పరిశోధనలో పదనిసలు - 12

 పరిశోధనలో పదనిసలు - 12


మొదటి  రెండు  అధ్యాయాల  గురించి చెప్పాను కదా! నా పరిశోధనలో కీలకమైనవి తర్వాతి రెండు. బాలగేయాల గురించిన విశ్లేషణ ఇక్కడే ఉంది.

ఆధునిక యుగం వరకు పిల్లలకు రచనలంటూ లేవని చెప్పాను. కానీ సాహిత్యం ఉంది. జానపద  సాహిత్య రూపంలో . ఎందుకంటే భావాల్ని అణుచుకోవడం ఎవరికయినా తరమవుతుందా? బిడ్డ ఏడుస్తుంటే తల్లులు కానీ , పెద్దవాళ్లెవరైనా కాని పట్టనట్లు ఉండిపోతే  వాళ్లు మనుషులెలా అవుతారు చెప్పండి. బిడ్డను ఓదార్చడానికి ప్రయత్నం చెయ్యరూ? అలా మొదట బిడ్డ ఏడుపునాపే ప్రయత్నం నుంచి పాట పుట్టింది.

సమాజంలో అక్షరజ్ఞానం లేని గ్రామీణులు, సామాన్యులు అలవోకగా అప్పటికప్పుడు ఎప్పుడో ( ఏ కాలంలోనో )  సృషించుకుంటే అలిఖితంగా ఒక తరం నుంచి మరో తరానికి కేవలం వాగ్రూపంలో సంక్రమిస్తూ వచ్చిన గేయాలు, పాటలు , కథలు జానపద సాహిత్యం.

లిపి ఏర్పడి లిఖిత సాహిత్యం పుట్టేటప్పటికే  జానపద సాహిత్య రూపంలో ప్రతి భాషలోనూ సాహిత్యం కొల్లలుగా ఉంది. అందులో బాల సాహిత్యం కూడా ఒక భాగం . అలా వాగ్రూపంలో వ్యాప్తిలో ఉన్న సాహిత్యాన్ని కొంత మంది అభిమానులు సేకరించి పత్రికల లోను , పుస్తకాల రూపంలోను ప్రకటించి ఉన్నారు. జానపద  బాలసాహిత్యం ఒకరి నుంచి మరొకరికి ఒక ప్రాంతం నుచి మరో  ప్రాంతానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి విశ్వవ్యాప్తమయింది.

ఉదాహరణకు : అరేబియన్ నైట్స్ , సిందూబాద్ సాహసాలు , ఈసపు నీతికథలు. ఇంకా ఎన్నో మన దేశానికి చెందినవి కావు . వివిధ దేశాల నుంచి వచ్చినవి.

మొదట  వెలువడిన గృహలక్ష్మి, జన వినోదిని, భారతి మొదలయిన  పత్రికలలో  బాల సాహిత్యానికి ఒకటి, రెండు పేజీలు కేటాయించే వాళ్లు . కొంత మంది పుస్తకాలుగా ప్రచురించి ఉన్నారు. బాలభాష ( వేటూరి ప్రభాకర శాస్త్రి) ప్రజావాజ్మయం  ( చింతా దీక్షితులు  ) సెలయేరు ( నేదునూరి గంగాధరం ) సంప్రదాయక విజ్ఞానం - పాతపాటలు ( టేకుమళ్ల కామేశ్వర రావు ) ప్రజా సాహిత్యం ( ఇల్లిందల సరస్వతీ దేవి ) , తెలంగాణా పల్లె పదాలు ( బి. రామరాజు ) మొదలయిన పండిత వర్గానికి చెందిన వారు జానపద బాల గేయాలను సేకరించి ప్రకటించి ఆ
సాహిత్యానికి ఉన్న ప్రయోజనాన్ని చాటి చెప్పినారు.

ఎప్పుడో జానపద బాలగేయాల్ని  , ఆధునిక యుగంలో పుట్టిన బాలగేయాల్ని విడి విడిగా రెండు అధ్యాయాలలో విశ్లేషించాలనుకున్నాను . ఎందుకంటే  రెండూ రెండు వేరు వేరు పరిస్థితులలో పుట్టి పెరిగాయి . లక్షణాలు వేరు వేరుగా  ఉన్నాయి . ఎలా అంటే :

జానపద  గేయాలు ప్రాచీన కాలంలోనే పుట్టి మౌఖికంగా వాగ్రూపంలో తరతరలుగా సంక్రమిస్తూ వస్తున్నవి . ఆధునిక బాలగేయాలు అర్వాచీన కాలంలో పుట్టి పుస్తక రూపంలో సంక్రమిస్తూ వస్తున్నవి .

జానపద గేయాల సృష్టికర్త లెవరో చెప్పలేము . ఆధునిక బాలగేయాలు రచయిత పేరు మీదే వ్యాప్తి చెందుతాయి .

జానపద బాలగేయాలకు రచయిత ఎవరో తెలియదు కాబట్టి కాలం కూడా తెలియదు. ఆధునిక బాలగేయాలు రచయితను బట్టి కాలాన్ని అంచనా వెయ్య వచ్చు .

జానపద బాలగేయాలకు ఒక పరిణత రూపమంటూ ఉండదు. ఎందుకంటే వాగ్రూపప్రచారాన్ని పొందేటప్పుడు విన్నది మార్పుచేర్పులకు గురవుతుంది. అంటే కాళిదాసు కవిత్వానికి తన పైత్యం కొంత అన్నట్లు ఒక చోట తరుగుతుంది. ఒక చోట పెరుగుతుంది . ఒక చోట ఒక కొత్త పదం వచ్చి చేరుతుది. ఒక చోట ఒక పదమో పాదమో , కొంత భాగమో ఎగిరి పోతుంది . ఆధునిక గేయాలకు ఇలాంటి మార్పుచేర్పులుండవు  . రచయిత లేదా కవి ఎలా రాసి ఉంటే అలాగే ప్రచారాన్ని పొందుతుంది.

జానపద గేయాలు ఆశువుగా , అలవోకగా పుడతాయి. వీటి పుట్టుకకు భావోద్వేగమే ప్రధానం. ఆలోచనలకు తావుండదు. పేపరు, పెన్ను తో అసలు పనిలేదు. దానికి భిన్నంగా పుడుతుంది లిఖిత సాహిత్యం . కవి తన ఆలోచనలకు పదును పెడుతూనే ఉంటాడు. పుస్తకం చేతి కొచ్చేదాక దిద్దుతూనే ఉంటాడు.

యతో , ప్రాసో జానపద గేయాల్లో అనుకో కుండా చేరి పాడుకోవడానికి వీలుగా గానత్వాన్ని సంతరించుకుంటుంది. ఆధునిక కవిత్వానికి యతిప్రాసలు అనివార్యం కావు.

ఇవి ప్రధాన లక్షణాలు . మొదటిది వాగ్రూపంలో ప్రచారానికి వస్తే రెండవది పుస్తక రూపంలో సంక్రమిస్తుంది.

జానపద బాలగేయాలు ఎలా ఉంటాయో తరువాత చుద్దాం.

               మహాసముద్రం దేవకి
                   29 - 10 - 2022

Comments