పరిశోధనలో పదనిసలు - 15
పెద్ద వాళ్లు ముఖ్యంగా తల్లులు తమ సమయాన్ని చాలా కాలం పిల్లల్ని చూసుకోవడం కోసం వెచ్చిస్తారు. నిరంతరం పిల్లల్ని ఆడిస్తూ వాళ్లను నవ్వుల పువ్వులతో ఆనంద డోలికల్లో ముంచెత్తుతారు. పాటలు పాడుతూ పిల్లల్ని ఆడించడం , వాళ్ల పనులు చేసేటప్పుడు కూడా పాటలు పాడడం చేస్తుంటారు.
ఉదయం లేవంగానే పసి బిడ్డకు ఆముదాన్ని రెండు చుక్కల పాలతో రంగరించి ఉగ్గు పెడతారు. అది వెగటుగా ఉంటుంది. పిల్లలు ఉగ్గు తాగడానికి ఇష్ట పడరు. తల్లి బిడ్డ దృష్టిని మరల్చి ఉగ్గు తాపడానికి ప్రయత్నిస్తుంది.
ఊ ఊ ఉంగన్న
ఉగ్గూ పాలు ఇందన్న
గుంటెడు ఉగ్గు కమ్మన్న
ఉమ్మక కక్కక మింగన్న
అని ఉగ్గు పెడుతుంది . బిడ్డ క్షేమాన్ని మనసారా కాంక్షించే తల్లి అడుగడున ప్రతిపనికి ఆశీర్వాదాన్ని జోడిస్తుంది. ఉగ్గు పెట్టిన తర్వాత -
ఊ ఊ ఉంగన్న
లుంగలు పెట్టక మింగన్న
ఓర్వని సవతుల దిష్టన్న
ఒప్పుగ మసలర బసవన్న
అని ఉగ్గుతాపిన పాలాడ తోనే దిష్టి తీస్తుంది . జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని పాడుతుంది.
స్నానం చేయించే ముందు తలకు నూనె రాస్తూ
మాడు పట్టుకు మంచి నూనే
కను చెవి ముక్కుల కమ్మని నూనే
డెబ్బ సిబ్బముల దబ్బున నూనే
రంధ్రం పట్టుల రాసిన నూనే
అంటూ ఒళ్లంతా నూనె తో మర్దన చేస్తుంది . స్నానం పూర్తయిన తర్వాత చెంబులో నీళ్లతో దిష్టి తీసి తన పాదాలపై ఆ నీటిని కుమ్మరించుకొంటుంది. ధూపం వేస్తూ
సందె పొద్దున సాంబ్రాణి
కమ్మని వాసన కర్పూరం
వట్టి వేర్ల పొగ పాపనికి
కస్తూరికా గైరకంబు ( ఉద్రేకము)
అని పాడుతుంది . అన్నం పెడుతూ ' చంద మామ రావే ' అని పాడుతూ బిడ్డ పొట్ట నింపుతుంది
కుక్కే వచ్చి తింటుందో - నక్కే వచ్చి తింటుందో
పిల్లే వచ్చి తింటుందో - బల్లే వచ్చి తింటుందో
అని ఏమరుపాటుగా ఉన్నప్పుడు గోరు ముద్దను నోటి కందిస్తుంది. చీకటి పడే సమయంలో కర్పూరంతోనో , ఉప్పుతోనో నూనే వత్తి తోనో , పాత బట్ట పీలికతోనో , పొరక పుల్లలతోనో దిష్టి తీసి కాల్చేస్తుంది . ఒక్కోసారి వీధిలో మట్టిని తొక్కి అరికాలి కింది మట్టిని ఎడమ చేత్తో తీసుకొని దిష్టి తీసి పడేస్తుంది . అప్పుడు కూడా
దిష్టి దిష్టి దివ్య దిష్టి
ముండ దిష్టి రండ దిష్టి
అమ్మ దిష్టి నాన్న దిష్టి
అవ్వ దిష్టి తాత దిష్టి
అక్కదిష్టి అన్న దిష్టి
ఇంట్లో వాళ్ల దిష్టి
ఈదిలో వాళ్ల దిష్టి
అని దిష్టి తీస్తూ ' రక్ష రక్ష దివ్య రక్ష దీప రక్ష ' అని కోరుకుంటుంది.
బిడ్డకు శారీరకంగా ఆయురారోగ్యాలు సిద్ధించాలని ఆడిస్తూనే ప్రయత్నం చేస్తుంది. బిడ్డను ఒడిలో కూర్చో బెట్టుకొని ముందు వెనుకలకు ఊపుతూ
గుమ్మాడమ్మా గుమ్మాడి
తీగ పాకిందమ్మ గుమ్మాడి
...........,........................
పండు పండిందమ్మ గుమ్మాడి
ఆ పండు ఎవరమ్మ గుమ్మాడి
నా చిట్టి తల్లమ్మ ( తండ్రమ్మ ) గుమ్మాడి
అని
తారంగం- తారంగం
తండవ కృష్ణా తారంగం
అని పాడుతూ , ఊపుతూ నవ్విస్తుంది.
బిడ్డ చేతిని తన చేతితో పట్టుకొని చాపి ఊపుతూ
చెయి ఊచమ్మ చెయి ఊచూ
సంతకు పోదాం చెయి ఊచు
శనగలు తెద్దాం చెయి ఊచు
చల్లగ తిందాం చెయి ఊచు
పప్పులు తెద్దాం చెయి ఊచు
పట పట తిందాం చెయి ఊచు
అని రకరకాలుగా పాటలు పాడుతూ ఆడిస్తుంది
వెల్లికిలా పడుకొని రెండు కాళ్లు ముడుచుకొని
ఆ కాళ్లమీద బిడ్డను పడుకో బెట్టుకొని కిందికి పైకి ఊపుతూ
జాంజి జప్పాంజి
అల్లరి కుట్టికి పెళ్లంట
..............................
అని పాడుతుంది . పిల్లలో భయాన్ని పోగొట్టడానికి
కొండకు పొయ్యి - కుందేలు తెచ్చి
నట్టింట్లో పెట్టి - నాలుక్కోసి
నీకో భాగం - నాకో భాగం
అమ్మకో భాగం నాన్నకో భాగం
............,.......,..............
అని పాడుతూ ఉన్నట్లుండి అల్లల్లల్లలా .. అంటూ కాళ్లు పైకెత్తుతుంది. . బిడ్డ ముందు భయ పడినా తర్వాత పదే పదే ఆ ఆట ఆడించమని పురికొల్పుతుంది .
చేతిని తీసుకొని ' ఇది అన్నం ఇది పప్పు ' అంటూ ఒక్కో వేలును చూపిస్తూ అరి చేతిలో ' ఇల్లలికి. ముగ్గు పెట్టి, ఆకేసి , పీటేసి , అన్నం పెట్టి నెయ్యేసి .... అంటూ
' సంతకు పొయ్యే దోవేది
శనగలు తెచ్చే దోవేది '
అని రెండు వేళ్లను చేతి మీద నడిపిస్తూ చంకలవరకు తీసుకెళ్లి కిత కితలు పెట్టి కిల కిలా నవ్విస్తుంది. అన్నం తినిపించాక
చివరి ముద్దతో దిష్టి తీసి
' రక్ష రక్ష దివ్య రక్ష దీప రక్ష
చిట్టి నా కన్నోడికి శ్రీరామ రక్ష'
అని దిగ దీస్తుంది తన బిడ్డ క్షేమంగా ఉండాలని అడుగడుగునా , ఆశిస్తూ కాపాడు తండ్రీ అని భగవంతుని మనసారా కోరుకొంటుంది .
మహాసముద్రం దేవకి
Comments
Post a Comment