వరిగపల్లె ముచ్చట్లు -6.
పుస్పావతి
తెల్లటి తెలుపు ,ఎర్రంగా వక్కాకు. దుగ్గుతో పెట్టిన నిమ్మకాయంత పుక్కెడ . చిన్న పిల్లోళ్లని 'నాయినా , కనా ' అని పెద్దోల్ని 'యమా' అని, మొగోల్లని 'నాయనా' అని నవ్వుతూ పలకరించే ప్రేమ నిండిన పలకరింపు.
నవ్వినప్పుడు కంటి కొనల్లో రొండు మూడు సూర్య కిరనాలు మాదిరిగా చిన్నా పెద్ద గీతలు . తలనిండా సమురు. పాపడ కూడా సరింగా ఉండదు.
ఒక్కోసారి కాంగిన సమురు వాసనొస్తా వుంటాది తల. ఉట్టి మిందున్న సెనిగి సమురులో సెయిబెట్టి తలకు పూసుకోడమే కాని అది కాంగిందా, కాదా అని సూసే గెవనం పుస్పకు లేదు . అందుకే ఆ వాసన.
మా ఊర్లో శాన మంది ఇదే తంతు. పండింది, ఎండింది సెనిక్కాయిలుంటాయి కాబట్టి దాంతో గానిగాడి తెచ్చుకున్ని నూని వుంటాది. దుడ్లిచ్చి తెచ్చుకొనే టెంకాయి సముర్లో, వాసన నూనిలో వాళ్లక్యాడనించొస్తాది .
ఇంక పుస్ప సంగతి కొస్తే మామూలు ముడేసుకోడమే కానీ జడేసు కునుంది ఈ పాపం జేసిన కంటితో సూల్లేదు. పుట్నింటికి బొయినా , పెండ్లికి బొయినా అంతే. కానీ తల్లో మాత్రం ఎప్పుడూ ఒక సెండుమల్లి పువ్వో , శామంచి పువ్వో ,అదీ లేకుంటే ముల్ల గోరింటి పువ్వో , కాయితిం పువ్వయినా సరే వుండాల్సిందే . బాయికాన్నించి ఒచ్చేటప్పుడు మాత్రం పుస్ప
తల్లో తంగేడు పువ్వు తప్పనిసరి .
ఆ చెట్టు ఎదురు పడితే ఒక పువ్వన్నా తుంచి తల్లో పెట్టుకోకుంటే అది 'ముండమోపి పొతావుంది ' అని తిడతాదంట. ఇంగా పెండ్లి కాకముందే వాళ్లవ్వ, ఇప్పుడు మొగినికి తల్లి అయిన గురమ్మ సెప్పింది. అది పుస్పకు బాగా గుర్తుండి పోయింది .
ఏమారకుండా తల్లో పూలతో వుండడంలో కూడా పుస్ప వుద్దేసం అదే అయ్యుంటాదిలే.
ఇంతకూ పుస్ప ఎవురు? గురమ్మకు సొయానా మనమరాలు . గురమ్మ పెద్ద కూతురికి కూతురు . కొడుకు సుబ్బరానికి తెచ్చి కట్టుకునింది. మొగుడూ పెండ్లాల మద్దిన ఇరవయ్యేండ్లన్నా తేడా ఉంటాది.
పుట్నించి నుంచి అవ్వింటికి కోడలిగా వొచ్చిన్నాటి నుంచే పసి బిడ్డి అని కూడా సూడకుండా ఇంటి బాద్దితంతా నెత్తికి కట్టేసింది అత్తైన అవ్వ.
' ఏందిమా' అని అడగబోయిన కూతుర్ని ' నీకు తెలీదులే పాపా ఇప్పట్నించి పనిలో నలిగితే బతుకు బంగారమవతాది . రేపు బిడ్డే పాపా పుట్న్యా అన్నిట్ని అనవరించుకొనే సామర్త్య ముంటాది. నన్ను మీ నాయినికి ఎంత వొయుసులో కట్టబెట్టినారో తెలుసా. ఆరేండ్లకే పెండ్లి జేసి సట్టీ కుండా సేతి కిచ్చినారు. దీని కిప్పుడు పదేండ్లు దాటింది. దీనికోసం కాసుకోని వాని జీవితం సగం ఎల్లమారి పోయింది . ఇప్పుట్నించయినా వానికి తోడూ నీడగా వుండక పోతే ఎట్లా ' పుల్ల ఇరిచి పొయిలో పెట్నెంత కచ్చితంగా కూతుర్ని అదరేసింది గురమ్మ
తోడూ నీడకు అర్థం ఆర్నెళ్లకే ఊరందరికీ తెలిసిపోయింది . ఇంట్లో పనిచేసి మొగునికి , కూలోల్లకి బాయికాడికి సద్దీ, సంగటి తీసకపొయే పుస్ప కొన్నాళ్లకి మొగుడు ఐలుగాడు సెప్పే పన్లన్నీ సెయ్య బట్టింది. ఆయన కపిలి దోల్తా వుంటే , వొడ్ల పైరుకు , సెరుకు దోటకు, మిరప తోటకు నీళ్లు గట్టే పని కూడా పుస్ప నెత్తిన బడింది.
పెండ్లామొచ్చినాక నీళ్లు గట్టనూ, కసువు కొయ్యనూ, గొడ్లు మేపనూ మనిసుంది కదా అని సేద్దిగాన్ని నిలిపేసినాడు ఐలయ్య . వాడు సేత్తా వున్ని కపిలిదోలేది, దుక్కి దున్నేది, అండ జెక్కేది, గొడ్లను కాసేది ఐలుగాడే సెయ్య బట్న్యాడు. దాంతో మొగుడు సేసే పనులు పుస్పకు తప్పింది కాదు.
పుస్పకు 20 ఏండ్లన్నా వొచ్చినాయో లేదో నలుగురు బిడ్లికి తల్లయింది. ఎప్పుడూ సేద్దిం పన్లు సెయ్యని పుస్ప ఆ ఇంట్లోనే పుట్టిన తల్లి, పినతల్లులు ముక్కు మింద ఏలేసుకొనేట్లుగా పనిలో ఆరితేరింది.
ఇంట్లో పని పూర్తి సేసి నాక ముసిల్ది తోసి పోసిన పెండా చెత్తను పోసొచ్చి సద్ది గుండాయి నెత్తిన బెట్టుకోని బాయికాడికి బొయ్యి మొగుడు సద్దాగినాక గెనింలో మొన్ను తీసుకొని పండ్లు తీటుకోని సద్దాగి ఆడ పనిలోకొంగతాది.
గొడ్లకు గెన్నాల్లో కసువుకోసుకోని ఇంటికొచ్చె పాటికి పదకొండవతాది . గబ గబా సంగటి కెలికి కూర గాంచే సరికి పొద్దు నడి నెత్తి మింది కొస్తాది. పన్నెండున్నరకి ఇస్కూలుకు బొయిన పిలకాయిలొస్తారు. మొగునికీ సంగటిచ్చి రావాల .
ఒచ్చి దంచేదుంటే దంచుకోని, ఇసిరేదుంటే ఇసురుకోని , కూరాకో నారాకో తెచ్చుకోవాల.
బాయికాడికి బోతే సవాలచ్చ పనులు కాసుకోనుంటాయి . గొడ్లకు కసువు, సెరుకు మోసులించుకోవడం, మిరప పండ్లేరడం , సెనిగి సేన్లో పండి ఎండిన అలసంద కాయిల్ని, పెసులు కాయిల్ని కోయడం, సింతకాయలో ఇప్పకాయిలో ఒడపడం ఒకటా రెండా సేసేకొద్దీ సేతినిండా పనులే కదా ఆండోళ్లకి.
అందురూ పండుకోని సుక నిద్ర బొయ్యే ఏలలో సేన్లోళ్ల రాట్నం గర గర లాడిందంటే పున్న్యత్మురాలు పుస్ప నీల్లకొచ్చిందని అర్తం.
ఒక ఇరవైగడవల నీళ్లన్నా దినామూ బాయిలో నుంచి సేందుకోని సంకలో కడవ, సేతిలో దుద్దతో ఒక పదయిదు సార్లన్నా బాయికీ ఇంటికీ తిరగాల . ఇదీ పుస్ప దినవారీ కార్యిక్రమం . కొన్ని పన్లు సేసేందుకు పుస్పకు తీరికి దొరికేది రాత్రి పూటే
పండగొచ్చిందంటే పుస్ప పడే పాట్లు సూడాల. అందరూ వారం ముందు సున్నాలు పూసుకోని పండగ ముందు రోజు అలికి ముగ్గులేసుకుంటా వుంటే అప్పుడు పెచ్చులూడిన గోడలకు మన్ను మెత్తించి , పేండా మన్నుతో అలికి సున్నం పూసుకొని నలుగురితో నారాయనా అనిపించే సరికి పుస్పకు తల ప్రానం తోక్కొచ్చేది . ఈ కస్టాలకు కారణం ఐలు గానికున్ని పిసినారి తనం అని తెలిసి పోలా!
జీతం లేని పనిమనిసి దొరికిందని అవ్వా, ఆ మొగుడనబడే మేనమామ పుస్పని పీల్చి పిప్పి చేసేసినారు.
కొన్నేండ్లకు బావుల్లో నీళ్లు అడుగంటి పొయినాయి. సేద్దిం పనులు సగానికి సగం తగ్గిపోయినాయి. పుస్పకు కొంచిం ఊపిరాడే పరిస్తితి వొచ్చింది. పాలు అమ్ముకోని దాని మిందే బతుకు ఎల్లమారించే రోజులొచ్చినాయి.
ఆవుల్ని మేపుకోవడం , గెడ్డి దెచ్చుకోడం మాత్రం తప్పలేదు పుస్పకు . ముసిల్ది మంటి మరుగై నాలుగేండ్లయిపోయింది.
అయిద్దాకా సదివి పెద్ద కూతురు ఇల్లు గాసుకోని పడుండాది. . ఇంట్లో పనులు, పెరిగి పెద్దవతా వున్ని ఇద్దురు కూతుర్ల సిటికినేలికి సాలట్లేదు. సిన్న కూతురికి ఈ సారికి ఐదు పూర్తవతాది.
పెద్ద కొడుకు మిల్ట్రీలో చేరినాడు.సిన్న కొడుకు టీచ్రుద్దోగంలో సేరినాడు.
తండ్రి పినాసి తనానికి తల్లి బడిన పీతి కష్టాల్ని కండ్లారా సూసినోళ్లు . సొయంగా అనుబోగించినోల్లు. వచ్చిన అదీకాన్ని వొచ్చినట్లే వడ్డీలకు తిప్పే తండ్రి ఇస్కూలుకు పొయ్యే పిలకాయిలకు కూడా గుడ్డా గుసురూ సరింగా కొనిచ్చే వోడు కాదు.
పుస్ప తల్లి వుండే దాకా పుస్పకు సమత్సరానికి రొండు సీర్లన్నా ఎత్తిచ్చేది. ఆమె పొవడంతో ఇప్పుడదీ లేదు. ఆండ పిలకాయిలైతే వాల్లమ్మ పాత సీర్లను సింపుకోని దావిన్లుగా వాడుకొంటా ఉండే వాళ్లు.
కొడుకులు సంపాదన పరులయినారు. ఇప్పుడన్నా అమ్మను సుకం లేకపోతే ఎట్లా అని అన్నదమ్ములు మాట్లాడు కున్న్యారు. పెద్ద కొడుకు దూరాబారంగా మిల్ట్రీలో వుండాడు. ఆడికి పోయి వుండేది , వొచ్చేది కష్టం. అందుకని సిన్న కొడుకు దెగ్గిర పెట్టుకొనేట్లు , పెద్ద కొడుకు కర్సులికి అంతో ఇంతో దుడ్లు పంపించేట్లు తీర్మానం సేసుకున్న్యారు. కానీ పుస్ప పెద్ద బిడ్డికి పెండ్లి సేసి గానీ ఇల్లు కదలడానికి ఒప్పుకోలేదు.
మళ్లీ గూడా ఉండూరొదిలి పెట్టి కొడుకుండే తావుకు పోడానికి పుస్పకు ఇష్టం లేదు . కానీ సిన్న కొడుకు ఇడ్సి పెట్ల్యా.
ముందు సెల్లిని తీసకపొయ్యి ఆరు లో సేర్సేసి నాడు. అమ్మను బయలుదేరదీసేపాటికి వాడి తల ప్యానం తోక్కొచ్చింది.
ఐలుగాడు కొడుకుల మింద సిందులేసినాడు. 'మొగుడి కంటే నీకు కొడుకులెక్కువయినారానే' అని పెండ్లాన్ని కొట్ను కొట్ను బొయినాడు.
ఆడే ఉన్ని సిన్న కొడుకు ముందు పప్పులుడకలా. ' నువ్వూ వొచ్చి ఆడే వుందువు రా' అని కొడుకన్న్యా అంతకన్నా నామోషీ తనం ఇంగొకటి లేదు అనుకొన్న్యాడు .
' నాకేం గతిలేదా నీ మోచేతి కింది నీల్లు తాగాల్నా' అని రోసానికి పొయినాడు. ఆడ బోతే ఈడ వొడ్డి దుడ్ల వసూలెట్ల ' అనుకున్న్యాడు మనసులో.
నాలుగేండ్లుగా పుస్పకు సేతి నిండా పని లేక ఊపిరాడడం లేదు. సేయ్యాలంటే పనుల్లేవా. కొడుకులికి బయపడి ఐలు గాడు ఊరికే ఉండాడు గాని లేక పొతే ఆడా ఏదో ఒక పని బెట్టి ఉపద్ర పెట్టేయడా.
నాయిన అమ్మను వక్కకొరికేంత సేపు కూడా కుచ్చోనియ్యడని వాళ్లకు తెలుసు.
ఐలుగానికి నాలుగ్గడవల నీళ్లు సేందుకోని పోవడం కస్టంగా వుండాదిప్పుడు. అంత వుడకేసి పెట్టే వాళ్లు లేక అల్లాడి ఆకులు మేస్తా వుండాడు. మొగుడు కష్టపడ్తా వుంటాడని పుస్ప మాటికీ పోతాననడం, కొడుకు ఒప్పుకోకపోవడం జరగతా ఒచ్చింది. .
కొడుకింట్లో సేతినిండా పనిలేదు. ఇరుగు పొరుగుతో పొద్దు పోగొట్టుకునే అలవాటు పుస్పకు లేదు. కూతురేమో ఇస్కూలుకు పోతా వస్తా బాగానే వుండాది.
ఉన్నెట్టుండి ' వూరికి పోతాన్రబ్బ' అని అంటే కొడుకు దండకమెత్తుకున్న్యాడు.
' అమ్మా నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నిన్ను ఇక్కన్నించి పంపిస్తాను అనే మాట మర్సిపో. అన్న్యావనుకో అన్న నిన్ను బాసకూడా రాని దేసం గాని సలి దేసానికి పిల్సుకోని పోతాడంటా . నా దెగ్గిరుంటే పండక్కో పబ్బానికో మనం మనూరికి బోయి నాలుగు దినాలన్న నాయినితో వుండేసి వస్తాము .ఇన్నాల్లూ పరుగులు దీసి పారాడింది సాలు ' అని వాళ్లవ్వ మాదిరిగా కట్టినించి పొయిలో బెట్టేసి ఒక పక్క వాల్లమ్మ ఆలోసనకు అడ్డుపుల్లేసేసినాడు
గొడ్డుగోదనిడ్సి పెట్టి ఐలుగాడు ఉరువే ఊరు కదలనంటాడు. పుస్ప ఊరికి పోతానంటే 'అమా' అని కొడుకు గెద్దిస్తాడు.
సంకురాత్రి పండక్కొచ్చిన పుస్పను సూసి ఊరు ఊరే ముక్కున ఏలేసుకొనింది. కొడుకు కూలి మనిసిని బెట్టి ఇంటికి సున్నంబూపించినాడని ఊరూనాడంతా కతలు కతలుగా మాట్లాడుకున్న్యారు.
'నీ నడమంత్రపు సిరి ఎన్నాళ్లో సూడకుండా పోతానా, కోడలొస్తే నా కాళ్లకాడొచ్చి పడతావు ' అని పెండ్లాంతో సవాలిసిరినాడు ఐలుగాడు.
కాల మహిమ అని అమ్మలక్కలు గుస గుసలాడతా వుంటే కుళ్లే వాళ్ల ముందర కులకాలని ' ఫ్యాను గాలి తీసుకుంటా పండుకుంటే గానీ నాకు నిద్ర పట్టదు. అది లేకుండా నాకు వుండాలంటే శానా కష్టంగా వుండాది లచ్చుమక్కా అందుకే రేపే బయలుదేరతా వుండాము ' అనింది పుస్ప .
' ఓసినీ' అని పండ్లు కొరికినాడు ఐలుగాడు . అది సూసి సిన్న కొడుకును ఒప్పించి ఈడే వుండిపోవడానికి ఒచ్చిన పుస్ప లోలోపల ముసి ముసిగా నవ్వుకొనింది.
మహాసముద్రం దేవకి
4-11-2018

Comments
Post a Comment