గాధా సప్తశతి - 3

గాధా సప్తశతి -  3

         అప్పుడప్పుడే తెగతత్వం వెనకడుగు లేస్తూ దూరమవుతోంది. కులం జీవితంలోకి నంగి నంగిగా తొంగి చూస్తూ ప్రవేశిస్తూ వుంది.

   తోడి గొల్ల పడతులాడు నాట్యము మెచ్చు
   నెపము తోడ జెంత నిలిచి జాణ
   యొక్క వ్రేత వారి చెక్కుటద్దములందు
   మొలచు కృష్ణు నీడ ముద్దు గొనియె

    చెంచు మగువయింటి చెంగట జెక్కిన
    మగని పెద్ద వింట తెగిన చిరుగు
    పొట్టు మింటి కెగరి పోయెడి సుడిగాలి
    దాని పొంగునకు పతాక యనగ

గొల్ల.  చెంచు , రెడ్డి , బ్రాహ్మణ మొదలయిన కులాలు, క్రైస్తవం, హిందూ లాంటి మతాలు ఆనాడున్నట్లు తెలుస్తోంది.

      ముదిరి పోవుచునున్నారు పూవు బోండ్లు                                          
      పితృగృహమందు కట్నముల్ పెరిగి పోయి
      మనకు మతమైన లేదాయె మరియు వారి
      మిషనరీలుగ నెటకొ పంపింప నైన

కట్నం ఆనాడు కూడా పెద్ద సామాజిక సమస్య. కట్నం ఇవ్వలేని పరిస్థితులలో ఆడ పిల్లలు వృద్ద కన్యలుగా మిగిలిపోయే వారు. వివాహం ఇష్టం లేని వాళ్లు క్రైస్తవ మిషనరీలుగా మారడం అప్పట్లో వుంది. పెళ్లి కాని వాళ్లు ఒకరి హేళనకు గురికాకుండా ఉండడానికి అదొక మంచి అవకాశం. అది హిందూ మతంలో లేదే అని ఒక ఇల్లాలి ఆవేదన
    
        ఆనాటి తెలుగు జాతి జీవితం పల్లెలకే పరిమితం. ఆ పల్లెల్లో ఇప్పటి లాగా చదునయిన మార్గాల్లేవు.

        పువులెదిగి బండి గురింద పొదలు పెరిగి
        యంగణము లందు వాకిండ్ల కడ్డ మయ్యె
        దారి జూచుచునుండు నోదార్పు గూడ
        నూర బతి లేని యతివలకొదవనట్లు

        నడుమ బలుచ నగుచు నడకచే బంకంబు.       
        రెండు ప్రక్కలందు నిండి యుండ
        బొలిచె రచ్చ యూరి తలమీద బాపట
        తీసి పెట్టి నట్టి తెరగు దోపె

వీధుల నిండా బురద. అందులో నడక . ఒకే దారిలో అందరూ నడవడం వల్ల ఇరుపక్కల బురద మిట్ట దేలింది . అది తల మీది పాపట లాగా ఉందట. (అప్పట్లో మధ్య పాపట తీసుకొనే వాళ్లు . ఇప్పుడు నడి పాపట్లు పోతున్నాయి. తల మీద ఏటి పాయాల్లాగా ఎక్కడ పడితే అక్కడ పాపట్లు)

        ఆనాటి పల్లెలన్ని కొండ పల్లెలు.  గుట్టల మీద ఇండ్లు . సెలయేళ్ల చప్పుళ్లు ,  అల్లిబిల్లిగా అల్లుకున్న పూపొదలు, అడవి పూల వాసనలు , పూరి గుడిసెలు , వాటి చుట్టూ పురివిప్పి ఆడే నెమళ్లు, ఊరి తల మీద పాపిట  తీసినట్లు రచ్చ వీధి, ఇదీ ఆనాటి తెలుగు పల్లె.

        పెద్ద గాలి తోలితే ఇంటి పై కప్పు ఎగిరి పోతుంది. వానకు మంటి గోడలు నానడం, వెలసి పోవడం, కూలి పోవడం సహజం.

        వానకు భర్త రాక తెలిపే గోడ గీతలు చెదిరి పోతాయని ఆ ఇంటి ఇల్లాళ్ల  ఏడుపు. కొన్ని ఇండ్లకు గోడలకు బదులుగా తడికెలు మాత్రమే ఉండేవి. పని చేసు కుంటూ అటూ ఇటూ తిరుగుతూ మధ్య మధ్య లో ఆ తడికల్లోంచి వీధి లోకి తొంగి చూసే వాళ్లు . ఆ సందుల్లోంచి ఆముదపు ఆకులు ఇండ్ల లోకి చొచ్చుకొని వచ్చేవి. ప్రియురాళ్లు తడిక మీద తలవాల్చి ప్రియుని కోసం ఎదురు చూసే వాళ్లు. పల్లెల చుట్టూ విశాల మైన  మైన పచ్చిక బయళ్లు, పంట పొలాలు - ఇవీ ఆనాటి పల్లెల్లో కను విందు చేసే మనోహర దృశ్యాలు.

        పత్తి , జనుము, వరి, నువ్వులు చెరకు, దోస ఆనాటి పంటలు. శృంగార ప్రధాన మైన ఈ కావ్యం లో  పంటల ప్రసక్తి  కూడా శృంగారానికి ముడి పెట్ట బడినవే.

      ప్రత్తి చేను దున్ను పనికి మంచి దినాన
      మడక పూజ సేయ దొడగు నపుడు
      కోర్కులాత్మ గుబులుకొన గడగడమని
      వడక జొచ్చె గాపు చెడిపె కేలు

రాబోయే రోజుల్లో పత్తి చేను సంకేత స్థలం అవుతుందని తెలిసి పుట్టిన కోర్కెలు. దాని వల్ల కలిగిన వణుకు.

     మోముదమ్మి నడ్డముగ ద్రిప్పి కొని చెలి
     యూర కిట్టులేడ్చు చుండ వలదు
     అలతి దోస తీవియల మాడ్కినివి యిట్లె
     వక్ర గతులు సుమ్ము వలపు లెపుడు

    అడవి యెలుకలు పండ్లచే బుడములెల్ల
    గొరుక నరవరలై సడి పరుచుటెండ
    జివికి వెల వెల బారిన నువుల చేను
    గాంచి వల వల యేడ్చెను కాపు గరిత

వెలగ పండ్లు, మామిడి పండ్లు, రేగు పండ్లు మొదలయిన పండ్ల ప్రసక్తి గాథాసప్తశతిలో కనిపిస్తుంది. వెలగ పండ్లు తెలుగు వాళ్ల కిష్టం. ఇవి ఆరోజుల్లో సమృద్ధిగా లభించేవి. పోట్లాడుకున్నా పొరిగింటి మామిడి పండే కావాలని పేచీ పెడతాడు లోకం పోకడ తెలియని పసి పిల్ల వాడు. ముద్దుల కొడుకు అప్పుడే వస్తున్న ముందరి పళ్లతో గాటు పెట్టిన రేగి పండును చూడమని ఆ పండును భర్త చేతిలో పెట్టి మురిసి పోతుంది భార్య.

    ' పట్టుడిదిగొ ! మొదట బుట్టిన పలుదోయి
     గొరికి , కొడుకు గాటు వరచి నాడు
     రేగు పండు గంటిరే! ' యని పెండ్లాము
     నగుచు దెచ్చి పెట్టె మగని చేత '

         పురి విప్పి ఆడే నెమళ్లను చూడాలంటే ఎవరికిష్టముండదు. గరిక పరక తల మీద నిలిచిన మంచు బిందువును మెడ సాచి పరక కదల కుండా ముక్కుతో పీల్చు కొనే నెమళ్లను చూస్తే ఎంత ఆనందం. అలాంటి కను విందు చేసే దృశ్యాలను చూసి ఆనాటి తెలుగు ప్రజలు మురిసి పోయే వాళ్ళు .అందరూ కలిసి ఆనందంగా వినోదాలలో మునిగి తేలే వాళ్లు.

     అడవినెల్ల జూడు ! చెడ గాల్చి కార్చిచ్చు
      మిట్ట పల్లములను మెట్ట్ దాటి
      గట్టు నందు వ్రేలు గడ్డి వెంబడి నేటి
      కడకు జేరె డప్పి పడిన యట్లు

ఎంత సుందరమైన దృశ్యమో! అంత కంటే అందమైన భావన .

మహాసముద్రం దేవకి 

Comments