముకుల వాళ్లు, హరిదాసులు చెప్పే హరి కథలు, బుర్ర కథలు మొదలైన వాటిలో హంగులు ఆర్భాటాలెక్కువ. మాట, పాట, ఆట, ఆహార్యం, వాద్యం, వ్యంగ్యం వీటిలో కలగలుపుగా ఉంటాయి. అందుకే వీటిని సమాహార కళలు అంటారు. వీటన్నిటి కంటే భిన్న మైనవి పొడుపు కథలు.

        పొడుపు కథలు మెదడుకు మేత వేస్తాయి. బుద్ధికి నిశిత గుణాన్ని కలిగిస్తాయి. ఆలోచనల్ని ప్రేరేపిస్తాయి. తెలివి తేటలను సాన పెడతాయి. జ్ఞానతృష్ణను కలిగిస్తాయి. యుక్తి ప్రయుక్తి ప్రకటనా సామర్థ్యాన్ని పెంచుతాయి. సమస్యలను పరిష్కరించుకొనే కౌశలాన్ని పెంపొందిస్తాయి. విద్యను విశదం చేస్తాయి. స్ఫూర్తిని కలిస్తాయి. చమత్కారాన్ని అందిస్తాయి. ఆనందాన్ని  పంచుతాయి.

        నిగూఢమైన అర్థాన్ని ప్రకాశింప జేసేవి, మనసుకు సూటిగా తగిలేవి , యదలో నాటేవి అర్థం తెలియకుండా తికమక పెట్టేవి పొడుపు కథలు .

        పొడుపు కథలు అన్ని భాషల్లోను ఉన్నాయి. తెలుగులో వీటిని చాలా పేర్లతో పిలుస్తారు. పొడుపు కథ, విడుపు కథ, అడ్డుకథ , ఒడ్డు కథ , మారు కథ , చిక్కు ప్రశ్న, సమస్య ఇలా ఎన్నో పేర్లున్నాయి .

        పొడుపుకు ఎత్తి పొడుపు , దెప్పి పొడుపు అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఈ అర్థాల్లో వ్యంగం వల్ల కలిగే బాధ ఉంది. పొడవడం అంటే ఉదయించడం అనే అర్థం కూడా ఉంది. పొద్దు పొడుపు అలాంటిదే. ఇందులో రమణీయార్థ ప్రతిపాదకత్వం ఉంది.

      క్రమ శిక్షణను అలవాటు చెయ్యడానికి మన పూర్వులు ఏర్పాటు చేసిన గొప్ప జ్ఞాన క్రీడ పొడుపు కథ.

దీన్ని ఆడే విధానంలో ఒక క్రమం ఉంది . ఒక్కొక్కరా , అంత కంటే ఎక్కువా మనిష్టం. ఒకరుంటే పొడుకథకు అర్థం లేదు . కనీసం ఇద్దరుండాలి . ఒకరు పొడుపు కథ వేస్తే ఎదుటి వ్యక్తి విప్పాలి . విప్ప లేక పోతే బదులు తనకు పొడుపు కథ వేసిన వ్యక్తికి  కథ వెయ్యాలి . ఆ వ్యక్తి విప్పలేక పోతే ఎవరి కథకు వాళ్లు విడుపు చెప్పడమే . రెండో వ్యక్తి పొడిచే పొడుపు కథను ఎదుటి మనిషి విప్పేస్తే విప్పలేక పోయేంత వరకు కథలు వేసి అతను లేదా ఆమె మొదట వేసిన కథకు సమాధనం రాబడతారు .

పుట్టుక

జీవితంలో మనమెదుర్కొనే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించినప్పుడే పొడుపు కథలు పుట్టాయి. అంటే వీటి పుట్టుకకు మానవ జీవితమే మూలాధారం. సమస్యలను
పరిష్కరించుకోవడానికి మనిషి చేసే ప్రయత్నమే ప్రేరణ. ఎవరి సమస్యలను వాళ్లు పరిష్కరించుకోవడం ఒక రకం. ఇతరులను ఇరికించి తమాషా చూడ్డం మరో రకం. ఈ రెండవ రకానికి చెందింది పొడుపు కథ. మొత్తం మీద ఎదుటి వాళ్లకు ప్రశ్న వేసి జవాబు రాబట్టడం ముఖ్యం.

        దేశమంతా విస్తరించిన వీటికి మూలకర్త లెవరో తెలియకున్నా వ్యవహర్తలు మాత్రం ప్రతి పల్లెలోనూ కనిపిస్తారు . అడిగిన వెంటనే ముచ్చట్లు చెప్తూ మురిపిస్తూ పొడుస్తారు. తర తరాలుగా ఉన్న ముళ్లు తీసి మార్గంలో పూలు పరుస్తారు.

       ౠగ్వేదంలో , భారతం లోని యక్ష ప్రశ్నలలో, భట్టి విక్రమార్కుని కథల్లో, ముఖ్యంగా భేతాళ కథల్లో, కాశీ మజిలీ కథల్లో, వినోద కల్పవల్లి కథల్లో, అపూర్వ చింతామణి కథల్లో పొడుపు కథలు మొలకెత్తి, కొనసాగి , మారాకు తొడిగి, పూలు కాయలు పండ్లై ఆ విత్తనాలు దేశమంతా వెదజల్ల బడినాయి. 

వచ్చే వారం కొన్ని పొడుపు కథల్ని చూద్దాం. అంత వరకు సెలవు .

మహాసముద్రం దేవకి
       7-5-2021
       

Comments