పరిశోధనలో పదనిసలు - 17

 పరిశోధనలో పదనిసలు -17


పిల్లలే పాడుకొనే పాటలు

పుట్టినప్పటి నుండి పెద్ద వాళ్లు పాడే పాటలను విన్న పిల్లలకు ఆ పాటల గాన స్వరూపం పట్టు బడుతుంది . పెద్దల్ని అనుకరిస్తూ కాళిదాసు కవిత్వానికి సొంత పైత్యం కొంత చేర్చి కొత్త పాటలను కల్పించు కుంటారు. అయితే భావ సౌష్టవాన్ని కుదర్చ గల కల్పనా శక్తి , భాషా పాటవం వాళ్ల కుండదు. అందుకే పిల్లలు కల్పించుకొని పాడుకొనే పాటలు చాలా వరకు అర్థ రహితాలుగా ఉంటాయి. ఇంగ్లీష్ లో పిల్లల పాటల్ని nursery  rhymes అంటే అర్థరహితాలైన పాటల్ని nonsense rhymes అంటారు. తెలుగులో తొక్కు పలుకులంటారు. ఈ పాటల కర్తృత్వం సామూహికం. ఆట విడుపు పాటలు, పండగ పాటలు, ఎగతాళి పాటలు, పొడుపు గేయాలు వీటిలో ప్రధానంగా కనిపిస్తాయి.

ఆట విడుపు పాటలు

ఆట విడుపు పాటలన్నీ చాలా వరకు తొక్కు పలుకుల్లాగా అర్థ రహితాలే. అయినా ఆయా ఆటల్లోని హావ భావాది చేష్టలకు అనుగుణంగా వాటిలో తాళ లయలు ఇమిడి ఉండడాన్ని చూడ వచ్చు. ఈ ఆటల వల్ల పిల్లలకు కలిగే  శరీర వ్యాయామం, ఉత్సాహం, సంఘీ భావం పెద్ద వాళ్లు ఆడే ఆటల వల్ల కలిగే వ్యాయామాదుల విషయంలో ఏ మాత్రం తీసి పోవు.

పిల్లల ఆట పాటలు అబ్బాయిలు  ఆడుకొనేవి, అమ్మాయిలు ఆడుకొనేవి, ఉభయులూ కలిసి ఆడుకొనేవి ఉన్నాయి. పెద్ద వాళ్ల ఆటల్లాగా కాకుండా పిల్లలు  ఆడే ప్రతి ఆటకు పాటలు తోడై ఉండడాన్ని గమనించ వచ్చు .

అబ్బాయిల ఆటలు :

చెడుగుడు, గోడీ బిళ్ల, గోళీలు బొంగరాలు మొదలైన ఆటల్ని మగ పిల్లలు ఆడుకుంటారు. ఈ ఆటలకు సంబంధించిన పాటలు పలు ప్రాంతాల్లో పలు రకాలుగా ప్రచారంలో ఉన్నాయి.

' గుడ్డెద్దు గంటా- గూని వాడికి చింతా
నా మొగుడు అందగాడు- నా కేమి చింతా'

' చింతాకు పులగూరా - తిందువు రారా బామార్దీ'

'ఆకు అల్ల సూది సుద్ద - ఆకు పాకు కర్వేపాకు '

చెడు గుడు ఆటలో గుక్క తిప్పు కోకుండా కూసే కూతలివి . ఇలా ప్రతి ఆటకూ వందలాదిగా పాటలు ఉన్నాయి.

బొంగరాలాటలో ఎదుటి వాళ్ల బొంగరాలను గాట్లు పడేట్లు కొడుతూ

' చిలుకు చిలాట్- ములుకు ములాట్ - పావు సేర్- అర్ధ సేర్ - గువ్వ దెబ్బ - చూసుకో '

అని పాడతారు. పాట అర్థవంతంగా లేకున్నా ఆట ఆడే వాళ్ల మధ్య ఉన్న పోటీ లోని తీవ్రత ఈ పాటలోని విరుపుల్లో స్ఫురిస్తుంది.

అమ్మాయిల ఆటలు :

జానపద బాల సాహిత్యంలో అబ్బాయిల ఆటల కంటే ఆడ పిల్లల ఆటలే ఎక్కువగా ఉన్నాయి. కారణం ఆ రోజుల్లో వాళ్లకు చదువు సాములుండేవి కావు. బడికి వెళ్లే పని లేదు. , చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఆడించడం తప్ప పెద్దగాపని పాటలు కూడా ఉండవు. ఉన్నా కొంత సేపు మాత్రమే. చికు చికు పుల్ల, కోడి గుడ్డాట, అల్లీ బిల్లీ, గచ్చ కాయలు , గుడు గుడు గుంచం, చెమ్మ చెక్క, ఒప్పుల కుప్ప, నాలుగు స్తంభాలాట, తొక్కుడు బిళ్ల, , బుడబుడ సంచి, ఒత్తొత్తి వారొత్తి , గుజ గుజ రేకులు, బొమ్మలాట ఇలా వందలాది ఆటల్ని ఆడ పిల్లలు ఆడుకుంటారు. వీటన్నిటికీ ఎన్నో పాట లున్నాయి. అవి ఆటను బట్టి ఉంటాయి . ఉదాహణకు : ఒత్తొత్తి- వారొత్తి ఆట చూద్దాం .ఈ ఆటకు ఎంత మంది అయినా ఉండొచ్చు. ఇద్దరు ఆట పెద్దలుగా వ్యవహరిస్తారు. మిగిలిన వాళ్లందరు గుండ్రంగా మధ్యకు అందరి పాదాలు కలిసేట్లు కాళ్లు చాపుకొని కూర్చుంటారు. చేతులు వెనక పెట్టు కుంటారు. ఆట పెద్దలలో ఒకమ్మాయి మధ్యలో పాదాలన్ని కలిసిన చోట నిల బడుతుంది. ఆ అమ్మాయికి ఆటలో తాటి చెట్టని పేరు. రెండవ అమ్మాయి ఒక ఒత్తి ( గుడ్డ పేలిక ) తీసుకొని చేతిలో కనిపించ కుండా పెట్టు కొని వంగి అమ్మాయిల చుట్టూ తిరుగుతూ అందరి చేతుల్లో ఒత్తి పెడుతున్నట్లు నటిస్తూ చివరికి ఎవరికీ తెలియ కుండా ఒకమ్మాయి చేతిలో ఒత్తి పెట్టి మళ్లీ ఒకటి రెండు చుట్లు తిరిగి ' బలభద్ర కోట్ ' అని ఒకరి వీపు మీద కొడ్తుంది. ఒత్తి పెడుతూ పాడే పాట.

' ఒత్తొత్తి వారొత్తి - చూసినోళ్ల కళ్లలో సూరొత్తి
   పత్తొత్తి పాలొత్తి - పరుల కళ్లలో నీరొత్తి '

చదువు సాములు లేని అమ్మాయిలకు కూడా నిత్య జీవితానికి కొన్ని అవసర మవుతాయి. అంకెలు, అక్షరాలు, వారాలు, తిథులు, నక్షత్రాలు ఆట పాటల ద్వారానే  నేర్చుకొని ఆ ముచ్చట తీర్చుకుంటారు వాళ్లు. ఉదాహరణకు : గచ్చ కాయలాట ఆడుతూ ఇలా పాడుకుంటారు .

' ఒక్కటి ఓ చెలియా- రెండూ రోకళ్లు
మూడూ ముచ్చిలుక - నాలుగు నందన్నా
ఐదూ బేడల్లు - ఆరూ జవ్వాజి
ఏడూ యెల మంద- ఎనిమిది మన మంద
తొమ్మిది తోకుచ్చు- పది పటనేడు '
అర్థ రహితమైన ఈ పాట ద్వారా పది దాకా అంకెలు వాళ్ల నోటి కొచ్చేస్తాయి. .
ఈ ఆటలోనే మరో పాట :

'కొండమింద వెండి గిన్నె
కొక్కి రాయి కాలు విరిగె
దాని కేమి మందు?
వేపాకు చేదు , వెల్లుల్లి గడ్డ
నూనెమ్మ బొట్టు- నూటొక్క దార
పూయ వోయి నూరి - పూట కొక్క తూరి '

ఈ పాటలో కాలు విరిగినప్పుడు చేసే ఆయుర్వేద వైద్యం ఇమిడి ఉందని సురవరం ప్రతాప రెడ్డి , బి. రామ రాజు గార్లు పేర్కొన్నారు.

పిల్లల ఆటలకు ఇంత మందే ఉండాలన్న నియమం లేదు. ఓటమి గెలుపుల పట్ల పట్టింపులు లేవు. శారీరక శ్రమతో కూడుకున్న ఈ ఆటలే గాక బొమ్మలాటలు, బొమ్మల పెళ్లిళ్లు మొదలైన ఆటలెన్నో ఆడ పిల్లలు ఆడుకుంటారు.

బాల బాలికలు కలిసి ఆడుకొనేవి :

కాళ్లాగజ్జి, తత్తింబిత్తిం , దాగుడు మూతలు , ఉయ్యాలాట మొదలైనవి ఆడ పిల్లలు, మగ పిల్లలు కలిసి ఆడుకుంటారు.

పండగ పాటలు:

పండగ రోజుల్లోను, ఇతర ఉత్సవ సమయాల్లోను పిల్లలు అందరూ కలిసి ఆనందంగా ఉత్సాహంగా పాటలు పాడు కుంటారు. గొబ్బి, బొడ్డెమ్మ , బతుకమ్మ, అట్ల తద్ది మొదలైన పండగల్లో ఆడ పిల్లలు గౌరమ్మ చూట్టూ తిరుగుతూ, అట్ల తద్ది నాడు ఉయ్యాల లూగుతూ పాడు కొనే పాటలు వందలాదిగా ఉన్నాయి. వాన దేవుని పూజలో మగ పిల్లలతో కలిసి ఆడపిల్లలు కూడా పాటలు పాడుతూ ఇల్లిల్లూ తిరిగి కప్ప దేవర పెళ్లి జరుపుతారు.

మహాసముద్రం దేవకి 

Comments