గాథా సప్తశతి - 7
గాథా సప్తశతి లోని ఉపమానాలు కూడా సామాజికాంశాలే . అవి అనుభవ పూర్వకాలు. అనుభూతి ప్రేరకాలు . ఆనంద దాయకాలు .
తన పైన ప్రియునికి వలపు లేదని స్నేహితురాలి దగ్గర వాపోతుంది ఒక నాయిక . కానీ ఆ చెలికత్తె ఆవులిస్తే పేగులు లెక్క బెట్టే రకం . అబద్దం చెప్తోందని తెలుసు. వెంటనే
' వలవడేని నిన్ను వాడు , నానాడిట్లు
క్రొత్త జున్ను పాలు గుడిచి చొక్కు
నెనుప దూడ వోలె , నేల నిద్రించెదు
పగటి పూట నొడలు ప్రాలు మాలి '
అని ప్రశ్నిస్తుంది. ముర్రు పాలు తాగి మత్తుగా నిద్ర పోయే ఎనప దూడ లాగా నాయిక పగలు కూడా ఒళ్లు అలసి నిద్ర పోతోంది అనడంలో నాయిక నిద్ర కంటే ముందు దూడను చూసిన సమాజం కనిపిస్తుంది .
ఒకామె భర్త పొరుగురికి వెళ్లాడు . ఆమెకు చదువు రాదు . క్యాలెండరు తెలీదు. ఎన్ని రోజులకు వస్తా నన్నాడో అన్ని గీతల్ని గోడ మీద గీసి పెట్టుకొంది. ( ఇప్పటికీ పాల లెక్కల్ని గోడ మీద గీతల రూపంలో గుర్తులు పెట్టు కొనే వాళ్లున్నారు ) ఒక రోజవగానే ఒక గీతను చెరిపేస్తుంటుంది.
' పూరి కొట్టము పెద్ద గాడ్పునకు చెదర
లోన దిగు వాన సోనల నాన కుండ
గడువు దినమని గోడపై నిడిన వ్రాత
చేతులడ్డము పెట్టి బ్రోచెడిని గృహిణి '
పల్లెల్లో చాలా వరకు పూరిండ్లే దర్శన మిస్తాయి. ఇక 2000 ఏండ్లకు ముందు పరిస్థితి ఎలా వుండేదో ఊహించ వచ్చు . కురిసే వానకు ఉరిసే పూరిండ్లే ఎక్కువ . గాలికి పై కప్పు ఎగిరి పోవడం , వర్షపు నీళ్లు ఇంట్లోకి కారడం , వస్తువులు తడిసి పోవడం సహజం. ఆ తడిసే వస్తువుల కంటే భర్త ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ గృహిణికి అతని రాకను తెలిపే గీతలే ముఖ్యం . అందుకే నీటి ధారలకు ఆ గుర్తులు చెదిరి పోకుండా చేతులడ్డం పెట్టి గీతల్ని కాపాడుకొంటోంది . దాంపత్య జీవితంలోని అనుబంధాల్ని, సొగసుల్ని చెప్పడానికి ఇంత కంటే మంచి విషయం ఏముంటుంది?
Comments
Post a Comment