పరిశోధనలో పదనిసలు : 22
పై వర్గాలలో ఎలాంటి గేయాలున్నాయో స్థాలీ పులాక న్యాయంగా ఒక్కో వర్గానికి ఒకటి రెండు గేయాలను పరిచయం చేస్తాను .
ప్రశంసాత్మక గేయాలు
చిన్న పిల్లల అందచందాల్ని, ముద్దుమురిపాలను, చిరు నవ్వుల్ని , చిలిపి చేష్టలను చిత్త ప్రవృత్తుల్ని ప్రశంసిస్తూ రాసిన గేయాలు చాలానే ఉన్నాయి . . ఇవి కొంత కవితా శిల్పంతో భావ ప్రధానంగా అనిపించాయి . జానపదగేయాల్లో లాలి పాటలు, జోల పాటల్లో మాత్రం ఇలాంటి ప్రశంస కనిపిస్తుంది . కాని ఆధునిక బాలగేయ రచయితల ప్రశంసాత్మక గేయాల్లో వర్ణనా వైచిత్రి, వయక్తిక భావనా రీతి , సౌందర్య దృష్టి వ్యక్తమవుతాయి . ఉదాహరణకు:
'మా పాప అందం
మతాబీల చందం
మా పాప హాసం
జిలేబీ వికాసం '
చిన్న పిల్లల ప్రపంచమంతా ఇంటికి , బడికి పరిమితమయి ఉంటుంది . పిల్లలకు బడిపంతులు చక్కని ఆదర్శం. అందుకే పెద్దవాళ్లయ్యాక బడిపంతులు కావాలన్న ఊహ వాళ్లలో సాధారణంగా కలుగుతుంటుంది .
' అమ్మా నేనొక రంగు మబ్బునై ఆకాశంలోఎగిరిపోనటే
దేశ దేశముల తిరిగినే
తియ్యని వానలు వర్షిస్తానే ' అంటూ అసాధ్యాలను సుసాధ్యాలుగా కలలు కంటుంటారు .
లాలిపాటలు
ప్రాచిన మయిన లాలిపాటలకు అనుకరణ ప్రాయాలయిన లాలి పాటలను ఆధునిక బాల గేయ రచయితలు రచించారు . వాటిని ఒక వర్గ కింద చేర్చడ మయింది . మచ్చుకు ఒకటి
' లాలి లాలీ బాల లాలిగోపాలా
లాలి భరతాన్వయాలంకార బాలా
వెన్న మీగడ పెరుగు అన్ని తిని పెరిగి
తిన్నగా మన తెనుగు తేనె చవి కొనుము '
ఇలా భాషలోను , భావం లోను కొత్తదనం కనిపిస్తుంది .
౩. బుజ్జగింపు పాటలు
పిల్లలు మారాము చేసినప్పుడు , ఏడ్చినపుడు , అలిగినపుడు తల్లుల సహనానికి ఒక పరీక్ష . అయినా ప్రతి తల్లీ ఏవో కల్లబొల్లి కబుర్లు చెప్పి సముదాయిస్తుంది . అలాటి పాటల్ని ఈ వర్గం కింద చేర్చాను . మచ్చుకు :
' చందమామ రావే జాబిల్లి రావే
మబ్బులెక్కిరావే మాయింటికేసి
గయ్యాళి పాపనీ ఉయ్యాలలూపి
కళ్లలో తీయని కలలల్లి పోవే
శబ్ద చమత్కార గేయాలు
అర్థానికి కాని, భావ పరిపుష్టికి గానీ అంతగాప్రాధాన్యం లేకుండా శబ్ద చమత్కారంతో కూడిన బాలగేయాలివి. ఇంగ్లీషులో వీటిని nonsense rhymes అంటారు.
జైగోవిందు జైగోవిందు
గాంధికి విందు బూందీ తిందు
పలకా చెక్క బలపం ముక్క
దొరికినవక్కా ద్వారం పక్క
పలకాచెక్క పైనే లెక్క
చేస్తానక్క చూస్తావక్క
ఇలాంటివి
ప్రార్థన గేయాలు
ఇవి ఎక్కువగానే ఉన్నాయి.
చిన్నీ కృష్ణుడు పుట్టాడు
చిటపట పువ్వులు కురిశాయి
చిన్నీ కృష్ణుడు నవ్వాడు
తళ తళ మెరుపులు మెరిశాయి
చిన్నీ కృష్ణుడు నవ్వాడు
తప్పట్లు కొట్టింది భూదేవి
విద్యా విషయక గేయాలు
పిల్లల్లో విద్యపై ఆసక్తిని పెంచడానికి అక్షరాలు, అంకెలు, వారాలు, నెలలు , ఋతువులు , తిథులు, నక్షత్రాలు మొదలయిన వాటిని నేర్చుకోవడానికి వాళ్లు ఆసక్తి చూపే విధంగా గేయ రూపంలో రాసినవివి .
అ ఆ ఇ ఈ అనియెదము
అందరమొకటై మెలగెదము
ఉ ఊ ఋ ౠ అనియెదము
ఉల్లాసంగా ఉండెదము
7. ప్రభోదాత్మక గేయాలు
చిన్న పిల్లల్లో నీతి నియమాలను కలిగించడానికిఉద్ధేశించిన బాలగేయాలు అధునిక సాహిత్యంలో మూక్కారు పంటగా పండింది.
బడికి రారో చిన్న బడికి రా చిన్న
బడి అంటే విజ్ఞాన భాండార మన్న
చదువు నేర్వని వాడి సరిగ ఓరన్న
రెండు కాళ్లే ఉన్న మొండి పశువన్న
మాతృభక్తి , గురుభక్తి, దైవ భక్తి, దేశ భక్తి , భూత దయ, విశ్వమానవ ప్రేమ, జాతి సమైక్యత, మత సామరస్యం మొదలైన భావాలను ఈ గేయాల్లో అందించారు .
8 . ఆట పాటలు
పిల్లల ఆటలు ఎన్నో రకాలు . తెలుగు వాళ్ల సంస్కృతిని , సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ పాటలున్నాయి .
రింగు రింగున తిరుగునీ బొంగరంబు
ఏదియో వ్రాయుచున్నదీ ఇసుక యందు
బడికి పోలేదు పొత్తంబు పట్ట లేదు
ఎటుల వచ్చెనో దీనికి ఇంత చదువు
ఆడుతూ పాడుకొనేవే కాక ఆట వస్తువులను కూడా వర్ణిస్తూ ఈ పాటలున్నాయి
9 . పశుపకక్ష్యాదుల పాటలు
పశుపక్ష్యాదుల ఆకారాలు , అరుపులు , చేష్టలు పిల్లల్ని అమితంగా ఆకర్షిస్తాయి . వినోదాన్ని కలిగిస్తాయి. తరచుగా కనిపించే కుక్క, పిల్లి , ఆవుదూడ, మేక ఒక విధంగా పిల్లలకు ప్రియమైన నేస్తాలు . అందుకే బాలగేయాల్లో వాటి ప్రసక్తి ఎక్కువ.
చక్కనీ చుక్క మా చిన్ని కుక్క
పాల బువ్వ తింటుంది పంచలో బజ్జుంటుంది
పగలు నిద్ర పోతుంది రాత్రి ఇల్లు కాస్తుంది
కావు కావు మని కాకమ్మ
కబురేదో తెచ్చిందమ్మ
పట్టణంలో ఉన్న పెద మామయ్య
పట్టు పరికిణీ నాకు తెస్తారా
చదువుల కెళ్లిన చిన్నన్నయ్య
చెల్లెలి ముచ్చట తీరుస్తాడా
ఈ పాటల్లో ధ్వన్యనుకరణ పదాలు కూడా చోటు చేసుకున్నాయి .
10 . పండుగల పాటలు
తెలుగు వాళ్లు ఉత్సాహంగా జరుపుకొనే పండుగలు ఇతర ఉత్సవాలకు సంబంధించిన పాటలను కూడా ఈ వర్గం కింద చేర్చడమైంది .
షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి గేయం చూడండి .
పండ్లు పులిసే చింత పండు
వెగటు పుట్టే వేప పూవు
వొగరు మామిడి పింది తోడను
కొత్త బెల్లము కొంత కలిపీ
కొత్త సంవత్సరపు వేళను
ఆరగించుట యందు చాలా
అర్థమున్నది బాలకా ..
వేరు వేరు మతములున్నా
వేష భాషలు వేరు అయినా
జాతి కొక్క నీతి యున్నా
భరత పుత్రుల ఆశయంబున
భావ బేధము లేదటంచును
బిన్న భిన్న రుచులు కల్గిన
చిన్న పానీయంబు చాటును
11 . నవ్వులాట పాటలు
చిట్టి పొట్టి చెల్లెలా చిట్టి ఎలుక నేస్తమా
వేరు శనగ పప్పులన్ని ఎట్లు మాయమయ్యెనే
చిట్టి నీదు వంతు ఎంత ? చిట్టి ఎలుక వంతు ఎంత?
12 . ప్రకృతి పాటలు
అన్నా రావోయి సోమన్నా రావోయి
నీ కన్నా తల్లి చంక నెక్కీ చిన్నీ పాపడా
సముద్రం, నదులు, చెట్లు, కొండలు , చంద్రుడు , సూర్యుడు, వెన్నెల, ఆకాశం ఇలా అందరినీ ఆకర్షించే మనోహరమైన దృశ్యాలు . అలాటి పాటల గురించి ఈ వర్గంలో చర్చించాను .
ఇవి కాక ఇంకా వైజ్ఞానిక బాల గేయాలు , కథా గేయాలు , జీవిత కథా గేయాలు, బాలల బుర్ర కథలు , నృత్య గేయ నాటికలు , ఆధునిక పొడుపు గేయాలు మొదలయినవన్నీ ఈ విభాగంలో చర్చకు వచ్చాయి .
13 . వైజ్ఞానిక విషయ గేయాలు
ఆధునిక విజ్ఞానం మానవ మేధస్సును అలివి కాని వేగం తో ప్రసరింప చేస్తున్నది . ఈ గేయాలు ఎక్కువగా ప్రశ్నొత్తరాల రూపంలో సులభంగా బోధిస్తున్నాయి . ఉదాహరణకు : అన్నదమ్ముల సంభషణా రూపం లోని గేయం.
అంతా చీకటి అంతా చీకటి
కారణ మేమిటి మేమిటి అన్నయ్యా
వెలుగూ వేడీ ఇచ్చే సూర్యుడు
పడమట గుంకెను తమ్మయ్యా
లోకమంతా ఈ నిముషాన
చీకటి మయమా అన్నయ్యా
కానే కాదు ఈ నిముషాన
పగలొకటున్నది తమ్మయ్యా
ఇలా కథా గేయాలు, జీవిత కథా గేయాలు , బుర్రకథలు మొదలయిన వెన్నో గేయ రూపం లో ఉన్నాయి .
బాలగేయాలువేల కొద్దీ ఉన్నాయి . వాటి లోని వైవిధ్యాన్ని , వైశిష్ట్యాన్ని సమగ్ర స్వరూప స్వభావాలను తెలుసుకోవడానికి నేను రాసిన తెలుగు బాల గేయ సాహిత్యం చూడండి .
Comments
Post a Comment