పరిశోధనలో పదనిసలు -18
నవ్వులాట పాటలు
పిల్లలు వాళ్లలో వాళ్లు నవ్వుతూ, ఇతరుల్ని నవ్విస్తూ, కవ్విస్తూ, పరిహసిస్తూ పాడే పాటలు నవ్వులాట పాటలు లేదా వెక్కిరింపు పాటలు. తమలో తామే కాక పెద్ద వాళ్లను కూడా ఎగతాళి చేసి ఏడిపించాలన్న కుతూహలం పిల్లలకెక్కువ . జానపద సాహిత్యంలో పిల్లలకు సంబంధించిన హాస్య రసం ఇందులో ఉంటుంది.
పిల్లలందరూ ఒక చోట చేరినప్పుడు సమయం కోసం కాచుకొని ఎగతాళి చేసి ఏడిపించడమంటే కొందరికి సరదా . అలాంటి సమయాల్లో అందరూ కలిసి ఉల్లాసంగా నవ్వుకుంటారు. అలా ఎగతాళి చేస్తూ పాడే పాటలు కొన్ని అనుశ్రుతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇద్దరు మాత్రమే ఉంటే ఈ హాస్యానికి చోటు లేదు.
కొంత మంది కలిసి ఆడుకుంటున్నప్పుడో, మాట్లాడుకుంటున్నప్పుడో కొంత మంది కొందరి ఎగతాళికి అందరి ఆనందానికి పాత్రులవుతూ ఉంటారు. అలాంటి ఎగతాళి పాటల్ని కొన్ని చూద్దాం .
నలుగురైదుగురు కలిసి ఉన్నప్పుడు ఏమరిపాటుగా ఉన్నవారి తలమీద వారికి తెలియకుండా చిన్న కాగితం ముక్కో, ఏదైనా చెత్తో పెట్టి ఎవరైనా చూస్తుంటే చెప్పకండని హెచ్చరిస్తూ చేతులు తడుతూ ఇలా పాడతారు.
' ఓ అబ్బాయి నెత్తి మింద గోరింక
చెప్పకు చెప్పకు చెడి పోతావు
చెబితే నీ ముక్కు తెగ్గోస్తా
దూలం మీంచి దూకిస్తా
పందిరి మీంచీ పాకిస్తా
కంచెడు అన్నం తినిపిస్తా
కడివెడు నీళ్లు తాగిస్తా ' ( బాల భాష )
' తల మింద చెత్తుంది చెప్పొద్దు చిన పాపా '
అని కూడా హెచ్చరిస్తూ పాడతారు.
ఇలా పాడడం మొదలు పెట్టగానే ఎవరికి వాళ్లు తమ తలల మీద ఏమో ఉందని తడిమి చూసుకుంటారు. చెత్త ఎవరి తల మీదుందో వాళ్ల చుట్టూ చేరి మరీ మరీ ఏడిపించి అలసట కలిగే దాకా నవ్వు కుంటారు
ఏడుస్తున్న తమ్మున్ని నవ్వించడానికి అక్కో అన్నో పాడే పాట.
' తమ్ముడు తమ్ముడు తాయిత్తు
తమ్ముడి పెళ్లాం మురికిత్తు
మురికిత్తు తీస్క పొయ్ మూల్లో పెడితే
నక్కెత్తుకు పాయెరా నారాయణా ' The Indian Antiquary 1906 . page No: 152 . )
పిల్లలు ఎవరైనా ఎమైనా అంటే మా అమ్మకు చెప్తా అంటుంటారు . అలాంటి వాళ్లను మరింత ఉడికిస్తూ
' చెప్పుకో చెప్పుకో - చెవులెక్క దీసుకో
మామిడాకిస్తాను - మందు నూరి కట్టుకో '
అని ఏడిపించి చుట్టూ ఉన్న వాళ్లను నవ్విస్తారు .
పిల్లలు ఆడుకొంటుంటే ఆ ఆటల తాకిడికి పాత బట్టలైతే చిరిగి పోతాయి. దాన్ని కూడా వదలరు పిల్లలు
' సీమ మిరప కాయ చిర్రో చిర్రో
పాత గుడ్డ చిరిగితే పుర్రో పుర్రో
దాని మొగుడు దాన్ని కొడితె మొర్రో మొర్రో '
( పాత పాటలు . పుట: 24 ) అని పక పకా నవ్వుతారు .
గొప్పలు చెప్పు కొంటూ డంబాలు పలికే వాళ్లను
' చిమడకే చిమడకే ఓ చింతకాయ
నువ్వెంత చిమిడినా నీ పులుపు పోదు
ఉడకకే ఉడకకే ఓ ఉల్లి పాయ
నువ్వెంత ఉడికినా నీ కంపు పోదు ' అని ఏడిపిస్తారు.
ఆటలకు పిలిస్తే రాకుంటే
' కుచ్చుంటె లెయ్య లేడు
కుమ్మరి చట్టి మొయ్యలేడు '
అని పాడి ఉక్రోషంతో వాళ్లు కొట్టడానికొస్తే దూరంగా పరిగెత్తి
'నన్ను కొట్నొస్తాడే నాకు నవ్వొస్తాదే ' అని ఉడికిస్తారు.
ఇష్టం లేని పిల్లల పట్ల అయిష్టాన్ని వ్యక్తం చేస్తూ
' బుర్రు పిట్ట బుర్రు పుట్ట తుర్రు మన్నది
పడమటింటి కాపురము చెయ్య నన్నది
అత్త తెచ్చిన కొత్త కోక కట్టనన్నది
మామ తెచ్చిన మల్లి పూలు ముడువ నన్నది
మొగుని చేత మొట్టిక్కాయ్ తింటానన్నది ' అని
పాడతారు.
ఈ పాటలన్నీ స్వరూపంలో చాలా చిన్నవిగా ఉంటాయి. వ్యంగ్య పూరితంగా కనిపిస్తాయి. ఏడ్చే వాళ్లను మరింత ఏడిపించి నవ్వడం, నవ్వించడం వీటి ప్రధానోద్ధేశం.
మహసముద్రం దేవకి
Comments
Post a Comment