పరిశోధనలో పదనిసలు - 13
జానపద బాలగేయాలు ఎలా ఉన్నాయో మొత్తం సేకరించిన గేయాల్ని కుప్ప పోసుకొని పరిశీలించాను . వాటిలో పిల్లల కోసం పెద్ద వాళ్లు పాడినవి , పిల్లలే స్వయంగా పాడుకున్నవి ఉన్నాయి . పెద్ద వాళ్లు పాడేవి బాల గేయాల కిందికి వస్తాయా అన్నది పెద్ద చర్చనీయాంశ మైనది . ఎందరో మేధావులను సంప్రదించాను . గైడ్ను అడిగాను . పనిలో పనిగా మా చిన్నాన్న ముందర కుడా ఈ సమస్యను పెట్టాను.
కొందరు పెద్దవాళ్లు పాడే పాటలు పిల్లల గేయాలు ఎలా అవుతాయి ? అని ఎదురు ప్రశ్న వేశారు. చాలా మంది ఆ గేయాలను పాడేది పెద్ద వాళ్లే అయినా పిల్లల కోసమే కాబట్టి బాల గేయాల కిందే లెఖ్ఖ అన్నారు. అయినా మనసులో అలజడి . పరీక్షకుల ఉద్దేశం ఎలా ఉంటుందో అని ఒక పక్క భయం . వాళ్లు తప్పు అనుకున్నా రంటే నిర్ధాక్షిణ్యంగా థీసిస్ను తిప్పి లొడతారు. మళ్లీ రాయమంటారు. మళ్లీ వైవా పెట్టించాలంటే చాలా టైం పడుతుంది. అందుకే నా భయం.
పెద్దవాళ్లను అడగడమే కాదు. ఎవరైనా ఎక్కడయినా ఈ విషయం గురించి రాశారేమో! అని దొరికిన పుస్తకాన్ని దొరికినట్లే ఆవురావురని వెదకడం మొదలు పెట్టాను . ఆ అన్వేషణలో భాగంగా జానపద బాల గేయ సంకలనాలను , పరిశోధక గ్రంథాలను తెగ చదివాను . అది నాకు ఎంతో భరోసానిచ్చింది.
ఆచార్య బిరుదు రాజు రామరాజు గారి ' తెలుగు జానపద గేయ సాహిత్యం ' ఒక పెన్నిధిలా దొరికింది. విషయ సూచికను చూశాను . పిల్లల పాటలు అనే అధ్యాయం కనిపించింది . అందులో ఆయన పిల్లల పాటలు రెండు రకాలుగా ఉంటాయని చెప్పారు.
1. పిల్లల కోసం పెద్దలు పాడే పాటలు 2. పిల్లలే స్వయంగా పాడుకొనే పాటలు అని రెండు రకాలుగా విభజించారు. ఆ రాత్రి బాగా నిద్ర పట్టింది. వ్యాసంలో ఒక విషయాన్ని అల్లాటప్పాగా చెప్పేయ కూడదు కదా! ఒక విషయాన్ని సిద్ధాంతరీకరించడానికి పరిశోధకుడు ప్రసవ వేదన పడతాడనిపించింది . దానికి ఉప బలకంగా గేయ సంకలనాల్లో పెద్ద వాళ్లు పాడే పాటల్ని పిల్లల పాటలు అనే వర్గం కిందే ఇచ్చారు.
ఆ సమస్య పరిష్కారం కాగానే నా రాత వేగం పుంజుకుంది. జానపద బాలగేయాలను వింగడించడం మొదలయింది. పెద్ద వాళ్లు పిల్లల కోసం పాడేవి ప్రధానంగా ఏమున్నాయి చెప్పండి . నేను ఇలా విభజించాను .
లాలి లేదా జోల పాటలు
ఆడించే పాటలు
నేర్పించే పాటలు
లాలి లేదా జోల పాటలు లెక్కకు మించినన్ని ఉన్నాయి. ఏడ్చే పిల్లల్ని లాలిస్తూ, ఓదారుస్తూ తల్లులు లేదా పెద్ద వాళ్లెవరయినా పాడే పాటలు లాలి పాటలు . చిన్న పిల్లల్ని నిద్ర పుచ్చడానికి జోకొడుతూ పాడే పాటలు జోల పాటలు . వీటిలో లాలీ, జోజో అనే ఎత్తుగడలు కనిపిస్తాయి. ఎలాంటి ఎత్తుగడలూ లేని పాటలు కూడా ఉన్నాయి.
వచ్చే వారం వాటిని ఉదాహరణలతో సహా చూద్దాం .
మహాసముద్ర దేవకి
1 - 11 - 2022
Comments
Post a Comment