పరిశోధనలో పదనిసలు - 14

 పరిశోధనలో పదనిసలు - 14


మొదట జానపద  బాల గేయాలు  రెండు రకాలుగా కనిపిస్తాయన్నాను కదా ! పిల్లల కోసం పెద్దలు పాడే పాటలు మూడు రకాలుగా కనిపిస్తాయని కూడా చెప్పాను   . వాటిలో మొదటిది లాలి లేదా జోల పాటల్ని గమనిస్తాం .

1905 లో ' The indian Antiquary ' అనే
పత్రికలో A lallaby, A nursery rhyme , Anursery game అని కొన్ని బాలగేయాలు ప్రచురితం . అందులోది ఒక లాలి పాట.

    ముదు మద్ది కాయ- ముత్యాల కుళ్లా
    ముద్దాడ లేపుదురు - నీ మేన మామలూ
    పాల మద్ది కాయ - పగడాల కుళ్లా
    పాల్దాగ లేపుదురు నీ మేన మామలూ

ఈ పాటను గమనించారా. తల్లి బిడ్డతో మేనమామల ప్రసక్తి తెస్తోంది. ఎందుకు? ఆమెకు మొదటి కానుపు . మామూలుగా మొదటి కానుపు పుట్టింట్లో నే జరుగుతుంది. అమ్మ, నాన్న, అన్నదమ్ములు , చెల్లెళ్లు ఉంటారు ఆ యింట్లో .

ఇంట్లో పసి బిడ్డ ఉంటే అందరూ ముద్దు మురిపాలలో ముంచెత్తుతూ ఆడుకొంటుంటారు. పాప ఎక్కువసేపు నిద్రపోతున్నా వీళ్లకు తోచదు. అందుకే లేపేస్తూ ఉంటారు . దాన్నే తల్లి బిడ్డతో చెప్తూంది. అంటే పాడుతోంది .

లాలిపాటల్లో లాలీ, జోజో , ఆయీ , హాయీ, ఒళళ .... అనే ఎత్తుగడ లుంటాయి. ఎటు వంటి ఎత్తుగడలూ లేని పాటలూఉన్నాయి. ఉదాహరణకు:

    జో అచ్యుతానంద!  జోజో ముకుందా! 
    రార పరమానంద రామ గోవిందా ! జో జో !
    నందునింటను చేరి నయము మీరంగా
    చంద్ర వదనలు నీకు సేవ చేయంగా
    అందముగ జాంబవతి  చందనము పూయా
    పొందుగా కాళింది పువ్వు లందియ్యా  జో జో !

బాల కృష్ణుని పరంగా , రాముని పరంగాను ఉన్న ఈ పాటలో కృష్ణుని అష్ట భార్యల ప్రసక్తి కనిపిస్తుంది. బాలగేయాల్లో పురాణ పురుషుల  ప్రసక్తి తేవడం తమ బిడ్డలు కూడా అంతటి వాళ్లుకావాలనే తల్లుల కోరికకు నిదర్శనం.

    హాయి హాయీ హాయి ఆపదలు గాయీ
    చిన్ని వాళ్లను గాయి శ్రీ వెంకటేశా !
    నిద్ర పోరా నాన్న నిద్ర పో నాన్నా
    నిద్ర కూ నూరేండ్లు నీకు నూరేండ్లు
    నిద్రపో బలబద్ర రాము తమ్మూడా !
    నిను గన్న తండ్రికీ నిండు నూరేండ్లు .

బిడ్డను అడుగడుగున ఆశీర్వదించే తల్లి భర్త  క్షేమాన్ని కూడా కాంక్షించడం పై పాటలో కనిపిస్తుంది.

ఎటువంటి ఎత్తుగడలూ లేని లాలి పాటలు కూడా ఉన్నాయి చూడండి .

    విశాఖ పట్నాన విసిరింది గాలీ
    వింజరపు రేవున తేలింది వాడ ( ఓడ )
    వర్తకుడి పేరేమి? వాడ పేరేమి ?
    వాడలో పోసిన దినుసు పేరేమి?
    వర్తకుడు అబ్బాయి వాడ మా వాడ
    వాడలె ఉండేటి దినుసు ముత్యాలు

పొత్తిళ్లలో బిడ్డను పెట్టుకొని నిద్రపుచ్చుతూ తన బిడ్డ గొప్ప ముత్యాల వర్తకు డయినట్లు కలలు గంటోంది తల్లి .

కాకి పిల్ల కాకికి ముద్దన్నట్లు ప్రతి తల్లికీ తన బిడ్డ ముద్దు బిడ్డే . సిరి సంపదల్లో , అంద చందాల్లో తన బిడ్డను అందరినీ మించిన బిడ్డగా భావించడం తల్లుల వాత్సల్య జగత్తు లోని ఒక సత్యం . అలాంటి పాట :

    వీది నెందరు ఉన్న విసరదే గాలి
    రచ్చ నెందరు ఉన్న రాదమ్మ వాన
    నా చిన్ని  అబ్బాయి వీది నిలుచుంటే
    మొగిలి పూలా గాలి ముత్యాల వాన

స్త్రీలు  పాడే ఈ పాటల్లో వాళ్ల మనస్తత్వం స్పష్టంగా ప్రస్ఫుటమవుతుంది. పిల్లల పట్ల వాళ్ల కోరికలు పుట్టింటిపై వాళ్ల కున్న మమకారాలు, అయిన వాళ్ల పట్ల వాళ్ల అభిమానాలు అన్ని ఈ పాటల్లో కనిపిస్తాయి. ఉదహరణకు:

    గోరంత దీపమ్ము కొండంత వెలుగు
     గోపాల కృష్ణమ్మ గోవులకు వెలుగు
    ................................................
     మాడంత దీపమ్ము మేడలకు వెలుగు
     మా చిన్ని అమ్మాయి మా కళ్ల వెలుగు
అని మురిసిపోతుంది తల్లి. అప్పుడే బిడ్డ పెళ్లి గురించి కలలు గంటుంది కూడా .

        అందితే అన్నతో వియ్యమందాలి
        ఆడితే వొదినతో జగడ మాడాలి
అని కోరుకుంటుంది.

వరసైన వదినతో మేల మాడడం జానపద సమాజంలో సర్వ సాధారణం .అలాంటి ఈ పాట చూడండి .

    చిచ్చీ ఓయీ ఓయల్ల ఓయీ
    ఓయల్ల లాడేరె ఓల లాడేరె
    నాయనను పాడేరె బంగారు తండ్రి
     ఓయల్ల పండెరుపు వంగ పండెరుపు
    తానెరుపు నాయన్న తన వారిలోను
    ఓయల్ల ఓయల్ల వంకాయ పుల్ల
    నల్లావుల చల్ల నీ యత్త కనుమెల్ల
    చీలమ్మ చెలరేగి చింత కొమ్మెగురు
    నాయన్న చెలరేగి మామ భుజమెగురు
    ............,,...............,,,,..................
    బర్రె వచ్చీ బరుక నీ యత్త మిడుక
ఇక్కడ నీయత్త అని బిడ్డతో అంటున్నది ఎవరిననుకున్నారు? తన అన్న భార్య వదిననే . అడుగడుగున స్త్రీ పుట్టింటి వాళ్లనే స్మరిస్తుంది.

బిడ్డ ఏడిస్తే నాయనమ్మ ఉయ్యాలలూపుతూ పాడే పాట.

    ఊడుగూ చెట్టుకూ ఉయ్యాలగట్టి
    ఊగుమని మీయమ్మ ఊర్లోకి పోయే
    పంది కొక్కా రావె పాలిచ్చి పోవే
    ఉడుతమ్మ నువు రావె ఊపేసి పోవే
    ఎలుకమ్మ నువు రావె ఎత్తుకొని పోవె

సామదాన బేధ దండోపాయాలంటారు కదా! బిడ్డ ఎంత ఓదార్చినా , లాలించినా, జోల పాడినా ఒక్కోసారి ఏడుపు నాపక పోగా గుక్క పట్టి ఏడుస్తుంటారు. తల్లికి కూడా ఒక్కోసారి విసుగొస్తుంది. అప్పుడు బెదిరిస్తూ

    అదిగో బూచివాడు మన
    అటక మిందున్నాడు
    ఏడిస్తె వాడు నిన్ను ఎత్తుకు పోతాడు
    మిట్టి గుడ్ల వాడు
    ఫొనకంత  పొట్టి వాడు

అని భయ పెడుతుంది.

    బూచి వాడా రార బుట్టల్లుకోని
    బుట్టలో నాయినను పట్టుకొని పోరా

అని బెదిరించి ఏడుపునాపించే ప్రయత్నం చేస్తుంది . ఈ చిరాకు, విసుగూ , కోపం తాత్కాలికమే . మరు నిముషంలోనే బిడ్డకు అపారమైన ప్రేమను పంచి నవ్వుల పువ్వులతోను, ఆనంద డోలికల్లోను ముంచెత్తుతుంది.

మహాసముద్రం దేవకి
    4 - 11 - 2022

Comments