కాలం కరుణిస్తే.
కాయ కష్టం పండుతుంది
నిలువ నీడ లేని నికృష్ట జీవుల
కాలే కడుపులకు
కాసింత మాడో మసానమో దొరుకుతుంది
అదే కాలం కాటేస్తే
తల్లిలా తన ఒడిలో చేర్చు కొని
పదిలంగా పెంచి పెద్ద చేసే ప్రకృతే
ప్రళయ తాండవం చేస్తే
ఆర్త నాదాలతో కూడిన
పసి పాపల పిందె ప్రాణాలు
అనంత వాయువుల్లో కలిసి పోవా
బతుకు బండిని నడప లేక
మూల పడ్డ ముసలి వాళ్ల
పండిన నిండు బతుకులు
శాశ్వతంగా సుఖ నిద్రలు పోవా
పిల్లాపాపా పెద్దాచిన్నా ముసలీముతకా
పశువూపక్షీ చెట్టూపుట్టా పైరూపంట
సర్వ ప్రాణికోటి జీవ నాడులూ
హడలి వడలి కుళ్ళి కృశించి
మట్టిలో మమేకమై పోతే
కూడూ గూడూ తోడూ నీడా
చివరికి కన్నీళ్లు సైతం
వరద నీటి వెల్లువలో వాగుల వెంబడి వెళ్లి పోతే
సవ్యంగా సాగే బండి చక్రాలు సైతం
ఉన్న పళంగా ముక్క చెక్కలై పోతే
అల్లకల్లోలమై పోయిన జీవన స్రవంతికి తోడుగా
అష్ట కష్టాలు తిష్ట వేస్తే
తినడానికి తిండి లేక
గొంతు ద్వారా ఎలుగెత్తి చాటాలనుకున్న
గుండె లోని అవేదనల్ని పాటలుగా పేని
పేగులన్నీ ఒక్క సారిగ ప్రకోపించి పాడుతుంటే
ప్రళయం పరిహసిస్తూ వేసే
ఈలల ఈదురు గాలులకు
పళ్లు పట పట లాడుతున్నా
చలి గాడి శీత కన్ను
శరీరాన్నంతా తడుముతున్నా
లెక్క చేయక
మానం కాపాడుకోవడానికి
కేవలం మానం కాపాడు కోవడానికి
ప్రాణాలను పణంగా పెట్టడానికైనా సిద్ధ పడి
ఎవరో వస్తారని ఏదోతెస్తారని ఏమో చేస్తారని
కళ్ల నిండా కొవ్వొత్తుల్ని పేర్చుకొని
జీవం లేని గాజు గోలీల్లాంటి కను గుడ్లను
అష్ట దిక్కులకే కాక
పై దిక్కుకు కూడా పహారా ఉంచి
చెవుల్లో నాదతంత్రుల్ని బిగించు కొని
ఎదురు తెన్నులు చూసీ చూసీ ఎదలు బరువెక్కి పోతే
చుట్టూ నీళ్లున్నా నోట్లో తడైనా లేని
నిర్భాగ్యుల జీవితాలతో ఆడుకోవడానికి
ధనవంతుల కళ్లలో పేరుకున్న కొవ్వు మరింత
గడ్డ కడుతుంది గట్టి పడుతుంది
నీళ్లలో నిలువునా మునిగి ఉన్నా
దాహం తీర్చు కోలేని
దరిద్ర నారాయణుల్ని
దురదృష్టం తరుముకొస్తే మాత్ర మేం
అధి కారుల ధన దాహాన్ని తీర్చడానికి
అదృష్టంగా మారుతున్నప్పుడు
పెను తుపాను చిరు సవ్వడిలో కలిసి పోయిన
పసి పాపల ఆక్రందనలు
ప్రళయ తాండవ భీకర గర్జనలో
కలగలిసిన మరణ మృదంగ నాదాలు
గొంతులోనే గొరీ కడితే మాత్రమేం
కవులు కవితలల్లుకొని సన్మానాల సంపాదన
సాగించడానికి సాధించడానికి కోరస్ గా పనికి వస్తుంటే
కూలిన కొబ్బరి చెట్ల ఆకుల సందుల్లోంచి
కుళ్లిన ప్రేతాల కనుగుడ్లు
నిగిడి నిలువు గుడ్లేసుకొని చూస్తుంటే
మంత్రులు విను వీధుల్లో విహార యాత్రలు చెయ్యడానికి
ఎంచెక్కా వీలు కలుగుతుందో !
అంతెందుకు
అవకాశ వాదులు
అతి తక్కువ కాలంలో
అవలీలగా కోట్లకు పడగలెత్తడానికి
ఆకాశ హర్మ్యాలు మరింత ఎత్తుకు ఎదగ డానికి
కార్లలో తిరిగే కలిమి
విమానాల్లో విందారగించడానికి
ఒంటి మీది బంగారం వజ్రాలుగా పరివర్తన చెందడానికి
వీకెండ్సులో విదేశాల్లో విహార యాత్రలు చేయడానికి
పేదల ప్రాణాల్ని హరించి
పూరి గుడిసెల్ని తుడిచి పెడితే మాత్ర మేం !
అంతే మరి
పేద వాడి కోపం పెదవికి చేటు
ఎద్దు పుండు కాకికి ముద్దు
నెమలి కంటి నీళ్లు వేటగాడి పరం
అడ్డంగా ఉండే చెట్టుకు అగ్ని ప్రమాదం
ప్రకృతి ఒకరిని శపిస్తే
ఒకరిని కరుణిస్తుంది
ఒకర్ని అణగ దొక్కితే
మరొకరిని అందలా లెక్కిస్తుంది
ఎవరికి వారే యమునా తీరే
ఈ లోకం తీరే అంత
ఆయుష్షు ఉండే దాకా ఆశ చావదు
అది దివి సీమ ఉప్పెనైనా
లాతూరు భూకంప మైనా
బీహార్ విష వాయువైనా
ఆకాశాని కెగసే త్సునామైనా
కార్గిల్ యుద్ధమైనా
వెలిగొండ రైలు ప్రమాద మైనా
ఒరిస్సా వరదలైనా
భూ ప్రకంపనలు ఢిల్లీ నేపాల్ ప్రజలను వణికిస్తున్నా
లేవు కళ్లు కాల చక్రానికి
లేదు మానవత్వం మనిషికి
మహాసముద్రం దేవకి
Comments
Post a Comment