వరిగపల్లె ముచ్చట్లు - 12
యామలత
నలుగురక్కలు, ఇద్దరన్నల తర్వాత ఏడేండ్లకు పుట్టిన బిడ్డి యామలత. కింద బెడ్తే మొన్నంటు కుంటాదని పైన బెడ్తే గెద్దెత్తుకు పోతాదని అందురూ కలిసి అపురూపంగా సాకి సంతరించినారు దాన్ని.
ఆ బిడ్డి నిద్ర బోతా ఉంటే ఎప్పుడెప్పుడు లేస్తాదా అని ఆడాడే సుట్టక లాడతా , అప్పుడప్పుడూ ఎవురూ సూడకుండా ఆ బిడ్ని మెల్లింగా గిల్లతా, కదిలించి లేపతా ఉండేది దానికన్నా పెద్దదైన ఏడేండ్ల శకుంతల.
లేసిందంటే సాలు ఒకరి నుంచి ఒకరు నువ్వా నేనా అని సంకలు మార్సుకొని ఆ బిడ్డికి ఊపిరాడ కుండా సేసే వాళ్లు.
ఇద్దురన్నలూ సదుంకోని ఒగడు టీచరుద్దోగానికి, ఇంగొకడు పోలీసుద్దోగానికి పొయినారు. అందురుకంటే పెద్దది పార్వతి. యామలత పుట్టక ముందే దాని పెండ్లయి పోయింది.
.
పార్వతి కంటే సిన్నోళ్లిద్దురూ పుట్టింది ఆండ పుట్టకే గాని మొగరాయిళ్లను మించి సేద్దిం పనులు సేసి మొగలాయిలనిపించుకున్న్యారు.
ఒక పక్క జీతాలు ఇంగోపక్క సేద్యాలతో దేనికీ లోటు లేకుండా పుంజిగా ఉండాదిల్లు .
యామలతను అందురూ ముద్దుగా 'పట్టూ' అని పిల్చే వాళ్లు . ఐదేండ్లు సూస్తా ఉండంగానే ఎల్లిపొయినాయి. దాన్ని మొగ పిలకాయిలుతో సమానంగా సదివించాలని వాళ్ల అన్నోళ్లిద్దురూ పట్టు బట్న్యారు.
ఊర్లోనే అయిద్దాకా ఇస్కూలుండాది. ఆడ సేర్సినారు. పొట్ట పొడిస్తే అ, ఆ లు ఒగటి రొండ్లు గూడా పూర్తిగా రాని యామలతను సమత్సరం అయి పోంగానే మళ్లీ ఒగట్లోనే పెడితేనే మంచిదని అయివోర్లు మొత్తుకున్న్యారు. వూహూ ఇనకుండా వాళ్ల సిన్నన్న బొయ్యి ఆ బిడ్ని రొండో తరగతి క్లాస్లో కూసో బెట్టి ఒచ్చినాడు.
అయివోర్లకు సింతకాయిలు, పచ్చి సెనిక్కాయిలు , సెరుకులూ, బెల్లం , పండింది ఎండింది బలమంతంగా ఇచ్చి అయిదో తరగతి సదువయిందనిపించినారు. ఆరో తరగతిలో సిత్తూరులో బీ జెడిస్కూల్లో సేర్పించి నారు. కణ్ణనిస్కూలు మా ఊరికి దెగ్గిర. అందుకని మా ఊర్లో ఎవురైనా ఆ ఇస్కూల్లోనే సదివేది. కానీ ఆ ఇస్కూల్లో వాళ్లన్న స్నేయితుడుండాడని ఆడ సేర్పించినారంటా
మా ఊర్లో సిత్తూరులో సదివే పిలకాయిలు మద్ద్యానానికి క్యారీరు కట్టుకోని పోవాల్సిందే . అన్నీ సేద్యం సేసే ఇండ్లు. పొద్దన్నే పొయ్యంటించే వీలు లేదు. సద్ది తాగి రాత్రి అన్నం పులుపు తడిప్పెట్టి పులుసన్నమో, లేకుంటే పెరుగన్నమో పెట్టిస్తే తీసక పొయ్యే వాళ్లం. .
యామలత వాళ్లింట్లో సేద్దిం పనులు మొగుడికి, కూతుర్లకు సిటికి నేలుకు సాలదు. అందువల్ల వాళమ్మ రాజమ్మకు ఏరే పనీ పాటా లేదు. వాళ్ల పెద్దన్న మా ఊరికి మూడు మైళ్ల దూరంలో ఉండే సెర్లోపల్లి లో టీచరు. ఆ యాబ్బోడికి పొద్దన్నే క్యారీరు కట్టి పంపించాల.
టీచరు సద్దెన్నం తీసకపోతే నలుగురిలో నగుబాట్ల సేటని పొద్దున్నే కిచ్చిలి సంబావు బీమేసి వొండి పప్పుకూరో పులుసుకూరో కాంచతాది రాజమ్మ. ఉడుకుడుకన్నాన్ని సంగటి పలక మింద ఆర బోసి కొడుక్కు , యామలతకు కారీరు నిండా అదిమి పెట్టి పంపిస్తాది .
యామలత సిత్తూరిస్కూలుకు వారం దినాలు శానా కుశాలుగా ఎగురుకుంటా పొయ్యి ఎగురుకుంటా ఒచ్చింది. పుస్తకాలొచ్చేదాకా పాఠాలు లేవు. కథలు కాలచ్చేపాలు మాత్రమే . ఆ తర్వాత బలరామయివోరొచ్చి క్లాసు టీచరని పరిచయం చేసుకున్న్యాడు. ఇంగ్లీసు ఏ బి సి డి లు ఎంతవొరకొచ్చో ఒక్కోర్నీ అడిగినాడు. శానా మంది కొచ్చు.
' మా ఊరిస్కూల్లో ఇంగ్లీస్ అనే పేరు కూడా ఎత్త లేదు సా . నాకు బొత్తింగా రాదు' అని లేసి దైర్నంగా సెప్పేసింది యామలత.
బోర్డ్ మింద ABCD అని రాసి రానోళ్లను సూసి రాయమన్న్యాడు. రాసేసినారు. మళ్లి ఒక్కోర్నే పిలిచి సూడకుండా బోర్డ్ మింద రాయ మన్నాడు. యామలత బెదిరి పొయ్యింది. ఒక్కచ్చరం రాసి నిలబడి పొయ్యింది. సారు సెయ్యి సాపమని బెత్తంతో ఒక్కటిచ్చినాడు.
మర్నాడు ఇస్కూలుకు పోనంటే పోనని మొరాయించింది. పోలేదు కూడా. ఇంగ ఆ దినం వాళ్లన్న సందకాడ లాంతరు ముందర ఆ బిడ్ని కూసో బెట్టుకొని హెచ్ దాకా దిద్దించి సెప్పించడానికి శత్ర శ్రమ పడినాడు.
ఎంత సదివిపించినా ఆ బిడ్డికి సదువు బారంగానే ఉండాది . అప్పట్లో ప్రతి క్లాసూ పాసయి గట్టెక్కాల్సిందే. ఇప్పటి మాదిరిగా కాదు. ఆరు రెండు సార్లు ఫైల్ అయి మూడొసారి ఏడు కొచ్చింది. దాని కంటే ఎనక సిత్తురిస్కూల్లో సేరిన నేను అప్పుడు నేను ఎనిమిదిలో ఉండా .
యామలత వాళ్లకు చిన్న చేమంచి పూల తోట ఉండాది. . బాయి గట్టున గుత్తులు గుత్తులుగా పూసే మైసూరు మల్లి చెట్లుండాయి . ఆ పూలు వాళ్లక్కా వాళ్లు కట్టిస్తే ఎప్పుడూ తలనిండుగా పెట్టుకొని వచ్చేది ఇస్కూలుకు. దాన్ని, దాని సోకుల్నీ సూసి అట్లా ఉండాలను కొనే వాళ్లం మేము కూడా.
మాయక్క ఎనిమిది సదివి నిల్సి పోయింది. నేనూ యామలత మాత్రమే సిత్తూరిస్కూలుకు పొయ్యే ఆండ పిలకాయిలం ఇప్పుడు.
పొద్దున్నే ఇంట్లో వాళ్లను సతాయించి ఏడుకంతా రోడ్ చేరతామా , అక్కడ రోడ్ పక్కన కుప్ప పోసిన కంకర రాళ్లతో అచ్చన రాళ్లు ఆడుకుంటా బస్సు కోసం ఎదురు చూస్తా ఉంటాము . ఆ రోడ్ లో నడిపే బస్సుల వాళ్లు మా మింద దయతలచి దుడ్లు దీసుకోకుండా ఎక్కించు కొని దర్గా దగ్గర దింపేవాళ్లు. అక్కడికి పది బార్ల దూరంలోనే మా ఇస్కూలు . యామలత మాత్రం బస్టాండులో దిగతాది. వాళ్ల ఇస్కూలు ఆడికి దెగ్గిర.
ఒక దినం ఏడున్నర కొచ్చే రంగనాద సర్వీసు మా ముందరొచ్చి ఆగింది. ఆడతావున్ని అచ్చన రాళ్లు కింద పారేసి పుస్తకాల సంచి , క్యారీరు సేతికి తీసుకొని బస్సెక్క బోతున్న నన్ను ఎనక్కి ఈడ్సింది యామలత. కండెక్టర్తో ' అనా మేమిప్పుడే రాలేదు రైట్ రైట్ ' అనింది. మొగపిలకాయిల్ని ఎక్కించు కొని బస్సెల్లి పూడ్సింది .
ఎనిమిది తరవాత సియంటీయస్ బస్సు వొచ్చింది . దాన్నీ ఎక్కనివ్వ లేదది. ఇస్కూలుకు టైమయి పొతాదంటే ' 'ఐపోనిలే ఏం కొంప మునిగి పోతాదా ? ' అనింది. ఆపైనెప్పుడో ఒచ్చిన బంగారు పాలెం బస్సెక్కినాము.
సిత్తూరుకు మా వూరికి మద్దిలో ఆంజనేయ సామి దేవళం ఉండాది. పొయ్యే బస్సు, వొచ్చే బస్సు ఆడ తప్పకుండా ఆపతారు . బస్సు ఆగంగానే పూజారి ఉండీని గల గల లాడించుకుంటా బస్సు సుట్టు తిరిగితే బస్సులో కూసున్నోళ్లు బక్తి కొద్దీ ఉండిలో దుడ్లేస్తారు.
ఆ గుడికి దెగ్గిరిగా ఉండే ఇరువారం పిలకాయిలు ఆడ కాసుకోనుండి ' సా సా ' అని కండెక్టరును అడుక్కోని బస్సెక్కతారు.
మేమెక్కిన బంగారుపాళెం బస్సు గుడి దెగ్గిర ఆగింది . ఎక్కే పిలకాయలు ఎక్కతా ఉంటే యామలత నా సెయ్యి పట్టుకొని వాళ్ల సందుల్లో నుంచి దూరి బస్సు దింపేసింది.
' ఏందిమే ' అని నేను అరస్తా ఉండా . 'రా నీకోటి సూపిస్తా' అని సెయ్యి పట్టి గుంజుకోని గుడికానుకోనుండే పూజారి ఇంట్లో దూరింది. అబిషేకానికి సిద్దం సేస్తా ఉన్ని పూజారి పెండ్లాము ' ఏమీ పొద్దు అప్పుడే ఒచ్చేసినావు ' అని అడిగింది. నేను బిత్తర పొయినాను. అంటే అది దినామూ ఈడికొస్తాదా అని.
యామలత ఇస్కూలుకు పొయ్యే పోవిడి కనిపించలా . అడిగితే మళ్లి సెప్పింది. ఎప్పుడో బుద్ది పుట్టిన్నాడు పోతానని. వాళ్లన్న స్నేహితుడు కూడా ఇప్పుడా స్కూల్లో లేడని సెప్పింది.
' పోయే , ఆ ఇస్కూలుకు పొయ్యి అయ్యోర్లతో దెబ్బలు దినేదానికి నేనేమన్నా ఎట్టికి బుట్ని రాజమ్మ కూతుర్నా . దినామూ మాయాక్కోళ్లు సేమంచి పూలిస్తారా ? అది పూలంగిట్లో అమ్మడానికి దర్గా కాడ దిగతా నంతే . ఆ పూలమ్మిన దుడ్లు కూడా నాకే. బఠాణీలు , కమ్మర కట్లు దీసుకోని మళ్లీ దర్గా కాడ బస్సెక్కి ఈడి కొస్తాను. ఈ పొద్దు పూలు లేవు కదా! అందుకే ఇప్పుడే దిగేసినాను ' అనింది.
మా ఉర్లో పిలకాయిలంతా కణ్ణనిస్కూల్లో సేరితే ఈ బిడ్ని దీసక పోయి మాదా గుడి ఈదిలో B. Z ఇస్కూల్లో ఎందుకు సేర్సినారా? అనుకున్న్యా. అది ఇస్కూలుకు పోతా ఉందా వస్త ఉందా అని పోకూవర్తూ తెలియక పోవడంతో దాని ఆటలు ఇట్లా సాగతా ఉండాయి.
పూజారామితో మాట్లాడు కుంటా ఇది కూడా తులసాకు మాల కట్టింది. పూజారి గర్బ గుడిలో అభిషేకానికి అమర్చుకుంటా ఉండాడు. పూజారి పెండ్లాం బొక్కిన్లో నీళ్లు దెచ్చి గర్బ గుడి ముందుండే మండపాన్ని నీళ్లు పోసి పుల్లల పొరకతో కడగతా ఉంది.
'మనం పైన సూసొస్తాం పదా ' అనింది. గుడి పక్కన పైకి ఎక్కడానికి రాతి మెట్లుండాయి. వాటిని కండ్ల జూడ్డమే గాని ఎప్పుడూ ఎక్కిన పాపాన పోలేదు నేను. ఆడ ఏముందని కూడా తెలీదు.
మూడు నాలుగు పర్లాంగుల దూరముండే కొండ మొగదల్లో ఉంటాది గుడి. గుడి సుట్టు బండరాళ్ల మద్దిలో బటానీ రోజాపూలు గుత్తులు గుత్తులుగా పూసి ఉండాయి. .
మెట్లెక్కి మలుపు తిరిగినాక చిన్న గెవి మాదిరిగా ఉన్ని దాంట్లోకి దూరింది . ఐదడుగుల పొడుగు నాలుగడుగుల ఎడల్పూ ఉన్న దాని లోపలికి ఎంత వొంకోని దూరినా నా తల టపీ మని కొట్టుకునింది. ' ఈడ కూసోనే మునులందరూ తవుసు సేసేది' అని సెప్పిందది.
'ఈ బిడ్డికి ఎన్ని ఇసయాలు తెలస్తాయా ' అని ఆశ్చిర్య పొయినాను.
' ఇప్పుడెవురూ తపస్సు సెయ్య లేదే' అనినాను . అది జవాబు సెప్పకుండా సక్కాముక్కాలేసుకోని కూసొని కండ్లు మూసుకొనింది.
నేను గెవి లోంచి జాగరత్తగా బయటికొచ్చి పక్కనే ఉన్ని మెట్లెక్కి పైకి బొయినాను. ఆడ దేవ గన్నేరు సెట్ల గుంపు మద్దిలో రాతి మంటపముండాది. ఆడ కూసుంటే దూరంగా కాజూరు , ఎడం పక్కగా సెరువు, దాని కానుకొని బోడి కొండ కనిపించింది .
' అరే మా బాయి కాడుండే బోడి కొండ ఈడుందా 'అని అర్సోది పోతా ఉండా .
ఎప్పుడొచ్చిందో ' మేయ్ , క్యారేజీ దెచ్చు కోని ఈడే కూసొని తిందారా?' అని అడిగింది.
' నీ తపసయిపోయిందా? ఇంగ ఇస్కూలుకు పోదాం పదా.' అన్న్యాను.
' ఇంగీపొద్దు ఇస్కూల్ల్యా గిస్కూల్ల్యా ' అనింది. నాకు కొంచిం వొణుకొచ్చింది. 'కిందికి బోయి క్యారేజీలు తెచ్చుకుందాం పదా ' అనింది.
మేము బొయ్యి బ్యాగులు తీసుకుంటా ఉంటే ' ఆడేడ తింటారు పాపా. అయినా పదకొండు గూడా కాలా , అప్పుడే ఆకిలా, కొండ మింద ముచ్చుకోతుల గుంపు సూసిందంటే మిమ్మల్నీ, మీ క్యారీలను కూడా పెరక్క పోతాయి. అని ఉల్సర బెట్టేసింది పూజారి బార్య.
రొడ్డు కవతల గన్నేరులు, మందారాలు, తులిసి సెట్లు ఉండే సిన్న తోటలో బొయ్యి కూసున్న్యాము. నా పులుసన్నం మూతలో బెట్టి ఆ బిడ్డికి కొంచి మిచ్చినాను.
రాత్రి పులుపు తడిప్పెట్టి పొద్దున్నే తిరగబాత పెట్టి ఏంచి ఇచ్చిందా మా యమ్మ. కమ్మంగా శానా రుసిగా ఉండాది. ఆ బిడ్డి పప్పుకూరన్నం దెచ్చుకున్నట్టుంది. నాకు పెట్టకుండానే పిడసలు బట్టుకోని తినేసింది.
వొచ్చి కొళాయి పక్కనుండే బండ మింద కూసున్న్యాము . వచ్చే బస్సులు పొయ్యే బస్సులుగా ఉండాయి. ' ఎవురైనా సూస్తారేమో , ఇస్కూల్లో ఉండాల్సిన బిడ్డి ఈడేం జేస్తా వుంది. అనుకుంటారేమో అని ఈడొద్దు మే ' అని అంటా ఉండా . రాగిమానుపెంట బస్సొచ్చి గుడి ముందు నిల్సింది.
ఉన్నెట్లుండి ఆ బస్సెక్కేసింది యామలత . నేనూ ఎక్కినా .
దర్గా కాడ దిగి మసీదులోకి పోయింది. సేంద బాయి లో నీళ్లు సేందుకోని కాళ్లూ, సేతులు మొగం కడుక్కొని సమాది ముందర నిల్చుకొంటే టోపీ పెట్టుకొని సమాది కాళ్ల కాడ కూసోనుండిన ఒగాయిన నెమిలీకిలతో మా తలమింద కొట్టి ఇబూది మా అరిసేతుల్లో ఏసినాడు.
ఆన్నించి రోడ్డు కెదురుగా ఉండే బంకు దెగ్గిరికి పోయింది. ఆ బంకులో ఉండే మనిషి నిల్చుకోనుంటే తలకాయి మాత్రమే కనిపిస్తా ఉండాది. అంత పొట్టిగా ఉండాడు. వాడితో బాతాకానీ ఏసుకొనింది, ఒక గంట సేపు . బంకులో సీసాయి తెర్సి కొన్ని కిచ్చిలి పప్పరమెంట్లు అదే లెక్క బెట్టి తీసుకొని సిల్లరిచ్చింది. వాటిని కర కరా నమల్తా నోటి నుండి కారిన సొంగను పావడతో తుడ్సుకొనింది .
నాకేం సేటుగాలమో ఇస్కూలుకు పోకుండా దాని ఎంటబడి తిరగతా ఉండాను. నాకూ మిఠాయిలు తినాలని ఉండాది. అయినా నోరు దెర్సి అడగడానికి నామోషీ . ఎంత సిల్లరియ్యాలో ఎన్ని తీసుకోవాలో తెలీక గమ్మునుండి పొయినాను.
యామలత మళ్లీ రోడ్డు దాటి పూలామి దెగ్గిరి కొచ్చింది. ' మా యక్కోళ్లీ పొద్దు పూలు కోసక రాలా రేపు దెస్తాలే ' అనింది.
పూలామి అర మూర మద్రాసు కదంబం తుంచి దాన్ని రొండు ముక్కలు సేసి తలా ఒకటి ఇచ్చింది. ఆ బిడ్డి నా సేతులోని పూలు కూడా దీసుకోని రెండూ పక్కన పక్కన బెట్టి సూసి ఒక బంతి పొడుగ్గా ఉన్ని పూలు అది దీసుకోని మిగిలింది నాకిచ్చింది.
ఆన్నించి గోపాల నాయుడు హోటల్కు దారి బట్టింది. నేనూ దాని తోక బట్టుకొనే బొయినాను. ఓటల్లో దుడ్లు వసూలు సేసుకొనే సీట్లో కూసో నున్ని గోపాల్ నాయుడుతో ఏమేముండాయని ఆరా తీసింది. ఆయన పెద్ద లిస్టే సదివినాడు..
' బోండాలు సెయ్య లేదా ఈ పొద్దూ'? ' .
' కన్ని దొరే బోండా పోటియా? ' అని గెట్టింగా అర్సినాడాయన. గణేష్ అనే సర్వర్ పరిగెత్తుకోనొచ్చి ఏమని అడిగినాడు. ఆయన మళ్లీ అదే ప్రెశ్ని ఏసినాడు.
' వాల కాయి బోండా దా పోటాచ్చీ ' సెప్పినాడు గనేశు.
సిల్లరిచ్చి నాలుగు బోండాలు కట్టించుకొనింది. వాటిని సూస్తా ఉంటే నాకూ మెర మెరానుండాది. నేనూ నాలుగు కట్టించు కున్నాను.
వాటిని తినుకుంటా మా ఊరి బెల్లబ్బండ్లు నిలబడే కాడికొచ్చినాము టైము ఇంగా నాలుగ్గాలా. నాలుగున్నరకి ఇస్కూలిడ్సి పెడ్తారు.
ఊర్ల నుండి వొచ్చే బండ్లు కాలీగా పోతాయిప్పుడు. అందుకని ఇస్కూలిడవంగానే పిలకాయిలు దర్గా దెగ్గిరికొస్తారు . ఇరువారం ధన్లచ్మి , రాదా వాళ్లు సూసినారంటే ఏం సెప్పాల? కాళ్లలో వొణుకు మొదులయింది నాకు . ఆ మాటే ఆ బిడ్డితో అంట్ని.
' ఏందిమే వాటికి బయపడేది. వాళ్లేమి మనూరికొచ్చి మీ యమ్మోళ్లకు సెప్తారా? ' అంటా బండ్లు నిలబడే సోట్నించి రోడ్డుకాపక్కుండే పల్లంలో వున్ని ఎద్దలాసుపత్రి లోకి దూరింది. దానెనకే నేనూను .
ఆడ ఒక సేంద బాయుండాది. ఎద్దలకు నీళ్లు దాపను తొట్లూ ఉండాయి. ఆడ బొక్కిన్లో నీళ్లు సేందుకొని తాగినాక ఆడుండే తొట్టిపైన కొలువు దీరింది . నేనూ ఆడే కూసున్నా.
పొద్దన్నుంచి తెలీలేదు గానీ నాకెందుకో ఇప్పుడు బయిం బట్టు కునింది. నాలుగున్నర దాటే దాకా ఆడున్ని సెట్లలో దేవ గన్నేరు పూలు కోసుకోని జడ బిల్లలు సేసుకున్న్యాము .
' అందురూ పూడ్సుంటారు పదమే ఇంగా ' అనింది. ఎద్దలాసుపత్రి గేటుదాటి రోడ్డెక్కి నామో లేదో మా పెద్దమ్మ కొడుకు శీరామన్న మా దెగ్గిరికొచ్చి సైకిలు నిలిపినాడు .
' ఈడేడనించి అంటానే ' ఊ ఎక్కు' అన్న్యాడు. నేనాబిడ్డి మొగం సూసినాను .
'పోమే నన్ను సూస్తావేమి ? ' అనింది. ఊరి దెగ్గిరి కొచ్చినాక దిగతా ఉంటే ఆ బిడ్డి నా కంటే ముందుగా ఆడుండాది.
బాబు గాడు ఒగతే ఉండానని టాక్సీ లో ఎక్కించు కున్న్యాడనింది. అది నాకు మామాలు మనిషి కాదు రాణీ రుద్రాంబ అనిపించింది. తీరిన బంటది. దాన్ని మించి నోళ్లుండరని కూడా అనుకున్న్యా. అందనంత ఎత్తులో ఉండాదది. నేనే ఎందుకూ పనికి రాను అనిపించింది. సిగ్గుతో చితికి పొయినాను.
కానీ మర్సనాడు పొద్దున్నే 'దాని సావాసమే ఒద్దుసామీ 'అనుకున్ని నేను బుద్దిగా నిలిపిన బస్సెక్కి ఇస్కూలుకుబొయినాను.
మళ్లీ ఒకనాడు ఇస్కూలు కాడ బస్సు దిగబోతున్న నన్ను దిగనీయ లేదది. ప్రయివేటు బస్టాండు దెగ్గిర అందురూ బస్సు దిగినాక బస్సు బస్టాండు మిట్టెక్కి ఓటల్ దెగ్గిర ఆగింది. డ్రయివరు, కండెక్ట్రు , క్లీనరు ఓటల్లో దూరినారు. నన్ను బస్సు దిగనీయల్యా. అదీ దిగలా .
'నాతో ఒస్తే నీ కోటి సూపిస్తా' అని ఊరించింది. వాళ్లొచ్చినాక కండక్టరు బస్సెక్కలా .బస్సు బయలు దేరింది బస్సులో క్లీనరు దానితో మాటలు పెట్టుకున్న్యాడు. నేను బయటికి సూస్తా కూసున్నా .
బస్సు ఒచ్చిన దారిలో కాకుండా ప్రతాప్ టాకీస్ పక్క నించి పోతా ఉండాది. ఆ టాకీసులో మా ఉరోళ్లంతా ఒచ్చి లవకుశ సినిమా సూసినాములే . అదొకటి తెలుసు నాకు
బస్సు సిత్రంగా గిరింపేటలో నుంచి మా వూరికి వచ్చే రోడ్డులో పోతా ఉంది . ఆ దోవ కాజూరు దాకా వస్తాది. ఆన్నించి ఎడం పక్క రోడ్డుకు తిరిగితే మా ఊరికి పోవచ్చు. అప్పుడప్పుడు మా యమ్మతో కూడా దుర్గమ్మ గుడికి వస్తాను కాబట్టి ఆ రోడ్డు గుర్తుండాది.
కాజూరుకు పోకనే బస్సు కుడి పక్కకు తిరిగి చెరువు దెగ్గిరి కొచ్చి ఆగింది. ఆడ సెరువుందనే తెలీదు నాకు .
ఆ సెరువులో క్లీనరు బస్సు కడతా ఉంటే యామలత డ్రయివరుతో కొంచేపు అరట్లు కొట్టింది . కొంచేపు డ్రయివరు ఏదో అంటే పక పకా నవ్వింది. కొంచేపు ఇద్దురూ కిత కితలు పెట్టుకొని పడీ పడీ నవ్వినారు . దాని మాదిరిగా అందురితో మాట్లాడ్డానికి రానందుకు శానా సిగ్గుగా అనిపిస్తా ఉండాది నాకు .
కొంచేపయినాక డ్రయివరన్న ఎనక్కి పోయి పొడుగు సీట్లో పండుకున్న్యాడు.
ఇద్దరం బస్సు దిగినాము . నీరెండలో ఉల్సపిల్లలు మిల మిల లాడతా తిరగతా ఉండాయి సెరువులో . కొందురు దూరంగా గాలమేసి సేపలు పడతా ఉంటే ఆడికి పొయినాము. ఆడే ఉండాలనిపిస్తా ఉంది. గాలాన్ని నీళ్లలోకి ఇసరడం, అది కదిలితే సేప సిక్కిందనుకోవడం, పైకి లాగడం ... , పది నిమసాలైనా కాలా, బస్సు హారనినిపిస్తే పరిగెత్తొచ్చి బస్సెక్కినాము .
మద్యానానికే ఉరుసేరినామా . అప్పుడే ఎందుకొచ్చినావని మా యమ్మ అడగతాదని నేను బయపడతా ఉండా. అది నాతోపాటే మాయింటి కొచ్చింది. సంగటికి పిండి పోసి గుడ్సింట్లో నించి పెద్దింట్లోకి పొతా ఉన్ని మాయమ్మ మమ్మల్ని సూసి ఏమప్పుడే ఒచ్చినారన్నట్లుగా నిలబడింది.
' మీ పాప కడుపు నొప్పని ఏడస్తా ఉంటే నేనూ ఇస్కూలుకు పోకుండా దర్మాసుపత్రికి పిల్సుకోని పొయ్యి ఒస్తా ఉండా' అనిందది. మాయమ్మ దాని పక్క మెచ్చుకున్నట్లుగా సూసింది. నేను నొప్పన్నట్లుగా కడుబ్బట్టుకున్న్యా.
అది నిజమని నమ్మిన మాయమ్మ ఉడికి నీళ్లు కాంచి సెక్కిరి కలిపి తాపింది. వాముపొడి సిటికెడు నొట్లో ఏసి నీళ్లు దాపింది. బొడ్డు సుట్టూ నాము కొమ్ము సాది పట్టు ఏసింది. అడుక్కొకసారి 'తగ్గిందా' అని అడగతా ఉంటే తగ్గలేదని ఒకసారి, కొంచం తగ్గిందని ఒకసారి అంటా ఉంట్ని .
'నానా బీనా కనా కసమాలం నిలుకు ల్యాకుండా నమలతా ఉంటే కడుపు నొప్పి రాకుండా ఉంటాదా? నిన్న కట్రావులో పెట్టిన బెల్లం ముద్ద అపుడే సగమై పొయింది. ఇది తప్ప దాన్ని ఈ ఇంట్లో అంటుకొనే వోళ్లెవురు? ' మా యవ్వ తిడ్తా ఉండాది. .
కళ్లు మూసుకొని పండుకోనున్ని నా కళ్ల ముందు యామలత ఇశ్వరూపం కనిపిస్తా ఉండాది. నా మనసు నిండా దాని తెలివి తేటల గురించిన ఆలోచనలు కదలాడతా ఉండాయి. ఇంకొన్నాళ్ల కది సిత్తూరును కూడా యాలతాదేమో !
మహాసముద్రం దేవకి
18- 3- 2019
Comments
Post a Comment