పరిశోధనలో పదనిసలు - 16

 పరిశోధనలో  పదనిసలు  - 16


నేర్పించే పాటలు

రెండేండ్లు నిండేసరికి పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లడ గలుగుతారు. తల్లి  దండ్రులు అత్త,  తాత అంటూ వాళ్ల చేత పలికించి మురిసి పోతారు క్రమంగా చిన్న చిన్న పదాలతో కూడిన గేయాలను నేర్పించే ప్రయత్నం చేస్తారు. ఉదా:

    ఏనుగు ఏనుగు నల్లన
    ఏనుగు కొమ్ములు తెల్లన
    ఏనుగు మీద రాముడు
    ఎంతో చక్కని దేవుడు

తెలుగు వాళ్లు మొదట మొక్కే దేవుడు వినాయకుడు. అందుకే

    ' ఓ బొజ్జ గణపయ్య-  నీ బంటు నేనయ్య
     పేరిన నెయ్యయ్య - పెసర పప్పయ్య
     కరిగిన నెయ్యయ్య కంది పప్పయ్య
    ఎలక వాహనమదే ఎక్క రావయ్య
    ఉండ్రాళ్ల మీదికి దండు బోవయ్య

    చిటికెన వేలు చెల్లాయి
    ఉంగరం వేలు బంగారం
    నడిమీ వేలు నాయన్న
    చూపుడు వేలు నీ కేసి
    బొటన వేలు బొట్టెట్టి
    అరిచేయి అరిచేయి అంటిస్తే
    దేమునికి దండం పెట్టొచ్చు 
    అందరికి నమస్తే చెప్పొచ్చు

మాటలు రాగానే నిత్యం ఎన్నో నేర్పించాలనుకొనే తల్లి దండ్రులు విద్యార్జనలో భాగమయ్యే ఎన్నో విషయాలను పాటల ద్వారా బోధిస్తారు . అలాంటి వాటిలో దశావతారాల గురించి చెప్పే పాట :

' మా పాప మామల్లు మత్స్యావతారం
కూర్చున్న తాతల్లు కూర్మావతారం
వరసైన బావల్లు వరహావతారం '
వాసిగల బొట్టెల్లు వామనావతారం
నట్టింట నా యత్త నరసింహావతారం
రక్షించు మామయ్య రామావతారం
పరమ గురుదేవ పరశురామావతారం
బుద్దితో మాచిట్టి బుద్దావతారం
కలివిడితొ నాయన్న కలికావతారం
చిట్టి నా కన్నోడ శ్రీ క్రిష్ణావతారం
వర్ధిల్లు పసిపాప వర్ధిల్లవమ్మా !

ఇలా పాటల ద్వారా నేర్చుకున్న విషయాలు కల కాలం గుర్తుండి పోతాయి

జానపద సమాజంలో కూనలమ్మ పదాల పేరుతో పిల్లలకు మనపూర్వులు ప్రాపంచిక జ్ఞానాన్ని అందించారు . ఆ పాటల్ని అనుసరించి  ఆరుద్ర రాసిన కూనలమ్మ పదాలు ప్రసిద్ధి పొందాయి. అసలు కూనలమ్మ పదాలనగానే ఆరుద్రే గుర్తొస్తాడు. కానీ అంతకు ముందే అమ్మలు నేర్పిన కూనలమ్మ పదాలు ఉదాహరణకు :

    జపతపంబుల కన్న
    చదువు సాముల కన్న
   ఉపకారమే మిన్న
    ఓ కూనలమ్మా


భీష్ముడనుభవశాలి
భీముడు బలశాలి
కర్ణుడే గుణశాలి
ఓ కూనలమ్మా

ఇలాంటి పాటల్ని వయసుననుసరించి నేర్పి పిల్లల వ్యక్తిత్వానికి  పునాదులు వేసే ప్రయత్నం చేస్తుంది తల్లి.

మహసముద్రం  దేవకి

Comments