గాథా సప్తశతి - 1

 గాథా సప్తశతి - 1

ప్రాచిన సాహిత్యంలో నాకు నచ్చిన పుస్తకం - గాథా సప్త శతి 


క్రీస్తుశకం 1 వ శతాబ్దానికి చెందిన గ్రంథరాజం

' గాథా సప్త శతి. ' ఇది తెలుగు భాషలో ఉన్న రచన కాదు. తెలుగు వాళ్ల జీవితాలకు సంబంధించిన రచన . ఇది ప్రాకృత సంకలన గ్రంథం. దీనిని హాలుడు సంకలనం చేశాడు.


శతి అంటే నూరు . సప్త శతి అంటే ఏడు వందలు . 700 పద్యాలతో కూడుకున్న ఈ గ్రంథంలో ప్రతి పద్యం ఒక ముక్తకం. ముక్తమంటే పూర్వ పర సంబంధం లేనిది. శతక పద్యం లాంటిది  . అలాంటి ఈ ముక్తకాలు గాథలుగా పేరు పొందాయి. పాడుకోవడానికి అనువుగా ఉన్న వాటిని గాథలు  అంటారు. ఒక్కొక్క ముక్తకం ఒక కథలాగా భాసించడం ఇందులోని ప్రత్యేకత. 


కవి వత్సలుడు అనే బిరుదున్న శాతవాహన రాజు హాలుడు. అతడు స్వయంగా మహాకవి .కవి పండిత పోషకుడు. హాలుడు అనుదినం జరిపే పండిత సభలలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కవులు చెప్పిన గాథలను కోట్లాది సేకరించాడు.   అందులో రసవంతాలైన వాటిని 700 గాథలను ఎంపిక చేసి ' గాథా సప్త శతి' పేరుతో ప్రచురించాడు. ఇందులో 350 మందికి పైగా కవులు కనిపిస్తారు . వాళ్లలో స్త్రీలు కూడా ఉండడం విశేషం . రేవా, వద్దా వహీ , అణులచ్చి, అసులద్ది, ససిప్పహా, నాథా మొదలైన కవయిత్రుల పేర్లు కనిపిస్తాయి. ఇది ఆనాటి తెలుగు ప్రజల సామాజిక జీవనాన్ని ప్రతిబింబించే మేటి కావ్యం . దీనికి తర్వాతి యుగాల్లో తెలుగు అనువాదాలు ,అనుకరణలు ( విశ్వ నాథ పంచశతి) వ్యాఖ్యానాలు ఎన్నో  వచ్చాయి. 


గాథా సప్తశతిలో కనిపించేది తెలుగు వాళ్ల పల్లె జీవితం. వాళ్ల శృంగార జీవితం , వ్యవసాయ జీవితం . ఆనాటి తెలుగు ప్రజల సమగ్ర జీవన విధానాన్ని ఈ గ్రంథం మన కళ్లకు కట్టిస్తుంది . ఇదందు లోని ప్రతి పద్యం రసవంత మైనదే .


పల్లెల రూపురేఖలు, ఇండ్లుచుట్టూ ఉన్న పంట పొలాలు, వాళ్ళు పండించే పంటలు ,ఇంటిలోని మనుషులు , భిన్న వ్యక్తుల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు , వాళ్ళ ప్రవర్తనలు అన్నీ ఆ చిన్న గాథలు మనకు విప్పి చెబుతాయి .


మహాసముద్రం దేవకి 















Comments