పరిశోధనలో పదనిసలు - 3

 పరిశోధనలో పదనిసలు -కొనసాగిపు ౩


ఆండాలమ్మ గారికి ఇద్దరు పిల్లలు . ఇద్దరూ మెడిసిన్ చదువుతుండే వాళ్లని చెప్పాను కదా! అబ్బాయిని బాబ్జీ అని అమ్మాయిని బుజ్జీ అని పిలిచే వాళ్లు. బుజ్జి అసలు పేరు గౌతమి. . చాలా తక్కువగా మాట్లాడేది తను . బాబ్జీలో కలుపు గోలు తనమెక్కువ. స్నేహానికి ప్రాణం ఇచ్చే వాడు. ఏదీ దాచుకొనే వాడు కాదు . పసితనం కనిపించేది. ముగ్గురిలో నాకు పొడవమ్మాయంటే చాలా ఇష్టమమ్మా అనే వాడట. మేము తిరుపతికి వచ్చేసినా బాబ్జీ నాకు వారానికి ఓ రెండు ఉత్తరాలయినా రాసే వాడు. వాటిలో కొనుక్కున్న బట్టల ప్రస్థావన మొదలుకొని ఇంటికి వచ్చినప్పుడు తన కోసం
వాళ్ళమ్మ వండిన వంటల దాకా ఉండేది. చూసిన సినిమాల గురించి రాసేవాడు. వాళ్ల అమ్మ అంటే చెప్ప లేనంత ఇష్టం . అమ్మ కూచి అనే వాళ్లం మేము.

ఒక సారి తిరుపతికి వస్తున్నట్లు ఉత్తరం రాశాడు. అబ్బాయిల హాస్టల్లో ఉండేట్లు ఏర్పాటు చేశాం. తిరుపతిలోని కపిల తీర్థం, అలిమేలు మంగాపురం శ్రీనివాస మంగాపురం , స్వర్ణముఖి నది సమీపంలోని శివాలాయం - ఇలా గుళ్లు గోపురాలతో పాటు సినిమాలు, షికార్లలతో చాలా బాగా గడిచింది.

ఒక రోజు తిరుమలకు కూడా వెళ్ళాము. మా ముగ్గురితో పాటు బాబ్జీకి కంపెనీ ఇవ్వడం కోసం సైకాలజీ శాఖలో చదువుతున్న మాధవ రెడ్డి ,శ్రీనివాస రావు వచ్చినట్లు గుర్తు .

ఉన్నన్ని రోజులు బాల గేయాలు కాపీ చేసి పెట్టీ, వ్యాసాలు రాసి పెట్టి చాలా సాయం చేసాడు .నేను 1979లో  అనంతపురం,  కృష్ణ దేవరాయ యూనివర్సిటీలో ఉద్యో గంలో చేరాక 1982 లో ఒక సారి అనంతపురం వచ్చాడు .ఎన్.ఎస్.ఎస్.ప్రోగ్రాం ఆఫీసరుగా నేను ఆంధ్రా యూనివర్సిటీకి  పదిహేను రోజులు క్యాంపు వెళ్లి నప్పుడు  బీమ్లీ , సింహాచలం చూపించాడు .తర్వాత మెడిసిన్ పూర్తి చేసి పెళ్లి కూడా చేసుకున్నాడు .పెళ్లికి వెళ్ళ లేక పోయాను .ఆ తర్వాత నాలుగేండ్లకే హార్ట్ ఎటాక్ తో పోయాడని తెలిసి వైజాగ్ వెళ్లి ఆండాలమ్మ గారిని ఓదార్చి ,రమణన్నను కలిసి నేను మావారు రెండు రోజులుండి వచ్చాము .

తర్వాత ఎన్నో సార్లు కాలేజి పని మీద వెళ్లి నప్పుడు
అందరిని కలిసి వాళ్లం. కళ్ళ ముందు కొడుకు పోవడం ఆండాళ్ అమ్మను బాగా కృంగ దీసింది .అయినా చాలా ఏండ్లు బ్రతికింది .4 ఇండ్ల గ్యాప్ తర్వాత ఒక సారి ఫోన్ చేసిన.ఆమె చల్లని గొప్ప మనసును , తలచుకోకుండా ఉండలేక ఇవన్నీ చెప్పాను .

మహాసముద్రం దేవకి








Comments