పరిశోధనలో పదనిసలు - 2

 పరిశోధనలో పదనిసలు - 2


అనకాపల్లె ఆండాళమ్మ తన దగ్గర చదువుకుందని , వాళ్ల ఇంటిలో మట్టసంగా ఉండి  పని ముగించుకొని రమ్మని నన్ను, శిరీషాను, ఎలిజాను పిలిచి చెప్పారు డిపార్ట్మెంట్ హెడ్, ప్రొఫెసరు, మా చిన్నాన్న గారు కూడా అయిన జి. ఎన్. రెడ్డి గారు .  అంత వరకు లోకల్ గా ఉన్న లైబ్రరీలలో మాత్రం విషయ సేకరణ చేసుకున్న మేము స్టడీ  టూర్ వెళ్తున్నామని సంబర పడి పోతున్నాము. తీసు కెళ్లాల్సిన బట్టలు , పుస్తకాలు సిద్ధం చేసుకున్నాము.

కానీ ఆమె దగ్గరి నించి సమాధానం రానందు వల్ల మా ప్రయాణం ఆగి పోయింది. ఆ తర్వాత సుబ్బరాజు గారింట్లో ఏర్పాటు చేసి మమ్మల్ని ట్రైన్ ఎక్కించారు .

ఆండాళమ్మ  గారు అనకా పల్లె గవర్నమెంట్ జూనియర్  కాలేజీ లో పని చేస్తూ ఆంధ్రా యూనివర్సిటీలో పార్ట్ టైం స్కాలర్ గా 
పిహెచ్. డి చేస్తొంది. దసరా సెలవులు కూడా కలిసి రావడంతో తను వైజాగ్  వెళ్లడం వల్ల మా చిన్నాన్న గారు రాసిన ఉత్తరాన్ని సమయానికి చూసుకో లేక పోయింది. ఆమె అనకా పల్లె లో అడుగు పెట్టిన వెంటనే ఉత్తరం చూసి మేము సుబ్బ రాజు గారింట్లో ఉన్నట్లు లిబ్రేరియన్ ద్వారా తెలుసుకొని అక్కడికి వచ్చింది.

అనకా పల్లెలో పని పూర్తి కాగానే మేము వైజాగ్ వెళ్లాలి . కానీ కవుల ఆంజనేయ శర్మ గారని బాల గేయ రచయితను కలవడానికి అక్కడే మరో రోజు ఉండి పోయాం. ఎన్నో తంటాలు పడి అతని అడ్రస్ సంపాదించారు ఆండాళమ్మ గారు. అనకా పల్లెకు ఉత్తరాన బొజ్జన్న కొండ దగ్గర ఒక మారు మూల ఉన్న ఆ ఇంటిని  వెదకి పట్టు కొనే సరికి మా తల ప్రాణం తోకకొచ్చింది .టైం ఒంటి గంట దాటింది . ఎగుడు దిగుళ్లు , మురుగు కాలువలు దాటు కొంటూ , అతని పేరు అడుగుతూ మేము నలుగురం వెళ్లేసరికి చుట్టా లొస్తున్నారన్న వార్త అందించారు అక్కడి ఆకతాయిలు. భోజనానికి  కూర్చో బోతున్న వాళ్లు ఎవరా చుట్టాలు అని ఎదురు చూస్తున్నారు.

మేము వేళ కాని వేళలో వెళ్లాం. దగ్గర్లో హోటళ్ల  ఆనవాళ్లు కనిపించ లేదు. మీరు భోజనం చెయ్యండి అంత వరకు కూచుంటా మన్నాము. ఊహూ . ఇంటి ఇల్లాలు వంట ఏర్పాట్లలో పడింది. చనువు తీసుకొని ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాను . ఉన్నదే తలా కాస్త తింటా మన్నాము .

ఒక్కటే తాటాకు ఇల్లు. బయట తడికల వసారా . అక్కడే వంటకు కాస్త తడిక అడ్డం కట్టి వంట పొయ్యి. కొక్కరిస్తూ పక్క పాక వాళ్ల పిల్లల కోడి ఇంట్లోకి రాబోతుంటే అక్కడే కునుకు తీస్తున్న కుక్క గుర్రు మంటూ వాటిని తరమ గొట్టింది. ఇద్దరు పిల్లలు స్కూలుకు టైం అవుతుందని భోంచేస్తున్నారు.

'సుశీలా అక్కయ్య గారింటికి ఒకసారి వెళ్లి రా ' అని హెచ్చరించారు శర్మ గారు.పది నిముషాల్లో వాళ్ల అక్క కూతురు , సుశీల కొన్ని గిన్నెలు పట్టు కొని వచ్చారు. శర్మ గారు పెరట్లోని అరిటాకులు కోసుకొని కడిగి తెచ్చారు. వసారాలోనే చాప పరుచుకొని భోజనానికి కూర్చున్నాము . వాళ్ల అక్క ఇంటి నుంచి మొత్తం కుండ కుండే పట్టు కొచ్చి నట్లు అర్థమయింది. వాళ్లు మళ్లీ వండుకుంటారు కాబోలు !

అన్నం వడ్డించ బోతే అడ్డు కున్నాము. పిల్లలు సంగటి తినడాన్ని చూశాము. సంగటి కావాలంటూ పేచీ పెట్టాము .కొత్తోళ్లం అనుకోకండి అంటూ చొరవ తీసుకొని వాళ్ల బెరుకును నిముషం లో పోగొట్టాము,  నేను ఆండాళమ్మ గారు.

ముందుగా సంగటి , పచ్చిటమేటా కాయిల చట్ని నేను, సుశీలమ్మ  కలిసి వడ్డించాం. నన్నూ బలవంతంగా  కూర్చో బెట్టిన సుశీలమ్మ తను మాత్రం ససేమిరా కూర్చో లేదు. ఆ కాంబినేషన్ అదిరి పోయింది. సంగటి ఇంకా ఉంటే అదే తినే వాళ్లం. ఆ తర్వాత అన్నం , ఆకు కూర పప్పు వడ్డించింది సుశీల. వాళ్ల అక్క కూతురు అప్పడాలు వేయించుకొని , గడ్డ పెరుగు గిన్నెతో వచ్చింది.  ఎంత తృప్తిగా తిన్నామంటే ఓ ముద్ద ఎక్కువే తినేట్లుగా.

శర్మ గారు తన పుస్తకాల పెట్టెల్ని బయటి తెచ్చారు. బాల పత్రికలు చాలా ఆయన దగ్గర దొరికాయి. ఒక్కో పత్రిక ఎప్పుడు మొదలయిందో సంచిక , సంపుటి ... వీటిని బట్టి లెక్క వేసి శర్మ గారే చెప్పారు.

శర్మ గారు పల్లె వాతావరణ మున్న ఆ ప్రాంతం లోని ఓ ఎలిమెంట్రీ స్కూల్లో టీచరు. ఎదుగూ బొదుగూ లేని సంసారంలో ఏటా ఏడులక్షల అప్పని అప్పు చేసి ఇద్దరి చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసి పంపించాడు. తండ్రి లేడు. తల్లి ప్రస్తుతం కూతురికి కాన్పయితే వెళ్లింది.

పేద  తనం  ఆయన ఆశయాలకు,   అభిరుచులకు  అడ్డుకట్ట వెయ్యలేక పోయింది. ఉపాధ్యాయుడుగా పిల్లలతో తనకున్న సంబంధాన్ని పురస్కరించుకొని వాళ్ల స్థాయికి తగిన రచనలెన్నో చేశాడు. 1957 నుంచి ఇంచు మించు 150 బాలగేయాలు, 20 గేయ కథలు , 10 బాలల నాటికలు. 2 నవలలు 3 బుర్ర కథలు  రాశారు. వాటిలో కొన్ని పత్రికలలోను, కొన్ని సంకలనాలుగా, కొన్ని గ్రంథాలుగా వెలువడినాయి.

వారి రచనలలో భావి పౌరులు ( 1969 ) అనే గేయ సంపుటిని 8-12 సంవత్సరాల మధ్య వయసు పిల్లల కోసం రాసినట్లు చెప్పారు. అంతే కాక బడి పాపలు, బొమ్మల పెళ్లి , రంగుల రాట్నం అనే గేయసంపుటాలను కూడా రాశారు. బలే బావ, స్వాతంత్ర్యం అనే వారి హాస్య నాటికలు పిల్లల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. మారిన మనిషి, పురుషోత్తముడు ( చారిత్రికం) అనేవి కూడా పిల్లల నాటికలే. ధర్మ సంస్థాపనను, సత్య వ్రత సాధనకు దేశ భక్తిని , హైందవ నీతిని చాటి చెప్పే వీర శివాజీ ( 1970 ) గాథను పది  పన్నెండేండ్ల  పిల్లలు ప్రదర్శించడానికి  వీలుగా మధ్య మధ్య హాస్యాన్ని చొప్పించి బుర్ర కథా రూపంలో రాశారు. బాలల విజ్ఞాన వినోద వికాసాల కోసం పాటు పడే బాలానంద సంఘాల పుట్టు పూర్వోత్తరాలను , వాటి నిర్మాణాన్ని ఆ సంఘాల కార్య క్రమాలను వివరిస్తూ వారు రాసిన మరో బుర్ర కథ బాలానందం ( 1974 ) గాంధీజీ  వారి  మరో   బుర్రకథ .

అనకాపల్లెలో రామ బాలానంద సంఘాన్ని స్థాపించి పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయించి వాళ్లలో ఉన్న రచనాసక్తిని పెంచే ప్రయత్నం చేసి కృతకృత్యులయ్యారు . శర్మ గారి రచనలు చదివితే పిల్లల భవిష్యజ్జీవితలకు బంగారు బాటలు వెయ్యడానికి ఆయన చేసిన  కృషి ఎంతో తెలుస్తుంది. నా పరిశోధనకు ఎంత గానో సహకరించిన  శర్మ గారికి కృతజ్ఞతలు తెలిపి ఆయన ఇచ్చిన పుస్తకాలతో ఆండాళమ్మ  వెంట ఆ మర్నాటి ఉదయమే విశాఖ పట్నం బస్సు ఎక్కాము మేము.

మహాసముద్రం దేవకి

Comments