గాథా సప్తశతి - 2

 గాథా సప్తశతి - 2


       సప్తశతిలో కనిపించేది ప్రధానంగా  పల్లె ప్రజల శ్రామిక జీవితం. ఆ జీవితంలో  సామాన్యులకు చెందిన రసవంతాలయిన శృంగార ఘట్టాలెన్నో నిక్షిప్తమై ఉన్నాయి.  . ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కోని స్వేచ్ఛా జీవితం వాళ్లది. అయితే ఆ శృంగారం  ఉదాత్తంగా , హద్దులు దాటనిదిగా చాలా చోట్ల కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు దారి తప్పినప్పుడు అధిక్షేపించడాన్ని వాళ్లలో చూడగలం.

     హద్దులు దాటే కొందరి ప్రవర్తనను ఖండిస్తూ హితబొధ చేసే ఘట్టాల్ని చూద్దాం.

        మలిన చిత్తుడైన మరదికి నిల్లాలు
        చిన్ని నవ్వు దోప జెప్పుచుండు
        రాము వెంట దిరుగు సౌమిత్రి చరితంబు
        గోడ మీద వ్రాసుకొన్న  దాని

'సంసారం గుట్టు- వ్యాధి రట్టు ' అన్నారు. సంసారం గుట్టుగా సాగాలి . గుట్టు రట్టు  జేసుకుంటే ఇంటి పరువు గంగలో కలవడం అటుంచి నలుగురిలో నగుబాట్ల చేటవుతుంది . కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయతలు సన్నగిల్లుతాయి. మమతానురాగాలు మంట కలుస్తాయి.

       ఆ మరిది మంచి వాడు కాడు. మలిన చిత్తుడు. వావి వరసలు మరిచి తల్లి లాంటి వదిన వెంట బడుతున్నాడు. తప్పు చేస్తున్నాడు. కానీ శీల చరిత అయిన ఆ ఇల్లాలు ఇంట్లో వాళ్లకు చెప్ప కుండా, గట్టిగా దండిస్తే ఎవరు వింటారో అని చిరు నవ్వుతో ' నువ్వు చేస్తున్న పని మంచిది కాదు ' అని మంచితనంగానే  చెప్పడానికి గోడ మీద రాసుకున్న చిత్రాన్ని చూపుతొంది. ఆ చిత్రంలో రాముని వెన్నంటి తిరిగే లక్ష్మణుడున్నాడు. నీ ప్రవర్తన సీతా రాముల పట్ల లక్ష్మణుడు ఎలా ప్రవర్తించాడో  అలా ఉండాలి అని చెప్పడమన్న మాట.

        అసలు విషయం పక్కన పెడితే గాథా సప్తశతి లో అక్కడక్కడా ఇలా రామాయణ , భారత, భాగవతాల ప్రసక్తి కనిపిస్తుంది. అప్పటికే ఆ కథలు సామాన్యులలో వ్యాప్తిలో  ఉండేవని చెప్పడానికి ఇవి నిదర్శనాలు . గృహాలంకారం కోసం గోడమీద చిత్రాల్ని గీసుకోవడం, చిత్ర పటాల్ని తగిలించు కోవడం కూడా ఆనాటి ఆనవాయితీ అని ఈ పద్యం చెప్తుంది.

        ఇలాంటి భావమే కింది గాథలో కూడా చూడగలం .

        చెడ్డమనసు గలిగి యడ్డాడు మరిది బా
        ధలను దెగువకాడు దయితు తోడ
        జెప్పదింటి బ్రదుకు చెడునంచు నానాట
        గోడలమల హృదయ క్రుంగుచుండు

'భర్త కోపిష్ఠి ఎంతకైనా తెగిస్తాడు. మరిది చెడ్డ వాడు. తన వెంట బడి అడ్డు తగులుతున్నాడు. భర్తకు చెప్తే కోపిష్ఠి అయిన భర్త మరిదిని చంపినా చంపుతాడు. ఇంటి బతుకు నాశనమవుతుంది. ' అనుకొని ఆ ఇల్లాలు బాధను తన లోనే దిగమింగుకొని బతుకు బండిని బాధగా , భారంగా ఈడుస్తోంది.

        బాధ్యత గల ఇంకో ఇల్లాలు మరిది చెడు ప్రవర్తనను అత్తకు చెప్పే తీరు చూడండి .

       ఊరికెల్ల నున్న దొకటే కదా రెడ్డి
       వారియింట నత్త పాద్రి చెట్టు
       మరిది జుట్టు నిండ మరి యిన్ని యా పూలు
       గలవిదేమి బాగు కాదు మనకు

ఆ రెడ్డి ఇంట్లో ఇతని కేమి పని అని చెప్పడం, ఆ ఇంటి మహిళతో మరిదికి ఉన్న సంబంధం గురించి అత్తను హెచ్చరించడం ఇందులో కనిపిస్తుంది.

మహసముద్రం దేవకి

        

Comments