పరిశోధనలో పదనిసలు - 21
నేను ఇంతవర్రకూ జానపద బాలగేయాలను ప్రస్తావించాను . తర్వాత ఆధునికులు రాసిన బాలగేయాలు ఎలా ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి . వాటిలోని విశేషాలేమిటి , అది పిల్లలకు ఎంతవరకు ఉపయోగ పడుతుంది ? మొదలయిన అంశాలను చెప్పాలనుకున్నాను . ఇదే నాపరిశోధనలో కీలకమైన విభాగం . దాని కోసం నేను సేకరించిన గేయాలను ( నోట్ బుక్కులలో రాసుకున్నవి , గేయ సంకలనాలు . ) ఒక దగ్గర చేర్చాను .
పరిశోధన వ్యాసం ఎప్పుడూ అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లుండాలి . చదివే పాఠకులను అయోమయంలో పడవేసేట్లుండ రాదు .
ఒక చోట చేర్చుకున్న గేయాలనుచూస్తే ఆ పని చెయ్యడం అసాధ్య మనిపించింది . ఎందు కంటే కొంతమంది రచయతులు ఒక విషయాన్ని
ఏదో ఒకే గేయంలో ప్రస్తావిస్తే , మరి కొంత మంది రక రకాల అంశాలను కలగూర గంపలాగా కలిపి చెప్పారు .అంటే ఒక చరణంలో ఒక విషయముంటే
ఇంకో భాగంలో దానికి భిన్నమయిన అంశమేదో ఉంటుంది . వాటిని వింగడించడం ఎలా అని మళ్లీ తలపట్టు కోవాల్సిన పరిస్థితి వచ్చింది . ఒక నాలుగు రోజులు వాటిని పక్కన పెట్టేసి హాయిగా పడుకొని విశ్రాంతి తీసుకున్నాను . మరో నాలుగు రోజులు వర్గీకరణ గురించిన ఆలోచనలతో గడిపాను. సమస్య ఏదో ఒక కొలిక్కి వచ్చినట్లనిపించి ఆ పద్ధతిని ఆచరణలో పెట్టాను .
ముందుగా నేను సేకరించిన పుస్తకాలను బాలగేయ సంకలనాలను , నోటు పుస్తకాలను ఒక చోట చేర్చి వాటి పైన 1, 2, 3 అని పెద్దగా చూడగానే కనిపించేట్లు నెంబర్లు రాశాను . ఆ తర్వాత ఒక్కో పుస్తకాన్ని తీసుకోని చదవడం మొదలు పెట్టాను .
మొదటి గేయం చందమామ గురించి ఉందనుకుందాం . ఒక కార్డు పైన చందమామ పాటలు అని రాసి కింద పుస్తకం నెంబరు వేసి దాన్ని రౌండ్ చేసి పక్కన పేజి నెంబరు వేశాను . మళ్లీ ఏ పుస్తకములో అయినా చందమామ పాట వస్తే అదే కార్డులో బుక్ నెంబరు పేజీ నెంబరు వేశాను . రెండవ పేజీలో ఆవు గురించి ఉంటే దాన్ని జంతువుల గేయాలు అని పేరు పెట్టి దాని కింద ముందు లాగే పుస్తకం నెంబరు , పేజీ నెంబరు వేశాను . ఇలా ఒక్కో కొత్త అంశం వచ్చినప్పుడంతా ఒక్కో కార్డులో క్రోడీకరిస్తూ వచ్చాను .
బాల గేయాలు చాలా రకాలుగా ఉన్నాయి . ఒక
విధంగా చెప్పాలంటే విశ్వం మొత్తం ఆ గేయాల్లో. ప్రతిబింబిస్తాయి. అంతే కాదు పిల్లల ఆటలు ,
వాళ్ల చేష్టలు, ఆలోచనలు , కోరికలు - ఇలా సర్వం ఆ గేయాల్లో ఆవిష్కరించ బడ్డాయి . అలా నేను పేర్లు పెట్టుకొనిరాసుకున్న కార్డులు 200 దాకా తేలాయి . ఆ వర్గీకరణ సబబుగా అనిపించ లేదు . మళ్లీ ఆలోచన . చివరికి చందమామ, సూర్యుడు , చుక్కలు --- మొదలన వాటిని ఒక వర్గం కింద చేర్చాను . అలా ఒక పది కార్డులను ఒక వర్గం కింద చేర్చే అవకాశం దొరికింది . ఉదాహరణకు : ఆకాశం , మబ్బులు , చందమామ, సూర్యుడు , నక్షత్రాలు , హరివిల్లు , తోక చుక్క , గ్రహాలు -- వీటిని ఒక చోట చేర్చి ఖగోళ వస్తువులు అని ఆ వర్గానికి పేరు పెట్టాను .
అడవులు, చెట్లు , కొండలు , లోయలు , నదీనదాలు మొదలయిన వాటిని ప్రకృతి గేయాలు అన్నాను . అలా మళ్లీ ఓ ఎనభై రకాల కార్డులు తేలాయి . దాన్ని ఇంకా సంగ్రహించాలని కంకణం కట్టుకున్నాను . కనిపించే ఖగోల వస్తువులు కూడా ప్రకృతి లో భాగమే కదా అనుకొని వాటిని ప్రకృతి గేయాల్లో కలిపాను . ఇలా పేర్లను మారుస్తూ కొన్నింటిని ఒకటిగా కలుపుతూ 13 వర్గాలుగా వింగడించాను . అవి ఇవి :
1 . ప్రశంసాత్మక గేయాలు
2 . లాలి పాటలు
౩ . బుజ్జగింపు పాటలు
4 . శబ్దచమత్కార గేయాలు
5 . ప్రార్థన గేయాలు
6 విద్యా విషయకగేయాలు
7 .ప్రబోధాత్మక గేయాలు
8 . ఆట పాటలు
9 .పశుపక్ష్యాదుల పాటలు
10 . పండుగల పాటలు
11 .నవ్వులాట పాటలు
12 . ప్రకృతి పాటలు
13 . వైజ్ఞానిక విషయ గేయాలు
ఈ వర్గాలకు చెందినవే గాక బుర్ర కథలు , నృత్య
గేయ నాటికలు పొడుపు గేయాలు, జీవిత చరిత్రలు మొదలనవి కూడా కొన్ని గేయరూపంలో వెలువడినాయి . ప్రక్రియా వైవిధాన్ని బట్టి వాటిని ప్రత్యేకంగా పరిశీలించడం సమంజసం అనుకున్నాను .
Comments
Post a Comment